సబ్ ఫీచర్
కరోనా అవగాహనా యాప్ ఆరోగ్య సేతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏప్రిల్ 2 నాటికి 1964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీని పేరు ‘ఆరోగ్య సేతు’. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు. ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్. లొకేషన్ డేటా, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఇది పనిచేస్తుంది. ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించే ముందు ప్రజలు మొదట వారి మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఓటీపీ ఆధారంగా మొబైల్ నెంబర్ ధృవీకరణ చేయబడిన తర్వాత సైన్ ఇన్ చేయబడుతుంది. ఇందులో పేరు, వయస్సు, లింగం, వృత్తి, ప్రయాణ చరిత్ర మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. దీని ప్రత్యేకత ఏంటంటే? ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది. ఈ యాప్‌లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. వినియోగదారులు దీని ద్వారా ఆయా రాష్ట్రాల తాజా కరోనా సమాచారం ఎప్పటికప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై ఉచితంగా లభించే ఈ ఆరోగ్య సేతు యాప్ పదకొండు భాషల్లో సేవలు అందిస్తుంది. కరోనా వైరస్ బారినపడ్డ బాధితులు మీకు ఆరు అడుగుల దూరంలోకి వస్తే వెంటనే యాప్ అప్రమత్తం చేస్తుంది. మీరు హై రిస్క్‌లో ఉన్నారో లేదో కూడా చెబుతుంది. ఒకవేళ మీరు హై రిస్క్ ఏరియాలో ఉంటే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తుంది. 1075 నెంబర్‌కు కాల్ చేసి దగ్గర్లోని టెస్టింగ్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. కరోనా వైరస్‌ను ఎలా అడ్డుకోవాలో ఆరోగ్య సేతు యాప్‌లో టిప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కరోనా వైరస్ పాజిటివ్ ఉందని తేలితే మీ డేటాను ప్రభుత్వానికి షేర్ చేస్తుంది ఈ యాప్. ఇందులో ఉండే ఛాట్ చేయడం ద్వారా మీ సందేహాలకు సమాధానాలను అందిస్తుంది. మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో చెబుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యక్ష ట్వీట్లను కూడా స్వీకరించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దేశంలో కరోనా మహమ్మారి గురించి నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ సంబంధిత యాప్‌లను ప్రారంభించాయి. ఈ యాప్ ద్వారా మీరు సురక్షితంగా ఉన్నారా? లేదా? అనే విషయాలను, మీరు ఉన్న ప్రాంతంలో కరోనా వైరస్ ఇనె్ఫక్షన్ యొక్క రిస్క్ స్థాయిని తెలుసుకునేందుకు, అప్‌డేట్స్ పొందడానికి క్రమం తప్పకుండా యాప్‌ను చూడాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాప్ ద్వారా కరోనా వైరస్ కట్టడి కోసం సిద్ధంగా ఉండండి కానీ భయపడకండి. సకాలంలో వైద్య సహాయం మరియు సురక్షిత మరియు పరిశుభ్రతతో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని ఎదుర్కోవచ్చునని తెలియజేస్తున్నది. స్వీయ అవగాహన పెంచుకోవడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను కూడా చెబుతోంది. ఈ యాప్ ద్వారా కోవిడ్-19 సహాయ కేంద్రాల సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. కోవిడ్-19 స్వీయ అంచనా పరీక్ష విధానం కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నేడు అందరికీ ఈ యాప్ అందుబాటులోకి, వినియోగంలోకి తేవడం ద్వారా కోవిడ్ 19 గూర్చి తెలుసుకోవడం, తమను కోవిడ్ 19 నుంచి రక్షించుకునేలా చర్యలు తీసుకోవాలి.