డైలీ సీరియల్

ఒయాసిస్ 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును సరోగసీలో ఇద్దర్నీ మోసం చేస్తోందన్నావు ఇందాక.. ఆ పాయింట్ ఏదన్నా పనికొస్తే మన సినిమాలో ఇరికిద్దామని..’’ అన్నాడు రణధీర్.
‘‘ పెట్టండి సార్.. ఈ రకం మోసాలు కూడా జనానికి తెలియాలి..’’
‘‘చెప్పు..’’ అన్నాడు రణధీర్ స్టీరింగ్ వీల్‌మీదకు వాలి, ఆమెవైపే చూస్తూ.
‘‘ఇది యాక్చువల్‌గా మా ఫ్రెండ్‌కి జరిగింది సార్.. అందుకని చెబుతున్నాను.. సినిమా కథలో వీలుంటే పెట్టండి సార్..’’
అందుకే చెప్పమంటున్నా..’’
‘‘అసలు మొదట ఒప్పుకున్న డీల్ ఏమిటంటే- ఒక పెద్దమనిషి ఇచ్చే వీర్యంతో ఒక అమ్మాయి గర్భం ధరించి, తొమ్మిది నెలలు బిడ్డను మోసి, బిడ్డను కని వాళ్ళకిచ్చేసి వెళ్లిపోవాలి.. ఇందుకు ఆ అమ్మాయికి అయిదు లక్షలు ఇప్పిస్తానని డాక్టర్ చెప్పింది. ఆ అమ్మాయి అవివాహిత కనుక, ఈ వ్యవహారమంతా రహస్యంగా జరిపించడానికి డాక్టర్ అంగీకరించింది. కానీ, దీన్ని దాచడమెలాగ? అందుకని ఆరునెలలపాటు ఆమె మారు పేరుతో ఒక ఇంట్లో అజ్ఞాతంగా ఉంచేందుకు అయ్యే ఖర్చుకూడా ఆ పార్టీయే భరిస్తుందని చెప్పింది.
ముందు యాభై వేలు అడ్వాన్సు ఇచ్చేందుకు, నెల నెలా లక్ష రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని డాక్టర్ కమిట్ అయ్యింది. ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే అయిదు లక్షలు వచ్చిపడతాయి కాబట్టి, దానితో ఆకాశానికి నిచ్చెన వెయ్యాలని కలలు కంటూ ఆ అమ్మాయి ఒప్పుకుంది. ప్రాసెస్ ప్రారంభం అయింది. ఈ ఆరు నెలలు ఎక్కడుండాలో చెప్పమంటే, ఫలానా చోటికి వెళ్లి ఆయన్ను కలవమని ఆ డోనర్ వివరాలు చెప్పింది. ఈ అమ్మాయి వెళ్లి చూసింది.
ఈయనకు చాలా వ్యాపారాలున్నాయి. చాలారకాల లావాదేవీలున్నాయి. ఆయన ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. ఆయన భార్య మాత్రం ఇక్కడ లేదు. ఆస్ట్రేలియాలో ఉందట. అంచేత, తన ఇంట్లోనే ఒక ఫ్లోర్ అంతా ఈ అమ్మాయికి కేటాయిస్తాను.. ఉండమన్నాడు. ఆయనకు పుట్టబోయే బిడ్డకు తల్లిగా ఉండటమనేదే, ఇమోషనల్ ఇష్యూ. మానసికంగా ఎవరూ ఎంత మాత్రం ఇష్టపడని విషయం.. అలాంటి పరిస్థితుల్లో, ఆయన తన భార్యకు దూరంగా, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో ఆయనకు బిడ్డను కనివ్వబోయే తల్లిగా ఆర్నెల్లపాటు ఉంటే, శారీరకంగా ఈ అమ్మాయికి అక్కడ రక్షణ ఉంటుందా? తనను ఉంపుడుగత్తెలా వాడుకోకుండా ఉంటాడా? సమాధానాల్లేని ఈ ప్రశ్నలతో సతమతమవుతూ, ఆ డాక్టర్ దగ్గరకు వెళ్తే, ఆయన రెండు లక్షలకన్నా ఎక్కువ ఇవ్వనంటున్నాడు, జైపూర్‌లో ఒక లక్షకే ఒప్పుకుంటున్నారు అంటూ బేరానికి దిగింది. లక్ష రూపాయలకు కాదు, వెయ్యి రూపాయలకు కూడా ఒప్పుకునేవాళ్ళూ ఉండొచ్చు. కానీ అవన్నీ ముందుగా నిర్ణయించుకోవాల్సిన విషయాలు.. ఈ లెక్కన ఇంకో నెల గడిచాక లక్ష రూపాయలే ఇస్తానంటే చేసేదేమిటి? అందుకని ఈ డీల్‌కి నేను ఒప్పుకోవడంలేదు. అబార్షన్ చేయమని ఆ అమ్మాయి గొడవ పెట్టింది. ఈ డాక్టర్ అబార్షన్ చేయడానికి ఒప్పుకోదే.. మొదటేమో అయిదు లక్షలిప్పిస్తాను, అతి రహస్యంగా ఉంచుతాను, ప్రత్యేకంగా వసతి ఏర్పాటుచేయిస్తాను అని ఎన్నో ఆశలు పెట్టి, చివరికి ఆ వ్యక్తికి ఒక ఉంపుడుగత్తెగా ఉండే స్థితి కల్పిస్తుందా?.. ఇదా ఆమె చేయవలసిన పని...’’ అన్నది ఆవేశంగా దీప్తి.
‘‘ఇలాంటివి ఇండియాలో చౌకగా జరుగుతున్నాయని విదేశీయులు సైతం ఇక్కడివాళ్ళతో ఒప్పందం చేసుకున్నారని విన్నాను కానీ, ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ కాబట్టి, అగ్రిమెంటు రాసుకోవాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘అగ్రిమెంటు రాసుకున్నాక కూడా, వాళ్ళు చేయదల్చుకున్నది చేస్తే ఏం చేస్తుందా అమ్మాయి.. కోర్టుకు వెళుతుందా? ఒక బిడ్డను కనివ్వడమనేది స్ర్తికి మరో జన్మ ఎత్తటం లాంటిది.. అంత రిస్కు తీసుకుని చేయల్సిన పని. పైగా ఇలా చేయటం సమాజం దృష్టిలో చాలా హేయమైన, నీచమైన పని.. ఇంత నీచానికి ఒడిగట్టినా.. అందులోనూ.. ఇంకా మోసం చేయాలని చూస్తే.. ఆవిడ మనిషేనంటారా? ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ అమ్మాయికియ్యాల్సిన అయిదు లక్షలూ తన ఫీజు కింద మరో రెండు లక్షలు, ఆ పార్టీనుంచి ఆమె ముందుగానే వసూలు చేసింది..’’ అన్నది దీప్తి.
‘‘ఇలాంటివాళ్ళు అందులోనూ ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నారంటే నమ్మబుద్ధి కావటంలేదు..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇది వృత్తికి సంబంధించిన విషయం ఎంతమాత్రం కాదు, మనిషి ప్రవృత్తికి సంబంధించిన విషయం.. దేవాలయంలో అర్చకుడ్ని సాక్షాత్తూ భగవంతుడి స్వరూపంగా భావిస్తాం. అంత పవిత్రమైన వృత్తిలో వుంటూ, దేవుడి బంగారు నగలు అమ్మేసి, నకిలీ బంగారు నగలు దేవుడి అలంకారానికి వాడుతున్న విషయం ఈమధ్య మన వార్తల్లో వింటున్నాం..’’ అన్నది దీప్తి.
‘‘చివరకు మనం ఎటు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియటంలేదు.. దేశంలో ఒక ప్రక్క ఆధ్యాత్మిక చింతన, భక్త్భివం ఎక్కువ అవుతున్నాయి.. మరోప్రక్క అంతకు రెండింతలుగా మోసం, ద్రోహం మితిమీరిపోతున్నాయి. కుడి ఎడమల దగా దగా..’’ అన్నాడు రణధీర్. ‘‘ఇన్ని మోసాలు, దగాలు జరుగుతున్నా, మీలాంటివాళ్ళు కొద్దిమందైనా ఉండటం, అందులోనూ మీరు నాకు తారసపడటం నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నది దీప్తి. ‘‘ఇంక వెళ్దామా?’’ అన్నాడు రణధీర్.
‘‘ఏదన్నా హోటల్‌కి తీసుకెళ్లండి.. ఆకలిగా ఉంది..’’ అన్నది దీప్తి.
‘‘నువ్వు పక్కనుంటే నాకూ ఆకలిగా ఉంది.. కానీ ఈ ఆకలి వేరు..’’ అన్నాడు కార్టు స్టారు చేస్తూ..
దీప్తి అతనికి మరింత దగ్గరగా జరిగింది.

- ఇంకాఉంది

శ్రీధర