డైలీ సీరియల్

అనంతం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవరంట’’అని అడిగింది.
‘‘పూనకఁవ్లో కొండ దేవరే సెప్పిండు!’’
‘‘ఇసుఁవంటిరుూగూడా శాత్తాడా..దేవర?’’
‘‘సెయ్యనీ, సెయ్యనీపోనీ- మనోళ్ళు నమ్మినారంతే! సివరాకరికి నీ అయ్య నగ్గూరాం గూడా సప్పుడుజెయ్యలేదు.. ఒకేళ, యిది అనేలఁవని ఎవురైనా అన్నా మనోళ్ళే ఇనేట్టులేరు...’’
‘‘యాడికి బోవాల్నేను? ఆడగూడా ఇట్టా సెయ్యరన్న నమ్మకఁవేటి?’’ అని, చాంద్‌నీ అడిగింది.
సమాధానం చెప్పబోయి గోపీనాయక్ ఎందుకో ఆగాడు!
దూరంగా అడవిలోనుంచి మనుషుల అడుగుల చప్పుళ్ళు వినిపించసాగాయి!
‘‘అనుఁవానవ్ లేదు! నీకోసరఁవే వత్తావుండారు వాళ్ళు!
సిక్కినావంటే నీ పని కలాస్! తొందరగా ఎళ్ళు’’అన్నాడు గోపీనాయక్.
లక్ష్మీబాయి అంతా విన్నది!
చాంద్‌నీతో-
‘‘గోపీనాయకే సెప్పిండంటే ఏంటికి సెప్పిండో ఆలోసిచ్చు! పరిత్తితి బాగా లేదు! ‘పట్టాగుడిశే లేసుకొని పట్నపోళ్ళు శార్టవ్, యంట, టుపాకుల పోలీసోళ్ళుండటఁవ్.. అంతా గందరగోళంగుంది!
యాడికి బోతావోగానీ, రుూడ్నించి ఎల్లిపో శాందినీ!
నిజ్జంగానే జోగిన్నిసేత్తే సెడిపోతావు. ఏంటికీ పనికిరాకుండా పోతావు’’ అని తొందరపెట్టింది.
‘‘రాగ్యాగాడి పనేఁవో- ఇదంతా’’ అన్నది చాంద్‌నీ.
‘‘అయ్యన్నీ యనకఁవాల ఆలోశిద్దాఁలర.. పద’’
అంతలో దూరంనుంచి మనుషుల అడుగుల చప్పుళ్ళు వినిపించాయి!
‘‘వొచ్చేస్తుండారు.. తొందరగా ఎల్లిపో’’అన్నాడు గోపీనాయక్.
‘‘యాడికి బోవాల’’అని చాంద్‌నీ అన్నది.
‘‘గొలుసు కొండల కాడుండు! యవ్వారఁవ్ సూసినాక తండా పెద్దల్ని తీసుకొని నేనొత్తాను. ఏం జెయ్యాల్నో నిమ్మళంగా ఆలోశిద్దాఁవు’’ అన్నాడు గోపీనాయక్.
చాంద్‌నీ తలెత్తి దూరంగా చూసింది!
అడవి దారిలో గుంపుగా జనం వస్తూ కనిపించారు.
‘‘ఆలీసెఁల్ జెయ్యగాకు’’ లక్ష్మీబాయి హెచ్చరించింది.
‘‘ప్రెవాదఁవ్’’అన్నాడు గోపీనాయక్.
చాంద్‌నీ బాణావతు ఇంట్లోకి వెళ్ళింది.. వాల్యా నెత్తుకొని తనివితీరా ముద్దాడింది.. క్రిందికి దించింది.. బయల్దేరింది!
కన్నీళ్ళు తుడుచుకొంటూ చాంద్‌నీ అడవిలోకి వెళ్ళిపోయింది!
కొద్దిక్షణాల తర్వాత, చాంద్‌నీకోసం వస్తున్న అడవిపుత్రులు తండా చేరారు. చాంద్‌నీకోసం అంతా గాలించారు.
ఆమె కనిపించలేదు.
నీరసంగా వెనుదిరిగి నల్లకొండ వైపునకు సాగిపోయాను.
అప్పుడు తండాలో వున్న అందరూ ఆందోళనకు గురయ్యారు! మొహాలు పాలిపోయాయి!
అడవిలోకి వెళ్ళిన చాంద్‌నీకి అయోమయంగా వుంది!
జరిగింది కలా? నిజమా? అన్నట్టుంది!
ఇప్పుడేం చెయ్యాలి?
ఇదంతా ఎందుకు జరుగుతున్నది?
రాగ్యా!
అవును! వాడివల్లే ఇదంతా జరుగుతున్నది. సందేహం లేదు.
ఐనా తను చెయ్యగలిగిందేముంది?
రాగ్యా వెంట గరుడాచలం ఉన్నాడు. ఎమ్మెల్లే ఉన్నాడు. ప్రభుత్వ యంత్రాంగం ఉంది. పోలీసులున్నారు.
అందర్ని ఎదుర్కొని చెయ్యగలిగేదేముంది?
చివరికి అడవి పుత్రులు కూడా నాగరికుల మాయలోపడి తనను జోగిన్ని చెయ్యాల్సిందే అంటుంటే- రక్షణ ఎవ్వరిస్తారిక తనకు?
అడవి పుత్రులను కూడా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి కల్పించాడు రాగ్యా!
రాగ్యా గుర్తొచ్చి పళ్ళుకొరికింది చాంద్‌నీ!
అప్పటికే ఆమె కాలి బాట వొదిలిపెట్టి, లోతట్టు అడవిలోవున్న గొలుసుకొండల వైపుకు సాగిపోతోంది.
అక్కడైనా రక్షణ ఉంటుందా? ఎక్కడుంది కనుక?
అడవిలో, క్రూరమృగాల భయం. తండాలో అడవి పుత్రుల భయం. ఫారెస్టుగార్డుల భయం. గుడారాల్లో మాటువేసిన నాగరికుల భయం.
రక్షణ ఎక్కడుంది?
వాల్యా గుర్తొచ్చాడు! వాడికి తీరని కోరికగా మిగిలిన వరిబువ్వ గుర్తొచ్చింది!
కడసారి వాడికి పిడికెడింత వరిబువ్వ పెట్టగలిగితే ఎంత బాగుండేది!?
అందుక్కూడా నోచుకోలేదు!
నడుస్తూ ఆలోచిస్తూ- ఆలోచిస్తూ నడుస్తున్నది చాంద్‌నీ!
ఎంత దూరం అలా నడిచిందో! బాగా అలసటగా వుంది!
కొంతసేపు విశ్రాంతిగా కూర్చోవాలనిపించింది!
క్షణక్షణం శక్తి హరించుకొనిపోతూ, శరీరం దూదిపింజలా మారిపోతోన్నట్టుంది.
ఇక, నడిచే శక్తిలేదు.
త్వరగా నడిచి, గొలుసుకొండల దగ్గరికి వెళ్ళాలన్న ఆసక్తీలేదు.
వెళ్ళి ఏంచెయ్యాలి?
చాంద్‌నీ ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది!
తనకోసం తండాలో గాలించి అడవి పుత్రులు నల్లకొండ దగ్గరికి తిరిగి వెళ్తారు. కనిపించలేదని రాగ్యాతో చెప్తారు. రాగ్యా అంతటితో ఆగడు.
తనను వేటాడేందుకు బయల్దేర్తాడు!
చాంద్‌నీ గుండె ఝల్లుమన్నది.
ఇప్పుడేం చెయ్యాలి?
దూరంగా మళ్ళీ అడుగుల చప్పుడు వినిపించింది!
ఉలిక్కిపడి చూసింది! ఆలకించి విన్నది చాంద్‌నీ!
అవ్వి తనకోసం వెతుకుతున్న అడవి పుత్రుల అడుగుల చప్పుళ్ళు కానేకావు! వినిపిస్తున్నవి ఒకే వ్యక్తి నడుస్తున్న అడుగుల చప్పుళ్ళు!
ఎవ్వరో?
రాగ్యా కాదు కదా?
చాంద్‌నీ భయాన్ని నిగ్రహించుకోలేకపోయింది.
గుండె దడదడా కొట్టుకొంటున్నది.
శరీరంలోనుంచి సన్నగా వొణుకు మొదలయ్యింది.
అమాంతం లేచి నిలబడి దూరంగా చూసింది చాంద్‌నీ!
రాగ్యా అటువైపే వస్తున్నాడు!
ఛెంగున లేడి పిల్లలా బండరాయి మీదనుంచి క్రిందికి దిగింది.. అడవిలోకి పరుగులంకించుకుంది!
వాడికి చిక్కితే ఎంత ప్రమాదం!
బలవంతంగా జోగిన్ని చేస్తాడు. బ్రతుకు ఛిద్రం చేస్తాడు. అనుభవిస్తాడు. అందర్నీ అనుభవించమంటాడు!
ఎంత నీచంగా ఉంటుందా బ్రతుకు..!
బండరాయి మీదనుంచి క్రిందికి దిగుతున్నప్పుడే ఆమెని చూశాడు రాగ్యా!
‘‘శాందినీ...!’’అని పెద్దగా అరిచాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు