డైలీ సీరియల్

అన్వేషణ -12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటకి ఆమెలో మళ్లీ ఇందాకటి ఆలోచనలు సుడులు తిరిగాయి.. ఒకవేళ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వచ్చాడా అని. ఆమాట అడిగింది. ‘‘మీ వాళ్లకోవసం మన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందా?.. ఫర్వాలేదు అనిర్! చెప్పు.. నువ్వు ఏం చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటాను.. ఏమీ అనుకోను..’’ అని.
‘‘్ఛ! కాదు.. అదేం కాదు.. అసలు నీ గురించి అమ్మమ్మతో మాట్లాడాలనుకున్నాను.. ఆమె కుదుటపడింది. కానీ మాట్లాడ్డం కుదరలేదు.. వేరే సమస్య నా గుండెలు పిండేసింది...’’
‘‘మరింకేమిటి నిన్ను అంతగా బాధపెట్టిన విషయం’’ అతడికేసి చూస్తూ అడిగిందామె అతడి మాటతో మనస్సు కాస్త తేలిక చేసుకుంటూ.
అతడు వెంటనే మాట్లాడలేదు. భారంగా కణతలు నొక్కుకున్నాడు. కొద్దిసేపయ్యాక ఆమెకేసి చూస్తూ అన్నాడు- ‘‘ఒక అనాధని మనం చేరదియ్యవచ్చు. ప్రేమించి పెళ్లీ చేసుకోవచ్చు.. కానీ నా పరిస్థితి..’’
‘‘్ఛ! అలా నువ్వెందుకు ఆలోచిస్తున్నావ్.. అసలు నువ్వు అనాధవి ఎందుకవుతావు? మీ అమ్మ చనిపోతే మీ అమ్మమ్మ నిన్ను పెంచిపెద్ద చేసింది.. నువ్వు అనాధవి కావు.. ’’ అన్నదామె ఓదార్పుగా.
‘‘అవును.. తండ్రెవరో తెలీని అనాధని హిమా!..’’ బాధగా అన్నాడు.
‘‘అనిర్!’’
‘‘మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. అంటూ ఈమధ్యకాలంలో పేపర్లలో చాలా వార్తలు చదివాము. అలాగే ఓ మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి ప్రతిఫలంగా పుట్టిన అభాగ్యుడిని నేను...’’ ఆ మాట అంటున్నపుడు అతడికి ఏడుపొచ్చేసింది. మోకాళ్లమధ్య తలపెట్టుకున్నాడు.
‘‘అనిర్!..’’ అంటూ అడి తలపై చెయ్యి వేసి నిమిరింది హిమజ!- ‘‘్ఛ!’’ అంటూ ఓదార్చింది.
కాస్సేపటికి అతడు తలపైకెత్తాడు. కళ్లనిండా నీళ్లు. పమిటతో తుడిచిందామె.
‘‘ఇంతకాలం నాన్న గురించి ఎన్నిసార్లు అమ్మమ్మని అడిగినా, మామయ్య, అత్తమ్మలనడిగినా- పోయాడ్రా.. ఆ ముదనష్టపోడు గురించి ఇప్పుడెందుకు అంటూండేవారు. అమ్మతో గొడవపడి వదిలేసి వెళ్లిపోయాడనుకున్నాను. మీ అమ్మ పిచ్చిదిరా అంటే అమాయకురాలనుకున్నాను. కానీ అసలు విషయం నాలుగు రోజుల క్రిందటే తెలిసింది నాకు. అమ్మమ్మకి వంట్లో బాగుండకపోవడంతో, ఇంక ఏమైపోతానోనన్న దిగలుతో కాబోలు.. మా నాన్న గురించి నేను అడిగితే.. జరిగిన సంగతంతా మా అమ్మమ్మ చెప్పింది’’ కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు.
గంభీరంగా తల పంకించింది హిమజ. లాలనగా అతడి భుజం చుట్టూ చేసి వేసింది. ఆ తర్వాత అనిరుధ్ తనకి అమ్మమ్మ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు.
‘‘నీ గతం తెలిసి నీ మనస్సు తీవ్రంగా గాయపడిందని నేనర్థం చేసుకోగలను.. ఈ రేప్ అన్నది ఇప్పటిది కాదు అనిర్! పురాణకాలం నుంచీ ఉన్నదే. ఈ విషయాలు నాతో చెప్పడానికి భయపడ్డావు కదూ?!.. నేను నిన్ను ఎక్కడ చిన్నచూపు చూస్తానోనని కొట్టుమిట్టాడావు కదూ?!.. మీ నానె్నవరో.. వాడి కులం ఏమిటో, గోత్రం ఏమిటో తెలియకపోయినా ఇప్పుడొచ్చిన నష్టం లేదు. నాకు కావాల్సింది నువ్వు అనిర్! నువ్వు మంచివాడివి. మనసున్నవాడివి. జీవితాన్ని ప్రేమించేవాడివి. నిన్ను బాగా స్టడి చేశాను అనిర్!’’ అంటూ అనిరుధ్ ముఖం కేసి చూసింది చిరునవ్వుతో హిమజ.
అంత అలజడిలోనూ ఆమె మాటలు అతడికి కొంత స్వాంతనిచ్చాయి. హిమజ తననుంచి వెళ్లిపోదు.. వెళ్లిపోదు.. అన్న భావం ఒక్కసారిగా బలం పుంజుకున్నది. ఆమె భుజంపై తలవాల్చాడు.
అనిరుధ్ ఆమె భుజంమీద నుంచి తల తీసి సరిగ్గా కూర్చున్నాడు. ఆమె చేతులు అందుకుని నిమురుతూ అన్నాడు- ‘‘నాకు నాన్న ఎవరో తెలియాలి హిమా!’’ అని.
ఆ మాటకి అతడికేసి తేరిపార చూసిందామె. తర్వాత అంది- ‘‘ఎలా?’’ అని.
‘‘మా అమ్మపై నలుగురు అత్యాచారం చేశారు.. ట.. గురుమూర్తి అని వాడికి ఆ విషయం తెలుసు. అమ్మమ్మ చెప్పింది. ఇక్కడికొచ్చేరోజు ముందు గురుమూర్తిని కలిశాను..’’ అంటూ గురుమూర్తిని కలిసిన వివరాలు చెప్పసాగాడు అనిరుధ్...
****
రాత్రి తొమ్మిది గంటలు దాటుతూన్న సమయంలో వీధి చివరనున్న గురుమూర్తి మిర్చి బజ్జీల బండి దగ్గరకొచ్చాడు కొండబాబుతో కలిసి అనిరుధ్. ఐదారుగురు బజ్జీలో ఏవో తింటున్నారు. దాదాపుగా ఇక ఆ రోజు అయిపోయినట్లుగా కళాయి క్రింద గ్యాస్ స్టౌ ఆపు చేసి సామాను సర్దుతోంది గురుమూర్తి భార్య. అరకొరగా వున్న బజ్జీలు, పుణుగులు ఎవరో వస్తే కట్టి ఇస్తున్నాడు గురుమూర్తి.
గురుమూర్తి బక్కపలచగా ఉంటాడు. నెరసిన గడ్డం. నెత్తిమీద చాలా భాగం జుట్టు ఊడిపోయింది. ఉన్న జుట్టు కాస్తా తెల్లగా వుంది. వయసు అరవై ఏళ్లయినా ఓ పదేళ్లు పెద్దవాడిలా ఉంటాడు.
గళ్ల లుంగీ కట్టుకున్నాడు. దానిమీద పల్చటి చొక్కా వేసుకున్నాడు. భుజంమీద తుండుగడ్డ. మనిషి అంత నలుపూ కాదు, అలాగని తెలుపూ కాదు.
అతడి భార్య పేరేదైతేనేం- అతడిలాగానే బక్కపల్చగా వుంది. అతడికంటే పదేళ్లు చిన్నదే అయినా చూడ్డానికి డెబ్బైయ్యేళ్ళ దానిలా వుంటుంది. ముదురు రంగు ముతక చీర కట్టుకుంది. సన్నటి చేతులకి మట్టి గాజులున్నాయి. మెడలో నల్లగా మాసిపోయిన మంగళ సూత్రం తాడుంది. చెవులకి పిచ్చి దిద్దులున్నాయి.
గురుమూర్తి వయస్సు మీదపడ్డాక ఇక రిక్షా తొక్కలేక కొడుకులు తమను సాకుతారని ఆశించాడుగానీ, అది నెరవేరలేదు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నాక ఎవరైనా సరే తమ సంసారాలు తర్వాతే అన్నారు. తల్లిని మాత్రం తమ దగ్గర పెట్టుకుంటామన్నారు. అదీ ఇద్దరి దగ్గరా చెరో ఆర్నెల్లూ ఉండాలన్న షరతుమీద! ఎందుకంటే ఆమె వంటపనీ, ఇంటిపనీ చేస్తుందని!
ఆ పరిస్థితుల్లో భార్య ఇచ్చిన సలహా మేరకు మిర్చి బజ్జీ బండి పెట్టుకున్నాడు గురుమూర్తి. ఒకళ్లమీద ఆధారపడకుండా ఇపుడు తమ తిండేదో తాము తింటున్నారు ఆ దంపతులు. ఈ విషయాలన్నీ కొండబాబు చెప్పాడు అనిరుధ్‌కి.
దాదాపు పది గంటలు కావస్తూంటే గురుమూర్తి బజ్జీ బండిదగ్గర జనం అంతా వెళ్లిపోయారు. నాలుగు బజ్జీలు, ఐదారు పుణుకులు మాత్రం మిగిలాయి. అప్పుడు కొండబాబుతో బండి దగ్గరకొచ్చాడు అనిరుధ్. అప్పటిదాకా వాళ్లు దూరంగా చెట్టుక్రింద నిల్చున్నారు.
‘ఏం లేవు.. అయిపోయినాయ్..’ అన్నాడు గురుమూర్తి వాళ్లని చూసి.
‘పర్లేదు బాబాయ్! ఆ నాలుగు బజ్జీలిచ్చెయ్..’ అన్నాడు కొండబాబు.
‘సల్లారిపోనాయ్‌రా..’ అంటూ బజ్జీలు కాగితంలో పెట్టి ఇచ్చాడు గురుమూర్తి. తర్వాత బీడీ వెలిగించుకున్నాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842