డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందువల్లే అతడు కాలేజీలో అప్పటికే అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలని టార్గెట్‌గా పెట్టుకునేవాడు. తన డబ్బునో, పరపతినో మరి దేన్నో ఉపయోగించి కొద్దికాలం తర్వాత ఎలాగైనా వాళ్ళ రిలేషన్ బ్రేకయ్యేలా చేసి, మానసికంగా అమ్మాయిలు బలహీనమై ఉన్న సమయంలో వల వేసినట్లుగా వాళ్ళని తన దగ్గరికి రప్పించుకునేవాడు.
అది అతడి స్ట్రాటజీ. తనకి నచ్చిన అమ్మాయిల వెంట తిరిగి వాళ్ళని ఒక లెవెల్ వరకూ చెడగొట్టడానికి కాలేజీలో అబ్బాయిలకి తన వంతు ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చేవాడు. ఇదం తా చాపక్రింద నీరులా చాలా నిశ్శబ్దంగా జరిగిపోయేది. భరణి నిజస్వరూపం తెలియక అదంతా అతడి మంచితనం అనుకునేవాళ్ళు. భరణి చేతిలో తాము మోసపోయామన్న విషయం అమ్మాయిలకి మోసపోయాక కానీ తెలియదు. అప్పటికే ఆ ‘విష సర్కిల్’లో కూరుకుపోయి ఉండడంవల్ల మింగలేకా కక్కలేకా అలాగే బ్రతికేస్తూ ఉంటారు.
సంధ్య కూడా మొదట్లో రాజేష్‌ని ప్రేమించింది. వాళ్ళ ప్రేమని ప్రోత్సహిస్తున్నట్టు నటించిన భరణి వాళ్ళమధ్యన కొంత ఎఫైర్ నడిచాక రాజేష్ పిరికితనాన్నీ, పేదరికాన్ని ఎత్తిచూపిస్తూ దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళమధ్యన భేదాభిప్రాయాలు వచ్చేట్టు చేసాడు. క్రమంగా ఆమె తనవైపు తిప్పుకున్నాడు.
అయితే, సంధ్య అందరిలాంటి అమ్మాయి కాదు. భరణిని నిజంగానే ప్రేమించింది. భరణి ఆమెని తన గర్ల్‌ఫ్రెండ్ అనుకున్నాడు. కానీ సంధ్య మాత్రం భరణిని తన లవర్ అనుకుంది. అందుకే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసాక భరణి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అతడిలో ఎలాంటి మార్పూ రాలేదు. అతడు హరితతో ఎఫైర్ మొదలుపెట్టాడు. రోజులు మామూలుగానే గడుస్తుండగా ఒక రోజు అనుకోకుండా భరణికి సంధ్య ఆత్మ కనిపించింది’’.
చెబుతున్న సూర్య వంక ఊపిరి బిగపట్టి చూసాడు పాణి. ‘‘వాట్?!’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘అవును. ఒకరోజు నేనూ, భరణి, శ్రీను, రాజు కలిసి బంజారాహిల్స్‌లో ఉండే మాల్‌కి వెళ్ళాము. నగరంలో పోష్ లొకాలిటీలలో నివసించే ధనవంతుల అమ్మాయిలకి, అబ్బాయిలకీ ఆ మాల్ ఒక అడ్డా లాంటిది. శని, ఆదివారాలు అక్కడ కాలేజీలో స్టూడెంట్లతో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ఒక ఫ్యాషన్ షోలా ఉంటుంది. మాల్‌లో షాపులన్నీ కలయతిరిగి బయట ఉన్న లాన్స్‌లో బెంచీమీద కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలని చూడడం మా అలవాటు. ఆ రోజు కూడా మాల్ బయట కూర్చుని వచ్చేపోయేవాళ్ళని చూస్తున్నాం. సడెన్‌గా భరణి ‘అటు చూడండి’ అన్నాడు ఉలిక్కిపడ్డట్టుగా. అమ్మాయిలమీదనుంచి దృష్టిని మరల్చి మేము భరణి వంక చూశాము.
భరణి కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న మాల్ వంక చూస్తున్నాయి. అక్కడంతా మామూలుగానే ఉంది.
‘‘ఏమైంది? ఏముందక్కడ?’’ అని అయోమయంగా అడిగాము మేము.
‘‘ఇపుడే.. ఇపుడే.. చూసాను’’ అన్నాడు భరణి తడబడుతున్నట్లుగా. ఏదో విషయం అతడిని విపరీతమైన అయోమయానికి గురిచేస్తోందని అర్థమైంది మాకు.
‘‘ఏమైంది భరణీ? ఏం చూసావు నువ్వు?’’ అందరం మూకుమ్మడిగా అడిగాము, భరణి చూపిస్తున్న నాలుగో అంతస్థువైపు పరిశీలనగా చూస్తూ. అక్కడనుంచి ఆ అంతస్థులో ఉన్న ‘షాపర్స్ స్టాప్’ షోరూమ్ కనిపిస్తోంది.
‘‘సంధ్య.. సంధ్య.. సంధ్య ఆత్మ నాకు కనిపించింది’’ అన్నాడు భరణి. గొంతు తడారిపోతున్నట్లుగా నాలుక పెదాలు తడుపుకుంటున్నాడు అతడు.
‘‘అక్కడ.. ఆ షాపర్స్ స్టాప్ అద్దాల వెనుక నిలబడి నావంకే కన్నార్పకుండా చూస్తోంది. ఇప్పటిదాకా.. అక్కడే ఉంది.. నేను మిమ్మల్ని పిలిచేసరికి మాయమైపోయింది. ఆమె కళ్ళు తీక్షణంగా ననే్న చూస్తున్నాయి’’ గబగబా అన్నాడు భరణి.
అతడి మాటలకి మేము ఒకరి ముఖాలొకరు చూసుకున్నాము. సంధ్యకి షాపర్స్ స్టాప్ షోరూమ్ అంటే పిచ్చి. అక్కడ దొరికే మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుని పబ్‌లకి తిరగడం, అందరూ తననీ, తన డ్రెస్‌నీ ఆసక్తిగా చూడడం అంటే ఆమెకి చాలా ఇష్టం. రాజేష్ ఆమె కోరికలు తీర్చలేకపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకునే భరణి డబ్బు వెదజల్లి సంధ్యని తనవైపు తిప్పుకున్నాడు. రాజేష్ సంధ్యతో కలిసి చాలా సార్లు షాపర్స్ స్టాప్‌కి వచ్చేవాడు. ‘షాపర్స్ స్టాప్‌లో ఒక్క మిడ్డీ కొనిపెట్టినందుకే సంధ్య నాకు అన్నీ సమర్పించుకుంది’ అని వ్యంగ్యంగా భరణి మాతో అనేవాడు.
ఆ కామెంట్ విన్నప్పుడు నాకు సంధ్యమీద, ఆమెలాంటివాళ్ళమీద విపరీతమైన జాలేసేది. అబ్బాయిలు తమ కోసం ముందూ వెనుకా చూడకుండా ఖర్చు చేస్తున్నారంటే అదంతా తమ మీద ప్రేమ అనుకుంటారు అమ్మాయిలు. అబ్బాయిలు మాత్రం తాము ‘ఎర’ వేస్తున్నాము అనుకుంటారు. కొంత ‘వెల’ చెల్లించి, వెలకట్టలేనిదాన్ని స్వంతం చేసుకుంటూ వుంటారు భరణి లాంటివాళ్ళు.
ఆ షాపర్స్ స్టాప్ షోరూమ్ చూసినపుడల్లా భరణికి సంధ్య గుర్తుకువచ్చేది. ఇపుడు కూడా అలాగే గుర్తొచ్చిందేమో, అతడు ఆమెని చూసినట్టుగా భ్రమపడుతున్నాడేమో అనుకున్నాం మేము. అదే అన్నాము భరణితో.
‘‘ఆ షోరూం చూడగానే నీకు సంధ్య గుర్తొచ్చి ఉంటుంది. ఆమెని చూసినట్టు భ్రమపడుతున్నావేమో?’’
‘‘లేదు. నాది భ్రమ కాదు. ఆమె స్పష్టంగా కనిపించింది. తెల్లరంగు చుడీదార్లో జుట్టు విరబోసుకుని, కిటికీ దగ్గర నిల్చుని తదేకంగా ననే్న చూస్తూ కనిపించింది. అది భ్రమకాదు’’ స్థిరంగా అన్నాడు భరణి. మాట్లాడుతుంటే అతడి కంఠం చిన్నగా ఒణికింది.
‘‘సంధ్య పోలికతో వున్న ఎవరో అమ్మాయి తెల్లరంగులో ఉన్న చుడీదార్ వేసుకుని నీకు పైనుంచి కనిపించి ఉండచ్చు. దూరం నుంచి చూసి నువ్వు సంధ్య అని భ్రమపడి ఉంటావు’’.
‘‘నో- ఆమె సంధ్య పోలికలతో కాదు- అచ్చం సంధ్యలాగే ఉంది. ఆమె చూపులు కూడా మనుషుల చూపుల్లా లేవు. అది కచ్చితంగా ఆత్మే’’.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ