ధనం మూలం

స్టాక్ మార్కెట్ జూదమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుకునే రోజుల్లో లెక్కల్లో తెలియని అంకెను ఎక్స్ అనుకుని లెక్క చేస్తాం. పెద్ద వారైన తరువాత కూడా, చదువుకున్న వారైనా చదువుకోని వారైనా తెలియని దాన్ని తెలియదు అని అంగీకరించే గుణం చాలా తక్కువ. స్టాక్ మార్కెట్ గురించి మానకేమీ తెలియక పోతే తెలియదు అని ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు. చదువురాని వారే కాదు బాగా చదువుకున్న వారు సైతం స్టాక్ మార్కెట్‌ను జూదంగా భావిస్తుంటారు. నిజంగా స్టాక్ మార్కెట్ జూదమా? జూదగాళ్లకు ఉపాధి చూపించే వృత్తినా? కాదు అస్సలు కానే కాదు. తెలివైన వారు తమ తెలివితో పెట్టుబడి పెట్టి సంపాదించే చోటు స్టాక్ మార్కెట్.
దాదాపు పదేళ్ల క్రితం నాటి వీడియో కావచ్చు. ఇటీవల పాత వీడియో ఒకటి యూ ట్యూబ్‌లో చూస్తే మహామేధావులు అనుకునే వారు సైతం స్టాక్ మార్కెట్ గురించి అంత అజ్ఞానంతో ఉండడం వింతగా అనిపించింది. సినిమాల్లో అమితాబ్ బచ్చన్, క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఐటి రంగంలో బిల్‌గేట్స్ ఎలానో స్టాక్ మార్కెట్‌లో రాఖేష్ జున్‌జున్ వాలా అలాంటి వారు. జర్నలిజంలో ప్రభుచావ్లాకు అంతటి పేరుంది. జున్‌జున్ వాలాను ప్రభు చావ్లా ఇంటర్వ్యూ చేసిన వీడియో అది. చావ్లా జర్నలిజంలో దశాబ్దాల అనుభవం ఉన్నవారు. సాధారణంగా ఎంతటి పేరుమోసిన నాయకులనైనా ఇంతటి అనుభవం ఉన్న జర్నలిస్టులు ప్రశ్నలతో ఆడుకుంటారు. కానీ జున్‌జున్ వాలాను చావ్లా అడిగిన ప్రశ్నలు, స్టాక్ మార్కెట్ గురించి ఆయనకున్న అభిప్రాయాలను ప్రశ్నల రూపంలో విన్నప్పుడు వింతగా అనిపించింది. మనం మేధావులు అనుకునే వారు సైతం స్టాక్ మార్కెట్ గురించి ఇంత సిల్లీగా అనుకుంటారా? అనిపించింది.
జున్‌జున్‌వాలా ఇనె్వస్టర్ అయినా మార్కెట్ గురించి ఆయనకున్న అపారమైన అవగాహన విస్తుగొలుపుతుంది.
స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 21వేల నుంచి 17వేలకు పడిపోయిన నిరాశాపూరిత వాతావరణంలో చేసిన ఇంటర్వ్యూ ఇది. ఈ వాతావరణం ఆరునెలలు, ఏడాదికి మించి ఉండదు, మళ్లీ మార్కెట్ పైకి వెళుతుంది అని ధీమాగా జున్‌జున్‌వాలా చెప్పారు. ఇప్పుడు బిఎస్‌ఇ ఇండెక్స్ 41వేలను దాటింది. ఈ రోజు లక్ష రూపాయలు ఇనె్వస్ట్ చేసి వెంటనే అది కోటి రూపాయలు కావాలని కొందరు అనుకుంటారు. ప్రభు చావ్లా కూడా అదే దోరణిలో వెంటనే భారీ లాభాలు రావాలంటే ఏం చేయాలో చిట్కా ఇవ్వమని అడిగితే జున్‌జున్ వాలా ఓ క్షణం కూడా ఆలోచించ కుండా గుర్రపు పందాలు ఆడండి. ఈ రోజు శనివారం రేపు రేస్‌కోర్స్ వెళ్లి గుర్రపు పందాలు ఆడండి ఆ స్థాయిలో వెంటనే లాభాలు అంటే అక్కడే అని చెప్పారు. స్టాక్ మార్కెట్ జూద గృహం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ. స్టాక్ మార్కెట్‌ను జూదగృహంగా భావించే వాళ్లు, ఆదే దొరణితో ట్రెడింగ్ చేస్తే జూదంలో ఫలితాలు ఎలా ఉంటాయో వారికీ అవే ఫలితాలు వస్తాయి . ఇనె్వస్ట్‌మెంట్ కోణంతో చూసే వారికి అదే విధంగా ఫలితాలు ఉంటాయి.
స్టాక్ మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ గురించి సాధారణ ప్రజలకు అనుమానాలు ఉండడం సహజం. దీని గురించి జున్‌జున్‌వాలాను అడిగినప్పుడు ఏ రంగంలో అన్‌సర్టెనిటీ ఉండదు చెప్పండి. జీవితమే అన్‌సర్టెనిటీ. పెళ్లి చేసుకున్న తరువాత కాపురం సరిగా ఉంటుందా? ఉండదా అనే సందేహం. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం. మన ప్రయాణం సక్రమంగా సాగుతుందా? గమ్యానికి చేరుతామా? దేనికి గ్యారంటీ ఉంటుంది. మన జీవితమే అన్‌సర్టెనిటీ అయినప్పుడు స్టాక్ మార్కెట్ అంతే. అనేక పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయి. అయితే ప్రపంచ యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, అనేక పరిణామాల తరువాత ఎన్నో ఆటుపోట్లు వచ్చినా స్టాక్ మార్కెట్ దీర్ఘ కాలంలో మంచి ప్రయోజనాలే కలిగించింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో సగం మంది వరకు స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తుంటే మన దేశంలో మాత్రం కేవలం ఐదుశాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ఎక్కువ మంది గుజరాత్, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు.
స్టాక్ మార్కెట్ అనేది దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడంతో పాటు వ్యక్తిగతంగా మనం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడేది స్టాక్ మార్కెట్. అలాంటి కల్పతరువును జూదగృహంగా భావించి దూరంగా ఉండడం వల్ల నష్టపోయేది మనమే.
స్టాక్ మార్కెట్ గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే... ఒక పరిశ్రమ స్థాపనకు వంద కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనుకుందాం. ప్రమోటర్ల వద్ద అంత డబ్బు ఉండదు. వారో 20 శాతం నిధులు సమకూర్చుకొని, మిగిలిన 80 కోట్ల రూపాయల కోసం పబ్లిక్ ఇష్యూ కోసం వస్తారు. అంటే ఒక వెయ్యి రూపాయలు మొదలు కొని మనం వాటా పెట్టవచ్చు. ఒకే వ్యక్తి వద్ద వంద కోట్లు లేకపోవచ్చు, కానీ వెయ్యి రూపాయలు ఉన్న మన లాంటి వారందరం కలిసి వాటాలు కొని వంద కోట్ల రూపాయల పరిశ్రమ ప్రారంభం కావడానికి దోహదం చేస్తాం. ఇలా పరిశ్రమలు స్థాపించినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అంతే తప్ప మన డబ్బు మన ఇంట్లోనే దాచిపెట్టుకుంటే వచ్చేదేమీ లేదు. ఆ కంపెనీకి ఆదాయం వస్తున్న కొద్ది స్టాక్ మార్కెట్‌లో ఆ షేర్ విలువ పెరుగుతుంది. 2002 ప్రాంతంలో బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర నాలుగు రూపాయలు ఉండేది. ఇప్పుడది నాలుగు వేలు. అన్ని షేర్లు ఇలా పెరుగుతాయని కాదు. సరైన నిర్వాహణ లేని కంపెనీలు మూత పడతాయి. అలాంటి వాటిలో మన పెట్టుబడి నష్టపోయినట్టే. ఏ కంపెనీ ఎలాంటిది అనే అవగాహన మనకు అవసరం.

- బి. మురళి