డైలీ సీరియల్

అనంతం-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి పుత్రులకు జన్మలో అందని భోజనం..
రాగ్యా అభిమానంగా గరుడాచలం వైపు చూశాడు.
ఎంత మంచివాడు గరుడాచలం!
అడవి పుత్రుడని అంటరాని వాడని నాగరికత తెలియని అజ్ఞాని అనీ తిరస్కరించి దూరంగాపెట్టకుండా తనతో సమానంగా చూస్తున్నాడు.
గొప్పవాళ్ళ మందే తాగిస్తూ, గొప్పవాళ్ళ భోజనం పెడుతూ, సిగరెట్లిస్తూ- తన సరసన కూర్చోపెట్టి ఆదరిస్తున్నాడంటే-
మనిషి రూపంలోవున్న దేవుడు గరుడాచలం!
రాగ్యా భావోద్వేగంతో చలించిపోయాడు.
భోజనాల అనంతరం కొంతసేపు విశ్రాంతి తీసుకొని, ఇద్దరూ అడవికి బయల్దేరారు.
‘‘సెక్యూరిటీ పంపించమంటారా’’అని ఎవ్వరో అడిగారు.
గరుడాచలం ‘్ఫక్కున’నవ్వాడు!
ఒంటరి పక్షిలా అప్పటిదాకా సందుల్లోగొందుల్లో కాలినడకన తిరిగేవాడూ; వ్యసనాల వత్తిడి తట్టుకోలేక వారకాంతలకోసం వీధుల్లో సంచరించేవాడూ, క్లబ్బుల్లో బీడీ బంకులదగ్గరా తచ్చాడేవాడూ-
జనం కర్మంచాలక ప్రజాప్రతినిధి ఐతే వెంటనే వాడికి సెక్యూరిటీ!
బజ్జీల బండ్లదగ్గర నిల్చున్నప్పుడు లేని ప్రాణహాని ఎమ్మెల్లేనో ఎంపీనో అయిన మరుక్షణమే ఎలా వస్తుంది?
అదో స్టేటస్ సింబల్!
అలాంటి వాళ్ళను చంపి బుల్లెట్లు వృధాచేసికొనే మూర్ఖులుండరని వాళ్ళకూ తెలుసు!
పాత బాకీ వసూళ్ళకు గన్‌మేన్లను పంపించేవాడూ. పెళ్ళాం పూలకోసం పాలపాకెట్లకోసం పిల్లల బిస్కెట్లకోసం, కూరగాయలకోసం సెక్యూరిటీని పంపించేవాళ్ళూ..
సెక్యూరిటీ పేరిట ప్రజాధనం కోట్లు తగలేస్తున్నారు.
‘‘అవసరం లేదు’’అన్నాడు గరుడాచలం.
రాగ్యా గరుడాచలం అడవికి బయల్దేరారు.
* * *
వాల్యా ఏడుస్తూనే ఉన్నాడు..
వరి బువ్వ కావాలిట!
పోలీసు దెబ్బలకు వొళ్ళంతా కడుములు తేలి, ఒకవైపు బాణావతు కదల్లేని స్థితిలోవుంటే, వరి బువ్వకోసం ఎలా వాల్యా?
అడవి బ్రతుకే శాపమై క్షణంక్షణం భయంభయంగా బ్రతుకుతూ, ప్రభుత్వాధికారుల నిర్బంధాలకు గురౌతూ, శాపగ్రస్థుల్లా-జీవచ్ఛవాలై జీవిస్తుంటే,
కడుపున పుట్టిన బిడ్డకు పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యస్థితిని తల్చుకొని బాణావతు గుండె పగిలిపోదూ!
దెబ్బల బాధకు మూలుగుతూ నిస్త్రాణగా పడివున్న భర్తకు వాల్యా ఏడుపు వినిపించకూడదనుకొన్నది లక్ష్మీబాయి. వాడ్ని సముదాయించమని చాంద్‌నీ దగ్గర విడిచిపెట్టి వచ్చింది.
వాల్యాని సముదాయించి ఏడుపుమాన్పించటం ఓపట్టాన చాంద్‌నీ వల్ల కూడా కావటంలేదు. వాడికి మళ్ళీ వరిబువ్వ గుర్తొచ్చింది.
ఎమ్మెల్లే వచ్చి మానిన గాయాన్ని కెలికాడు!
ఇప్పుడేం చెయ్యాలి?
ఏడుపెలా మాన్పించాలి?
చాంద్‌నీ ఆలోచించింది! వాల్యాకి జాంపండ్లంటే ఇష్టం.
‘‘జాంప్లొండు గావాల్నా’’అని అడిగింది.
‘‘కావాలి’’అన్నాడు వాల్యా, ఆశగా చూస్తూ.
అడవిన దొరికే జాంపండ్ల వైపుకు వాల్యా మనసు మళ్ళించి తాత్కాలికంగా ఏడుపు మాన్పించగలదేమో కానీ... సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఏమిటి?
మళ్ళీ వాడికి వరిబువ్వ గుర్తొస్తే-
ప్రపంచంలోని ఆకలి బాధంతా గొంతులోకి తెచ్చుకొని జాలిగా దీనంగా హృదయవిదారకంగా ఏడుస్తాడు. ప్రపంచ అన్నార్తుల సమ్మేళనంలో భారత ప్రతినిధిలా ఆకలి కేకలు వినిపిస్తాడు.
ఆర్తనాదాల్లో, విలాపాల్లో, వెక్కిళ్ళలో, కన్నీళ్ళలో, దహించే కడుపుమంటలో మన దౌర్భాగ్యాన్ని బొమ్మకట్టి చూపిస్తాడు.
‘‘జాఁవ పొండ్లుగావాలి’’అన్నాడు వాల్యా.
చాందినీ కూడా జాంపండ్లమీదికి మనసుపోయింది!
చెట్టుకే పండిన జాంపండ్లు చాలా మధురంగా వుంటాయి.
నెమలి గుట్ట దగ్గర్లో వున్న నీటి కొలను చుట్టూ చాలా జామ చెట్లున్నాయి. చేతికి అందుతాయి కూడా!
‘‘కొలనుకాడికి బోదాఁవా’’ వాల్యాని అడిగింది.
‘‘జాఁవ పొండ్లుంటయ్యా.’’
‘‘తిన్నన్ని.’’
‘‘కొన్నిదెచ్చి దాపెట్టుకుందాఁవు’’అన్నాడు వాల్యా.
ఇద్దరూ బయల్దేరారు.
తండాదాటి, అడవిదారిలో జాగ్రత్తగానడుస్తూ కొలనువైపుకు సాగిపోతోన్నారు.
దూరంగా ఏదో పక్షి వికృతంగా అరిచింది!
వాల్యా భయపడ్డాడు.
అమాంతం చాంద్‌నీ కాళ్ళను వాటేసుకున్నాడు.
తూలిపడబోయి, తమాయించుకుంది. వాల్యాకి ధైర్యంచెప్పింది.. మళ్ళీ నడక..
కొలను దగ్గరికి చేరారు. విరిగ కాసిన జామచెట్లు చాలా వున్నాయక్కడ.
వాల్యా సంతోషం పట్టలేకపోయాడు. కేరింతలు కొడుతూ చెట్లదగ్గరికి వెళ్ళాడు.
చాంద్‌నీ కూడా వెళ్ళింది.
వాల్యా తలెత్తి జాంపండ్లవైపే చూస్తున్నాడు.
బాగా పండిన జాంపండ్లు ఎర్రగా, దోరగా పండిన పండ్లు ఎరుపు తెలుపూ రంగుల మిశ్రమంలా కనువిందు చేస్తున్నాయి.
ఆకుల పసరు వాసన, జాంపండ్ల తీపి వాసనా జత కలిసిన పరిమళం ఏదో గాలివెంట వస్తోంది.
వాల్యా చేతులు పైకెత్తి ఎగుర్తున్నా జాంపండ్లు అందటం లేదు.
చాంద్‌నీ వైపు జాలిగా చూసాడు.
నవ్వుతూ వెళ్ళింది. చేతులు చాపింది. చాలా పండ్లు కోసి వాల్యాకిచ్చింది.
ఇద్దరూ అక్కడే నేలమీద కూర్చొని కడుపునిండా తిన్నారు.
మిగిలిన జాం పండ్లు వాల్యా తలగుడ్డలో మూటకట్టి నెత్తిమీద పెట్టుకోబోయింది.
‘‘పొండ్లమూట నాకియ్యి’’అని వాల్యా మారాంచేసాడు.
‘‘మొయ్యలేవు’’అన్నది చాంద్‌నీ.
‘‘సిన్న మూటే!’’
‘‘మొయ్యలేవు.’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు