డైలీ సీరియల్

అనంతం-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలివికోడి ప్రాజెక్టుకోసం అధికారులు విడిది చేసిన గుడారాల్లా లేవు! శత్రు రాజ్యమీద దండెత్తివచ్చిన సైనిక శిబిరాల్లా ఉన్నాయి!
అడుగడుగునా నిలబడి పహారాకాస్తున్న సాయుధ పోలీసులు చీమ ‘చిటుక్కు’మన్నా తుపాకులు ఎక్కుపెడుతున్నారు.
అడవి పుత్రులను ఊహించుకుంటూ సూది కళ్ళతో చూస్తున్నారు.
గుడారాలు, అక్కడి వాతావరణం, నాగరికుల రహస్య మంతనాలు, సాయుధ పోలీసుల అప్రమత్తత- త్వరలో ఎదురయ్యే ఏదో విపత్తుకూ, విధ్వంసానికి సంకేతాలందిస్తున్నట్టుంది!
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డికి, పక్షిజాతుల పరిశోధకుడు గరుడాచలానికీ ప్రత్యేకంగా గుడారాలిచ్చారు. ఇద్దరికీ ఆ గుడారాల్లో ఎలాంటి ఇబ్బందీ కలక్కుండా సదుపాయాలు సమకూర్చారు.
రెండు గుడారాలూ నక్షత్రాల హోటల్ సూట్లను మరిపిస్తున్నాయి!
ఫ్రిజ్‌లు, డైనిగ్ టేబుళ్ళు, టీపాయ్‌లు, ఫోంబెట్ మంచాలు, అందమైన కార్పెట్లు-
ఎర్ర చందనంలో చెక్కి అద్భుతంగా తయారుచేసిన షోకేసుల్లో రకరకాల మద్యం సీసాలున్నాయి. అతిధులతో అవసరాన్నిబట్టి, వాళ్ళ స్థాయినిబట్టి ఎవరికే మద్యం అందించాలన్నా అందుబాట్లో ఉంచారు.
రాగ్యానాయక్‌ను వెంటపెట్టుకొని తీసుకొని రమ్మని పురమాయించి ఫారెస్టుగార్డును రెడ్డియానాయక్ తండాకు పంపించాడు గరుడాచలం.
గార్డు వెళ్ళాక, రాజ్యాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు!
పక్షి జాతుల మీద పరిశోధన చేస్తూ గతంలో ఒకసారి అదే అడవికి వొచ్చాడు గరుడాచలం. అప్పుడు రాగ్యాతో పరిచయమైంది.
అడవి ఆనుపానులన్నీ అతనికి బాగా తెలుసు!
కార్యసాధకుడు. తెలివైనవాడు అనుకున్నది సాధించందే నిద్రపోడు. కండబలమూ గుండె బలమూ వుంది. రెడ్డియానాయక్ తండాలో రాగ్యా మాట వినే కుర్రవాళ్ళు చాలామందున్నారు. మందు తాగడు. సిగరెట్లు కాల్చడు. అడవి జంతువులను చంపడు. ప్రకృతిని ఆరాధిస్తాడు.
తొలిసారి రాగ్యాను చూసినప్పుడు గరుడాచలానికి చాలా ఆశ్చర్యంవేసింది!
దినవారి వేతనంమీద గరుడాచలం వెంట తిరుగుతూ, అడవిదారుల వెంట తిప్పుతూ, అరుదైన పక్షులను చూపిస్తూ గరుడాచలానికి సహాయకుడిగా ఉండేవాడు రాగ్యా.
కొద్దిరోజుల్లోనే రాగ్యా సామర్థ్యం ఏమిటో గరుడాచలం గ్రహించాడు. అభిమానం పెంచుకున్నాడు.
గరుడాచలం అడవిలో తిరిగినంతకాలం అతని వెంటే ఉన్నాడు రాగ్యా.
అది అతనికి గర్వంగా తోచింది!
అంత గొప్పవాడికి ఆంతరంగికుడై వెంట తిరగటం తన అదృష్టం అనుకున్నాడు రాగ్యా.
ఒకరోజు-
గరుడాచలం విదేశీ విస్కీ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ రాగ్యాను బలవంతపెట్టాడు.
‘గొప్పవాడి’ మాటకాదనలేకపోయాడు రాగ్యా. తనూ మందు తాగాడు. సిగరెట్లు కాల్చాడు. నెమలి మాంసం తిన్నాడు. రుచిమరిగాడు!
గొప్పవాడి వెంట తిరుగుతూ తనూ గొప్పవాడైపోయినట్టు తనకుతాను అనుకొంటూ, అప్పట్నించి గరుడాచలాన్ని విడిచిపెట్టలేదు రాగ్యా.
పరిశోధన పూర్తయ్యి గరుడాచలం వెళ్ళిపోయినా విదేశీ మందు గుర్తొచ్చినప్పుడల్లా పట్నం వెళ్ళి గరుడాచలాన్ని కలిసేవాడు.
వాళ్ళ అనుబంధం అలా కొనసాగుతూనే వుంది!
ఫారెస్టుగార్డు రాగ్యాకోసం వెళ్ళి చాలాసేపైంది. ఇంకా రాలేదు.
రాగ్యా తండాలో ఉన్నాడో పట్నం వెళ్ళాడో!
కబురు అందితే ఆగమేఘాల మీద వస్తాడు. ఇనుప సంకెళ్ళతో బంధించినా ఆగడు. తెంచుకొని వస్తాడు.
తను మప్పిన అలవాట్లకు బానిసయ్యాడు రాగ్యా!
కుర్చీలోనుంచి లేచాడు గరుడాచలం. గుడారంలోనే పచార్లుచేస్తూ కొంత సమయం గడిపాడు.
రాగ్యా అజాపజా లేడు. అతనికోసం వెళ్ళిన ఫారెస్టుగార్డు కూడా తిరిగి రాలేదు.
అసహనానికి గురయ్యాడు గరుడాచలం.
గుడారం బైటికి వెళ్ళి దూరంగా చూసాడు!
గుడారాలకు కొంచెం దూరంగా గాడిపొయ్యిలు వెలుగుతున్నాయి.
పొయ్యిల మీద పెద్దపెద్ద డేగిషాల్లో వంటకాలు ఉడుకుతున్నాయి.
నెమలి మాంసం కూడా వొండుతున్నట్టుంది!
గాలి వెంట వస్తోన్న వంటకాల వాసన్నుబట్టి గ్రహించాడు. మళ్ళీ గుడారంలోకి వెళ్ళాడు గరుడాచలం.
రాగ్యా గుర్తొచ్చాడు.
విస్కీ గుర్తొచ్చింది.
నెమలి మాంసమూ గుర్తొచ్చింది!
ఆలోచనలు రాగ్యావైపుకు మళ్ళాయి...
వాడింకా రాలేదేం? అసలు వస్తాడా? రాడా?
కలివికోడి ప్రాజెక్టు విషయం తెలిసి తండావాళ్ళు అతన్ని బైటికి కదలకుండా కట్టడి చేశారేమో?
అసంభవం!
ఆ విషయం ఎవ్వరికీ తెలియదు.
మరెందుకు రాలేదు?
వస్తాడు. వచ్చి తీర్తాడు. అవసరాలకోసం వస్తాడు.
విస్కీకోసం విదేశీ సిగరెట్లకోసం వస్తాడు.
నాగరికుల అలవాట్లమీద మోజుతో వస్తాడు!
ఆలోచనలతో గరుడాచలం బుర్రవేడెక్కింది. గబగబా షోకేస్ దగ్గరికి వెళ్ళాడు. విస్కీసీసా అందుకున్నాడు ‘కర్రు’న మూతతీసి ‘లొడ లొడా’గ్లాసులో వొంపుకున్నాడు.
సోడా కలిపి తాగుతూ కూర్చున్నాడు.
హాయిగా వుంది. మనసు గాల్లో తేలిపోతోన్నట్టుంది.
సమస్యల్ని మరుగునపెట్టి మనసుకు విశ్రాంతినిచ్చే మంత్ర జలంలా వుందా విస్కీ!
సిప్ చేస్తున్నాడు. నింపాదిగా ఆలోచిస్తున్నాడు.
కలివికోడి వైపుకు మళ్ళాడు!
సందేహం లేదు! నిజంగానే ఇక్కడి అడవిలో కలివికోళ్ళున్నాయి. వాటిని చూడాలి. వాటికోసం వెదకాలి. సమగ్రమైన సమాచారం సేకరంచి వ్యాసం రాయాలి.
అందుకోసం దండకారణ్యంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనా, ఇప్పుడు నల్లమల అడవుల్లో సాధించి తీరాలి!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు