డైలీ సీరియల్

అనంతం-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదక ద్రవ్యాల జోలికి రావటంలేదు.
పేకాట పట్టించుకోవడంలేదు.
‘‘ ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అంటే నేం!
‘‘అన్యాయం.. అక్రమం’’అని అరిచే ‘లడీకొడుకుల’కన్నా, అరవని ఆ దొంగ.... కొడుకులు ఎంతో నయం!
జాతర సందడి మొదలయ్యింది.
తండాలనుంచి అడవి పుత్రులు తండోపతండాలుగా వొస్తున్నారు.
ముసలివాళ్ళని డోలీల్లో తెస్తున్నారు.
కుటుంబాలకు కుటుంబాలే తరలి వస్తున్నాయి.
జనసంద్రంగా మారిపోతోంది!
కొంతమంది..
భక్తిపారవశ్యంలో చిందులు వేస్తున్నారు!
చాలాకాలం తర్వాత అక్కడ కలిసినవాళ్ళు ఆప్యాయంగా ఒకళ్ళనొకళ్ళు పలుకరించుకొంటూ నవ్వులు చిందిస్తున్నారు.
ఒకళ్ళ బాధలు సుఖాలు ఒకళ్ళకొకళ్ళు అడిగి తెలుసుకొని ఓదార్చుకుంటున్నారు.
వాళ్ళ మాటల్లో-
సంపదకోసం పడే అవస్థలు, సంతలో జరిగే దోపిడి, పోలీసుల దాష్టీకం, ఫారెస్టువాళ్ళ వేధింపులూ, దళారీల మాయ..యిత్యాదివే వినిపిస్తున్నాయి!
అడవి పుత్రులు దుకాణాల దగ్గర గుమికూడుతున్నారు.
వ్యాపారం ఊపందుకుంది.
కావాల్సిన వస్తువులు కొనుగోలుచేస్తూ, అందుకు ప్రతిగా అడవి సంపద చెల్లిస్తున్నారు అడవి పుత్రులు.
వస్తుమారకమే వ్యాపారులకు లాభసాటి బేరం!
సరుకు అసలు ధర అడవి పుత్రులకు తెలియదు. దగ్గరున్న అడవి సంపద అసలు విలువా తెలియదు.
వ్యాపారులు చెప్పినంత ధరకు, అడిగినంత అడవి సంపద సమర్పించుకొంటున్నారు. ధరల్లో వ్యత్యాసాన్ని పట్టించుకోవటం లేదు.
ఆ వ్యత్యాసం అదనపు లాభం!
పడికట్టు రాళ్ళతో సరుకు కాటావెయ్యటం లేదు. తమ చేతుల్నే కాటాలనుకొని ఉజ్జాయింపుగా లెక్కచెబుతూ సరుకు అమ్ముతున్నారు.
అడవి సంపద పొందుతున్నారు.
అలా మోసపోతోన్న విషయం అడవి పుత్రులకు తెలియదు... మోసగించకుండా సరుకు అమ్మటం వ్యాపారులకు తెలియదు!
అంతకంతకూ లోతట్టు అడవుల్లోనుంచి జనం వచ్చి పడుతున్నారు. నేల రుూనిందా అన్నట్టుంది.
నల్లకొండ చుట్టుపట్ల ఎటుచూసినా జనమే!
కిలాడి వ్యాపారి ఒకడు-
‘‘్ధనలక్ష్మి యంత్రాలోయ్...యంత్రాలు’’ అని అరుస్తున్నాడు.
సత్తురేకుల మీద అచ్చుపోసిన లక్ష్మీదేవిని, పాత గోతాలకి తెచ్చి, -చాప మీద గుట్టపోసి అమ్ముతూ-
‘‘రండి బాబూ..రండి! ధనలక్ష్మి యంత్రం కొనండి. అదృష్టవంతులు కండి!
ఈ ధనలక్ష్మి యంత్రం ధరించే ఓ బికారి వెధవ భాగ్యవంతుడై ఎమ్మెల్లే అయ్యాడు.. ఇంకో యంత్రం కొని మంత్రి అయ్యాడు. ముచ్చటగా మూడోది కొని ముఖ్యమంత్రి అయ్యాడు.
రండి బాబూ.. రండి!
ధనలక్ష్మి యంత్రం కొనండి!
దీని మహిమ తెలియక, యంత్రం వొద్దన్న ఓ స్వాతంత్య్ర సమర యోధుడు ఆకలిచావు చచ్చాడు. నాస్తిక వెధవ దేశభక్తుడొకడు బూటకపు ఎన్‌కౌంటర్లో మరణించాడు.
‘మహిమా-తొక్కా’అన్న కాన్సర్ పేషంటొకడు రక్తం కక్కి చచ్చాడు!
రండి బాబూ.. రండి!
ధనలక్ష్మి యంత్రం కొనండి!
స్కాముల్లో యిరుక్కున్నా, కోర్టులు మందలించినా, జరిమానాలు వేసినా, సంజాయిషీ అడిగినా, శిక్షలు పడినా- యింకా కొంతమంది ‘యుగపురుషులు’ మంత్రివర్గంలోనే వున్నారంటే... అదంతా మా ధనలక్ష్మి యంత్ర మహిమే!
ఆలస్యం చేస్తే అందవు బాబూ...రండి!
రండి బాబూ..రండి. ధనలక్ష్మి యంత్రం కొనండి’’అంటూ అతగాడు పెద్దపెద్దగా అరుస్తూ అడవి పుత్రుల్ని ఊరిస్తున్నాడు. అక్కడ జనం మూగారు!
‘‘అట్లా రావాలి. యంత్రాలు కొనాలి. అదృష్టవంతులు కావాలి
రండి బాబూ రండి. ధనలక్ష్మి యంత్రం కొనండి’అంటూ రెట్టించిన ఉత్సాహంతో అరుస్తున్నాడతను.
అడవి పుత్రులు అబ్బురంగా యంత్రాల వైపే చూస్తున్నారు!
ఎరుపూ, నలుపూ రంగుదారాలకు వ్రేలాడగట్టారా సత్తురేకుల ధనలక్ష్మి యంత్రాల్ని!
ఐతే నేం,-
ఏకబిగిన అమ్ముడుపోతున్నాయి.
మహిమ, మరా సత్తురేకుదో, అచ్చోసిన బొమ్మదో, రంగుదారాన్దో కానీ, అడవి పుత్రులు విరగపడి కొంటున్నారు.
అప్పుడొచ్చాడు గోపీనాయక్!
అడవి పుత్రులందరూ ఆరాధనగా అతనే్న చూస్తున్నారు!
ఎముక పుష్టి తప్ప, కండ పుష్టి లేని బక్కచిక్కిన శరీరం!
అయస్కాంతాల్లాంటి కళ్ళు, ఆ కళ్ళల్లో మిరుమిట్లుగొల్పే ఏదో కాంతి!
సకల పురాణ పురుషులంతా దివ్యశక్తుల్ని చేర్చికూర్చి, తయారుచేసిన దివ్యాస్త్రంలా ఉన్నాడు!
‘‘ఎంత?’’ అన్నాడు, కిలాడి వ్యాపారితో
‘‘ఒకటా- రెండా- మూడా?’’ అడిగాడు వ్యాపారి.
‘‘మూడు గొంటే ముక్కెమంత్రి అయ్యిండంటివి గదా.. మరి నాలుగ్గొంటే..?’’
‘‘దేశంలో వున్న గనులున్నీ మీవే అవుతాయి.’’
‘‘ఐదుగొంటే?’’
‘‘పోలీసుల భయం ఉండదు. ఫారెస్టుగార్డులతో పేచీ ఉండదు.’’
‘‘ఆరుగొంటే?’’
‘‘సంతలో దళారీల బాధుండదు.’’
‘‘ఏడుగొంటే?’’
‘‘పాములు, పులులు, సింహాలూ తోకముడిచి పారిపోతాయి.’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు