సబ్ ఫీచర్

పేదలకు దూరంగా చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య... ధనం లాంటిది. చదువుకున్నవాడు ధనవంతుని లాంటివాడు. తరతరాలనుండి అనేకానేక చారిత్రక కారణాల వలన ధనం ధనవంతులవద్దనే కేంద్రీకృతమై పెరిగిందో, అలాగే విద్యకూడా ఆయా కాలాలలోని విద్యాధికుల, జ్ఞానుల వద్దే కేంద్రీకృతమై పెరిగింది. విద్య ఎవరివద్ద కేంద్రీకృతమైందో, అదివారి వికాసానికి, తద్వారా వారి సంస్కృతీ సంస్కార నాగరీకతలకు కూడా దారితీసింది కనుక సంస్కృతీ సంస్కారాలు కూడా విద్యలతోపాటు విద్యలకు నోచుకున్నవారి వద్దే కొనసాగాయి. అలా ఎవరు ధనవంతులో వారే బలవంతులైనట్లు, ఎవరు విద్యాధికులో వారే బలవంతులవుతూపోయారు. ఇది చారిత్రక సత్యం, వాస్తవం.
బీదవారు, వెనకబడిన కులాలవారు, గ్రామీణులు వారి ఆర్థిక, సాంఘిక పరిస్థితి బాగులేనందున చదువులకు నోచుకోలేకపోయారు. అందువలననే అటు ధనవంతులు కాజాలక, ఇటు విద్యావంతులై పెద్ద ఉద్యోగాలకు, వృత్తులకు, పదవులకు చదువుకున్నవారితో పోటీపడలేక బీదలలాగే ఉండిపోయారు.
ఈ పరిస్థితి స్వాతంత్య్రం వచ్చాక కొంత మారింది. విద్యాలయాల విస్తృతి జరిగింది. పేద, గ్రామీణ విద్యార్థులకు, చదువుకోవడానికి అవకాశాలు లభించాయి. అదృష్టవశాత్తు, ఆ విద్య వారికి వారి ఇంటి భాషైన తెలుగులో లభించడంవలన వారు వారికి బోధించిన పాఠాలను సులభంగా అర్థంచేసికోగలిగి, పుస్తకాలు, పత్రికలు మున్నగునవి కూడా సునాయాసంగా చదువుకోగలిగి ప్రావీణ్యతలు సంపాదించుకోగలిగారు.
తెలుగు మీడియంవలన వారికి వారి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసాలు పెరిగాయి. సదస్సులలో సమావేశాల్లో వారు సులభంగా పాల్గొనగలిగారు. అలావారు సమాజంలో ఎంతో విశ్వాసంతో ముందడుగు వేయగలిగారు. బోధనా మాధ్యమం తెలుగు కావడంతోపాటు అప్పటి విద్యాలయాల్లో వసతి సౌకర్యాలు కూడా బాగుండడం వలన ఆనాటి తెలుగు మీడియం విద్యాలయాలనుండి చక్కని చిక్కని విద్యాధికులు కోకొల్లలు వచ్చారు. అందులోనుండి వచ్చినవారే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు కూడా.
ఎన్నాళ్లవరకైతే ప్రభుత్వం ద్వారా సవతి తల్లి చూపు చూడబడలేదో అన్నాళ్ళు అవి ఆనాటి ఇంగ్లీష్ మీడియంవాటికి సమానంగా ఫలితాలిచ్చాయి. ఆనాటి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులతో పోటీపడి ఉన్నత విద్యలకు చెందిన ప్రవేశపరీక్షల్లో, ఉన్నత ఉద్యోగాల ఎంపికకు చెందిన పరీక్షల్లో సమానంగా నిలిచి నెగ్గగలిగారు. అదివారి గత చరిత్ర చూస్తే, వింటే మనకే తెలుస్తుంది. ప్రభుత్వం రానురానూ తెలుగు మీడియం ద్వారా బోధిస్తున్న విద్యాలయాలనన్నింటినీ చిన్నచూపుచూస్తూ వాటికి వనరులు, వసతులు, సౌకర్యాలు తగ్గిస్తూపోయింది.
అలా ఆ ఒకప్పటి మంచి విద్యాలయాలెన్నో చిక్కి కృశించి నశించిపోయాయి. ఇంకా పోతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు సమాజం వాటిని అలా సవతి తల్లి చూపుచూస్తూ దిగజార్చాయి. అలా దిగజారుస్తూ, దిగజారుస్తూ వాటిపై స్టాంపువేస్తూ వాటిలో పిల్లలు చదవడానికి ఇష్టపడడం లేదంటూ ప్రచారచేస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యాలయాలకు పెద్దపీట వేయడం మొదలెట్టాయి. ఆ విధంగా నిన్నమొన్నటివరకు తెలంగాణాలో ఇంగ్లీష్ మీడియం విద్యాలయాలను ఝండాకెక్కించి బీద పేదవారు, గ్రామీణులు, వెనకబడిన కులాలవారు సులభంగా, సునాయాసంగా చదవగలిగే తెలుగు మీడియం విద్యాలయాలను కుంటుబడగొట్టడం జరిగింది.
ధనవంతులతో ఆర్థిక రంగంలో పోటీపడడానికి ఎలాగైతే ‘‘రిజర్వేషన్’’ ప్రవేశపెట్టబడిందో అలాగే ధనవంతుల, విద్యాధికుల, సామాజిక, సాంస్కృతికపరంగా ముందుబడిన వారితో సమానంగా పోటీపడటానికి వెనుకబడినవారి కొరకు తెలుగు మీడియం ప్రవేశపెట్టబడింది. ఆ విషయం బీదవారు, వెనుకబడిన కులాలవారు, గ్రామీణులు గ్రహించి ఎలాగైతే రిజర్వేషన్స్‌కొరకు పట్టుబడతారో అలాగే తెలుగు మీడియం కొరకు కూడా పట్టుబట్టవలసింది.
తెలుగు మీడియమనునది బీద పేదవారి పేరిట వరమని, అది వారికి పోటీ పడడానికి సమకూర్చబడిన ‘‘హ్యాండీకాప్’’లాంటిదని వారు గ్రహించడం లేదు. వారి కులాల, వర్గాల పెద్దలు కూడా వారికలా నచ్చజెప్పకుండా ఇంగ్లీష్ మీడియంవారి భవిష్యత్తులను బాగుపరుస్తుందని వారిని ప్రక్కత్రోవ పట్టిస్తున్నారు. యువకులను అలా ప్రక్కత్రోవపట్టిస్తూ పరిపాలించే పార్టీలను ఇంగ్లీష్ మీడియం సమకూరిస్తే దాని పేరిట వారు, వారి పార్టీలు ఓట్లుదండుకోవచ్చని వారిని, వారి పార్టీలను కూడా పక్కత్రోవ పట్టించారు. అది పచ్చిఅబద్ధం, పచ్చి దుర్మార్గం, మోసం.
తగినన్ని వసతి సౌకర్యాలు వనరులు సమకూర్చకుండా ఏ మీడియంలో బోధనా అధ్యయనాలు చేబట్టినా ఒరిగేదేముంటుంది? ఇపుడు ఇంగ్లీషు మీడియం విద్యాలయాలు కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కేవలం ఇంగ్లీష్ మీడియంవి అయినందున మాత్రమే బాగున్నాయా?
ఇంగ్లీష్ నేర్చుకోవడం సంస్కృతం నేర్చుకోవడంకన్నా ఎందుకు కష్టమో, ఎలా కష్టమో తమ ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’నాటకం ద్వారా నిరూపించిన విశ్వనాథ సత్యనారాయణగారి మాటలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరవగూడనివి. కాని మనవారు చదువరుగా! చదివినా అర్థం చేసికోరుగా! అర్థం చేసికున్నా పట్టించుకోరుగా! వారికన్నా గొప్పవారు మరెవరూ లేరనుకుంటారుగా.
ఇంగ్లీషును ఒక భాషగా నేర్చుకోవడమే, వాడడమే ఎంతో కష్టమైన పనియని విశ్వనాథవారు నిరూపిస్తే దానిని పైపెచ్చు ఒక బోధనా మాధ్యమంగాకూడా ప్రవేశపెట్టడం ఎంత ద్రోహం, ఎంత నేరం, ఎంత పాపం. అది బీద పేద గ్రామీణ వర్గాల వారి పాలిట శాపం.
తెలుగు భాషాసమస్య తెలంగాణా వాద సమస్య లాంటిది. ఒక విధంగా అంతకన్నా పెద్దది. కాని సమాజం, మరీ అట్టడుగువారు కూడా దానికి ఊఁకొట్టడం వారి పాలిట రాబోయే రోజుల్లో ఒక సునామీ లాంటిదవుతుంది. అది వారు మున్ముందు గ్రహించకపోరు. కాని అన్నాళ్ళు సఫర్ కావలసిందేనా? మరి ఎందరో అమాయకులు, తెలియనివారు, తెలీసి తెలియనివారు? కొన్ని జనరేషన్స్ అలా పాడయిపోవలసిందేనా?

- డా.వెల్చాల కొండలరావు