డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఆత్మ భరణిని కాంటాక్ట్ చేయడానికి ఎంచుకున్న మాధ్యమాలు- ఉత్తరాలు, సెల్ ఫోన్ కాల్స్. దీన్ని బట్టి చూస్తే బ్రతికున్నపుడు తను తిరిగిన పరిసరాల పట్ల, తను ఇష్టంగా ఉపయోగించుకున్న మాధ్యమాలపట్ల చనిపోయిన సంధ్యకి మక్కువ పోలేదని, అటువంటి చోట సంధ్య ఆత్మ భరణికి కనిపిస్తోందని అర్థవౌతోంది.
ఊరి చివరనున్న భరణి వాళ్ళ గెస్ట్‌హౌస్‌లో చాలాసార్లు సంధ్య భరణితో గడిపింది. ఆ గెస్ట్‌హౌస్ అంటే కూడా సంధ్యకి చాలా ఇష్టం. అందుకే సంధ్య ఆత్మ భరణిని అక్కడికి లాక్కెళ్ళింది. తనకిష్టమైన భరణిని అక్కడే హత్య చేసి తనలో కలిపేసుకుంది’’.
‘హరర్ సినిమాలు ఎక్కువగా చూస్తావా నువ్వు?’ అన్న ప్రశ్న నోటి చివరిదాకా వచ్చి ఆగిపోయింది పాణికి. కొద్దిసేపాగి, ‘‘్భరణికి వచ్చే బెదిరింపు ఉత్తరాలన్నీ తెలుగులోనే ఉండేవా?’’ అని అడిగాడు.
‘‘అవును. పబ్‌లో పేపర్ నేప్కిన్ మీద రక్తంతో రాసిన సందేశం కూడా తెలుగులోనే ఉంది’’ అన్నాడు సూర్య.
‘‘మీ స్నేహితుల బ్యాచ్‌లో పుస్తకాలకి కథలూ కవితలూ రాసే అలవాటు ఎవరికైనా ఉందా?’’’
‘‘లేదు. ఎందుకలా అడుగుతున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సూర్య.
‘‘తెలుగులో టైపు చేసే అలవాటు ఎక్కువగా రచయితలకే ఉంటుంది. అందుకే’’ అన్నాడు పాణి.
సూర్య చెప్పినది అతడికి చవకబారు సినిమా కథలాగే అనిపిస్తోంది కానీ నమ్మకం కలగడంలేదు. ‘‘చివరగా ఒక ప్రశ్న. భరణి చెబుతుంటే వినడమే తప్ప నువ్వెప్పుడైనా సంధ్య ఆత్మని కళ్ళతో చూశావా?’’ అన్నాడు.
సూర్య దెబ్బతిన్నట్టుగా చూశాడు ఆ ప్రశ్నకి. ‘‘మీరు నేను చెబుతున్నదాన్ని నమ్ముతున్నట్టుగా లేదు. దెయ్యాలూ, ఆత్మలూ అందరికీ కనిపించవు. తాము కనిపించాలనుకున్న వాళ్ళకే కనిపిస్తాయి’’ అన్నాడు.
‘‘కావచ్చు. నాకు దెయ్యాల సంగతి పెద్దగా తెలియదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నేను ఊహించినది అబద్ధం కాకపోతే నీకు మెడలో ఆంజనేయస్వామి లాకెట్టు ఉన్న గొలుసూ, చేతికి మంత్రించి కట్టిన తాయెత్తూ వుండి ఉంటాయి. అవి కూడా ఈమధ్యకాలంలో కట్టుకున్నవే. అవునా?’’ అన్నాడు పాణి.
‘‘అవును. మీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అన్నాడు సూర్య.
‘‘నిజం కూడా దెయ్యంలాంటిదే. అందరికీ కనిపించదు’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు పాణి. ఆ మాటల్లోని వ్యంగ్యం సూర్యకి అర్థమైంది. పాణి లేచి వెళ్ళబోతుంటే అతడి వంక సూటిగా చూస్తూ అన్నాడు. ‘‘సార్, ఇందాకా మీరు నన్నొక ప్రశ్న అడిగారు. మా స్నేహితుల బ్యాచ్‌లో ఎవరికైనా పుస్తకాల కథలు రాసే అలవాటు ఉందా అని. మా బ్యాచ్‌లో ఎవరికీ ఆ అలవాటు లేదు కానీ, చనిపోయిన సంధ్యకి మాత్రం ఆ అలవాటు ఉండేది. ఆమె పుస్తకాలకి కథలూ కవితలూ రాసేది’’.
అతడి మాటలు విన్న పాణి షాక్ తిన్నట్టుగా చూశాడు.
***
పాణి హోటల్ రూమ్‌కి వచ్చేసరికి అంజలి టీవీలో ఏదో ‘ఎగ్జార్సిస్ట్’ సినిమా చూస్తోంది.
‘నువ్వు దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా?’ సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ అడిగాడు పాణి.
పాణి ప్రశ్నకి అయోమయంగా చూసింది అంజలి.
‘‘ఒక దెయ్యం మనిషిని చంపాలనుకుంటే ఎలా చంపుతుంది? మెడ కొరికి, రక్తం పీల్చేసి, పొడవైన గోళ్ళతో రేక్కేసి.. అవునూ దెయ్యాలకెందుకు ఎపుడూ పొడవైన గోళ్ళు ఉంటాయి? చనిపోయిన తరువాత నెయిల్ కట్టర్స్ అందుబాటులో ఉండకా?!’’
‘‘ఏమ్మాట్లాడుతున్నారు మీరు?’’
టీవీలో కొద్దిసేపు భయంకరమైన నిశ్శబ్దం, తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎవరో మనిషి హృదయ వికారంగా ఏడుస్తున్న శబ్దం, స్మశానంలో ఎంటాకులు కాళ్ళక్రింద నలుగుతున్న చప్పుడు. ఆ తరువాత సడెన్‌గా గుండె ఆగిపోయేట్టు ఒక పెద్ద శబ్దం.. టిపికిల్ హారర్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తోంది.
‘‘చిన్నప్పటినుంచీ ఇన్ని హారర్ సినిమాలు చూస్తున్నావు కదా? ఒక దెయ్యం మనిషిని చంపితే అక్కడ వాతావరణం ఎలా వుంటుందో చెప్పగలవా? చనిపోయిన వ్యక్తి గుడ్లు బయటికి పొడుచుకు వచ్చి, ఒళ్ళంతా రక్తంతో తడిసి, మెడమీదా డ్రాకులా పళ్ళగాట్లతో బీభత్సంగా ఉండాలి అవునా?’’
‘‘ఇప్పుడు మీకెందుకీ డీటయిల్సన్నీ? హరర్ సినిమా ఏమైనా తీయబోతున్నారా మీరు?’’ నవ్వుతూ అంది అంజలి టీవీ సౌండ్ మ్యూట్ చేస్తూ.
‘‘నేను డీల్ చేస్తున్న కేసులో హత్య చేసినది ఒక దెయ్యం అని చెబుతున్నారు అందరూ. కానీ హత్యా స్థలాన్ని పరిశీలిస్తే ప్రశాంతమైన మరణంలా వుంది తప్ప అక్కడ ఇలాంటి బీభత్స వాతావరణమేమీ లేదు. పోస్టుమార్టమ్ రిపోర్టులో కూడా డ్రాకులా పళ్ళగాట్లూ ఏవీ లేవు. కేవలం గుండె ఆగడంవల్ల చనిపోయినట్టుగా వచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం అది సహజ.. మరణం. నేను ఎవర్ని నమ్మాలి?’’
అంజలి మళ్లీ నవ్వింది. ‘‘మీ పోస్టుమార్టమ్ రిపోర్టులూ పరిశోధనల గురించి నాకు తెలియదు కానీ, మీరన్నట్టుగా చిన్నప్పటినుంచీ చూస్తూ ఉండడంవల్ల హారర్ సినిమాల గురించి నాకు తెలుసు. భయం మనిషిని థ్రిల్‌ని కలిగిస్తుంది. ఆ థిల్ కోసమే ఎక్కువగా హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు జనం. కానీ భయానికి కూడా కొన్ని డిగ్రీలు ఉంటాయి. ఒకసారి ఒక ‘్భయం’ మనకి అలవాటైపోతే, మళ్లీ మళ్లీ అదే భయం మనల్ని భయపెట్టదు. మరోసారి మనం భయపడాలంటే ఈసారి భయం ‘డిగ్రీ’ని పెంచాలి.
హారర్ సినిమాలు మొదటిసారి చూసేవాళ్ళు చిన్న దెయ్యం సీనుకి కూడా భయపడిపోతారు. కానీ హారర్ సినిమా ఒక ప్రత్యేకమైన జెనర్. ఈ జెనర్‌కి ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఉంది. అలా హారర్ సినిమాలూ చూసి చూసి భయం అలవాటైపోవడంవల్ల ఆ ప్రత్యేక ప్రేక్షక వర్గానికి థ్రిల్ కలిగించడానికి భయం ‘డిగ్రీ’ని పెంచుతూ ఉంటారు దర్శకులు. అందుకే ఈ రక్తపాతం.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ