డైలీ సీరియల్

అనంతం-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంప్రదాయక ఆధారాలైన ఈటెలు, వేట కొడవళ్ళు, బరిశెలు, వడిశాలలు, బాణా కర్రలూ ఉన్నాయి.
కళ్ళల్లో కసి, కోపం వుంది.
ఆయుధాల మీద బిగుసుకున్న పిడికిళ్ళలో అనంతమైన ప్రతిఘటనా శక్తి వుంది.
వాళ్ళ చూపుల్లో చురుకుదనం వుంది!
రాగ్యా కనిపిస్తాడా?
వాడు పెద్ద తప్పుచేసాడు. పెద్దల్ని ధిక్కరించాడు కట్టుబాట్లను కాలదన్ని, క్షంతవ్యం కాని నేరం చేశాడు.
భయపడి పారిపోతే అడవిలోనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయేవాడు. లేదంటే పట్నానికి పోయేవాడు.
అలా చెయ్యలేదు వాడు!
తండా ఖాళీ చేయించి అడవి పుత్రుల జీవితాలతో చెలగాటమాడేందుకు వచ్చిన నాగరికులతో చేతులు కలిపాడు.
వాళ్ళ గుడారాల్లోనే తనూ వుండి ఏం కుట్రలు చేస్తున్నాడో!
మద్య మాంసాలకోసం రాగ్యా ఎన్ని అకృత్యాలైనా చేస్తాడు. ఉచ్ఛనీచాలు విస్మరించి ప్రవర్తిస్తాడు.
దానికితోడు చాంద్‌నీ తిరస్కారం, ఆమె చేసిన అవమానం అగ్నికి ఆజ్యం పోసింది!
రాజ్యా ఎంతకైనా తెగిస్తాడు!
అలాంటి ఆలోచనలతో అడవిపుత్రులు రాగ్యామీద మరింత కోపం పెంచుకొని గుణపాఠం నేర్పాలన్న సంకల్పంతో ఉన్నారు!
జాతర జనంలో ఎక్కడున్నాడో, రాగ్యా!
కనిపిస్తే వాడ్ని తాళ్ళతో బంధించాలి.
తండాకి తీసుకొని వెళ్ళి, పంచాయితీల చెట్టుదగ్గర చింత బరికలతో కొట్టాలి... వివరాలు ఆరా తియ్యాలి!
తెరవెనుక ఏం జరుగుతున్నదో, అంతమంది సాయుధ పోలీసులు ఎందుకక్కడ విడిది చేశారో, తండా ఖాళీ చేయించేందుకు జరుగుతున్న కుట్రలేమిటో తెలుసుకోవాలి!
వాళ్ళు డేగ కళ్ళతో రాగ్యాకోసం చూస్తూ, అణువణువూ గాలిస్తూ కొండ వైపుకు సాగిపోతున్నారు.
* * *
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి, గరుడాచలం కొండ దగ్గరికి వెళ్ళలేదు. ఎమ్మెల్లే గుడారంలో ఇద్దరూ కూర్చొని మంతనాలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ, అవసరమైన సూచనలు, సలహాలూ ఇస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు ఎమ్మెల్లే!
అప్పగించిన పనులన్నీ రాగ్యా సక్రమంగా చేశాడని సమాచారం అందింది.
మఫ్టీ కానిస్టేబులు కనకయ్య అప్పటికే కొండ దగ్గరికి వెళ్ళాడు!
‘‘దేవుడి మహిమగా భావించి పూనకాలనింకా నమ్ముతున్నారంటే ఆశ్చర్యంగా వుంది’’ అన్నాడు గరుడాచలం. పెదవి విరుస్తూ.
ఎమ్మెల్లే అదోలా చూసాడు!
‘‘ఆకాశంలోకి దూసుకొని వెళ్ళి కొత్త గ్రహాల ఉనికిని తెలుసుకొంటుంటే- ఇప్పటికే మూఢ నమ్మకాలు, ఆచారాలు మనుషుల్ని విడిచిపెట్టకపోవటం వింతగా లేదూ?’’ గరుడాచలమే అడిగాడు.
‘‘మూఢత్వం అని నువ్వే అన్నావు కదా’’అని నవ్వాడు ఎమ్మెల్లే.
ఒక్క క్షణం ఆలోచించి-
‘‘దేవర పూనింది నమ్ముతారా, అడవి పుత్రులు?’’ అని అడిగాడు.
‘‘సందేహం లేదు! నమ్ముతారు.’’
‘‘అంత నమ్మకంగా ఎలా చెప్తున్నాను.’’
‘‘అదంతే! గుండె మార్పిడి శస్తచ్రికిత్సలు చేసే డాక్టర్లే కొంతమంది దేవుడ్ని ధ్యానించి కానీ, థియేటర్లకు వెళ్ళరు. కొత్త గ్రహాల్ని కనుగొనేందుకు రాకెట్లు పంపించే శాస్తజ్ఞ్రులు సైతం ముహూర్త బలం చూసి గానీ మీటలు నొక్కటం లేదు!
దేవుడి మీద పదవీ స్వీకార ప్రమాణం చేసి, పాలకులయ్యే నేతలు ఏనుగు వెలగ పండు తిన్నట్టు దేశాన్ని మింగుతున్నా, స్కాములతో లక్షల కోట్లు గడించి దాచుకున్నా పట్టించుకోడా దేవుడు.
అందుకే దేవుడి మీద ప్రమాణం చెయ్యటం.
ఉళుకూ పలుకూ లేని దేవుడు ఎంత మంచివాడూ!?
నాగరికులే, ముక్కోటి దేవుళ్ళు చాలరన్నట్టు- కుక్కల్ని, పిల్లుల్ని, బల్లుల్ని, చీమల్ని, చిలకల్ని- దైవత్వం ఆపాదించి పూజిస్తుంటే, ఇక అమాయకులైన అడవి పుత్రులు నమ్మటంలో ఆశ్చర్యం ఏమున్నది? నమ్ముతారు నమ్మి తీర్తారు’’అని గరుడాచలానికి ధైర్యం చెప్పాడు ఎమ్మెల్లే.
‘‘నీకు దేవుడి మీద నమ్మకంవుందా’’ గరుడాలం అడిగాడు.
‘‘దేవుడికి నామీద నమ్మకం వుంది! అందుకే ఎమ్మెల్లే అయ్యాను’’ అని, పగలబడి నవ్వాడు ఎమ్మెల్లే.
‘‘జీవ రహస్యం తెలుసుకొనే ‘బిగ్‌బేంగ్’ ప్రయోగం పట్ల నీ అభిప్రాయం ఏమిటి’’ గరుడాచలం అడిగాడు.
‘‘దేవుడ్ని నమ్మని వాళ్ళు పూర్తిగా నమ్మరు!’’
‘‘నమ్మేవాళ్ళో?’’
‘‘దృఢంగా నమ్ముతారు.’’
‘‘అదెలా సాధ్యం.’’
‘‘జీవి పుట్టుకకు కారణమైన ‘దైవ కణం’ అనబడే శూక్ష్మ మూల కణమే ‘దైవ సృష్టి’అనుకుంటారు’’అని ఎమ్మెల్లే చెప్పాడు.
ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
కొంత సమయం వౌనంగా గడిచిపోయాక-
‘‘చాంద్‌నీ విషయంలో అల్లర్లు జరుగుతాయేమో?’’అని, ఎమ్మెల్లేవైపు చూశాడు గరుడాచలం.
‘‘జరుగుతాయి.’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘అడవి పుత్రులు వేల సంఖ్యలో వున్నారు.’’
‘‘నీ భావం అర్ధమైంది! మంది బలం చూసుకొని వాళ్ళు రెచ్చిపోతేనే మంచిది! అల్లర్లు జరగాలి. కాల్పులదాకా వెళ్ళాలి. విధ్వంసం విలయ తాండవం చెయ్యాలి.’’
‘‘ప్రయోజనం.’’
‘‘పనిలోపనిగా తండా ఖాళీ చేయించొచ్చు’’ అన్నాడు ఎమ్మెల్లే.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు