మెయన్ ఫీచర్

నిరాడంబర రాజధానికి దారేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన నిరాడంబరత్వాన్ని ఆవిష్కరిచారు. చలన చిత్ర నటుడు పవన్ కల్యాణ్ కూడా తన నిరాడంబరత్వాన్ని అనావరణం కావించడం తెలుగునేలపై సంభవించిన సమాంతర పరిణామం. అంతరం లేకపోలేదు. సుదీర్ఘరాజకీయ ప్రస్థాన స్మృతులు చంద్రబాబు భావోద్వేగానికి గురిచేశాయి. చేశాయని ప్రచారమైంది. ఇటీవలికాలంలో చంద్రబాబు నాయుడు తరచు భావోద్వేగానికి గురి అవుతున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అద్వితీయ స్థానంలో నిలబెట్టడానికై నడుం బిగించి సింగపూర్‌కు చైనాకు వెళ్లి, ఇతరేతర దేశాలకు వెళ్లి పరిశోధనలు చేసి వస్తున్న ముఖ్యమంత్రి ఆయా దేశాల అనుభవాల మూటలను మోసుకొని వస్తున్నారు. ఈ అనుభవాలు, రాజధాని నిర్మాణపు అనుభూతులు కలసికట్టుగా వారిని భావోద్వేగాలకు గురి చేస్తుండవచ్చు. చంద్రబాబు రాజకీయ జీవన ప్రస్థానం మొత్తం భావోద్వేగాల భరితమని నిర్ధారించిన నిపుణులు కూడ లేకపోలేదు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం అతిపిన్నవయసులో మంత్రికావడం, తెలుగుదేశంలోకి చేరిపోవడం, ఒక ముఖ్యమంత్రిని పదవినుంచి తొలగించి తాను ముఖ్యమంత్రి కావడం, ప్రధానమంత్రి పదవిని స్వీకరించరాదని ప్రతిజ్ఞచేయడం-వంటివి ఆయన నిరాడంబర జీవన గమనంలో అతికొద్ది భావోద్వేగ ఘట్టాలు కావచ్చు. అందువల్ల చంద్రబాబు ఆవిష్కరించిన నిరాడంబరత్వానికి భావోద్వేగ పరంపర మాత్రమే ప్రాతిపదిక. ఆయన నిరాడంబర జీవన పద్ధతిని అందరూ అంగీకరించి తీరాలి, ఆత్మకథలో ఎవ్వరూ అబద్ధం చెప్పరు...సమాంతరంగా పవన్ కల్యాణ్ అనే చిత్ర ప్రముఖుడు చిత్ర విచిత్రంగా తన ఆత్మకథను కూడ అనావరణం చేసేశాడు. ఆయనది కూడ గొప్ప నిరాడంబరత్వం. ఎటొచ్చీ ఆయనకు రాజకీయ జీవితపు భావోద్వేగాలు లేవు. ఉండడానికి వీలులేదు. ఎందుకంటె అతగాడు ఇంకా రాజకీయా లలోకి రాలేదు. మరి ఆయన నడిపిస్తున్న ఈ మొత్తం వ్యవహారం ఏమిటి? దానిపేరే ‘‘నిరాడంబరత్వం!’’ అందువల్ల ఆయనకు రాజకీయ భావోద్వేగాలు లేవు. ఉన్నవి చిత్ర జగతికి సంబంధించిన భావోద్వేగ అభినయ విన్యాసాలు మాత్రమే..
అందువల్ల పవన్‌కల్యాణ్ నిరాడంబరత్వపు ఆవిష్కరణకు, ‘అభినయ ఆవేశం’ మాత్రమే ప్రాతిపదిక. చంద్రబాబు నిరాడంబరత్వానికి, పవన్ కల్యాణ్ నిరాడంబరత్వానికి ఇది ప్రధానమైన భేదం. పవన్ కల్యాణ్ సినిమాలను వదలివేస్తే అ మరుసటిరోజునుంచి ఆయనను జనమే పోషించాలట. అంతటి నిరుపేదతనం ఆయనది...అందువల్ల సినిమాలలో నటించడం మానుకోమంటారా? అని ఆయన అభిమానులను ప్రశ్నించిన ఘట్టం ఈ ఆవేశానికి పరాకాష్ఠ, ‘‘వదిలేయమంటారా..?’’ అని అభిమానులను మామూలుగా ప్రశ్నించి ఉండవచ్చు... మైకులు ఎలాగూ ఉన్నా యి కాబట్టి అందరికీ వినబడితీరుతుంది. కానీ పవన్ కల్యాణ్ ఆకాశానికి చిల్లులు పడే స్థాయిలో ఆవేశంగా అరిచాడు. ‘‘వద్దిద్ది లేయ్యయ్య మంఠారా’’ అని ఆయన అరవడం అభిమానులు ‘‘వద్దువద్దు’’ అని సమాధానం చెప్పడం ప్రజాభిప్రాయ సేకరణ ప్రహసనం. ఆ ఒక్క సభలో ఉన్నవారే సమస్త ప్రజానీకం..అందువల్ల ఆయన చలనచిత్రాలలో నటించడం కొనసాగిస్తాడట. అక్కడున్న జనం ‘‘మానెయ్’’ అని అరచి ఉంటే ఆయన సినిమాలను మానేసి ఉండేవాడు కాబోలు. కాకినాడలో సభ జరిగింది. పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం కొనసాగించాలా? వద్దా? అన్న ‘మహా విషయం’ నిర్ధారించడానికికన్నది అభిమానులకు అర్థమైన సంగతి. సభ వెనకాల ఉండిన కొందరు ‘వదిలేయ్’ అని కూడా అరచినట్టు గిట్టనివాళ్లు ప్రచారం చేశారు. సినిమాలను వదిలివేసిన వెంటనే పవన్ కల్యాణ్ అభిమానులు వంతులు వేసుకొని పూటకొకరి ఇం ట్లో భోజనం పెట్టాలి. ఎందుకంటె సినిమాలలో నటించడం మానేసిన తక్షణం ఆయన నిరుపేద! ఈ సంగతి స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. ఇన్ని రోజులూ ఆయన సినిమాలలో నటించి సంపాదించినదంతా భోజనానికి సరిపోయిందన్నమాట! ఏమీ మిగలలేదు. లేదా భోజనానికి సరిపోయినంత పారితోషికం మాత్రమే తీసుకొని ఆయన ఇన్ని రోజులూ నటించేశాడు. అదీ నిరాడంబరత్వం. అది నిజమైతే సర్వోత్కృష్ట, ఆర్థిక నీతిని పవన్ కల్యాణ్ నిజజీవితంలో అమలు పరిచాడన్నమాట..‘‘యావత్ బ్రియేత జఠరం తావత్ స్వత్వం హిదేహినామ్, అధికం యోభిమనే్యత సస్తేనో దండీమర్హతి..’’ అని మనువు చెప్పిన మాట. ఈ ఉదాత్తమైన ఆర్థిక నీతి. ‘‘ఆకలి తీర్చుకోవడానికి అవసరమైనంత మాత్రమే సంపాదించాలి. ఎక్కువ సంపాదించి నిలువచేసేవాడు దొంగ, వాడు శిక్షార్హుడు..’’ అందువల్ల సినిమాలలో నటించడం మానిన తక్షణం నిరుపేదగా మారిపోనున్న పవన్ కల్యాణ్ ఈ పరమోన్నత సామాజిక న్యాయసూత్రాన్ని పాటిస్తున్నాడన్నమాట! లేకపోతే ‘‘అక్కా అన్నంపెట్టు’’ అని ‘‘నటుడు కాని’’ పవన్ కల్యాణ్ ఇంటింటికి తిరగవలసిన అవసరం ఏముంది?? ఇదీ నిర్బంధ నిరాడంబరత్వం..
సంపన్నులు నిరాడంబరంగా ఉండడం గొప్ప. అందువల్ల చంద్రబాబునాయుడి నిరాడంబరత్వం స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది. ఆయన తాను చేసే సాదాసీదా భోజనం గురించి ఇతరేతర నిరాడంబరాల గురించి చెప్పుకున్నారు. ఖద్దరు కట్టుకుంటున్నారా లేక ఖద్దరు ధరించడం ఖరీదైన వ్యవహారం కాబట్టి మిల్లు బట్టలనే ధరిస్తున్నారా? వివరాలు మాత్రం చంద్రబాబు ఆవిష్కరించినట్టు ప్రచారం కాలేదు. ఏమయినప్పటికీ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, పవన్‌కల్యాణ్ వలె నిరుపేదలు కాజాలరు. నిరుపేదలు నిర్బంధ నిరాడంబరత్వాన్ని పాటిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్న స్వచ్ఛంద నిరాడంబరత దేశంలోని కనీసం రాష్ట్రంలోని సంపన్నులకు, కనీసం సంపన్న కార్యకర్తలకు ఆదర్శం కావచ్చు. ఆయన స్ఫూర్తితో కొన్ని లక్షల మంది సంపన్నులు నిరాడంబరంగా జీవించినట్టయితే దానివల్ల రెండు రకాల లాభాలు చేకూరవచ్చు. ‘‘యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేత రోజనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే..’’ అని మహాభారతకారుడైన కృష్ణద్వైపాయన వ్యాసుడు వ్రాసి ఉన్నాడు. ‘‘శ్రేష్ఠుడు ఆచరించిన దానిని ఇతరులు ఆచరిస్తారు, అతడు పాటించిన ప్రమాణాన్ని ఇతరులు అనుసరిస్తారు.’’ కృష్ణుడు, అర్జునుడు వంటి శ్రేష్ఠులు ఈ సూత్రానికి సజీవ రూపాలుగా నడయాడడం చరిత్ర. అది ద్వాపరయుగం నాటి చరిత్ర. ఇప్పుడు ద్వాపరయుగం తర్వాతిదైన కలియుగంలో 5118వ సంవత్సరం నడుస్తున్నది. అందువల్ల కలియుగంలో ఇది యాబయి రెండవ శతాబ్ది. కలియుగం పదహారవ శతాబ్దిలో వౌర్య చంద్రగుప్తుడు భారతదేశాన్ని ‘గిరివ్రజం’ రాజధానిగా పాలించాడు. ‘గిరివ్రజం’, ‘పాటలీపుత్రం’ ప్రస్తుతం బిహార్‌లో ఉన్నాయి. కలియుగం నాలుగవ దశాబ్ది వరకు గిరివ్రజం మొత్తం భారతదేశానికి రాజధాని. ఇరవై ఎనిమిదవ శతాబ్దిలో అంటే క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో, సమ్రాట్టులయిన గుప్తు లు రాజధానిని గిరివ్రజం నుంచి పాటలీపుత్రానికి మార్చారు. ఈ గుప్తవంశపు చంద్రగుప్తుడు, అతని కుమారుడు సముద్రగుప్తుని కాలంలోనే అలెగ్జాండర్ అనే గ్రీకుదేశపు బీభత్సకారుడు మనదేశంలోకి చొరబడినాడు. గుప్తులకు భయపడి వెనుదిరిగి పారిపోయాడు. కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో ఉజ్జయిని రాజధానిగా ప్రమర వంశపు విక్రముడు మొత్తం భారతదేశాన్ని పాలించాడు. కలియుగం, ముప్పయి ఎనిమిదవ శతాబ్ది-క్రీస్తుశకం ఏడవ శతాబ్ది-లో సమీకృత భారత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యేవరకు ఉజ్జయిని భారతదేశానికి రాజధాని. ఉజ్జయిని ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఉన్నది. ‘‘రాతియుగం’’, ‘‘కోతియుగం’’ వంటి విచిత్ర యుగాలను ‘‘కనిపెట్టిన’’ పాశ్చాత్యుల భావ వారసులకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వంటి జాతీయ కాలగణనం నచ్చకపోవచ్చుగాక. గుడ్లగూబలకు కనబడనంత మాత్రాన సూర్యుడు లేనట్టు కాదు...
కలియుగం పదహారవ శతాబ్ది, అంటే క్రీస్తునకు పూర్వం పదహారవ శతాబ్ది నాటి వౌర్య చంద్రగుప్తునికి గురువైన చాణక్యుడు గొప్ప రాజ్యాంగ విజ్ఞానవేత్త. నందవంశం వారి దుష్టపాలనను తొలగించి వౌర్య చంద్రగుప్తుని సమ్రాట్టుగా ప్రతిష్ఠించిన మహా వ్యూహ నిర్మాణవేత్త చాణక్యుడు. అలా వినూతన సామ్రాజ్యాన్ని నిర్మించినప్పటికీ అధికార పదవులు ఆశించని ఆదర్శమానవుడు చాణక్యుడు. తాను మహామంత్రిగా ఉండక రాక్షస బిరుదుగల కాత్యాయణున్ని ప్రధానమంత్రిగా నియమించి తను ఋషివాటికలకు వెళ్లిన నిరాడంబరుడు చాణక్యుడు. ఆయన విష్ణుగుప్తుడు, తల్లి ‘కుటల’, అందువల్ల ఆయన ‘కౌటిల్యుడు’, తండ్రి చణకుడు అదువల్ల ఆయన చాణక్యుడు..కానీ వౌర్యు డు సమ్రాట్టయిన కొత్తలో కొంతకాలం సర్వసామ్రాజ్య వ్యవహారాలను చాణక్యుడే నిర్వహించడం చరిత్ర... ఆ సమయంలో ఆచార్య చాణక్యుని దర్శించడానికి సమాచారం నివేదించడానికి, ఆజ్ఞలను స్వీకరించడానికి అనేకానేక ప్రముఖులు, మంత్రులు, సేనానులు, సామంతరాజులు, రాజప్రతినిధులు, అధికారులు ప్రతిరోజూ ఆయన నివాసం ముందు బారులు తీరిన దృశ్యాన్ని చరిత్ర తిలకించింది...రథాలు, గుర్రాలు, శకటాలు, వృషభాలు, అదిలింపులు, హెచ్చరికలు, తొక్కిసలాటలు..చాణక్యుని నివాసం ముందు సందడే సందడి. చాణక్యుని అధికార నివా సం మాత్రం ‘తృణ కుటీరం’-పూరి గుడిసె!
అదీ నిరాడంబరత్వం...అభినయం కా దు.. ‘‘నిరీహణమీశః తృణమివ తిరస్కార విష యః’’ అన్నది చాణక్యుని జీవన రీతి. ‘‘కోరిక లేని వానికి సామ్రాజ్య అధికారం గడ్డిపోచవలె తిరస్కరించదగినది!’’ ఇప్పు డు చంద్రబాబు మళ్లీ నిరాడంబరం గురిం చి తపిస్తున్నారు. ఈ వ్యక్తిగత నిరాడంబరత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడ వర్తింపచేస్తే, హతమై పోనున్న ఆకుపచ్చని పొలాలు మళ్లీ కృతమవుతాయి. గిరివ్రజం, పాటలీపుత్రం, ఉజ్జయిని, హంపీ, ఓరుగల్లు-వీటిని భారతీయులు నిర్మించారు... సింగపూర్ వారు కాదు, టింబక్టూవారు కాదు.

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352