డైలీ సీరియల్

బంగారుకల - 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జగన్నాథ! కోరితే తీరుతుందా! విజయనగర సింహాసనం మీద ఏ రాజయినా సరి అయిన పద్ధతిలో కూర్చున్నాడా! అంతదాకా ఎందుకు. నీ భర్త.. అదే శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సోదరులను, వారి కుమారుడ్ని చంద్రగిరిలో బందీ చేసేగా రాజయ్యాడు. పైగా ఈ ముసలి మంత్రేగా తంత్రమంతా నడిపింది’’ ఆలోచింపజేస్తున్నాడు.
‘‘అయితే’’ అన్నపూర్ణాదేవి అతనికేసి తిరిగింది.
‘‘జగన్నాథ! అయితే అంటావేమిటి తల్లీ! ఈ రాజ్యంలో తిమ్మిని బమ్మి చేయాలన్నా, బమ్మిని తిమ్మి చేయాలన్నా తిమ్మరుసు మంత్రికి నల్లేరు మీద బండి నడకే!’’ రహస్యం చెబుతున్నట్లు అన్నాడు. మళ్లీ తన బోధ కొనసాగించాడు. ఆమె ముఖ కవళికలు మారుతున్నాయి.
‘‘ఈ మహామంత్రి మనసులో ఏముందో తెలుసా! నేను బాగా కనిపెట్టాను. రాయలు తన చేతిలో కీలుబొమ్మ. కాలం కలసిరాగానే రాయల్ని అడ్డు తొలగించి తన కొడుకు గోవిందరాయలకి పట్టం గట్టాలని’’.
‘‘స్వామీ జగన్నాథ! ఎంత మాట విన్నాను. తిమ్మరుసు మహామంత్రి కృష్ణరాయల కెగ్గు తలపెట్టటమా! కలలోనైనా ఊహించలేమే’’ ఆవేదనగా అంది అన్నపూర్ణాదేవి.
‘‘ఆ కలలో కూడా ఊహించనిది చేయటమే తిమ్మరుసు తెలివి’’
‘‘నువ్వు చెప్పేది వింటుంటే నా తల తిరిగిపోతున్నది. నేనిప్పుడేం చేయాలి? నా ప్రభువునెలా రక్షించుకోవాలి’’ ఆసనంపై కూలబడిందామె.
‘‘నీ ప్రభువును రక్షించుకోవాలంటే నీ కుమారుడు తిరుమల రాయని ఈ విశాల విజయనగరానికి సామ్రాట్టును చేయాలంటే ముందు రాయలవారు తిమ్మరుసును గుడ్డిగా నమ్మరాదు. బానిసలా బతుకరాదు. స్వంత బుద్ధితో ఆలోచించాలి, జగన్నాథ!’’
‘‘అదెలా సాధ్యం? వారు ప్రభువుకు తండ్రిలాంటివారు. ఏ పనిచేసినా తిమ్మరుసులవారిని సంప్రదించనిదే జరుగదు. ఆఖరికి మా వివాహ విషయంలో కూడా తిమ్మరుసు వారి పట్టుదలే కారణం’’ అన్నపూర్ణాదేవి గతంలోకి చూసింది.
‘‘ఆ! అక్కడే ఉంది కుట్ర. గజపతులు చాలా పరాక్రమంతులు. వారింటి ఆడబిడ్డను వివాహమాడితే బంధుత్వ రీత్యా ఆ ముప్పు తొలగిందిగా!’’
‘‘వారు నన్ను వీరభోజ్యంగా గ్రహించారు వీరేంద్రా! ఇంతకాలంలో ఏనాడూ నా పట్ల ఇసుమంతయినా చిన్నచూపు చూసింది లేదు. పైగా కుమారుడు తిరుమల రాయలు మా విజయనగర సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఇక ముప్పేముంది?’’ ‘‘అని నువ్వనుకుంటే సరిపోయిందా పిచ్చితల్లీ! నేనిందాకే చెప్పాను. ఈ సింహాసనానికి వారసత్వ శక్తి లేదు’’.
‘‘మరి ఏం చేద్దాం’’ ప్రశ్నించింది ఆరాటంగా రాణి. అన్నపూర్ణ తన దారిలోకి రావటం వీరేంద్రునికి పరమానందంగా వుంది.
‘‘జగన్నాథ! ఇప్పటికి నేను చెప్పేది నీకు అర్థమైంది. ఇన్నాళ్ళు నీకు అరణపు చుట్టంగా ఇక్కడ పడి ఉన్నందుకు ఫలితం దక్కుతున్నది’’.
గొంతు తగ్గించాడు. అటూ ఇటూ చూశాడు. చాటున ఉండి రహస్యంగా వింటున్న మంజరి కొద్దిగా నీడలోకి జరిగింది కనపడకుండా. ఆమె మొహం విషాదంలో ముడుచుకుపోయింది. వీరేంద్రుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చాడు. రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు.
‘‘చూడమ్మా! మన గజపతుల వంశాంకురమే విజయనగర సింహాసనం అధిష్ఠించాలని నా ప్రాణం కొట్టుకుంటున్నది. పుట్టింటి మీద నీకు మాత్రం ప్రేమ లేదా ఏంటి? కృష్ణరాయల్ని, కుమారుడిని రక్షించుకోవాలంటే మన పని నెరవేరాలంటే.. రాయలను నువ్వో కోరిక కోరాలి’’.
‘‘కోరికా? ఏమని?’’
‘‘నీ కుమారుడికి పట్ట్భాషేకం చెయ్యమని’’.
‘‘అందుకు ప్రభువు అంగీకరిస్తారా! తిరుమలరాయలింకా పసివాడే గదా!’’ అన్నపూర్ణాదేవి సందేహం.
‘‘జగన్నాథ! అక్కడే ఉంది కిటుకు. రాయలు నీ ముచ్చట తీర్చటానికైనా అంగీకరిస్తాడు. కానీ ఆ తిమ్మరుసు ఒప్పుకోవటమే అనుమానం. దీనిలో అతని కుటిలత్వం ప్రభువుకు కూడా తెలుస్తుంది’’ గుట్టు విప్పినట్లు నవ్వాడు వీరేంద్రుడు.
ఇపుడు అన్నపూర్ణాదేవి పూర్తిగా వీరేంద్రుని మాయాజాలంలో పడిపోయింది. పుత్ర ప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది.
‘‘నువ్వు చెప్పినట్లే నేను ప్రభువును ఈ కోరిక కోరతాను’’ ఆమె నిర్ణయించుకుంది.
వీరేంద్రుని ఆనందానికి అవధులు లేవు. తన మొదటి పాచిక పారుతోంది. సరిగ్గా గురి చూసి తగిలితే తిమ్మరుసుకూ, రాయలకూ మధ్య మొదటి విభేదం తలెత్తుతుంది. పసివాడికి పట్టం గట్టటానికి తిమ్మరుసు ఎటూ ఒప్పుకోడు.
దాంతో రాయలు రాణికిచ్చిన మాట కోసం తిమ్మరుసును కాదనవలసి వస్తుంది. రాణి కోరిక రాయలు ఒప్పుకుంటాడా? ఒకవేళ తిమ్మరుసు రాయల మాటకు ఒప్పుకుంటే?’’ వీరేంద్రుడు ఉత్కంఠభరితంగా నవ్వుకున్నాడు.
మంజరి మనసు కలతపడుతున్నది. సాధ్వి అన్నపూర్ణాదేవి మనసులో విషబీజం నాటుతున్నాడీ దుర్మార్గుడు. తిమ్మరుసులవారికి రాయలవారికి తగవు తేవాలనే ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయి స్వామీ విరూపాక్షా! అనుకుంటూ బయలుదేరిన మంజరి తిమ్మరుసు మహామంత్రికీ వార్తను అతి రహస్యంగా చేరవేయటంలో సఫలురాలయింది.
****
తిమ్మరుసు, రామలింగ నాయకుడు వ్యాసరాయలు ఆశ్రమంలో సమావేశమైనారు.
‘‘ఏదో బురదపామనుకున్నాం గానీ తాచులా బుసలు కొడుతోంది’’ రామలింగ నాయకుడు కోపంతో ఆవిర్లు కక్కుతున్నాడు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి