రాష్ట్రీయం

బ్రిటిష్ డిజైన్లు బెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇంజనీర్లది సాంకేతిక తప్పిదం
అందుకే, మూల్యం చెల్లిస్తున్నాం
కరవు, తుపానులపై సాంకేతిక సమరం
ఆక్వా నష్టాలపై కేంద్రానికి నివేదన
జోరువానలో చంద్రబాబు పర్యటన
సాయం చేస్తామని బాధితులకు భరోసా

నెల్లూరు, నవంబర్ 21: ఆంధ్రను పట్టిపీడిస్తున్న తుఫాన్‌లు, కరవు పరిస్థితులపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమరం సాగించి, వాటివల్ల కలుగుతున్న నష్టాల నుంచి బయటపడదామని బాధితులకు సిఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. జిల్లాలో రెండోరోజు శనివారం ఉదయం నుంచి సిఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లామంత్రి పి నారాయణ, నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిఎం వెంట ఉన్నారు. పర్యటనలో భాగంగా సర్వేపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ కట్టపైనే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో మన ఇంజనీర్లు చేస్తున్న సాంకేతిక తప్పిదాలు, డిజైన్లలోపం కారణంగా భారీ వర్షాల సమయంలో గండ్లుపడి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతోందని సిఎం అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల క్రితంనాటి బ్రిటిష్ ఇంజనీర్లు రూపొందించిన డిజైన్లు, నిర్మాణాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అందులో 20శాతమైనా మన ఇంజనీర్లు ప్రమాణాలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆయకట్టు క్యాచ్‌మెంట్ ఏరియా పరిరక్షణకు, రిజర్వాయర్ల కట్టడాల భద్రతలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుమారు 4500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన రిజర్వాయర్‌తో భూగర్భ జలాలను కాపాడవచ్చునని సిఎం పేర్కొన్నారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు కొట్టుకుపోయాయని, వందల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఇతర పంటల రైతులతోపాటు ఆక్వా రైతును ఆదుకొనేందుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నట్టు చెప్పారు. మూడు వేల కోట్ల నష్టాన్ని ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల్లూరు జిల్లాల్లో 50, 60ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగైదు రోజుల్లో 85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం అరుదైన సంఘటన అన్నారు. భారీ వర్షాల కారణంగా చేరుకున్న నీటిని సద్వినియోగం చేసుకున్న తరువాత మిగిలిన జలాలు సముద్రంలోకి ప్రవహించేలా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 23 మండలాల్లో ఐదు వందల గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, ఒక్కో మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు సిఎం తెలిపారు. భారీగా నష్టపోయిన మండలంలోని రెండు మూడు గ్రామాలకు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. నష్టాల వివరాలు తెలుసుకొనేందుకు 30మంది ఐఏఎస్ అధికారుల సేవలు వినియోగించుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు. రెండు మూడు రోజుల్లో నష్టనివారణకు సంబంధించిన సర్వేలు పూర్తి చేయాలని, దాని ఆధారంగా పరిహారం బాధితులకు చెల్లిస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో ఏటా నవంబర్‌లో తుపాను ఉంటుందని, దాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలన్నారు. గోదావరి, కృష్ణ నదులను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించినట్టే కృష్ణా, పెన్నాలనూ అనుసంధానం చేస్తామని సిఎం తెలిపారు. నదుల అనుసంధానంతో కరవు, తుపాను పరిస్థితులపై సమరం సాధించగలుగుతామన్నారు. వాటివల్ల నష్టాలను పారద్రోలుతామని చంద్రబాబు తెలిపారు. మనుబోలు వద్ద గండి పడిన జాతీయ రహదారి ఒక లైన్ ద్వారా వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయని, శనివారం రాత్రికల్లా రెండువైపుల వాహనాల రాకపోకలు జరుగేలా చర్యలు తీసుకున్నామన్నారు.
గత పాలకులవల్లే జిల్లాకు ప్రస్తుత పరిస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పుకొని జేబులు నింపుకుందని, జరిగిన పనులన్నీ నాసిరకం పనులని అన్నారు. ఆ ప్రభుత్వ వారసత్వ పాపాన్ని నేటి తమ ప్రభుత్వం మోయాల్సి వస్తుందోనని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వరద బాధితులకు తగిన సహాయ సహకారాలు పునారావస చర్యలు సక్రమంగా జరిగేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, అందుకోసం తాను రెండు రోజులు జిల్లాలో ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాగా శనివారం రాత్రి మూలాపేట గచ్చుకాలవలో పూడికతీత పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన స్వయంగా జెబిసి ఎక్కి పూడిక తొలగింపు చేపట్టారు.
బాగయ్యేవరకు ఇక్కడే మకాం
వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన పలు ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులోని పంట కాలువలు, చెరువులను ఆక్రమించి భవంతులను నిర్మించడం వల్ల వర్షం నీళ్లల్లో ప్రజలు వారంరోజులుగా ఉండాల్సి వచ్చిందన్నారు. నెల్లూరును ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. నెల్లూరు నగరాన్ని బాగుపర్చేంత వరకూ ఇక్కడే ఉండేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. నెల్లూరుకు 1100 కోట్లు మంజూరు చేశామన్నారు. పంట కాలువల ఆక్రమణలు తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన వంద జెసిబిలతోనైనా తొలగించి నెల్లూరు ప్రజలను వరద ముంపు నుంచి కాపాడతామని హామీ ఇచ్చారు.
నెల్లూరులోని ఖుద్దూస్ నగర్‌లో వర్షం బాధితులకు ధైర్యం చెబుతున్న చంద్రబాబు