డైలీ సీరియల్

అనంతం-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే సేవకుడొచ్చి రెండు ప్లేట్లలో ఫ్రై చేసిన నెమలి మాంసం టీపాయ్‌మీద పెట్టి వెళ్లాడు.
మందు తాగుతూ, నెమలి మాంసం తింటూ-
‘‘కలివికోడి పేరు విన్నావా’’ అని గరుడాచలం అడిగాడు.
‘‘ఇన్నాను సారూ! అడివిలో వున్నయ్యంట’’
‘‘వాటికి రక్షిత ప్రాంతం ఏర్పాటు చెయ్యాలి’’
‘‘తవరు తల్సుకుంటే అవుద్ది సారూ’’
‘‘నీ సహకారం కావాలి’’
‘‘యిసమ్ దాగవంటే తాగుతా’’
‘‘నాకేమిటి లాభం’’
‘‘ఏం గావాల్నేటి’’
‘‘రెడ్డియా నాయక్ తండా ఖాళీ చేయించాలి’’
‘‘యాడికి బోవాల మేవు?’’
‘‘పట్నంలోనే?’’ రాగ్యా కళ్ళుమెరిసాయి.
‘‘అవును’’
‘‘ఏం జేసి బతకాల’’
‘‘ఉద్యోగాలిస్తాం’’
‘‘నేనేవి జెయ్యాల్సారూ’’
‘‘చెప్పింది చెయ్యాలి’’
‘‘నాకేంటిది లాబం’’ అని రాగ్యా అడిగాడు.
‘‘ఏంకావాలి’’
‘‘శాందినీ’’
‘‘చందమామా’’
‘‘అసువంటి పిల్లే! తండాలో వుంటది’’
‘‘ఓహ్.. ఆడపిల్లా’’
‘‘నగ్గూరాం కూతురు’’
‘‘మనసు పడ్డావా’’
‘‘పేనం సారూ’’
‘‘అంత అందంగా ఉంటుందా’’
‘‘రంబ’’
‘‘రంభ స్వర్గంలో ఉంటుంది’’
‘‘శాందినీ యాడుంటే ఆడే సొరగవ్’’
‘‘అడిగావా దాన్ని’’
‘‘సెంబుతో గొట్టింది’’’
‘‘మళ్లీ కదిలించలేదా’’
‘‘ఏవన్నది’’
‘‘సీపుర్తో గొడతానంది’’
‘‘ఐతే అది పొగరుమోతు గిత్త’’
‘‘పోగురా.. పొగురా’’
‘‘వొదిలెయ్యి దాన్ని’’
‘‘నావల్లగాద్సారూ’’ అంటూనే రాగ్యా పెద్దగా ఏడ్చాడు.
పరిస్థితి గరుడాచలానికి అర్థమైంది!
రాగ్యా నాటుసారా తాగి కడుపులో తెమిలి, రాత్రి అన్నం కూడా తినకపోవడం, ఇపుడు విపరీతంగా విస్కీ తాగటం, సిగరెట్లు కాల్చటం...
చాంద్‌నీ ఆలోచనలను రాగ్యా మరచిపోలేకపోతున్నాడు.
అన్నీ కలిసి రాగ్యా తలకెక్కాయి! నిషా దిగేదాకా రాగ్యాతో ఏం మాట్లాడినా దండగే అన్న నిర్ణయానికొచ్చాడు.
గుడారంలోనే తన మంచానికి దూరంగా సేవకులతో చాప పరిపించాడు. రాగ్యాని చాపమీదికి చేర్చారా సేవకులు.
చాంద్‌నీనే కలువరిస్తూ రాగ్యా క్రమంగా గాఢనిద్రలోకి జారిపోయేడు.
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి అధికారులతో అప్పటిదాకా రహస్య మంతనాలు చేసి, అలసిపోయి విశ్రాంతిగా ఐదు నిమిషాలు పడుకొని అప్పుడే లేచాడు.
బహుళ జాతి కంపెనీల నుంచి వత్తిడి అధికమైందని, త్వరగా ఆపరేషన్ పూర్తి చెయ్యాలనీ, హైదరాబాదు నుంచి కబుర్లొస్తున్నాయి!
బాగా ఆలోచించాడు!
రెడ్డియా నాయక్ తండా వాళ్ళతో పరిచయాలున్నాయి. తన తండ్రిగారైన పెద్దిరెడ్డి కీ.శే. ఐనపుడు ఆ పెద్దలంతా ఓదార్పుకొచ్చారు.
పరిచయాలను అడ్డుపెట్టుకొని తనే స్వయంగా తండాకి వెళ్తే ఎలా ఉంటుంది? తండావాళ్ళని సమీకరించి అడవి పుత్రులకు ప్రభుత్వం మంచి జీవితాన్ని అందించాలని కంకణం కట్టుకుందనీ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇళ్ళు కట్టించి ఉద్యోగాలిచ్చి పట్టణాలకు తరలించాలని నిర్ణయించిందనీ వివరంగా చెబితే ఏమంటారో?
‘కలివికోడి రక్షణ’ మిషతో ఒక వైపునుంచి గరుడాచలం, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మరో వైపునుంచి ఎమ్మెల్యేగా తనూ వెంటపడితే తండావాళ్ళు ఆలోచనలో పడతారు. వాగ్దానాల జల్లులు కురిపిస్తే లొంగిపోతారు.
అప్పటికప్పుడు పోలీసు సిబ్బందిని గుడారానికి పిలిపించాడు. వాళ్ళతో చర్చించాడు. చర్చల ముగింపునకు చాలా సమయం పట్టింది. నిర్ణయం జరిగింది!
అంతలో గరుడాచలం వచ్చాడు.
‘‘ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారే?’’ అన్నాడు ఎమ్మెల్యేతో.
తన నిర్ణయాన్ని గురించి చెప్పి,
‘‘గరుడాచలంగారూ! మీ దారి వేరు. జనం ఏమనుకున్నా ఇబ్బంది ఉండదు. మా విషయం అలా కాదు! జనంతో మాకు సంబంధాలు చెడిపోకూడదు. అందువల్ల గిచ్చి ఏడ్పించినా మేమే మళ్లీ జోలపాడాలి. జనానికి వ్యతిరేకం చేస్తూనే జనంతో మమేకం కావాలి. అందుకే జనంలోకి వెళ్తున్నాను’’ అన్నాడు.
‘‘తండా బాటా?’’ అని గరుడాలం అడిగాడు.
‘‘అదే బాగుంది! అడవి బాటంటే అపార్థాలొస్తాయి’’
ఇద్దరూ పెద్దగా నవ్వారు.
‘‘మీ బాటలో మీరుండండి.. నా ప్రయత్నంలోనే నేనున్నాను’’
‘‘పురోగతి వుందా’’ గరుడాచలాన్ని అడిగాడు ఎమ్మెల్యే.
‘‘రాగ్యాని పిలిపించాను.. ఓంకారం పలికినట్టే’’
‘‘రెడీ సార్’’ అన్నాడొక పోలీసు అధికారి ఎమ్మెల్యేతో.
***
అనుకోని అతిథిలా అకాల వర్షంలా మేఘాల్లేని పిడుగులా వచ్చి పడ్డ ఎమ్మెల్యేని చూసి రెడ్డియా నాయక్ తండావాళ్లు ఆశ్చర్యంతో నోళ్లువెళ్లబెట్టారు.
మళ్లీ ఎన్నికలేమో అని సంతోషించిన వాళ్ళూ లేకపోలేదు.
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి తండ్రిని మించిన తనయుడు.. పులి కడుపున పులే పుడుతుందన్నట్టు, పుట్టుకతోనే ప్రపంచం తెలుసుకున్నవాడు! సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా, పోలీసులతో తండాకొచ్చాడన్న అపకీర్తి రాకుండా- పదిమంది మఫ్టీ పోలీసుల్ని వెంటపెట్టుకొచ్చాడు.

(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు