సబ్ ఫీచర్

వెట్టిచాకిరికి అంతం ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా సామాజిక రంగంలో మాత్రం ఇంకా వెనుకబడే వుంది. మహిళలపై అత్యాచారాలు, లింగ వివక్ష, వ్యభిచారం, వరకట్నం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. అనాదిగా ఆర్థిక అసమానతలకు నిలయమైన భారత్‌లో వెట్టిచాకిరి జాడలు పూర్తిగా తొలగిపోలేదు. వెట్టిచాకిరికి గురైనవారు శారీరకంగా, మానసికంగా హింసకు గురవుతున్నారు. వెట్టిచాకిరి ఒక ఊబి లాంటిది. దీనినుండి బాధితులు బయటపడటం చాలాకష్టం.
ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని పల్లెసీమల్లో పేదలు రుణం తీసుకుని చెల్లించని పక్షంలో వెట్టిచాకిరి చేయక తప్పడం లేదు. ఈ రుణభారం ఒక తరం నుండి తరువాతి తరానికి వెళుతున్నది. కొన్ని సందర్భాలలో వెట్టిచాకిరి కాలపరిమితి తక్కువే అయితే కార్మికుడు పలువురు యజమానుల దగ్గర పనిచేయాలి. అంటే, ఈ జన్మలో వెట్టిచాకిరి నుండి బయటపడే అవకాశం లేదన్నమాట. రుణాల కారణంగా వెట్టిచాకిరి కాస్త తగ్గినా ఇతర పద్ధతుల్లో వెట్టిచాకిరి కొనసాగుతూనే వుంది. మొదట్లో వ్యవసాయానికి మాత్రమే పరిమితమైన వెట్టిచాకిరి ఇప్పుడు అనేక రంగాలకు (చిన్న పరిశ్రమలు, ఇటుకల తయారీ, అగరబత్తి తయారీ, క్వారీలు, గనులు మొదలైనలవి) విస్తరించింది. మన దేశంలో వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976లో అమలులోకి వచ్చింది.
మరోవైపు అనేక బీద, మధ్య తరగతి దేశాల్లో వెట్టిచాకిరి చేస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే వుంది. ఇది 4.58 కోట్లుగా వుంది. మన దేశంలో 1.38కోట్ల మంది ఇప్పటికీ నిర్బంధ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉండటం గమనార్హం. ఈ వివరాలు ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేసే ‘వాక్ ఫ్రీ’ అనే మానవ హక్కుల సంస్థ కొద్దిరోజుల క్రితం తన తాజా నివేదికలో తెలియజేసింది. వెట్టిచాకిరిని గుర్తించి, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెట్టిచాకిరి చేసేవారు తాము ఇష్టపూర్వకంగానే పనులు చేస్తున్నామని చెబుతుంటారే తప్ప యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసించరు. వాస్తవానికి యజమానులే అలా చెప్పమని తమ వద్ద పనిచేసే కూలీలపై ఒత్తిడి తెస్తారు. శ్రామికులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలసపోవడం వల్ల కూడా పరిస్థితి క్లిష్టమవుతున్నది. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం వెట్టిచాకిరి నిర్మూలన విషయంలో శ్రద్ధ చూపడం లేదు. చట్టం ప్రకారం జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలలో వెట్టిచాకిరి నివారణకు నిఘా సంఘాలను ఏర్పరచాలి. అధికారులు, అనధికారులతో కూడిన విజిలెన్స్ కమిటీలను ఏర్పరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపడం లేదు. పరిపాలనా సిబ్బందికి వెట్టిచాకిరి నిర్మూలన చట్టం గురించి సరైన అవగాహన కల్పించేందుకు వివిధ స్థాయిలలో శిక్షణ తరగతులు నిర్వహించాలి. విజిలెన్స్ కమిటీల పనితీరును మెరుగుపరచాలి. వెట్టిచాకిరి నుండి విముక్తి పొందినవారికి సరైన జీవనోపాధి కల్పించాలి. బాధితులందరూ ఆర్థిక సాధికారత సాధించేందుకు స్వయం సహాయక సంఘాలలో చేరాలి. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోవాలి.

- ఇమ్మానేని సత్యసుందరం