డైలీ సీరియల్

అనంతం-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాయక్ చెప్పింది అక్షరాలా నిజం!
అక్కడ-
గొలుసు కొండలకి పులులు పహారా కాస్తుంటాయి.
విష సర్పాలు బుసలుకొడుతూ సూదికళ్ళతో చూస్తుంటాయి.
అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి.
వింత పక్షుల రెక్కల కరకు చప్పుళ్ళూ- యుద్ధవిమానాల్లా ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరిగే రాబందులూ- అలికిడి వినిపిస్తే ‘ఖస్సు’న లేచి పడగలెత్తే భయంకర సర్పాలూ...
మరో ప్రపంచంలా ఉంది!
‘‘ఈ తావరఁవ్ పోలీసోళ్ళగూడా తెలవదా?’’అని, రాగ్యా నడిగారు ఎవ్వరో.
‘‘తెలవదు’’అన్నాడు రాగ్యా.
వాళ్ళు యింతింత కళ్ళుచేసుకొని గొలుసుకొండల్నే చూస్తూ అడుగులు వేస్తున్నారు.
గొలుసుకొండల్లో చాలా గుహలున్నాయి.
గుహల్లోనుంచి దూరంగావెళ్ళే రహస్య మార్గాలున్నాయి!
రాగ్యా, గోపీనాయక్ దారిచూపిస్తూ, వాళ్ళనొక పెద్ద గుహలోకి తీసుకొని వెళ్ళాడు.
ఆ గుహ చాలా విశాలంగా ఉంది.
అప్పటికే అలిసిపోయిన అడవి పుత్రులు గుహలో ఎక్కడివాళ్ళక్కడ నేలమీదే కూలబడిపోయారు.
ఇప్పుడు తెలుస్తున్నది వాళ్ళకి గాయాల బాధ!
కొంతమంది అడవి పుత్రులు గుహనుంచి బైటికివెళ్ళి ఏవేవో ఆకులు మూటకట్టుకొని తెచ్చారు.
రెండు అరచేతుల మధ్య ఆకుల్ని నలిపి, బలంగా గాయాల మీద పోసి ఆకులతోనే కట్లుకడుతున్నారు.
కొంత సమయం గడచిపోయింది.
అడవి పుత్రులు ఆకలితో నకనక లాడటం గోపీనాయక్ గమనించాడు. అనుచరులను పిల్చి వాళ్ళకేదో చెప్పాడు.
దృఢంగా ఉన్న యువకులు అడవికి వెళ్ళారు. కొద్ది సమయంలోనే కాయలూపండ్లూ తెచ్చి వాళ్ళకిచ్చారు.
అడవి పుత్రుల ఆకలి చల్లారింది. స్థిమితంగా కూర్చొని ఆలోచనల్లో పడ్డారు!
జరిగిందంతా గొర్తొచ్చి వాళ్ళ కడుపు దహించుకొనిపోతోన్నది!
బాణావతు, నగ్గూరాం, కాళీచరణ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందారని రెడ్డియానాయక్ తండాకి కబురు అంది ఉంటుందా?
లక్ష్మీబాయి భర్తచనిపోయిన విషయం తెలిస్తే తట్టుకోగలదా?
వాల్యా తండ్రి కావాలని అడిగితే ఏం సమాధానం చెప్తుంది?
చాంద్‌నీ ఆత్మహత్య చేసుకున్నదని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు.
ప్రశాంతంగా వున్న అడవి పుత్రుల జీవితాల్లో కొద్ది గంటల్లోనే ఎనె్నన్ని విషాధ ఘట్టాలకు తావు కలిగిందో!
అంతా జరిగింది పాలక వర్గాలవల్ల కదూ!
అన్ని ఘోరాలకు కారణమై చివరికి వాళ్ళు సాధించేది ఏమిటి?
అడవి పుత్రులకేమీ పాలుపోవటం లేదు.
రాగ్యా, గోపీనాయక్ వౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నారు.
ఇప్పుడు తక్షణ సమస్య తండా వాళ్ళదే!
కసితోవున్న పోలీసులు రెడ్డియానాయక్ తండామీద ఏ క్షణంలో అయినా విరుచుకుపడతారు. వృద్ధులు, స్ర్తిలు, పిల్లలని కూడా చూడరు. లాఠీలతో కొడతారు. తండాని ధ్వంసం చేస్తారు.
ఈ విషయం వాళ్ళు ఊహించగలరో, లేదో!
తండాలోవున్న వాళ్ళని వెంటనే రక్షించాలి. వాళ్ళక్కూడా గొలుసుకొండ గుహల్లనే ఆశ్రయం ఇవ్వాలి.
ఉద్రేకాలు చల్లబడేదాకా రెడ్డియానాయక్ తండావాళ్ళు పోలీసులకు చిక్కకండా తప్పించుకోవటం చాలా అవసరం.
అశ్రద్ధచేస్తే ప్రాణాలుకూడా పోవచ్చు!
ఏం చెయ్యాలి?
వాళ్ళనెలా రక్షించాలి?
రాగ్యా ఎందుకో అక్కడ్నించి లేచివెళ్ళి దూరంగా కూర్చున్నాడు.
మధ్యమధ్యలో గోపీనాయక్ వైపూ, గాయాలతో విలవిల్లాడుతున్న అడవి పుత్రుల వైపూ మార్చిమార్చి చూస్తున్నాడు.
గోపీనాయక్ బాధనెలా భరిస్తున్నాడో కానీ, అతని కాలికి బలమైన గాయమే అయ్యింది. ఎవ్వరూ చూడకుండా గాయంమీద పసరు పిండుతుంటే రాగ్యా అప్పుడు చూసాడు!
అతని కళ్ళల్లోనుంచి జలజలా కన్నీళ్ళు రాల్తున్నాయి.
ఇదంతా జరిగింది తనవల్లనే అన్న న్యూనతతో కృంగిపోయాడు.
కొంత సమయం గడిచిపోయింది.
పసరు ప్రభావంతో గాయం బాధ కొంచెం ఉపశమించింది. అప్పుడు మళ్ళీ గోపీనాయక్‌కి రెడ్డియానాయక్ తండాలోవున్న స్ర్తిలు, వృద్ధులు, పిల్లలూ గుర్తొచ్చారు!
ఎవ్వరో ఒకరు వెంటనే బయల్దేరి, అక్కడికి వెళ్ళాలి.. పొంచివున్న ప్రమాదం గురించి హెచ్చరించి వాళ్ళనా తండానుంచి రక్షించి తేవాలి. ఆలస్యమైతే ఏ క్షణంలో ఐనా పోలీసులు విరుచుకొని పడతారు!
ఇప్పుడేం చెయ్యాలి?
తనే వెళ్ళొచ్చుకానీ, కాలి గాయం బాధతో త్వరగా నడిచే అవకాశం లేదు. గొలుసుకొండల దగ్గిరికి నడవటమే కష్టమైంది.. కాలంతా పూర్తిగా వాచిపోయింది.
గోపీనాయక్ రాగ్యా వైపు చూశాడు!
గుహలో ఓ మూలగా రాతి గోడకి చేరగిలబడి శూన్యంలోకి చూస్తూ, రాగ్యా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు!
రాగ్యా పరిస్థితి అతనికి అర్ధమైపోయింది!
వాడో స్వయంకృతాపరాధి! నిర్భాగ్యుడు!!
కోరుకున్న చాంద్‌నీని, అమితంగా ప్రేమించే కన్న తండ్రినీ పోగొట్టుకున్నాడు. స్నేహంలో వంచించబడ్డాడు. అత్యాశకుపోయి అనర్థాలను కొనితెచ్చుకున్నాడు!
ఇప్పుడు బాధపడుతున్నాడు!
చేసిన తప్పువల్ల అన్యులు పడే బాధకన్నా, తన తప్పుతెలుసుకొని బాధపడే వాడి బాధే- మహాబాధ!
రాగ్యా ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు.
అతన్ని ఓదార్చాలా? వొద్దా?
ఏడువ నివ్వాలి. ఓదార్చకూడదు!
గుండె ద్రవిచేలా ఏడిస్తే, అంతరాళాల్లో గడ్డకట్టి వేధించే బాధ అశ్రుకణాలపై కారి, జారిపోతాయి! హృదయం తేలికపడుతుంది!
ఓదారిస్తే, మరో దారిలేక అశ్రుకణాలే అణుబాంబులై విస్ఫోటిస్తోంది!
ఒక్కో సందర్భంలో ఓదార్పు ఎన్ని దుష్ఫలాలనిస్తుందో!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు