డైలీ సీరియల్

అనంతం-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగ్యా, గరుడాచలం దగ్గరికొచ్చాడు!
వాళ్ళని చూసి భయంతో గుండె ఝల్లుమని- అంతలోనే భయం బైటపడకుండా కుదుటపడింది చాంద్‌నీ!
అలాంటివాళ్ళు పౌరుషమున్న త్రాచుపాముల్లాంటి వాళ్ళుకాదు! ఎదురు తిరిగితే పారిపోయే పిరికి జెర్రిపోతులు!
అందుకే భయాన్ని బలవంతంగా అణచుకొని ధైర్యం ప్రదర్శించింది చాంద్‌నీ!
ఆడదానిలో యింత అందం ఉంటుందా’ అన్నంతగా ఆశ్చర్యపోతూ చాంద్‌నీనే చూస్తూ, అనిమిష నేత్రుడే అయ్యాడు గరుడాచలం!
‘‘యల్దాఁవు పదరా వాల్యా’’అన్నది చాంద్‌నీ.
‘‘సార్ని పరిశయఁవ్ జాస్తానుండు’’అన్నాడు రాగ్యా.
‘‘నా పేరు గరుడాచలం... పక్షుల మీద పరిశోధలు చేస్తున్నాను. బాగా ఆస్తిపరుడ్ని. వంద కోట్లకి తక్కువుండదు. ఒక భార్య, ఇద్దరు పిల్లలు మాత్రమే! తినేవాళ్ళు అంతకన్నా లేరు’’ అని తన్నుతానే పరిచయం చేసికొన్నాడు సారు!
‘‘గరుడాశలఁవ్ సారు శానా మంచోడు’’ అన్నాడు రాగ్యా.
‘‘నీకాడికా?’’ అన్నది చాంద్‌నీ, వాల్యా చెయ్యపట్టుకొని నడిపించబోతూ.
‘‘ఒక్కమాట’’ అన్నాడు గరుడాచలం.
చాంద్‌నీ ఆగింది. ‘ఏమిటి’ అన్నట్టు చూసింది.
‘్భలే అందంగా ఉన్నావు’’
గుర్రుగా చూసింది.
‘‘రాగ్యా కూడా అందగాడే’’
‘‘పదరా వాల్యా పోదాం’’
‘‘శాందినీ’’ అని రాగ్యా పిల్చాడు.
‘‘ఏవి రోగవ్’’ అడిగింది.
‘‘సారు శానా గొప్పోడు’’
‘‘ఐతే నాకేంటిదంట’’
‘‘ఏం గావాల్నో అడుగు! మనిద్దరి లగ్గవ్ సారే శాత్తాడు’’
‘‘సెంబు దెబ్బసాల్లేదంటరా’’
‘‘తండాదానివని సెంబున గొట్టినా ఒగ్గీశాను.. సార్తోన పరాశకాల్ గాదు’’
‘‘బెదిరిస్తుండావా’’
‘‘ఆలోచిచ్చంతే’’
‘‘ఏటంట’’
‘‘లగ్గవాడు నన్ను’’
‘జల్మలో గాదు’’
‘‘పట్నంలో డాబా ఇంట్లో బెడతా. కోరినబువ్వ, కోరిన సీరే రెయికా! వాసన సబ్బులూ.. పొగడరీలూ..’
‘‘సి.. సి.. యదవ జల్మ’’
‘‘నాది కాదే శాందినీ. నీది! అడవి ఏటిత్తుండాదే నీకు? సీవల్లో దోవల్లో సింపిరి తల గోక్కుంటా, అడవి సిదుగు లేరుకుంటా పొయ్యూదుకుంటా, వంట కుండ లెక్కిత్తా.. దింపుతా..
అసువంటి జల్మ నీకేంటికే శాందినీ? లగ్గవాడావంటే సొరగవ్ సూపిత్తా! పట్నంలో వుండే సుకాలన్నీ నీ కాడికి తెప్పిత్తా! మంచి శాన్సు. సెడనూక్కోగాకు’’ అన్నాడు రాగ్యా.
సహించీ.. సహించీ అప్పుడు శివమెత్తింది! ఇంతింతకళ్ళు చేసికొని రుద్రకాళిలా రాగ్యాని భస్మం చేసేట్టు చూస్తూ-
‘‘అడవి నాకేటిచ్చిందో తెలవదంటరా, సచ్చినోడ! అడవి నాకు జల్మనిచ్చింది. బతకటవ్ నేరిపిచ్చింది. సావటం నేరిపిచ్చింది. బతకటవ్ కోసరవ్ సంపటవ్ నేరిపిచ్చింది.
సవట నాయాల! అడవి నాకు పొండుకాయలిచ్చింది. కోనేటి నీలిచ్చింది. తేనె పట్లిచ్చింది. మాటేసి దుమికే యాట నేరిపిచ్చింది. పులుల్నీ ఎదిరిచ్చటవ్ నేరిపిచ్చింది. నెమిళ్లనీ జింకల్నీ సేరదియ్యటవ్ నేరిపిచ్చింది. ‘ఏవిచ్చింది’ అంటావంటరా బోకరు నంజాకొడక’’ అని ఆగ్రహవేశాలతో రుద్రమూర్తి అయి, అమాంతం రాగ్యా మొహంమీద కాండ్రించి ఉమ్మేసింది చాంద్‌నీ.
రాగ్యా ఆమెను పట్టుకోబోతే మెరపు వేగంతో కదిలి కోసురాయి అందుకొని బలంగా వాడి తలమీద మోదింది.
‘్ఠ’ప్పున శబ్దం!
రాగ్యాకి ఆ దెబ్బతో చుక్కలు కనిపించాయి! మెదడు మొద్దుబారి ఒక్క క్షణం ఆలోచనలు స్తంభించిపోయాయి.
చేష్టలుడిగి పోయాడు రాగ్యా.
గరుడాచలం చాందినీ మీదికి దూకబోయాడు!
విసురుగా గాల్లోంచి లేచి వచ్చి మరో రాయి గరుడాచలం తలను బలంగా తాకింది.
గావుకేక పెట్టాడు.
అదే అవకాశంగా భావించింది చాందీనీ. రాగ్యా మొహంమీద మళ్లీ కాండ్రించి ఉమ్మేసి గరుడాచలం వైపు కోపంగా చూసింది.
వాల్యాని వెంట బెట్టుకొని వడివడిగా అరుస్తూ, అక్కడ్నించి వెళ్లిపోయింది చాంద్‌నీ.
గరుడాచలం మీదికి రాయి విసిరింది వాల్యా!
చిన్నవయసులోనే వాడికి ప్రతిఘటనాతత్వం ఎలా అబ్బినట్టు? ధైర్యంగా రాయి ఎలా వెయ్యగలిగాడు? ఇదే స్వభావం కొనసాగితే పెద్దయ్యాక వాడెలా తయారౌతాడు? వాడినలా తయారుచేసిందెవ్వరు?
ఇవ్వాళ గురి చూసి రాయి విసిరినవాడు తర్వాత గురి చూసి తుపాకులు పేల్చడనీ, బాంబులు విసరడనీ ఏమిటి నమ్మకం?
తమ శత్రువుల్ని తామే తయారుచేసుకోవటం ‘పెద్దవాళ్ల’కు శాపం అనటం తప్ప మరో సమాధానం లేదు!
చాంద్‌నీ ప్రేమాభిమానాలతో ఉప్పొంగి పోతూ వాల్యా తలమీద చేత్తో నిమిరింది.
తండాకి చేరారు.
వాల్యాని ఇంటి దగ్గర దిగవిడిచింది చాంద్‌నీ.
***
‘తండా బాట’ కార్యక్రమం రెడ్డియానాయక్ తండాలో అంత అభాసుపాలైనా కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డికి కించిత్తు కోపం కూడా రాలేదు.
‘‘నా ప్రజలు చైతన్యవంతులౌతున్నారు’’ అన్నాడు.
పోలీసు సిబ్బందికి వింతగావుంది.
ఓ అధికారి కోపం పట్టలేక
‘‘సార్! ఆర్డరిస్తే చాంద్‌నీని, లక్ష్మీబాయినీ మక్కెలిరగతనే్నవాళ్లం. ఉపేక్షించారెందుకు? ముందు మనం ఖాళీ చేయించాల్సిందే ఆ తండా. ‘ఊ’ అంటే ఫైరైనా ఓపెన్ చేసేవాళ్లం’’ అన్నాడు.
ఎమ్మెల్యే మాట్లాడలేదు. చిరు మందహాసం చేశాడు!
‘‘ఎన్‌కౌంటర్ చెయ్యాల్సింది’’ పోలీసు ఉద్యోగి మళ్లీ అన్నాడు.
వాళ్ళంతా గుడారాల వైపుకు సాగిపోతూ అడివి దారిలో అలా మాట్లాడుకొంటున్నారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు