మెయన్ ఫీచర్

కమ్యూనిస్టుల దేవాలయ సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సుమారు వారం రోజుల క్రితం ఒక టెలివిజన్ ఛానల్‌కు ఇంటర్‌వ్యూ ఇస్తూ, తాను దేవాలయాలకు వెళ్తుంటానని చెప్పారు. ఒక కమ్యూనిస్టు నాయకుడు అయివుండి అట్లా చెప్పటం వినేవారికి ఆశ్చర్యం కలిగిస్తుందని, అపోహలకు తావిస్తుందని భావించినట్లున్నారు. దాంతో అంతలోనే సర్దుకొని అక్కడ ప్రజలు ఉంటారు కనుక వెళతానని వివరణ ఇచ్చారు. కమ్యూనిస్టులు దేవుడనే భావనను నమ్మకపోవడం గాని, అదే సమయంలో దేవాలయాలకు వెళ్లడం కానీ ఏదీ కొత్తకాదు. ఇది వీరభద్రంతో మొదలు కాలేదు, ఆయనతో ముగిసిపోదు. అందువల్ల ఆయన చెప్పింది బహుశా ఎవరికీ ఆశ్చర్యం కలిగించి ఉండదు. ఇంతకూ ఆయన దేవాలయ సందర్శన భక్త్భివంతోనో లేక అక్కడ ప్రజలు ఉంటారు గనుకనో నిర్థారణగా ఒక అభిప్రాయానికి రాగల అవకాశం మనకు లేదు. అది తన మనస్సుకు తెలియాలి.
దానినట్లుంచితే ‘‘అక్కడ ప్రజలు ఉంటారు గనుక’’ అనడంతో మాత్రం కొన్ని ప్రశ్నలున్నాయి. దేవాలయాల వద్ద ప్రజలు ఉండే మాట నిజం. అక్కడకు వెళ్లడంలో కమ్యూనిస్టుల ఉద్దేశమేంటి? వెళ్లి ఏం చేస్తారు? అన్నవి ప్రశ్నలు. ఉద్దేశం ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడమా? సమస్యలపట్ల చైతన్యం కల్పించడమా? ఆ సమస్యలపై తమ అవగాహన ఏమిటో, అందుకు పరిష్కారం ఏమిటో వివరించడమా? సదరు సమస్యపై తాము పోరాడుతున్నామని చెప్పి, తమతో కలిసి రావలసిందిగా కోరడమా? ఒకవేళ అటువంటి ఉద్దేశాలతో వెళ్లి ఇదంతా చేస్తుండినట్లయితే అం దులో ఎవరికీ ఆక్షేపణ ఉండనక్కరలేదు. నిజానికి దేవాలయాలకు, ఇంకా అటువంటి మత సంబంధ కేంద్రాలకు, కార్యక్రమాలకు వెళ్లి ఇదంతా చేయడం కమ్యూనిస్టు పార్టీల విధానంగా ఉండాలి. ఆ కార్యక్రమాలలో వీరభద్రం వంటి నాయకుల నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు అందరూ పాల్గొనాలి.
కాని తొంబయి సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో ఇటువంటిది ఎప్పుడూ జరిగినట్లు కనిపించదు. పోనీ తమ్మినేని తన వ్యక్తిగత స్థాయిలో అటువంటి నిర్ణయం తీసుకుని ఆపని చేస్తుండవచ్చునా? నాయకుని హోదా లో గల వ్యక్తి అట్లా చేయడమంటూ జరిగితే అసంబద్ధంగా తోస్తుందిగాని, ఒకవేళ నిజమైతే తను ఎప్పటినుంచి ఈ పని చేస్తున్నారో, అక్కడ ప్రజలమధ్య చేసింది ఏమిటో, దాని ప్రభావం ఎట్లావుందో, స్వానుభవాలతో ఏదైనా రాస్తే ఇతరులు తెలుసుకోగలరు. అందులో అనుకరించదగినది ఏమైనా ఉంటే తక్కిన కమ్యూనిస్టులు అదే పని చేయవచ్చు కూడా.
ఇదంతా ప్రజల సమస్యలకు సంబంధించిన విషయం. ప్రజల సమస్యల గురించి కృషి చేయదలిస్తే వారు ఇతరచోట్ల కూడా ఉంటారు గదా, దేవాలయాలకు వెళ్లడమెందుకు? అక్కడ భక్తి కార్యక్రమాలలో ఉండే జనులు సమస్యలపై చర్చలకు సుముఖత చూపుతారా? వంటి ప్రశ్నలున్నాయి. వీటికి తమ్మినేని వివరణ ఇవ్వగలగాలి. అయితే ఒకటున్నది. సామాన్యులకు జీవిత సమస్యలు ఎప్పుడైనా వెన్నాడుతూనే ఉంటాయి గనుక, కమ్యూనిస్టులు వాటిని కళారూపాలలో రంగరించి, ప్రజల మతపరమైన భావనలు దెబ్బతినని రీతిలో నేర్పుగా చెప్పగలిగినట్లయితే ఆలకించేందుకు సిద్ధంగానే ఉంటారు. ఆ వ్యవధిలో భక్తిపారవశ్యం పక్కకుపోయి జీవిత సమస్యల పార్శ్వం ముందుకు వస్తుంది. మరి కమ్యూనిస్టు నాయకులు అటువంటిదేమైనా చేస్తున్నారా? బయటకు తెలిసి మాత్రం ఏమీ లేదు. రహస్యంగా జరుగుతుంటే చెప్పలేం. అయితే ఇటువంటివి రహస్యంగా ఉండటం కష్టం.
కమ్యూనిస్టులు దేవుళ్లకు మొక్కడం ఇది కొత్త కాదని పైన అనుకున్నాం. 1960లలో కావచ్చు. కేరళ కమ్యూనిస్టులు ఈ పనిచేయడం సంచలనాన్ని సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అపుడాపని చేసింది ఎవరో ఒక నాయకుడు వ్యక్తిగతంగా కాదు. పలువురు సామూహికంగా వెళ్లారు. తర్వాత అనేక సంవత్సరాలకు విజయవాడ కనకదుర్గ గుడికి అదేవిధంగా పోవడం మరొక వివాదమైంది. బెంగాల్‌లో దుర్గామాత ఉత్సవాలలోనైతే అక్కడి వామపక్షీయులంతా అదొక సాధారణ విషయమన్నట్లు పాల్గొనడం తెలిసిందే. దానిపై విమర్శలూ లేవు, చర్చలూ లేవు. ఇవి కొన్ని ఉదాహరణల మాత్రమే. హిందూమతంతో పాటు ఇంకా వేర్వేరు మతాలకు చెంది కమ్యూనిజం వైపు మొగ్గినవారిలో ఇంకా ఎవరెవరు తమ ప్రార్థనా మందిరాలకు రొటీన్‌గా వెళుతున్నారో, మత సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారో ఎవరూ చెప్పలేరు. ఇవి పైకి కన్పించేవి. ఇవి గాక మనస్సులలో ఎవరికి ఎటువంటి భావాలు ఉన్నాయో చెప్పగల అవకాశం అంతకన్నా లేదు.
దీనంతటిని బట్టి అర్థమయ్యేది ఒకటున్నది. దేవుడు, మతం గురించి కమ్యూనిస్టులకు ఒక థియరీగా నేర్చుకున్న విషయాలు కొన్నున్నాయి. కాని వాటికి, వాస్తవికతలకు మధ్య నిమిత్తం ఉండటం లేదు. నిమిత్తం ఏర్పడలేదు. అందుకు కారణం ఏమిటి? థియరీ అవాస్తవికమైనదా? లేక దానికి వాస్తవాలతో నిమిత్తం కల్పించడంలో వారు విఫలమవుతున్నారా? లేక నిమిత్తం కల్పించడమన్నది అసలు సాధ్యం కాదా? సూత్ర రీత్యా సాధ్యమేననుకుంటే ఆచరణలో దానిని సాధించడమెట్లా? ఒకరు కమ్యూనిస్టా కాదా అనే దానితో సంబంధం లేకుండా కూడా తరచి చూసి అర్థం చేసుకోవలసి విషయాలివి. ఎందుకంటే అవి వౌలికంగా మానవ సమాజానికి సంబంధించినవి. ఇదే తరహా పరిస్థితులు, ప్రశ్నలు ఏ అంశానికి సంబంధించి అయినా ఉండవచ్చు. దానినట్లుంచితే, పైన పేర్కొన్న తరహా ప్రశ్నలపై భారతదేశపు కమ్యూనిస్టులు ఏమి చర్చ చేసారో మనకు తెలియదు. మనం విన్నంతవరకు వారు ‘‘దేవుడు లేడు, అది స్వప్రయోజనపరులు సృష్టించిన భావన, మతం మత్తుమందు’’ వంటివి చెబుతుంటారు. ఇట్లా చెప్పడంలో నిజం లేదని ఇక్కడ ఖండించడం లేదు. అది ఈ చర్చ పరిధిలో రాదు. చర్చిస్తున్నది ఈ థియరీ చెబుతున్న వారికి గల నిజమైన అవగాహన ఏమిటి? అంతకన్న ముఖ్యంగా వారి ఆచరణ మెథడాలజీ ఏమిటి? అన్నంత వరకే.
థియరీ ఏమి చెప్పినా అంతిమంగా దానిని ఆచరణలో పరీక్షించవలసి ఉంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు. అనుభవాలనుంచి థియరీలు వస్తాయి. అవి తిరిగి ఆచరణలో పరీక్షకు గురవుతాయి. పరీక్షల ఫలితాలు థియరీలకు తిరిగి మెరుగులు దిద్దుతాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఇంతవరకు బాగానే ఉన్నది. కాని భారతదేశపు కమ్యూనిస్టులు దేవుడు, మతం గురించి తమ థియరీ ఏమిటో ఒకసారి ప్రకటించడం చేసిన తర్వాత, దానిని ఇటువంటి ఆచరణాత్మక ప్రక్రియకు గురిచేసారా? చేసి ఉంటే వారి అనుభవాలేంటి? చేసి ఉన్నట్లయితే ఆచరణలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అయోమయాలు, వైరుధ్యాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి? థియరీ సరైనదేనని నమ్మితే తప్పేమీ లేదు. కాని అట్లా నమ్ముతూనే దానిని వాస్తవాలకు సమన్వయ పరుస్తూ, అయోమయాలు లేని విధంగా ముందుకు వెళ్లగల పద్ధతులను ఎందుకు కనుగొనలేకపోతున్నారు? దానికదే ఒక వైఫల్యం కాగా, చివరకు వ్యక్తిగత స్థాయి వైరుథ్యాలు కూడా ఎందువల్ల చోటు చేసుకుంటున్నాయి? నాయకుల పరిస్థితి ఇది అయినపుడు కార్యకర్తలు, సాధారణ ప్రజల చైతన్యాలు ఎప్పటికైనా జరిగేనా?
నిజానికిది తమ్మినేనికో, భారతదేశానికో పరిమితమైన అస్పష్టత కాదు. దశాబ్దాలపాటు కమ్యూనిస్టులు పాలించిన వ్యవస్థలలో ఏమి జరుగుతున్నదో కనిపిస్తున్నదే. బహుశా ఒకటి కావచ్చు. ఒకవైపు దేవుడు, మరొకవైపు నిత్యజీవిత సమస్యలు అనేవాటికి మధ్య ఉండే ‘సంస్కృతి’ అనే దానిని సరైన రీతిలో అర్థం చేసుకోవడం కమ్యూనిస్టులు చేస్తున్నట్టు లేరు. నిత్యజీవిత సమస్యలు అన్నవి ఆర్థిక-రాజకీయ-సామాజిక వ్యవస్థతో, ఆ వ్యవస్థను నియంత్రించేవారి ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. దేవుడనే భావన మనిషికి స్థూలమైన రీతిలో అనాది కాలంనుంచి ఉండగా ఆ భావనను స్వప్రయోజనపరులు తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకొని సామాన్యులను అందుకు ఉపయోగించుకుంటున్నారని అనుకుందాము. అయితే అదేసమయంలో ఇటు దైవత్వ భావనతోను, అటు నిత్యజీవిత సమస్యలతో ప్రత్యక్షమైన నిరంతర సంబంధం లేకుండా మధ్యలో సంస్కృతి అనే అంశం ఒకటి ఉంటుంది. దానికి అన్నింటితో సంబంధం ఉంటుంది గాని దేనికీ పరిమితం కాదు. నిరాకార నిర్గుణమవుతూనే అన్ని ఆకారాలు అన్ని గుణాలు ఉంటాయి. ఇది దేనికైనా లొంగవచ్చు, దేనికీ లొంగకపోవచ్చు. ఇటువంటి సంస్కృతి అనే పదార్థంపై అవగాహన, కనీసం తమకు అవసరమైన మేర నియంత్రణ ఉంటే తప్ప ఏది చేయటమైనా వీలుపడదు. భారతదేశంలో క్రీస్తుపూర్వం నుండి గల చరిత్రను గమనిస్తే, ఇటువంటి అవగాహనను, నియంత్రణను దైవత్వ భావనాపరులు తగినంత సాధించగా, కమ్యూనిస్టులు విఫలమైనట్టు తెలుస్తున్నది.
సంస్కృతి ప్రాముఖ్యత వారికి తెలియదని ఎవరూ అనలేరు. దాని జోలికి వారు వెళ్లలేదని కూడ కాదు. వాస్తవానికి తమ సిద్ధాంతాలను వ్యాపింపజేసేందుకు వారు సంస్కృతిని ఉపయోగించుకోవడం ఎప్పుడూ ఉన్నదే. కానీ అదంతా తమ పార్శ్వం నుంచి చేసిన ప్రయత్నంకాగా, యథాతథంగా ప్రజల సాంస్కృతిక జీవనంపై, వ్యవహరణపై అత్యధిక భాగం, దైవ భావనాపరులైన తమ ప్రత్యర్థులకు గల నియంత్రణ వామపక్షీయులకు లేదు. అట్లా లేకపోవడం ఒక సమస్య కాగా అందుగురించి తగిన అవగాహన అయినా లేకపోవడం అంతకు మించిన సమస్య. అవగాహనలో కొరత ఉన్నప్పుడు సహజంగానే వ్యవహరణలోనూ లోపం ఉంటుంది. అయితే, దుర్గాదేవి రూపంలో బెంగాలీలో సంస్కృతిలో పూర్తిగా భాగమైపోయిన బెంగాల్ కమ్యూనిస్టుల అనుభవాలేమిటో మనకు తెలియదు. అవి భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయనిపిస్తుంది.
కమ్యూనిస్టులలో ఈ లోపం వర్తమానానికి పరిమితమైంది కాదు. భారతదేశపు గత చరిత్రను, ఆ సంస్కృతిని అవగాహన చేసుకోవడంలోనూ ఇవే లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు చార్వాక, బౌద్ధ సంప్రదాయాలను ఆమోదించి ప్రచారం చేస్తారు. కాని వేదాలు, ఆరణ్యకాలు మొదలుకొని పురాణాల వరకు, రామాయణం, భారతాల వరకు, భక్తి సంప్రదాయాలు, తాంత్రికతల దాకా గల అనేకానేకాల్ని పుక్కిటి పురాణాలంటూ కొట్టివేస్తారు. అవన్నీ దైవత్వ భావనతో, హిందూమతంతో మాత్రమే ముడివడినవన్నది వారి అపోహ. దానితో అందులోని సమాజాన్ని, చరిత్రను, శతాబ్దాల పాటు సాగిన ఆర్థిక-రాజకీయ- సామాజిక పరిణామాలను నిరాకరించి, ఆ ‘చోటు’కు అవతలి వర్గానికి వదలివేస్తున్నారు. ఆ ‘చోటు’కు తాము దూరమవుతున్నారు. ఆవిధంగా సంస్కృతికి దూరం కావడమంటే ప్రజలకు దూరం కావడమే. అదే వర్తమాన స్థితికి సంబంధించి కూడా జరుగుతున్నది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)