మెయన్ ఫీచర్

ఎవరి ఎన్నికల ఎత్తుగడలు వారివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల అయిదవ తేదీన జరిగిన కేంద్ర మంత్రి మండలి మార్పులు వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినటువంటివని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కాదనేందుకు తగిన కారణం లేదు. అందులో తప్పుపట్టేందుకు కూడా ఏమీలేదు. ప్రభుత్వం వారిది, ఎన్నికలను ఎదుర్కొనేది వారు, గెలవటం అవసరం. అందుకు తగినట్లు ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వటం, కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకోవటం తప్పదు. మార్పు లు చేసిందే అందుకోసం కదా. మరెవరైనా అయితే ఇంతకన్న భిన్నంగా చేస్తారా?
వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజా బ్, రాజస్థాన్, గుజరాత్ వగైరా అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి కీలకం కావటం తెలిసిందే. యధాతథంగా అక్కడ గెలవటమే ఒక ముఖ్యావసరం కాగా, ఆ తర్వాత మరొక రెండేళ్లలో తిరిగి లోక్‌సభ ఎన్నికలు జరగనుండటం బహుశా అంతకన్న ముఖ్యమైన స్థితి. ఈ రాష్ట్రాలతోపాటు బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్రు పోయినమారు అనూహ్యమైన స్థాయిలో అనుకూలించినందువల్లనే బిజెపికి అంతే అనూహ్యమైన విధంగా స్వంత ఆధిక్యత లభించింది. ఎన్‌డిఎ భాగస్వాములూ బలపడి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రణాళిక ప్రకారం పాలించేందుకు పూర్తి ఆత్మవిశ్వాసం లభించింది. ఈ స్థితి ఇదే విధంగా 2019 తర్వాత మరో అయిదేళ్లపాటు కొనసాగే అవకాశం రావాలంటే వచ్చే సంవత్సరపు అసెంబ్లీ ఎన్నికలు కీలకమవుతున్నాయి.
అవి భవిష్యత్తుకు సూచికలు కూడా. యుపిఎ పదేళ్ల పాలన పట్ల బాగా నిరాశ చెందిన ప్రజలు, ఆ పరిస్థితిని మార్చగలనన్న మోదీ వాగ్దానాలను నమ్మారు. అది బిజెపి కన్న ఎక్కువగా వ్యక్తిగతంగా మోదీ కల్పించిన విశ్వాసమని వేరే చెప్పనక్కరలేదు. అందువల్ల ఈ రెండేళ్లపాటు అందరి దృష్టి తనపైనే కేంద్రీకృతమైంది. గమనించదగినదేమంటే, బిజెపి పాలిత రాష్ట్రాలలోనేగాక, ఇతర రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి ఉంది. వివిధ కారణాలవల్ల కొన్ని అసెంబ్లీలలో బిజెపి ఓడి ఉండవచ్చు. కాని అక్కడ ఆ పార్టీకి లభించిన ఓట్లలో గణనీయమైన భాగం మోదీ వ్యక్తిగత ఆకర్షణవల్ల వచ్చినవేనన్నది నిజం. కనుక గత రెండేళ్ల మోదీ పాలనను దేశవ్యాప్తంగా అందరూ గమనిస్తూ వస్తున్నారు. బిజెపికి మొదటినుంచి పట్టణ ప్రాంతాల పార్టీ అని, కొన్ని వర్గాల పార్టీ అని పేరున్నది. ఆ ముద్రలు వాజపేయి కాలంలో కొంత చెదిరాయి. మోదీ నాయకత్వాన మరింత చెదరటం ఆసక్తికరమైన విషయం.
వాజపేయికి గల ప్రతిష్ట గొప్ప నాయకుడు, గొప్ప వక్త, పెద్దమనిషి, ఉదారవాది, ప్రజాస్వామికవాది తరహాది. అప్పటికి ఇతర పార్టీలు విఫలం కావటంతో ఆ పరిస్థితులలో ఆయన నాయకత్వంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికాయన గొప్ప పరిపాలకునిగా పేరుతెచ్చుకున్న సందర్భాలు లేవు. విదేశాంగ శాఖను సమర్ధంగా నిర్వహించటం తప్ప. కాని అది సాధారణ ప్రజల జీవితాలతో సంబంధం కలది కాదు. నరేంద్రమోదీది అందుకు భిన్నమైన స్థితి. యుపిఎ ప్రభుత్వం పాలనాపరంగా విఫలమై ఏర్పడిన శూన్య స్థితిలో ఆయన ముందుకొచ్చారు. తన వెనుక గుజరాత్ రికార్డు ఒకటి ఉన్నట్లు బాగా ప్రచారంలోకి వచ్చింది. అందుకు తగిన విధంగా అభివృద్ధి, సమర్ధవంతమైన పాలన, అవినీతి రాహిత్యం, ధరల అదుపు, ఉపాధి కల్పన వగైరా హామీలు ఇచ్చారు. మొత్తం దేశ ప్రజల దృష్టిలో మోదీ అనే కొత్త జాతీయ నాయకునికి రూపకల్పన ఆ విధంగా జరిగింది. ఇది వాజపేయికి జరిగిన దానికన్నా దాదాపు పూర్తిగా భిన్నమైనది.
అనగా, ప్రజలు తన పరిపాలనను రాగల అసెంబ్లీ ఎన్నికలలో మదింపు చేసేందుకు ఈ ప్రతిష్ట అంతా గీటురాయి అవుతుందన్నమాట. వీటిలో కొన్ని రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్నందున స్థానిక పాలనల ప్రభావం కొంత కన్పించే మాట కాదనలేం. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలలో ఫలితాలు బిజెపికి మిశ్రమంగా ఉండటం తెలిసిందే. అందుకు కారణం స్థానిక పరిపాలనల తీరే తప్ప కేంద్ర ప్రభుత్వ పాలన అనలేము. దాని అర్థం, ఒకవేళ గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి మూకుమ్మడిన ఓటువేసిన ప్రజలు తర్వాత స్థానిక ఎన్నికలలో వ్యతిరేకంగా ఓటుచేసి ఉంటే, ఆ తేడాలు ఈసారి కూడా చూపకలరనా? వచ్చే సంవత్సరపు అసెంబ్లీలో స్థానిక బిజెపి నాయకత్వానికి వ్యతిరేకంగా ఓటుచేసి, ఆ తర్వాత 2019 లోక్‌సభకు యధావిధిన మోదీ వైపు మొగ్గగలరని భావించవచ్చునా? ఇది జవాబు చెప్పలేని ప్రశ్న. కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఓటింగు నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు పలు అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఓట్లు ఒకే తీరున ఉన్న సందర్భాలు, లేనివి కూడా ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ జయాపజయాల ఖ్యాతి అపఖ్యాతులు రాష్టస్థ్రాయి నాయకులకు మాత్రమే పరిమితం కావు. బిజెపి, కాంగ్రెస్ వంటివి జాతీయ పార్టీలు అయినందున, జాతీయ విధానాలూ ఆ పార్టీల కేంద్ర స్థాయి పరిపాలనల ప్రభావాలు సైతం స్థానిక ప్రభుత్వాల మంచిచెడులతోపాటు ఉంటాయి గనుక, అసెంబ్లీ జయాపజయాల ప్రశంసలు, విమర్శలు కేంద్ర నాయకత్వంపై అనివార్యంగా ఉంటాయి.
ఇదంతా ఇంత వివరంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఈ మతలబులన్నీ తెలిసినందువల్లనే వచ్చే సంవత్సరపు అసెంబ్లీ ఎన్నికల విషయమై మోదీ ఇప్పటినుంచే జాగ్రత్తవహిస్తున్నారు. రాజకీయ వ్యూహాలను పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా క్షేత్రస్థాయిలో రచిస్తుండగా, అందుకు తగినట్లుగా ప్రభుత్వ స్థాయిలో చేయవలసింది చేయటం ప్రధానమంత్రి కర్తవ్యమవుతున్నది. అది వారిద్దరు సమన్వయంతో చేసే పని. సాఫల్యమైనా, వైఫల్యమైనా చివరకు ఆ మార్కులు ఇద్దరికీ కలిపి పడతాయి. కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య కనిపించే గుణాత్మకమైన వ్యత్యాసాలలో ఇది ఒకటి. కాంగ్రెస్‌లో విజయాల ఖ్యాతి కేంద్ర నాయకత్వానికి, అపజయాల అపఖ్యాతి రాష్ట్ర నాయకత్వాలది అవుతుంది. ఈ పరిస్థితి ఒక్క కాంగ్రెస్‌లోనే ఉంది. కమ్యూనిస్టులలోనూ లేదు. ఈ తేడాకు కారణం ఊహించటం కష్టంకాదు. కాంగ్రెస్‌లో ఇటువంటి లక్షణాలు స్వాతంత్య్రానికి ముందు లేవు. అపుడు నాయకులంతా ఒకరికొకరు తీసిపోని హేమాహేమీలు. అది పార్టీకి సరిసమానుల ఉమ్మడి నాయకత్వం వంటిది. చివరకు గాంధీజీని సైతం అంతగా గౌరవిస్తూనే తన మాటను తోసిరాజన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాని స్వాతంత్య్రానంతరం, ముఖ్యంగా పటేల్ మరణం తర్వాతనుంచి, నెహ్రూ ప్రధానమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా రెండు అగ్రస్థానాలను తన అధీనంలోకి తీసుకోవటంతో ఆరంభించి కేంద్రీకృత అధికారం స్థిరపడింది. దానివెంట వ్యక్తి ఆరాధన పెరిగింది. వ్యక్తిగతంగా నెహ్రూ గొప్పస్థాయి కలవాడైనందున అప్పటికది ఎక్కువ చెడును చేయలేదు గాని, తదనంతర కాలంలో చాలా చెడును చేసేందుకు ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఆ దుర్లక్షణా లు ఇందిరాగాంధీ కాలంనుంచి మొదలై ఈనాటివరకు కన్పిస్తున్నాయి. పరిస్థితులను గమనించగా ఇది ఇక భవిష్యత్తులోనూ మారగల సూచనలు లేవు.
బిజెపి విషయం అట్లాకాదు. అందులో పార్టీవాదులనుంచి తగు గౌరవాన్ని పొందే అగ్రనాయకులైతే ఉన్నారు గాని సర్వం సహాధిపతులు లేరు. తగు సిద్ధాంతాలు, కార్యకర్తల నిర్మాణంగల బిజెపి, కమ్యూనిస్టుల వంటి పార్టీలలో వికేంద్రీకృతమన్నది ఒక సహజ స్థితి. వ్యక్తి ఆరాధనలుండవు. అందువల్ల, మరొక ఎనిమిది-తొమ్మిది మాసాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మోదీకి పెద్ద పరీక్షే అవుతాయి. గత లోక్‌సభ ఎన్నికలు ఆయన వ్యక్తిగత నాయకత్వం చుట్టు ఎక్కువగా తిరగటం అప్పటి పరిస్థితులనుబట్టి జరిగినా, దానిని క్రమం గా సరిదిద్దేందుకు సైద్ధాంతిక నాయకత్వం తర్వాత కాలంలో ప్రయత్నించింది. ఆ దిద్దుబాటు ఈసరికి పూర్తయిందని అనలేముగాని, పరిస్థితి కనీసం రెండేళ్ల క్రితంవలె లేదు. ఇటువంటి స్థితిగతుల మధ్య అసెంబ్లీ ఫలితాలు ఆశించిన విధంగా లేని పక్షంలో అంతా తలకిందులైతే కాదు గాని, ఆ ప్రభావం మోదీపై ఉండటం అనివార్యమవుతుంది. అదే విధంగా అమిత్‌షాపైన. యుపి, రాజస్థాన్, గుజరాత్ మొదలైనచోట్ల ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పైన చెప్పుకున్నట్లు మిశ్రమంగా ఉండినందున, 2014లో వలె 2019లో పార్లమెంటు విజయాలు ఏకపక్షం కాకపోవచ్చుననే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. అవి సరైన అంచనాలలో కాదో తేల్చగల ఒక పెద్ద పరీక్ష వచ్చే సంవత్సరపు అసెంబ్లీ ఎన్నికలవుతాయి. ఆ ఫలితాలనుబట్టి తర్వాత కాలానికి ఒక మూడ్ వంటిది దేశమంతటా ఏర్పడుతుంది.
కనుకనే ప్రధానమంత్రి మంత్రిమండలి మార్పులతీరు అందుకు తగినట్లుగా ఉంది. అది తప్పదు కూడా. పైగా తను చేసిన దానిలో తప్పు, కొత్త, అసహజం వంటివేమీ లేవు. రాజకీయాలలో ఇవి సర్వసాధారణమైన ఎత్తుగడలు. ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వగలవా లేదా అన్నది కేవలం ఆ మార్పులపై ఆధారపడి ఉం డదు. మార్పులు ఒక సన్నాహకం మా త్రమే. ఈ కొత్త మంత్రుల బాధ్యతల నిర్వహణ, క్షేత్రస్థాయిలో రాజకీయ సామ ర్థ్యం ఒకవైపు, ప్రతిపక్షాలు తమవైపునుం చి వేయగల ఎత్తుగడలు, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చూపగల ప్రభావాలు ఫలితాలను నిర్దేశిస్తాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)