డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సో.. అదీ కేసు! నేను అన్నట్టుగా ఈ రోజు ఉదయానికి కేసు సాల్వ్ చేసి మీకు అప్పగించాను. భరణి మరణానికి కారణం సంధ్య. కానీ ఆమె అతడిని హత్య చేసిందనడానికి సాక్ష్యాలు లేవు.
ఆమె అతడిని గొంతు నులమలేదు- పిస్తోలుతో కాల్చలేదు- కత్తితో పొడవలేదు. కేవలం అతడి ఎదురుగా నిలబడింది అంతే. ఒక మనిషి ఎదురుగా వచ్చి నిలబడితేనే అతడు చచ్చిపోతే అది ఆ నిలబడ్డ మనిషి తప్పు కాదు కదా? లక్ష్మి చెప్పినట్టుగా భరణిని చంపింది వీళ్ళెవరూ కాదు- అతడిలోని అపరాధ భావమే. చట్టాన్ని చేతిలో ఉంచుకున్న అధికారిగా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవర్ని దోషులుగా న్యాయస్థానం ముందు నిలబెడతారో మీ ఇష్టం’’ ఎప్పుడు వచ్చాడో పాణి గుమ్మం దగ్గర నిలబడి అన్నాడు.
‘‘ఇదంతా మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అన్నాడు పాణి.
‘‘హరిత రాత్రే పాణిగారికి ఫోన్ చేసి మొత్తం చెప్పింది. అప్పటికే ఆయన జరిగింది గ్రహించారు. కేవలం నిజం మా నోటితో చెప్పించాలన్న ఉద్దేశ్యంతోనే బయటికి వెల్లడి చెయ్యలేదు. ఆయన సలహాతోనే మేము మీ దగ్గరికి వచ్చి అంతా చెప్పేము’’ అంది లక్ష్మి.
రవీంద్ర పాణి వంక ఆశ్చర్యం చూశాడు.
***
ఎస్సై రవీంద్ర ఆ రోజు పది గంటలకి భుజంగరావుగారి ఇంటికి వెళ్ళాడు.
‘‘సార్, భరణి మరణం విషయంలో చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి’’ అన్నాడు. అప్పటికే భరణి స్నేహితుల ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకున్న భుజంగరావుగారి ముఖంలో భయం కనబడింది.
‘‘ఎప్పుడూ వెళ్ళనివాడు భరణి అసలు ఆ సమయంలో ఎవరూ లేకుండా ఒంటరిగా గెస్ట్‌హౌస్‌కి ఎందుకు వెళ్ళాడో, అక్కడ ఏం జరిగిందో, అంతటి ఆరోగ్యకరమైన మనిషి అలా ఎలా సడెన్‌గా చనిపోయాడో అంత మిస్టరీగా అనిపిస్తోంది. ఈ మిస్టరీ వెనుక ఏవో మానవాతీత శక్తులున్నట్టుగా బయటపడుతోంది’’ నసుగుతున్నట్టుగా అన్నాడు రవీంద్ర.
భుజంగరావు నెమ్మదిగా తల పంకించాడు.
‘‘ఈ కేసులో ఇనె్వస్టిగేషన్ అంటే మా డిపార్టుమెంటు వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇంతకన్నా లోతుగా వెళ్ళడం మంచిది కాదని నాకూ అనిపిస్తోంది..’’ అంటూ ఆయన రియాక్షన్ కోసం చూస్తున్నట్టుగా ఆగాడు.
‘‘చెయ్యగలిగేదేమీ లేనపుడు కేసుని తవ్వి మాత్రం ఉపయోగమేముంటుంది? పెదవి విరుస్తూ అన్నాడాయన. ఆయన కంఠంలో వైరాగ్యం కన్నా భయమే ఎక్కువగా కనిపిస్తోంది.
‘‘మీరు అనుమతిస్తే...’’
‘‘ఇప్పటివరకూ చేసిన పరిశోధన చాలు. ఇంక కేసు మూసెయ్యండి’’ అన్నాడాయన కుర్చీలోంచి లేస్తూ. రవీంద్ర మనసు ఆనందంతో గెంతులేసింది.
***
‘‘పెద్ద గండం గడిచింది. భుజంగరావుగారు కేసు క్లోజ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. భరణి స్నేహితుల్లాగానే ఆయన కూడా ఈ కేసు గురించి మాట్లాడటానికే భయపడుతున్నారు ప్రస్తుతం. ఇంకా ముందుకు వెడితే ఇంకేం కొంపలంటుకుంటాయో, భరణిని చంపిన దెయ్యం తమనేం చేస్తుందో అని భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ భయమే మనకి చాలా ప్లస్సయ్యింది’’ ఆనందంగా అన్నాడు రవీంద్ర పాణితో.
‘గుడ్’ నవ్వాడు పాణి.
‘‘అవునూ, సంధ్య మరణించలేదన్న సంగతి మీరు ముందుగానే ఊహించారు కదూ? అందుకే ఒక కానిస్టేబుల్‌ని సంధ్య వాళ్ళ ఊరికి పంపి ఆమె గురించి ఎంక్వయిరీ చేయమన్నారు కదా?’’
‘‘అవును’’
‘‘ఎలా ఊహించారు ఆ విషయాన్ని మీరు?’’
పాణి చిన్నగా నవ్వేడు. ‘్ఫరెన్సిక్ రిపోర్టుల ప్రకారం గెస్ట్‌హౌస్ వాష్‌రూమ్‌లో వేలిముద్రలు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నది ఒక అమ్మాయి వేలి ముద్రలు కాదు. ఇద్దరు అమ్మాయిల వేలిముద్రలు. ఒక వేలి ముద్ర హరిత వేలి ముద్రలతో సరిపోయాయి.
మరి రెండో వేలిముద్రలు ఎవరివి? హరిత మనకి గెస్ట్‌హౌస్‌లో ఏమి జరిగిందో చెప్పాక ఆ వాష్ రూమ్‌లో రెండో వేలి ముద్రలు ఎవరివై ఉంటాయో నేను ఊహించాను. అపుడే నాకు కేసులోని ముడి విడిపోయింది. సంధ్య మరణించలేదన్న సంగతి అర్థమయ్యింది. ఎందుకంటే ఆత్మలకి వేలిముద్రలు ఉండవు కదా?’’
‘‘గుడ్ అనాలిసిస్’’ మెచ్చుకున్నాడు రవీంద్ర. ‘‘మీతో కలిసి పనిచేయడం చాలా బాగుంది పాణి గారూ. అపరాధ పరిశోధనలో కొత్త కోణం తెలిసింది. మీ రెమ్యూనరేషన్ గురించి చెబితే ఆ ఏర్పాటు చేస్తాను’’
‘‘సారీ రవీంద్రగారూ.. నేను డబ్బు కోసం కేసులు డీల్ చెయ్యను. నాకొక సాయం చెయ్యండి. నేనూ నా భార్య అంజలీ అరకులోయ వెళ్ళడానికి ప్రయాణం ఏర్పాట్లు చెయ్యండి. అప్పటికే చాలా లేటయిపోయింది’’ నవ్వుతూ అన్నాడు పాణి.

ఉపసంహారం
చాలా రోజుల తరువాత ఒక రోజు.
శీతాకాలం.. సాయంత్రం ఐదు గంటలకే చిరు చలి సన్నగా ఒణికిస్తోంది. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరింది హరిత. తన అలవాటు ప్రకారం కారు విండో గ్లాస్‌ని పూర్తిగా తెరిచివుంచి బయటికి చూస్తోంది. బయటినుంచి వస్తున్న చిల్లటి గాలి, నులివెచ్చని సూర్య కిరణాలు కలగలసి ఏదో వింత అనుభూతినిస్తున్నాయి. చూస్తున్న హరిత ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. కారు తమ కాలేజ్ మీదనుంచి వెళ్తోంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ