సబ్ ఫీచర్

నగదు రహితం.. గందరగోళమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక సంస్కరణలు, ద్రవ్యమార్పిడి వి ధానంలో మార్పులూ అంత సులభమైనవి కావు. వీటిని అమలు జరపడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే, దేశంలోని ప్రతి పౌరుడి దైనందిన పనులూ డ బ్బుతో ముడిపడి వుంటాయి. పౌరుడు చిన్న స్థాయివాడైనా, పెద్దవాడైనా ప్రతి వ్యక్తీ వారి వారి స్థాయిల్లో నగదు లావాదేవీలు జరపక తప్పదు. ఈ దేశం చాలా విస్తృతమైనది. 125 కోట్ల మంది జనాభా కలిగినది. ఇంతమందిలో ప్రతి ఒక్క వ్యక్తి అవసరాలూ నగదుతోనే తీరవలసి వుంటుంది. అటువంటి దేశంలో ఒక్కసారిగా నగదు మార్పిడిని నిలిపివేస్తే ప్రజల జీవన పరిస్థితులు అస్తవ్యస్తమైపోతాయి, అవసరాలు తీరక గందరగోళం మొదలవుతుంది. ఇటీవల అకస్మాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దువల్ల అదే జరిగింది. నల్లధనం కలిగినవారి పరిస్థితెలా వున్నా, సాధారణ ప్రజలు దిక్కుతోచనివారయ్యారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును జీవనావసరాలకు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది వారికి. ఈ చర్యకు ముందు ఆర్థిక నిపుణులతో అధ్యయనం చేయించి, వారితో చర్చించి తగిన ఏర్పాట్లు చేసిన తర్వాతనే ప్రకటించవలసింది. ఇలా ముందస్తు సాధన చేస్తే నల్లకుబేరులకు ముందే సమాచారం తెలిసిపోవచ్చని కొందరు అంటున్నారు. ఇపుడింత అకస్మాత్తుగా ప్రకటించినప్పటికీ, ముందుగానే కొందరికీ ‘లీకు’ అవ్వలేదా? అని మేధావులంటున్నారు. ‘లీకు’ అయిన మాట నిజమేనని వీలైనంతమేరకు నల్లధనాన్ని కొత్త నోట్లలోకి మార్చేసుకున్నమాట నిజమేనని వార్తలు చెబుతున్నాయి. చిత్తశుద్ధి వుంటే ముందస్తు కసరత్తు, ఏర్పాట్లూ చేసినా కూడా లీకవ్వదు.
ప్రజలు ఎన్నిరకాలుగా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వంలోని నాయకులకూ, అధికారులకూ తెలుసు. తొందరపాటు నిర్ణయం జరిగింది. పొరపాటు జరిగిందని అంగీకరించి, విజ్ఞతతో కూడిన నష్టనివారణ చర్యలు వెంటనే మొదలుపెట్టడం తప్పా? అలా మొదలుపెట్టారా? ప్రభుత్వ నేతలూ, ప్రతిపక్ష నేతలూ పంతాలు, భేషజాలు మాని వెంటనే నివారణ చర్యలు మొదమలుపెట్టాలి కదా! ఇపుడు అత్యంత ప్రయోజనకరమైన చర్య ఏమిటంటే ‘నగదు ద్రవ్యత’ను పెంచడమే! అంటే 500 నుండి దిగువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రింటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటమే! దీనికి బదులు, రద్దు ప్రకటనకు రెండు, మూడు నెలల ముందునుండే 2,000 నోట్లను ప్రింటు చేయడం మొదలెట్టారు. ఇదెవరి సలహాయో? ఎవరి ప్రయోజనం కోసం చేశారో వారికే తెలియాలి. ఇందువలన నగదు ద్రవ్యత గడ్డకట్టుకుపోయింది. అంతకుముందున్న మార్పిడి సౌలభ్యత కూడా లేకుండాపోయింది. ప్రింటు చేసిన పెద్ద నోట్లలో అధిక భాగం నల్లధనం వున్నవారికే చేరిపోయాయి. సాధారణ ప్రజలకు కూడా బ్యాంకుల్లో, ఎటిఎమ్‌లలో ఒకటో, రెండో 2వేల నోట్లిస్తున్నారు. చిన్న నోట్లు చెలామణిలో లేకుండా ఈ పెద్ద నోట్లను ప్రజలెలా మార్చుకుంటారు? 2,000 నోట్లకు బదులుగా, అప్పుడే 500, 100 నోట్లను ప్రింటు చేసి బ్యాంకులకు విడుదల చేసి వుంటే, నగదు ద్రవ్యత కొంతవరకూ పెరిగి వుండేది. ప్రజలకు కొంత ఉపశమనం కలిగి వుండేది. నల్లధనం కలిగినవారు తమ పాత నోట్లను అధికంగా మార్చుకోవడానికి వీలు కలిగేది కాదు.
ఇప్పటికి కూడా కొత్త 500, 100 నోట్లు చెలామణిలోకి వచ్చేలా రిజర్వు బ్యాంకు కాని, ప్రభుత్వం గాని ప్రయత్నం చేయలేకపోయారు. దేశంలో ‘మింటింగు’ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడమే ఇందుకు కారణం. చిన్న నోట్లను చెలామణిలోకి తీసుకురాలేక నగదు రహిత లావాదేవీలే జరగాలంటున్నారు. సెల్‌ఫోను, ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడాలు, కొనుగోలు, అమ్మకాలు జరగాలంటున్నారు. ఈ దేశంలో ఇది సాధ్యమా? ఇది సురక్షితమా? దేశంలో అత్యధికుల వద్ద సెల్‌ఫోనులున్నమాట నిజమే. కాని వాటిని సమర్థంగా వినియోగించగల వారెంతమందున్నారు? ఎవరికైనా ఫోన్ చేయడం, అవతల నుండి ఫోన్ అందుకోవడం తప్ప సెల్‌లోని ఇతర అంశాలెవరికీ తెలియవు. బాగా చదువుకున్నవారు కూడా వీటిని పూర్తిగా వినియోగించలేకపోతున్నారు. ‘‘నేను దేశ ప్రధానిగా చేశాను. కాని, సెల్‌ఫోన్‌ను వినియోగించడం సరిగా తెలియదు’’ అని దేవెగౌడ అన్నారు. రోశయ్యకి ఎవరైనా ఫోన్ చేసి ఇవ్వాలట! టెక్నాలజీ పండితుడు, ఐటిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు తనకు స్మార్ట్ఫోన్ వాడడం సరిగా తెలియదని స్వయంగా అన్నాడు. ఇవి సరదాగా చెప్పుకునే మాటలు కావు. యధార్థ పరిస్థితి అలాగే వుంది. పట్టణాల్లోని కొందరు యువకులు మాత్రమే వీటిని బాగా వాడుతున్నారు. ఈ దేశంలో నగరాలు, పట్నాలు, గ్రామాలు, కొండలమీద పల్లెలూ వున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు ‘స్వైపింగు’ యంత్రాలనూ వాడి చెల్లింపులు, నగదు అందుకోవడాలూ చేయగలరా? చేయలేకపోతే, వారి దైనందిన ఆర్థిక అవసరాలెలా తీరతాయి? పరిశ్రమ రంగం, వ్యాపార రంగాల్లోనూ జరిగే లక్షల, కోట్లాది పెద్ద లావాదేవీలిప్పటికే చెక్కుల ద్వారా జరుగుతున్నాయి. ఇందులో నగదు మార్పిడి ఎలాగూ లేదు. 3 వేల నుండి 5వేల రూపాయలవరకూ నగదుతో లావాదేవీలు జరిగినందువలన నల్లధనం పెరిగిపోదు. రాజకీయ, అధికార, ప్రజా వ్యవస్థల్లో జీర్ణించుకుపోయిన అవినీతివల్లనే నల్లధనం పెరిగిపోతున్నది. ఆ అవినీతిని పూర్తిగా తగ్గించగలిగినపుడే నల్లధనం అంతం అవుతుంది. ఇంతా జరిగాక కూడా అవినీతిని అడ్డుకోలేకపోతే మళ్లీ నల్లధనం పెరుగుతుంది.
సెల్‌ఫోను, ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాల ద్వారా నగదు రహిత చెల్లింపులు జరపడం ప్రారంభిస్తే అది ప్రమాదకరంగా మారవచ్చు. యాంత్రిక, ఎలక్ట్రానిక్ ప్రక్రియలకు ప్రతిక్రియలను టెక్నీషియన్లు తయారుచేస్తున్నారు. వీటిలో వ్యక్తుల అకౌంట్లను, వివరాలను వారు ‘హేక్’ చెయ్యవచ్చును. అలా చేసి కొన్ని అకౌంట్లల్లోని డబ్బును దొంగిలించవచ్చును. అలా జరిగితే దేశంలో ఎంతమంది ప్రజలకు తమ అకౌంట్లలోని డబ్బు ప్రక్కదారుల్లో పోతున్నదని తెలుస్తుంది? ఇప్పటికే ఇలాంటివి జరుగుతున్నవని వార్తల్లో చూస్తున్నాం. ఆమధ్యన ఇలాగ కొన్ని వేల ఎక్కౌంట్లు నెంబర్లు హేక్ చేయబడ్డాయని వార్తలు వచ్చాయి. అలాగైతే ప్రజల డబ్బుకు రక్షణ ఏది?
ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రకటించిన నోట్ల రద్దువలన ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. ప్రజలు అపహాస్యమయ్యారు. ఇప్పుడు ప్రజల్లో నూటికి 80 మందికి కూడా తెలియని నగదు రహిత ప్రక్రియను ప్రవేశపెట్టి, మళ్లీ మరింత సంక్షోభంలోకి నెట్టవద్దు. మళ్లీ అపహాస్యం కానివ్వవద్దు. 500, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ఎక్కువగా సర్క్యులేషన్‌లోకి పంపితే నగదు ద్రవ్యత పెరుగుతుంది. నగదు రహితం (క్యాష్‌లెస్) కన్నా, నగదు ద్రవ్యత (క్యాష్ లిక్విడిటీ) ప్రజలకు ప్రయోజనకరంగా వుంటుంది.

-మనె్న సత్యనారాయణ