సబ్ ఫీచర్

సంక్షోభంలో ఉప్పు పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కరువై మూతపడుతున్న అనుబంధ వ్యవసాయ పరిశ్రమల్లో ఉప్పు తయారీ పరిశ్రమ కూడా చేరిపోయింది. ఎటువంటి యం త్రాల సహాయంలేకుండా కేవలం మానవశక్తితో తయారయ్యే సాధారణ ఉప్పు పరిశ్రమ ఏలికల నిర్లక్ష్యంతో ఏ ఏటికాయేడు కరిగిపోతోంది.
ఆంధ్రులకు ఆమాటకొస్తే భారతీయులందరి వంటకాల్లో ఉప్పు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకనే ఉప్పులేని పప్పు అనే సామెత కూడా పుట్టిం ది. ఆరు రుచుల్లో చౌకగా దొరికేది ఉప్పు. అలాగని ఉప్పును ఎక్కువ వాడినా ఆరోగ్యానికి ముప్పే. ఈ ఉపోద్ఘాతమంతా సాంప్రదాయ ఉప్పు పరిశ్రమ అంతరించిపోతున్నదని సాధారణ ఉప్పు తయారీదార్ల శ్రమకు తగిన ఫలితం దక్కటం లేదని చెప్పటానికే. రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పు తయారీదార్లు నష్టాలు ఎదుర్కొంటున్నారు. కిలో ఉప్పుకు రెండు రూపాయల ధర కూడా లభించడం లేదు. ఈ కారణంగా ఉప్పు తయారీదార్లు ఇతర వృత్తులను ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సముద్రతీర ప్రాంతానికి చెం దిన శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో గతంలో 25వేల ఎకరాల వరకు ఉన్న విస్తీర్ణం ఇప్పుడు ఐదారు వేల ఎకరాలకు పడిపోయింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే నాలుగు వేల ఎకరాల నుండి వెయ్యి ఎకరాలకు విస్తీర్ణం పడిపోయింది.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు, తగ్గిన డిమాండ్, కూలీల కొరత, శిస్తుల పెరుగుదల ఈ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ఖర్చులేని సముద్రపు నీరే ఉప్పు తయారీకి ప్రధాన ముడి పదార్థమైనా ఇతర ఖర్చులు ఉప్పు ఉత్పత్తిదారులను అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. ఉప్పు ఉత్పత్తిలో గుజరాత్‌దే సింహభాగం. అక్కడ 70 శాతం ఉప్పు తయారవుతోంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 2 లక్షల 90వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. ఇక ద్వితీయ స్థానంలో ఉన్న తమిళనాడులో 50వేల ఎకరాల్లోను తృతీ య స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో 25వేల ఎకరాలలోను సాగవుతోంది. కాగా నాలుగో స్థానం లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 20వేల ఎకరాలలో ఉప్పు తయారవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో కేంద్ర సాల్ట్ కమిషన్ కార్యాలయం ఉంది. తమిళనాడు కూడా ఈ కేంద్రం పరిధిలోనికే వస్తుంది.
రాజస్థాన్‌లో తయారయ్యే ఉప్పు సముద్రం నీరు నుంచి కాకుండా గనుల నుండి తవ్విన రాతి నుండి తయారుచేస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా చినగంజాం, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా లో కాకినాడ సమీపంలోని గ్రామీణ ప్రాంతాలు ఉప్పు పరిశ్రమకు కేంద్ర స్థానాలుగా ఉన్నాయి.
సముద్ర తీర భూములు ఉప్పు పంటకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఉ ప్పును డిసెంబర్ నుంచి జూన్ వరకూ పండిస్తారు. వాతావరణం అనుకూలించకపోతే మే నెలతోనే ఈ పంటను నిలిపివేస్తారు. సీజన్ ప్రారంభానికి రెండు నెలలు ముందు నుంచి నేలను చదును చేసే పని చేపడతారు. ఇందుకు పొడుగాటి కర్రకు అడుగున వెడల్పాటి చెక్క అమర్చిన పరికరాన్ని ఉపయోగిస్తారు. చదును చేసిన తరువాత ఆ భూమిని ఉప్పు పండించటానికి వీలుగా మడులుగా తీర్చిదిద్దుతారు. ఈ మడులను కొటారులు అంటారు. సముద్రపు నీటిని ఈ కొటారుల్లో ఎండగడతారు. సముద్ర నీరు అందుబాటులో లేకపోతే భూగర్భంలోకి బోర్లువేసి ఆ నీటిని ఉపయోగిస్తారు. రోజూ కొటారుల్లో నీటిని చెక్క కర్రతో ఒక మూలకు లాగుతారు. ఎండలు గట్టిగా కాస్తే మడుల్లో నింపిన నీరు ఆర్చుకుపోయి, నాలుగైదు రోజులనుంచే ఉప్పు పంట పండటం ప్రారంభమవుతుంది. అలా తయారైన ఉప్పు పలుకులను తేలికపాటి తెడ్లతో ఒక పక్కకు లాగుతారు. తరువాత మడులను మళ్ళీ నీటితో నింపుతారు. సముద్రపు నీరు సహజ ఆటుపోటుల ద్వారా మడులకు చేరకపోతే పిల్ల కాల్వల ద్వారా ఆయిల్ ఇంజన్లు వేసి మడులను సముద్రపు నీటితో నింపుతారు.
ఉప్పు పండించడంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. కొటార్లలోని ఉప్పు రాశుల్ని దక్కించుకోవడానికి ఎంతో శ్రమపడాలి. తయారైన ఉప్పును కొటారుల నుంచి కావిళ్లతో బయటకు తరలించి రాశులుగా పోసి తాటాకులు కప్పుతారు. పంట చేతికందే సమయానికి వర్షాలు, తుఫానులు వస్తే అప్పటివరకు పడిన శ్రమ, పెట్టిన పెట్టుబడి నీటిపాలవుతుం ది. ఉప్పు రాశులు కరిగిపోయి రైతులు తీవ్రం గా నష్టపోతారు.
ఉప్పు తయారీకి ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. పండిన పంటకు ఇటీవల ఎగుమతులు, తగిన రవాణా సౌకర్యాలు లేక తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోపక్క తమకు రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. ఎంతో శ్రమకోర్చి పండించినా క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.200కి మించి ధర దక్కడం లేదని అంటున్నారు.
మరోపక్క అయోడైజ్డ్ సాల్ట్ వాడకం పెరగడంవల్ల కూడా సాధారణ ఉప్పు డిమాండ్ తగ్గింది. దీంతో ఉప్పు తయారీపై ఆధారపడి జీవించే కార్మికులు ఇతర పనులకోసం వలసలు వెళ్తున్నారు. దీనికితోడు ఏడాదికి ఆరునెలలు మాత్రమే వారికి ఈ పని ఉంటోంది. ఉపాధి హామీ పథకంవల్ల ఈ ఉప్పు పనిచేయటానికి కూలీల దొరకటం లేదు.
గతంతో పోల్చుకుంటే ఖర్చులు, లీజు మొత్తం కూడా పెరిగాయని, దీంతో ఉప్పు సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. తమ శ్రమకు గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఒక రూపాయికే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేవారని ప్రస్తుతం యూనిట్‌కు రూ.6 వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. 2004వరకూ ఉప్పు మడి లీజు ఎకరాకు రూ.200 ఉండేది. ఇప్పుడు దానిని రూ.2,200కు ఉప్పుశాఖ పెంచింది. ప్రస్తుత లీజు గడువు 2018కి పూర్తవుతుంది. గతంలో పాతవారికే రెన్యువల్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్‌లో టెం డర్ వేసుకోవాలంటున్నారని చెబుతున్నారు. బ్రిటిష్ కాలంనుంచీ తమ కుటుంబాలు ఉప్పు భూములనే నమ్ముకుని ఉంటున్నాయని, గడు వు పూర్తయినా, పాత రైతులకే తిరిగి లీజు కేటాయించాలని, ఉప్పు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రుణాలు మంజూరు చేయాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ ఉప్పుకు గుజరాత్ ఆధునిక ఉప్పు పరిశ్రమ దెబ్బ గట్టిగానే తగిలింది. ఈ రైతులను చంద్రబాబు ప్రభు త్వం ఏ విధంగా ఆదుకుంటుందో వేచి చూడా లి.

- పుట్టా సోమన్నచౌదరి