సబ్ ఫీచర్

ఆర్థిక సంక్షోభం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టిన- చందాన దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి సరికొత్త ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. పెద్దనోట్ల రద్దుతో సంపన్న వర్గాల సంగతేమో గానీ, నిరుపేదలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నిత్యావసర సరకులు, అత్యవసర మందులు, ఆస్పత్రి ఖర్చులకు చేతిలో నగదు లేక పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 500, 1000 రూపాయలను మార్చుకునే గడువు ముగిసిందని కేంద్రం ప్రకటించి చివరికి చేతులెత్తేసింది. నగదు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద గంటలకొద్దీ పడిగాపులు పడినా ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది. తమ డబ్బును తాము తీసుకునేందుకు వీలులేనందున ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఎవరి చేతుల్లోనూ నగదు లేనందున చిరు వ్యాపారులు, దినసరి కూలీలు ఉపాధికి దూరమయ్యారు. అన్నిరకాల వ్యాపారాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితులపై సుప్రీం కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘నగదు కోసం భారీ క్యూలు కొనసాగడం తీవ్రమైన అంశం.. సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఇదే పరిస్థితి కొనసాగితే అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది..’- అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో కోర్టు తలుపులను మూసివేయలేమని, కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రజలకు ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకునే ఉపశమన చర్యలను తెలియజేయాలని కోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది.
ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నపుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న విషయమై పాలకులు లోతుగా అంచనా వేయాలి. ఇలాంటి అంచనాలేవీ లేనందునే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దనోట్లను రద్దు చేస్తే అవినీతి, నల్లధనం అంతరించిపోతాయని చెప్పడమే తప్ప సామాన్యుల అవస్థల గురించి పాలకులకు పట్టడం లేదు. ఆర్థిక విషయాలపై అనుభవం లేని ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేసేముందు నిపుణుల సలహాలను తీసుకుని ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదు. అవగాహన లేని నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు కష్టాలు తప్పవని గతంలోనూ పలుసార్లు రుజువైంది. పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా చేయని పనిని ప్రస్తుత ప్రధాని మోదీ చేసి ‘21వ శతాబ్దపు తుగ్లక్’గా విమర్శలందుకుంటున్నారు.
పెద్దనోట్లను రద్దు చేశామని చెబుతూనే ఏకంగా రెండువేల రూపాయలను విడుదల చేయడం మరో విడ్డూరం. రద్దయిన 500, 1000 నోట్లను మార్చుకునేందుకే జనం తిప్పలు పడుతుండగా, మరోవైపు అపుడే నకిలీ 2వేల రూపాయల నోట్లు దర్శనమిస్తున్నాయి. విపక్షాలతో గానీ, ఆర్థిక నిపుణులతో గానీ ఎలాంటి చర్చలు జరపకుండానే రాత్రికి రాత్రి ఆకస్మికంగా మోదీ ‘నల్లధనంపై మెరుపుదాడి’ ఎందుకు చేసినట్టు?
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నల్లధనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని బిజెపి ప్రచార రథసారథిగా మోదీ గంభీర వాగ్దానాలు చేశారు. మన దేశంలోని బడాబాబులు విదేశాల్లో దాచుకున్న సుమారు 80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తానని, ప్రతి పేదవాడి ఖాతాలో 15వేలు జమ చేయిస్తానని ఆయన ఎన్నికల సభల్లో హామీలు గుప్పించారు. కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయినా ప్రధాని మోదీ ఆ హామీలను అమలు చేయలేకపోయారు. నల్లధనాన్ని నిర్మూలించడం అసాధ్యమని ఆయన గ్రహించారు. త్వరలో అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో మోదీ ఆకస్మికంగా పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అధిక ధరలు, అవినీతి, ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం.. ఇలా అన్ని సమస్యలకూ నల్లధనమే కారణమని, దీన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్లు మోదీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పెద్దనోట్ల రద్దు వ్యవహారం బెడిసికొట్టి, ప్రతిపక్షాలకు సరైన ఆయుధాన్ని స్వయంగా మోదీయే ఇచ్చారన్న వ్యాఖ్యానాలు లేకపోలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయకపోవడం వల్లే ‘నోట్లరద్దు’తో మోదీ సర్కారు చేతులు కాల్చుకున్నట్టయింది.
పెద్దనోట్లను రద్దు చేయడం దేశంలో ఇదే తొలిసారి కాదు. 1946, 1978లో పెద్దనోట్లను రద్దు చేశారు. అయినా అప్పట్లో ఎలాంటి సత్ఫలితాలు రాలేదు. గతంలో చెలామణిలో ఉన్న నగదులో పెద్దనోట్లు కేవలం రెండు శాతం మాత్రమే. ఇపుడు చెలామణిలో ఉన్న కరెన్సీలో పెద్దనోట్ల వాటా 86 శాతం. ఇంతటి భారీ స్థాయిలో కరెన్సీని రద్దు చేయడం వల్ల జనం అవస్థల పాలవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఊహించని సంక్షోభం నెలకొంటోంది. మోదీ నిర్ణయం వల్ల రాబోయే ఎన్నికల్లో బిజెపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విపక్షాలు సంబరపడుతున్నాయి.
దేశంలో ప్రజలందరికీ బ్యాంకుసేవలు అందుబాటులో లేవు. గ్రామసీమల్లో చాలామందికి బ్యాంకుఖాతాలు లేవు. రద్దయిన నోట్లను వీరు ఎలా మార్చుకుంటారు? తగినంత నగదు చెలామణిలో లేనపుడు సరకుల ధరలు పడిపోతాయి. ఉత్పత్తి మందగిస్తుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుముఖం పడుతుంది. మొత్తంగా దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడే పరిస్థితి అనివార్యమవుతుంది. నోట్లరద్దుపై ఓ వైపు జనం ఆగ్రహంతో రగిలిపోతుండగా, మరోవైపు విజయ్ మాల్యా లాంటి బడా పారిశ్రామిక వేత్తలు ఎగవేసిన వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరగడం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టయింది. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన బడాబాబులను వదిలేసి తమపై ప్రభుత్వం ఎందుకు పగబట్టిందని సామాన్యులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాస్తున్న పాలకులు పెద్దనోట్ల రద్దుతో సాధించేది ఏమిటన్నది అర్థం కాని ప్రశ్న. బడాబాబులు చెల్లించాల్సిన బ్యాంకు రుణాలను, ఇతర పన్నులను మాఫీ చేయడం పరిపాటిగా మారింది. లక్షల కోట్ల రూపాయల్లో మొండి బకాయిలను మాఫీ చేస్తున్నందున ప్రభుత్వరంగ బ్యాంకులు దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఏ వర్గాల కోసం బ్యాంకులను జాతీయం చేశారో గమనించకుండా పాలకులు వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలతో దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని ప్రచారం చేసి, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి కూడా అదే మార్గంలో పయనిస్తోంది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ నియంత్రణకు నిర్థిష్టమైన చర్యలు లేవు. రూపాయి విలువ మరింతగా క్షీణిస్తోంది. అన్ని సమస్యలకూ పెద్దనోట్ల రద్దు ఒక్కటే పరిష్కారం అన్నట్టుగా ప్రస్తుత పాలకులు చెబుతున్నారు. ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థ ఏర్పడాలన్న జనం ఆకాంక్షలు ఫలించేదెపుడో..?

- షేక్ కరిముల్లా