చిత్తూరు

భక్తుల సేవే శ్రీవారి సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిటిడి ఈవో డాక్టర్ డి సాంబశివరావు వెల్లడి

తిరుమల, డిసెంబర్ 18: దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే తోటి భక్తులకు సేవలందించడం భగవంతుని సేవతో సమానమని, అదే శ్రీవారి సేవ పరమార్థమని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి. సాంబశివరావు ఉద్ఘాటించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవారి సేవకులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ డిసెంబర్ 21న వైకుంఠ ఏకాదశి, 22న ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని, వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి సేవకులు సేవలందించాలని కోరారు. శ్రీవారి సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సేవకుల సంఖ్యను పెంచడంతో పాటు పుట్టపర్తి సేవాదళక్ష నిపుణులతో ఇక్కడ ధర్మప్రచారం, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై ప్రతి వారం శిక్షణ ఇస్తామని తెలిపారు. టిటిడి ధర్మప్రచార కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు భాగస్వాములు కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానికంగా హైందవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.
* శ్రీవారి సేవకులతో సర్వే
శ్రీవారి సేవకులు నిరంతరం భక్తుల మధ్య ఉండడం వల్ల వారి సమస్యలు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుందని, ఈ కారణంగానే సేవకుల ద్వారా సర్వేలు నిర్వహించి క్షేత్రస్థాయిలో భక్తుల సమస్యలను పరిష్కరిస్తామని ఈవో తెలిపారు. శ్రీవారి సేవకుల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏడాదిన్నరలోపు భవనాలు నిర్మిస్తామని తెలిపారు. సేవకులు తిరుమలలో దర్శనం, అన్నప్రసాదం, బస తదితర అంశాలపై అవగాహన పెంచుకుని భక్తులకు సూచనలందించాలని కోరారు.
* త్వరలో ఆన్‌లైన్ నమోదు
శ్రీవారి సేవకు మరింత సులభతరంగా నమోదు చేసుకునేందుకు వీలుగా త్వరలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. ఈ విధానం వల్ల ఎక్కడినుంచైనా సులువుగా సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు. టిటిడి ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ షర్మిష్ట మాట్లాడుతూ తోటి భక్తుల్లో భగవంతుని దర్శించి ప్రేమతత్వంతో భక్తులకు సేవలందించాలని కోరారు. సేవకులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుపరిసరాల పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు. తిరుమలలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట ఎరుపు, ఆకుపచ్చ కుండీలను ఏర్పాటు చేశామని, తడి, పొడి చెత్తను వేసే విషయంలో భక్తులకు సూచనలివ్వాలని సేవకులకు సూచించారు. టిటిడి అన్నప్రసాదం ట్రస్టు డిప్యూటీవో వేణుగోపాల్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు క్యూలైన్లలో పాలు, అల్పాహారం, అన్నప్రసాదం, తాగునీటిని సమయానుసారం అందించాలని శ్రీవారి సేవకులను కోరారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒకేసారి నాలుగువేల మంది అన్నప్రసాదం స్వీకరించే అవకాశం ఉందని, సేవకులు ఈ విషయాన్ని భక్తులకు తెలియజేయాలని సూచించారు. శ్రీవారి సేవకులు చక్కటి సేవలందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టిటిడి సహాయ ప్రజా సంబంధాల అధికారిణి పి.నీలిమ మొదటగా శ్రీవారి సేవకులకు విధి విధానాలను తెలియజేశారు. అంతకుముందు మహాలక్ష్మి శ్రీవారి సేవకులతో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవ కార్యాలయ అధ్యక్షులు గోపాల్ రావు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర,కేరళ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన 2700 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు

తిరుపతి, డిసెంబర్ 18: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం ఈ నెల 21వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినానికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబయ్యాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశినాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ద్వాదశినాడు చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం జరగనుంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజామున 12 గంటల నుండి 12.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 12.30 నుండి 3 గంటల వరకు తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం వినిపిస్తారు. వేకువజామున 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5 గంటల నుండి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 21న స్వర్ణపుష్పార్చన, ఆర్జిత కళ్యాణోత్సవం సేవలు రద్దు కానున్నాయి. అలాగే అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించనున్నారు. అలాగే నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోనూ, శ్రీ కోదండరామాలయంలోనూ, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల, డిసెంబర్ 18: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. శుక్రవారం తెల్లవారి జామున శ్రీవారి అభిషేకం సేవలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొనగా మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంగన్‌వాడీలపై లాఠీచార్జ్ అమానుషం
* సిఐటియు, ఏఐటియుసి రాస్తారోకో
తిరుపతి, డిసెంబర్ 18:గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం అమానుషమని సిఐటియు, ఏఐటియు నాయకులు అన్నారు. లాఠీచార్జ్‌కి నిరసనగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐటియు నాయకులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, అడిగినందుకు మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. వారిని అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. బాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళలేనన్న విషయం మరచిపోరాదని చెప్పారు. వెంటనే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు గురుప్రసాద్, వేణు, గంగులప్ప, బుజ్జి, అంగన్‌వాడీ నాయకురాళ్ళు నాగరాజమ్మ, జయప్రద, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిని తాకిన కాల్‌మనీ వ్యవహారం
పోలీసు అదుపులో మహిళా వడ్డీ వ్యాపారి
శ్రీకాళహస్తి, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాల్ మనీ వ్యవహారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని తాకింది. వడ్డీ వ్యాపారుల బాధితులు ఫిర్యాదు చెయ్యవచ్చని ప్రభుత్వం పోలీసు అధికారులు చెప్పడంతో వ్యాపారుల ఆగడాలు అన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ కాళహస్తి పట్టణంలో ఒక మహిళా వడ్డీ వ్యాపారి రుణం తీసుకొన్న వారిని వేధిస్తున్నదని ఫిర్యాదు రావడంతో పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని వేళంపాలెం ప్రాంతానికి చెందిన మంజులమ్మ వడ్డీ వ్యాపారం చేస్తోందని సకాలంలో చెల్లించలేని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులకు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వన్ టౌన్ సి ఐ చిన్న గోవిందు వడ్డీ వ్యాపారి మంజులమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. వేధింపుల విషయాలు కొన్ని రుజువుకావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె వద్ద రుణం తీసుకున్న మరికొందరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఎంత మొత్తంలో రుణం ఇచ్చారు, ఆ రుణంకు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ వసూలు కాకుంటే ఏవిధమైన వేధింపులకు గురి చేస్తున్నారనే విషయంపై విచారణ చేస్తున్నారు. అంతే కాకుండా కొందరు కేవలం వడ్డీ వ్యాపారం పైన ఆధారపడి జీవిస్తున్న వారు కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. నామామాత్రపు వడ్డీకి ఇచ్చి తిరిగి తీసుకొనే కొందరు కాల్ మనీ వ్యవహారం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాల్ మనీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రుణం ఇచ్చినవారు తమను కూడా వేధిస్తున్నారనే ఫిర్యాదులు చేసే అవకాశం లేకపోలేదు. దీని వల్ల కొద్ది మొత్తాన్ని వడ్డీలకు ఇచ్చి అవసరాలు తీర్చుకొనే వృద్ధులు, కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

మేయర్ దంపతుల హత్య కేసులో నలుగురికి రిమాండ్ పొడిగింపు
చిత్తూరు, డిసెంబర్ 18: చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న నలుగురి రిమాండ్‌ను పొడిగించారు. ఈమేరకు చింటూకు ఆశ్రయం కల్పించాడని అరెస్ట్ అయిన పుంగనూరు మండలం దండుపాళ్యంకు చెందిన నాగరాజు, లోకేష్, రఘుపతి, న్యాయవాది ఆనంద్‌లకు శుక్రవారంతో రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు సంబంధిత నలుగురు నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని కోరగా నాల్గవ అదనపు కోర్టు న్యాయమూర్తి యుగందర్ పైపేర్కొన్న నిందితులకు ఈనెల 22వ తేది వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తిరుమలలో ప్రమాదం - చిన్నారికి తీవ్ర గాయాలు
తిరుమల, డిసెంబర్ 18: తిరుమల పిఎసి 3 వద్ద ఉన్న బస్టాండ్ సమీపంలో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరుకు భక్తులతో బయలుదేరిన ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు ఓ చిన్నారి కాలిపైనుంచి బస్సు ముందుచక్రం వెళ్లగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదుకు చెందిన మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శుక్రవారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఈక్రమంలో బస్టాండు ఆవరణలోని మరుగుదొడ్ల వద్ద వేచి ఉండగా బెంగుళూరుకు వెళుతున్న ఆర్టీసి బస్సు వారి ముందు నుంచి యూటర్న్ తీసుకొంటున్న సమయంలో మల్లేష్ కుమార్తె హిమబిందు (4) బస్సు గమనాన్ని గమనించకుండా పరుగెత్తింది. ఇది డ్రైవర్ గమనించకుండా మలుపు తిప్పే క్రమంలో ప్రమాదవశాత్తు చిన్నారి బస్సు ముందు చక్రం కింద పడిపోయింది. ఆ ప్రమాదంలో చిన్నారి ఎడమకాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బంది గాయపడిన చిన్నారిని హుటాహుటిన స్థానిక అశ్విని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘క్రీడలు శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకలు’
* రెండవ సీనియర్ రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
చిత్తూరు, డిసెంబర్ 18: క్రీడలు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ సీనియర్ రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను ఎస్పీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పాల్గొన్న పురుషుల, ఎనిమిది జిల్లాల నుంచి మహిళల జట్లు పాల్గొనే ఈ చాంఫియన్‌షిప్ పోటీలను ఎస్పీ, జిల్లా జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి, జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, డీఎస్పీ లక్ష్మీనాయుడు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్‌కుమార్, డ్వామా ఏపిడి గోపీచంద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జాతిసమైక్యతను పెంపొందించేందుకు, మంచి పౌరులుగా ఎదిగేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలతో జ్ఞానం, చక్కని ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. జేసీ-2 మట్లాడుతూ ముఖ్యమంత్రి క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ సరికొత్త హంగులతో స్టేడియాలు నిర్మితమవుతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోనూ ఆరు స్టేడియాలు త్వరలోనే ప్రారంభానికి నోచుకోనున్నాయని తెలిపారు. క్రీడాకారులు బాగా ఆడి తమ జిల్లాతో పాటు, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. చెంగల్రాయనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక రెండోసారి జిల్లాలో నిర్వహిస్తున్న బాస్కెట్‌బాల్ పోటీలకు క్రీడాకారుల నుంచి, నిర్వాహకుల నుంచి మంచి స్పందన రావడం హర్షణీయమని అన్నారు. మరోసారి అవకాశం వస్తే 2018లో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి ఎన్ రాజసింహులు ప్రసంగిస్తూ జాతీయస్థాయి క్రీడల నిర్వహణకు ప్రభుత్వపరంగా అనుమతి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ, జేసీ-2 తదితరులు బాస్కెట్‌బాల్ ఆడి ప్రేక్షకులను అలరించారు. ఈ సమావేశంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి త్యాగరాజన్, సభ్యులు హరిప్రసాద్‌రెడ్డి, భానుప్రకాష్, సురేష్‌బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్‌సాహెబ్ పలువురు కోచ్‌లు, మొత్తం 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
తొలి రెండు మ్యాచ్‌లలో కడప, చిత్తూరు జిల్లాలు గెలుపు: తొలుత పురుషుల విభాగంలో నిర్వహించిన తొలిరెండు మ్యాచ్‌లలో కడప, చిత్తూరు జిల్లాల జట్లు తమ ప్రత్యర్థి జట్లైన విజయనగరం, నెల్లూరు జిల్లా జట్లపై విజయం సాధించాయి. కాగా ఈ క్రీడలు ఆదివారం రాత్రితో ముగియనున్నాయి.