ధనం మూలం
ధన రేఖలు గీసుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘నా తల రాత ఇంతే... చేతి గీతల్లో ధన రేఖ లేనప్పుడు ఎంత అనుకుని ఏం లాభం. ధన రేఖ లేకపోవడం వల్లనే డబ్బు చేతిలో నిలవడం లేదు.’ చాలా మంది నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. పుట్టినప్పుడే మన చేతి రాతలు, నుదిటి రాతలు రాసి ఉంటాయంటారు. నిజమే ఆ రాతలు తల్లికడుపులో ఉండగానే రాసి ఉంటాయి. నుదిటి గీతను, చేతిపై ఉన్న రేఖలను మార్చుకోలేమేమో... వాటిని మార్చుకోవలసిన అవసరం కూడా లేదు. కానీ మన ధన రేఖలను మనం రాసుకోవచ్చు. దాని కోసం మన అలవాట్లు మార్చుకోవాలి.
ఒకే చోట, ఒకే జీతంపై పసి చేసే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు జీతం వచ్చిన మొదటి వారంలోనే అప్పుల కోసం చేయి చాస్తారు. కొందరు ఒక పద్దతి ప్రకారం జీతం ఖర్చు చేస్తూ భవిష్యత్తు కోసం ఎంతో కొంత పొదుపు కూడా చేస్తారు. ఇద్దరి మధ్య తేడా ఏమిటి అంటే కొన్ని అలవాట్లే. మన చేతి రాతలను మార్చే అలాంటి అలవాట్లపై దృష్టిసారించాలి. అలవాట్లు మార్చుకుంటే మీ ధన రేఖ మారుతుంది.
* జీవితంలో ఆర్థికంగా ఎదిగిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం. జీతం రాగానే మొదటి తమకు తాము జీతం చెల్లించుకుంటారు. అంటే జీతం ఎంతైనా కావచ్చు అందులో కొంత శాతం ముందు తమకు తాము చెల్లించుకుని మిగిలిన దానిని ఇతర ఖర్చులకు ఉపయోగిస్తారు.
ఉద్యోగి కావచ్చు, ఏదైనా వృత్తిలో ఉండొచ్చు, వ్యాపారం కావచ్చు ఏ పనిలోనైనా కావచ్చు. వచ్చిన ఆదాయంలో ఒక వాటాను ముందు తమకు తాము చెల్లించుకోవాలి. ముందు పొదుపు, ఆ తరువాతే ఖర్చు. సామాన్యులుగా ఉండాలన్నా, సంపన్నులు కావాలన్నా, ఆర్థిక భద్రత ఉండాలన్నా ఈ అలవాటు తప్పని సరి.
* ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కాని కుటుంబం గడవని పరిస్థితి అని ఆవేదన చెందుతుంటారు. ఒకరు సంపాదించినా ఇద్దరు సంపాదించినా ఒకే ఆదాయం ప్రమాదకరం. ఏ స్థాయిలో ఐనా సరే ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండకూడదు. అంటే ఉద్యోగం చేస్తుంటే ఒక్క జీతమే ఆదాయంగా ఉండరాదు. కనీసం ఇంకో ఆదాయం ఉండాలి. అంటే మీరు చేసిన పొదుపును ఇనె్వస్ట్ చేసినప్పుడు దానిపై వచ్చే వడ్డీ కావచ్చు, స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తే వచ్చే ఆదాయం కావచ్చు, మీకు సాధ్యమైన మరో పని చేయడం ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, ఏదో ఒక రూపంలో మరో ఆదాయం ఉండాలి. దాని కోసం ప్రయత్నించాలి. ఒకే జీతంపై ఆధారపడే వారి జీవితం ఎదుగుబొదుగు లేకుండా అలానే ఉండిపోతే, ఒకటికి మించిన ఆదాయం ఉన్న వారి ఆర్థిక స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
* పొదుపు చేసిన డబ్బుపై తగిన ఆదాయం వచ్చే ఆస్తులుగా మార్చుకోవాలి. ఉదాహరణకు ఒక ఇంటిని కొంటే దానిపై అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పొదుపు చేసిన డబ్బు పెద్ద మొత్తం కాగానే ఎప్పటి నుంచో కలలు కంటున్న కారు కొన్నాను అని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు. కారు ఎప్పటికీ ఆస్తి కాదు. కారు నిర్వహణ కోసం అదనపు ఖర్చు తప్ప ఆదాయం తెచ్చిపెట్టదు. ఖర్చు పెట్టించేది ఆస్తి కాదు, ఆదాయం తెచ్చిపెట్టేదే ఆస్తి అని గ్రహించాలి.
* ఆర్థికంగా ఎదగాలి అనే కొరిక బలంగా ఉంటే పిరికి తనం పనికిరాదు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ఆర్థిక రంగంలో రిస్క్‌కు తగ్గట్టుగానే ఆదాయం ఉంటుంది.
* ఎవరో చెప్పారని, ఎవరో సలహా ఇచ్చారని కాకుండా తెలిసిన రంగంలోనే పెట్టుబడి పెట్టాలి. అందరికీ అన్నీ తెలియలని లేదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అన్ని కోణాల్లో విశే్లషించుకోవాలి. తెలియని దేవుడి కన్నా తెలిసిన దయ్యం మేలు అంటారు. అలానే బోలెడు ఆదాయం వస్తుందని ఎవరో చెబితే విని ఇనె్వస్ట్ చేయడం వల్ల దెబ్బతింటారు. తెలిసిన రంగం, లేదా ఆ రంగం గురించి బాగా తెలుసుకుని ఇనె్వస్ట్ చేయాలి.
* డబ్బు సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. దీన్ని గ్రహించి చేతికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత మందికి కోట్ల రూపాయల లాటరీ వచ్చినా వారి వద్ద ఎక్కువ రోజులు సంపద నిలువదు. ఆ సంపదను హోల్డ్ చేయడం వారికి తెలియదు. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సుశీల్ కుమార్ అనే గ్రామీణ ప్రాంత సాధారణ ఉద్యోగికి ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి. నెలకు 18వందల రూపాయల జీతంతో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అతనికి ఒక్కసారి ఐదు కోట్లు వస్తే జీవితం ఎలా మారిపోతుందో అనుకుంటాం. అతని డబ్బంతా పోగొట్టుకుని ఉద్యోగం కోసం తంటాలు పడుతున్నాడని పలు జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది పూర్తిగా నిజం కాదు కానీ కొంత వరకు నిజం. ఆదాయం పన్ను మినహాయింపు తరువాత మూడున్నర కోట్ల వరకు అతనికి ముట్టింది. కుటుంబానికి పెద్ద ఇల్లు నిర్మించాడు. పొలం కొన్నాడు. డబ్బు వృధా చేయలేదు కానీ... చేయడానికి అతనికి చేతిలో పని లేదు. తెలియని రంగంలో పెట్టుబడి పెట్టి రోడ్డున పడకుండా ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకున్నందుకు అతన్ని అభినందించాలి. కానీ అదే స్థానంలో పెట్టుబడి గురించి మంచి అవగాహన ఉన్న మరో వ్యక్తి ఉండి ఉంటే ఆ డబ్బును సరైన రీతిలో ఇనె్వస్ట్ చేసి చేయడానికి తనకు పని కల్పించుకోవడంతో పాటు మరింత మందికి ఉపాధి కల్పించే వారు. మీడియా వార్తల్లో వచ్చినట్టు అతనేం డబ్బు పోగొట్టుకోలేదు.
అకస్మాత్తుగా వచ్చి పడిన డబ్బును హోల్డ్ చేయడం కూడా సాధారణ విషయం కాదు. చాలా మంది నటులు ఒక్క వెలుగు వెలిగి వచ్చిన పడిన డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక అంతా పోగొట్టుకున్న వారు ఉన్నారు. సామాన్యులుగా మిగిలిపోయే వారికి సంపన్నులకు ఇక్కడే తేడా ఉంటుంది. డబ్బును ఎలా ఇనె్వస్ట్ చేయాలో, ఎలా హోల్డ్ చేయాలో వారికి అవగాహన ఉంటుంది. వంద రూపాయలను జాగ్రత్తగా కాపాడుకుని వాటిని వెయ్యి రూపాయలు చేయడం ఎలా అనే ఆలోచనలే వారిని ముందుకు తీసుకు వెళతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం తపన పడతారు. అలాంటి అలోచన లేకపోతే లాటరీలో డబ్బు వచ్చి పడిపోయినా ఎం చేయాలో అర్థం కాదు. కొంత కాలానికి తిరిగి పేదరికాన్ని ఆహ్వానించిన వారు అవుతారు. మన చేతిరాతలను మనమే మార్చుకోవచ్చు. మార్చుకుంటారా?లేదా? అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.