మెయన్ ఫీచర్

సమస్యలు సృష్టిస్తున్న కుహనా మేధావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెసు నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. సోనియాగాంధీకి నమ్మినబంటు. ఇండియన్ ఫారిన్ సర్వీసులో ఎంపికైన ఈ ప్రభుద్ధుడు భారత ప్రభుత్వంలో సహా విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. 1989లో ఈయన రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడులో మయిలదురై నుంచి 1991, 1999, 2004లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 1996, 1998, 2009, 2014 ఎన్నికల్లో ఓడారు. 1978-1982 కాలంలో కరాచిలో భారత దౌత్యాధికారిగా పనిచేశారు. స్వతహాగా వామపక్ష భావాలున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన కాంగ్రెసు వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే. పండితుడైన అయ్యర్ నోటినుంచి వచ్చేవన్నీ పచ్చి అబద్ధాలు మాత్రమే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. మనిషి మాటలో కాని, బాడీ లాంగ్వేజిలో కాని ఎప్పుడూ వ్యం గ్యం, అవహేళన ధ్వనిస్తుంటుంది. 2004లో అండమాన్ వెళ్ళినపుడు అక్కడ సెల్యులర్ జైలులో శిక్షననుభవించిన దేశభక్తుడు స్వాతంత్య్ర సమర యోధుడు వీరసావర్కర్‌ను ఆయన వేర్పాటువాద నాయకుడు జిన్నాతో పోల్చాడు. అక్కడ సావర్కర్‌ను స్మరిస్తూ పద్యం రాసి వున్న ఓ ఫలకాన్ని తొలగించి మహాత్మాగాంధీ మాటలున్న ఫలకాన్నుంచమని ఆయన ఆదేశించాడు. దీనిపై పార్లమెంటులో రభస జరిగింది. మహారాష్టల్రో శివసేన ఘర్షణకు దిగింది. తన వ్యాఖ్యల ద్వారా అయోమయం, ఒక రభస సృష్టించడమంటే మణిశంకర్ అయ్యర్‌కు భలే సరదా! ఒక సందర్భంలో గోమాంసం తింటే తప్పేమిటి? అని కూడా ఆయన వ్యాఖ్యానించాడు.
ఇటీవల ఆయన పాకిస్తాన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్‌తో చర్చల పునరుద్ధరణపై మోదీ సర్కారులను దుయ్యబట్టాడు. గత సంవత్సరం ఈ దేశంలో చాయ్‌వాలా ఎప్పటికీ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన అయ్యర్ 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావడంతో బిక్కచచ్చిపోయారు. ఆయనలో అసహనం పరాకాష్టకు చేరింది. తాజాగా చర్చలు ప్రారంభించాలంటే ఏంచేయాలి అని అడిగిన పాకిస్తాన్ విలేఖరి ప్రశ్నకు మోదీ సర్కారును దించమని తమను (కాంగ్రెస్)ను అధికారంలోకి తెమ్మని ఆయన సూచన చేశారు. భారత ప్రధానిని సైతం పరాయిగడ్డపై అవమానించగల్గిన కుసంస్కారం ఆయన సొత్తు. పదేళ్ళపాటు భారత ప్రధానిగా వున్న మన్మోహన్‌సింగ్ ఎందుకు ఏనాడూ పాకిస్తాన్ సందర్శించలేదో అయ్యర్ చెప్పగలరా? పదేళ్ళపాటు ఎన్నో వేదికల మీద పాకిస్తాన్ నేతలలో చర్చలు జరిపిన మన్మోహన్‌సింగ్ పాకిస్తాన్‌కు ఏనాడూ వెళ్ళే సాహసం చేయలేదు.
యుద్ధాల్లో గెలిచినా ప్రతిసారీ చర్చల్లో ఓడిపోతున్న భారత్ విదేశాంగ విధానాన్ని ఒక సమగ్ర దృక్పధంతో సమీక్షించే ప్రయత్నంలో మోదీ సర్కారు తీవ్రవాద, వేర్పాటువాద వర్గాలతో చర్చలు జరపవద్దని, కేవలం భారత ప్రభుత్వంతోనే చర్చలుండాలని పాకిస్తాన్‌కు సూచించింది. జీన్యూస్ ప్రవక్త సుధీర్‌చౌదరి ధైర్యంగా ఈ కుహనా మేధావులను విమర్శించాడు. కాంగ్రెస్ నేత, పూర్వ విదేశ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ పాకిస్తాన్, ఇస్లామాబాద్‌లో జిన్నా ఇన్‌స్టిట్యూట్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్‌తో భారత్ చర్చలు జరపకపోవడాన్ని ఎత్తిపొడిచారు. పాకిస్తాన్ శాంతి ప్రస్తావన చేస్తోందని, తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, భారత ప్రభుత్వం అందుకు సరిగా స్పందించడంలేదని విదేశీ గడ్డమీద శత్రువుని మెచ్చుకొంటూ స్వదేశాన్ని తులనాడాడు. నరేంద్రమోదీ ఇంకా రాజనీతిజ్ఞుడు కాలేదంటూ భారత ప్రధానిని నిందించాడు. 2014లో భారత ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందుకు ఖుర్షీద్ నవాజ్ షరీఫ్‌ను ప్రస్తుతించాడు.
వందేళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా చేష్టలుడిగిన నేతలు చేసిన హైడ్రామాని తప్పుపట్టి సరిచేసే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి లేకపోయింది. విదేశం విషయంలో ‘వయం పంచాధికం శతం’ సూత్రాన్ని సైతం కాంగ్రెస్ రాజకీయాలకోసం తుంగలో తొక్కింది. పాకిస్తాన్‌కు తీవ్రవాదం విషయంలో కితాబిచ్చిన ఈ నేతలు నిజానికి శత్రువుకు బలంచేకూరుస్తున్నామన్న యింగితం కూడా మర్చిపోయారు. పాకిస్తాన్‌లో ఒక టి.వి ఛానల్ యింటర్వ్యూలో మాట్లాడుతూ ముషారఫ్ తీవ్రవాదాన్ని మేమే మొదలుపెట్టాం. పౌరులకు శిక్షణ యిచ్చి తీవ్రవాదులుగా మలిచి వారిని భారత్‌పైకి ఉసిగొల్పాం, వారంతా మా హీరోలు, కాని ప్రస్తుతం వారే మాకు శత్రువులయ్యారు, మా దేశంలో అలజడి సృష్టిస్తున్నారని’ అమాయకులను చంపుతున్నారని స్వయంగా తమ తప్పిదాన్ని వొప్పుకుంటున్న నేపధ్యం వుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం పాక్ నేతలను తారీఫ్ చేస్తూ భారతదేశాన్ని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
మరోపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్ ఐస్‌ఐస్‌నుద్దేశించి మాట్లాడుతూ ‘వారు భగవంతుడ్ని చేరాలన్న మతంలో వున్నారో లేదో కాని వారిని నేను మాత్రం నిర్దాక్షిణ్యంగా భగవంతుడి దగ్గరకు పంపిస్తాను’అని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ‘సెక్యులరిజం అంటే అందరినీ సమదృష్టితో చూడడమైనంత మాత్రాన మత దురహంకారంతో తీవ్రవాదం జడలువిప్పితే ఉపేక్షించేది లేదని’ దాన్ని సమూలంగా నిర్మూలిస్తామని నిర్ధారించారు. మొన్నటిమొన్న క్యాలిఫోర్నియా సమీపంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద జంట ఒక వికలాంగ కేంద్రంలో కాల్పులు జరిపి అమాయక ప్రాణాలు బలిగొన్న ఘటనను పరిశీలిస్తే, అనేక ముస్లిం దేశాలకు సైతం నచ్చని పాకిస్తాన్ తీవ్రవాద పంధా ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్లాం’ను యిరకాటంలో పడేసిందన్న వాస్తవం నిరూపితమవుతున్నది. కేవలం పొరుగు దేశమేకాదు, దక్షిణాసియాలోనే రాజకీయ అనిశ్చితి, వ్యవస్థాగత బలహీనతలు, తీవ్రవాదం అభివృద్ధికి ఆటంకంగా మారాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తీవ్రవాదాన్ని సరిగా నిర్వచించనందుకు అగ్ర దేశాలతోపాటు ఆయన ఐక్యరాజ్య సమితిని కూడా తప్పుపట్టారు. ఈ విషయమై ఆయన పారిస్‌లో పాకిస్తాన్ అధ్యక్షుడికి నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. ఆ తరువాతనే వారు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది.
దేశ భద్రతను పెంచేందుకు, దేశ ప్రజలలో విశ్వాసం కల్గించేందుకు ‘చేవ’గల్గిన పనులు చేయాలి. కేరళ కొచి తీరంలో భారత నావికాదళం ఈ డిసెంబరు 15న జరిపిన అద్భుత ప్రతిభాపాటవ ప్రదర్శనలో 8వేల మంది త్రివిధ దళ సైనికులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో త్రివిధ దళ సామర్థ్యం సమన్వయం చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం చేసిన సూచనమేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్‌కు స్నేహ హస్తం ఇవ్వడానికి నాడు వాజ్‌పేయి లాహోరుకు బస్సులో వెళ్ళారు. పాకిస్తాన్ అనుకూల శక్తుల చేష్టలకు ముకుతాడువేస్తూ వారితో రాజకీయంగా కూటమి ఏర్పాటుచేసి కాశ్మీరు అభివృద్ధి ఎజెండాగా, కనీస ఉమ్మడి కార్యక్రమంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. దృఢ వైఖరి మాత్రమే దుందుడుకు చర్యలను, దూకుడును ఆపగలదని, అంతమాత్రం చేత అభివృద్ధి రథం ఆగకూడదని కాశ్మీరుకు 85వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. తీర ప్రాంతంనుంచి ఎదురైన తీవ్రవాద దాడులు 2008లో ముంబైలో సృష్టించిన మారణహోమం నేపధ్యంలో కోచి తీరంలో ‘సైనిక ప్రదర్శన’ ద్వారా తీవ్రవాదులకు కేంద్రం బలమైన హెచ్చరికలు పంపింది.
కాశ్మీరులో ఉగ్రవాదుల ఉత్సాహం తగ్గింది. వారిలో ఆధిపత్యపోరు మొదలయింది. కాశ్మీరు సరిహద్దుల్లో నేడు సైన్యం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చొరబాట్లను అరికట్టింది. కాశ్మీరు లోయలో 70మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. లష్కర్ కమాండర్ అబూకాశిమ్ వంటి వారు కూడా చనిపోయారు. ప్రజలు ఉగ్రవాదంతో వేసారి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌లో పబ్బం గడుపుకుంటూ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ ఏర్పాటుచేసిన సమావేశాల్లో పాకిస్తాన్ అనుకూల ప్రసంగాలు చేసిన రాజేంద్రసచార్ లాంటి మేధావులకు ఖుర్షీద్, అయ్యర్‌లకు తేడా ఏంలేదు. అయితే అలాంటి సమావేశాలు, మేధావుల కదలికల పట్ల కేంద్రం నిఘా పెరిగిన నేటి పరిస్థితిలో ‘మోదీమీద కోపం’ ఈ మాజీలకు దేశంమీద ద్వేషంగా పరిణమించడం అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైన విషయం. తీవ్రవాదులకు ఉరిశిక్ష అమలును అడ్డుకోవడం, తమకు నచ్చని వారిని ఫాసిస్టులనడం, జీహాదీ దుర్మార్గాల పట్ల పెదవి విప్పకపోవడం, సల్మాన్ రష్డీ తస్లీమానస్రీన్ లాంటి రచయితలను అవమానించినప్పుడు ఫ్రాన్సులో జర్నలిస్టులను, చిత్రకారులను సజీవదహనం చేసినపుడు కిమ్మనకపోవడం, ఐస్‌ఐస్ ఆగడాలను ఏనాడూ తులనాడకపోవడం వంటి సోకాల్డు ప్రగతి కాముక పోకడలుపోతున్న మేధావి వర్గానికి సైతం దన్నుగా నిలిచి చీటికీ మాటికీ కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలుదువ్వుతున్నది.
అయ్యర్, ఖుర్షీద్ లాంటివారు సోనియా భజనలో మరో అడుగుముందుకువేసి శత్రుదేశంలోనూ కత్తులు నూరుతున్నారు. ఈ మేధావులు తమ మేధస్సును, శక్తినీ, విజ్ఞానాన్ని నిర్మాణాత్మక పంధాలో, సకారాత్మక దృష్టితో వినియోగిస్తే దేశం బాగుపడుతుంది. భారతీయ ముస్లిం నేతలు సుమారు వెయ్యిమంది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్‌కు వ్యతిరేకంగా 1050 పుటల పత్వాను వెలువరించిందన్న వాస్తవం ఈ రాజకీయ దుర్వీణులు తెలుసుకోవాలి. భారతదేశంలో ముస్లింలుగా తాము సుఖంగా వున్నామని పాకిస్తాన్ సహకారంతో పేట్రేగిపోతున్న సున్నీ వర్గపు ఐసిస్‌ను తుదముట్టించాలని అన్ని దేశాల పెద్దలను కోరుతున్నామని వారంటున్నారు.

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ సెల్: 9676190888