సబ్ ఫీచర్

మద్దతు ధర ప్రయోజనం పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నా రైతుకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. గ్రామీణ కుటుంబాల్లో రైతు కుటుంబాల వాటా 57.8 శాతం. మొత్తం వ్యవసాయ దారుల్లో చిన్న, సన్నకారు రైతుల వాటా 86.58 శాతం. వ్యవసాయ వ్యయం పెరగడంవల్ల రైతులను ఆదుకోవాలని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొన్ని ముఖ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. ఈ ధరలను ప్రతి సంవత్సరం పెంచుతూ వుంది. ఈ విషయంలో ప్రభుత్వం సిఏసిపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్) సలహాను తీసుకుంటున్నది. ధాన్యాలను సేకరించేటప్పడు ఈ మద్దతు ధర చెల్లించడం జరుగుతున్నది. మద్దతు ధర పెంచడం మంచిదే కానీ దాని ప్రభావం ఎలా వుంటుందో పరిశీలించాలి. మద్దతు ధర పెరగడంవల్ల ఆహార ధాన్యా ల ధరలుకూడా పెరుగుతాయి. అందువల్ల పేద ప్రజలు, చిన్న, సన్నకారు రైతులు కూడా నష్టపోతారు. అసలు మద్దతు ధరను ఎలా నిర్ణయించాలి అన్నది వివాదాస్పదంగా మారింది. సిఏసీపీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటోంది. వీటిలో ముఖ్యమైనవి ఉత్పత్తి ఖర్చులు, సాగుకు వాడే సామగ్రి, ధరల్లో మార్పులు, మార్కెట్‌లో పంటల ధరల సరళి, డిమాండ్-సరఫరా అంచనా, జీవన వ్యయంపై ప్రభావం. స్వామినాధన్ కమిటీ మద్దతు ధర వ్యవసాయ ఖర్చులకంటె 50 శాతం ఎక్కువగా వుండాలని అభిప్రాయపడింది. మద్దతు ధర మొదటినుండి వివాదాస్పదంగా మారింది. అసలు దేశమంతటికీ ఒకే మద్దతు ధర వుండకూడదని కొందరి వాదన. ఎందుకంటే ఉత్పత్తి వ్యయాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. అంతేకాదు, చిన్న సన్నకారు రైతులకు మార్కెటింగ్ మిగులు వుండదు. అంటే వీరికి మద్దతు ధరతో సంబంధం వుండదు. అందువల్ల ఆచార్య ఎం.ఎల్.దంతవాలా లాంటి ఆర్థిక శాస్తవ్రేత్తలు రైతులందరు లాభం పొందాలంటే ఉత్పాదకత పెరగడమే సరైన మార్గమని వాదించారు.
ప్రభుత్వం మద్దతు ధరలను ప్రతి సంవత్సరం పెంచుతునే వుంది. 2003-04, 2012-13 మధ్య కాలంలో వరి విషయంలో మద్దతు ధర పెరుగుదల 127 శాతం, గోధుమ విషయంలో ఇది 107 శాతం, 2008లో ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేయడానికి రు.70వేల కోట్ల ప్రత్యేక పాకేజీ ప్రకటించింది. అంతకుముందు రు.25వేల కోట్ల వరకు రుణ మాఫీ చేసింది. ముఖ్యంగా ఇది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఉపయోగపడింది. జూన్ 1న వివిధ పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. వరి విషయంలో క్వింటాల్ మద్దతు ధరను రు.60 మాత్రమే పెంచి రు.1,470గా నిర్ణయించింది. ఇది బాగా తక్కువని పలువురి అభిప్రాయం. పప్పు దినుసుల మద్దతు ధరలు బాగున్నాయి. క్వింటాల్ కంది రు.5,050, పెసరకి రు.5,225, మినుములకి రు.5,000 లభిస్తున్నాయి. ఖరీఫ్ పప్పుదినుసుల మద్దతు ధరలు 7.7 శాతం నుంచి 9.2 శాతం పెరిగాయి. పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే దిశగా కంది, మినుము, పెసర పంటల మద్దతు ధరకు అదనంగా రు.425 బోనస్ ప్రకటించింది. వ్యవసాయ ఆర్థిక శాస్తవ్రేత్త రమేష్ చంద్ ధర ప్రోత్సాహంపైనే ఎక్కువగా ఆధారపడడం వల్లనే రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరేతర ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయం. వీటిలో ముఖ్యమైనవి నీటి వినియోగంలో ఆదా, యాంత్రీకరణ, ఎరువుల వినియోగంలో శాస్ర్తియత, చిన్న, సన్నకారు రైతుల ఆదాయాలు పెంచడం ముఖ్యం.
ఒక ముఖ్య విషయం. కేవలం మద్దతు ధరలు ప్రకటిస్తే సరిపోదు. ఆ ధరలకు ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించాలి. అన్ని ధాన్యాల విషయంలో ఇలా జరగడం లేదు. ఉదాహరణకు పప్పు ధాన్యాల మద్దతు ధర బాగా పెంచినా సేకరణ సరిగా లేదని రైతులు ఈ పంట విషయంలో శ్రద్ధ చూపడం లేదు. మద్దతు ధరపై ఎక్కువగా ఆధారపడకుండా సాగు ఖర్చు తగ్గించుకోవాలి. సేంద్రీయ ఎరువులను వాడాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా యాంత్రీకరణ చేపట్టాలి. సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై శ్రద్ధ చూపాలి. అంతేకాదు వివిధ స్థాయిల్లో వృధాను తగ్గించాలి. ఉత్పాదకాల వినియోగంలో శాస్ర్తియత వుండాలి. ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరచాలి. దళారులనుండి రైతులను కాపాడాలి.

-డాక్టర్ ఇమ్మానేని సత్య సుందరం