సబ్ ఫీచర్

ప్రజలకు ఉపయోగపడని ‘ప్రజావాణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజావాణి, మీకోసం అనే కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే ఇందులో ప్రయోజనం మాత్రం శూన్యంగానే ఉంటున్నది. రాష్ట్రంలోగల అధికారులు ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాలు నిర్వహణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అమలువంటివి చేస్తుంటారు. అయితే అన్నిస్థాయిల్లో అధికారులు సక్రమంగా పనిచేయకపోవటంవల్ల, లబ్దిదారులకి సరైన విధంగా లబ్దిచేకూరకపోవటంవల్ల ఉన్నతాధికారుల దృష్టికితెచ్చి సరైన విధంగా పనిచేయించుకోవటం ఈ కార్యక్రమంలో ఉద్దేశం. గత ఇరవై ముప్ఫై సంవత్సరాల క్రితంనుండే కొనసాగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొని తక్షణం స్పందించేవారు. గంటల్లో ప్రజాసమస్య పరిష్కారం అయ్యేది. అయితే కాలంతోబాటు అధికారులూ వారి తీరుతెన్నులు సైతం మారిపోయాయ. పూర్వం ప్రజావాణిలో కలెక్టర్లు ఫిర్యాదులు తీసుకొని వెంటనే సంబంధితులందరికీ ఆదేశాలు ఇచ్చేవారు. అర్జీమీదనే ఉత్తర్వులను రాసేసేవారు. అమలుచేయకపోతే మళ్ళీ వచ్చి కలవమనేవారు. పనులు వెంటనే జరిగేవి. పనిలో చాలా వేగం ఉండేది. అధికారులు సైతం హడలిపోయేవారు. ప్రస్తుతం ‘ప్రజావాణి’కి ఏమాత్రం ప్రతిస్పందనే ఉండటం లేదు. కాయితాలు పుచ్చుకొని బుట్టదాఖలు చేయటం మినహా ఏం జరగటం లేదు. అంతా పచ్చి బూటకం అని జనం అంటున్నారు.
ఏ అధికారి తమకు న్యాయం చేయలేదని కలెక్టరుగార్కి ఫిర్యాదుచేద్దామని వస్తారో ఈ ఫిర్యాదు అర్జీ పరిష్కారం నిమిత్తం అతనివద్దకే పంపించేస్తున్నారు. ఏదైనా మండల రెవిన్యూ అధికారో లేదా అభివృద్ధి అధికారిపైనా ఫిర్యాదు సమర్పించినపుడు ఆ ఫిర్యాదు తిరిగి అదే అధికారికి వెళ్ళటంవల్ల కావల్సిన పనులు ఏవిధంగా అవుతా య? ఫిర్యాదు చేశారన్న కోసంతో సదరు అధికారి ఫిర్యాదుదారుల్ని ఇంకా మోసం చేస్తున్నారు. తన మీద ఫిర్యాదుచేస్తే మీ గతి ఇంతే అంటున్నారు. ప్రజావాణిలో కలెక్టర్లు కూచుంటే ఒక స్థాయి కమాండ్ ఉంటుంది. అయితే కలెక్టర్లుగానీ, జాయింటు కలెక్టర్లుగానీ ఎవరూ హాజరుకాకుండా ఓ క్రిందిస్థాయి అధికారులు ప్రజాసమస్యలు ఈ చెవితో ఆ చెవితో వదిలేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో అధికారులు ఫిర్యాదులపై ఎటువంటి ప్రత్యక్ష చర్యలూ లేకపోవటంవల్ల ఆడింది ఆటపాడింది పాటగా మారింది. ఇదే తంతు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా సాగిపోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన చాలా ఫిర్యాదులు బుట్టదాఖలు అయిపోతున్నాయి. ఫిర్యాదులు అభ్యర్థనలు వంటి అంశాలపై చంద్రబాబు స్పదించే సమయం ఉండటంలేదనే ప్రచారం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫిర్యాదులు అభ్యర్థనలు అర్జీలకి నెంబరింగ్ పడి సంవత్సరాలు గడుస్తున్నా పరిష్కారాలు కాకపోవటం వంటివి చూస్తుంటే సాధారణమైన చిన్నపాటి సమస్యలక్కూడా పరిష్కారం చేయలేకపోవటం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజావాణి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను రశీదులపై ఉన్న నెంబర్లకి ఫోన్‌చేస్తే ఫోన్ ఎత్తేనాధుడే ఉండటం లేదు. ఫిర్యాదుదారుడు టోల్‌ఫ్రీ నెంబర్‌కి డయల్ చేస్తే రెస్పాన్స్ ఉండటంలేదనేది జనవాణి. అటువంటపుడు ఇటువంటి కార్యక్రమాలు పెట్టటం దేనికో దేముడికే తెలియాలి. ప్రతి సోమవారం రానూపోనూ ఛార్జీలు, కాయితాలు కలం ఖర్చుమినహా పేదలు మధ్యతరగతి ప్రజలకు ఒరిగేది అంతా సున్నాయేనన్న సంగతి ముందుగా తెలిస్తే ఎవరూ రానేరారు. అందరు అధికారులూ ప్రజావాణి సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవంటూ వార్తాప్రకటనలు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు నటిస్తున్నారు. తమను భ్రమల్లో పడేసి కాలక్షేపం చేయడం మినహా జరిగేది ఏమీలేదన్న సంగతి జనం గ్రహిస్తున్నారు.
‘ప్రజావాణి’, మీకోసం అంటూ వివిధ పేర్లు తగిలించి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫొటోను సైతం ప్రచురించి ఫిర్యాదు నెంబర్లువేసి పనికిరాని సమాధానాలు వ్రాసి పరిష్కరించబడింది అని వారికివారే సరిపెట్టేసుకుంటూ ఉం టున్న సందర్భాలూ ఉంటున్నాయి. కంటితుడుపు కార్యక్రమాలవల్ల ఒరిగేది లేకపోవటమేకాదు, ప్రభుత్వం పరువు ప్రతిష్ఠ దెబ్బతింటుంది. నిజంగా ఇది చంద్రబాబు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరికి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనే పేరుకాస్తా ఈ మీకోసం ప్రజావాణి మూలంగా ఆవిరైపోయిందని జనం అంటున్నారు.
కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, అధికారులు అందరూ హాజరై ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని సక్రమంగా నిర్వహించాల్సిందిగా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిత్తశుద్ధితో ఆత్మవంచన లేకుండా పారదర్శకంగా పరిపాలన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయినుండి జిల్లాస్థాయివరకూ ప్రజాప్రభుత్వపు కార్యక్రమాలు అన్నిస్థాయిల్లోనూ అమలుకావాలని కోరుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్‌లు, వికలాంగుల పింఛన్‌లు, రేషన్ కార్డులు, నివేశన స్థలాలు, కార్యాలయాల్లో పేరుకుపోయిన పెండింగ్ ప్రజాసమస్యలన్నింటినీ పరిష్కరించటానికి యం త్రాంగం వేగవంతంగా పనిచేయాలి. కార్యక్రమ అసలు లక్ష్యం నెరవేరకుండానే సంవత్సరం కాలంపాటు గడిచిపోవటంవల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది.
ఎవరైనా ఫలానా అధికారి అవినీతికి పాల్పడ్డాడని ఫిర్యాదుచేస్తే ఆ ఫిర్యాదు కలెక్టరుస్థాయి అధికారికి చేరా ల్సి ఉంటుంది. సదరు ఫిర్యాదు అదే అవినీతి అధికారికి చేర్చేస్తున్నారు. పైగా ఏ ఫిర్యాదునీ కలెక్టర్లు జాయింటు కలెక్టర్లకు పంపించవద్దని చెప్పినారని అధికారులు చెప్తున్నారు. కలెక్టర్లు స్వయంగా చూడవలసిన అంశాలు కూడా చూడటానికి ఇష్టపడనే పడటం లేదు. మరి వారు ఆ ఉద్యోగాలు నిర్వహించటానికి ఎందుకు వచ్చినట్లు నియమించిన వారికే తెలియాలి.
ఏదిఏమైనా ప్రజాసంక్షేమంకోసం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ఇలా వృధా కావడం అందరికి క్రమంగా తెలిసిపోతున్నది. చేతిలో ఉన్న పావలా అర్ధరూపాయి కాయితాలు ఫొటోస్టాట్‌లు వగైరాలు తీయించుకొని డబ్బు ఖర్చు, శ్రమ, ప్రయాణం ఖర్చులతో ప్రజలు ఫిర్యా దు చేయడానికి రారు. ప్రజల ప్రతిపైసా కూడా కష్టార్జితమే కదా!

- ఎన్.నాగేశ్వరరావు