Others

పాండురంగ మహాత్మ్యం (భక్త పుండరీకుని కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్‌బ్యాక్ @ 50
===========

ఎన్టీ రామారావు సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా స్థాపించిన సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్. ఈ సంస్థ తొలుత పిచ్చిపుల్లయ్య (1953), తోడుదొంగలు (1954), జయసింహ (1955) తరువాత నిర్మించిన చిత్రం -పాండురంగ మహాత్యం. 1946లో త్యాగరాజ భాగవతార్, వసుంధరాదేవి నటించిన తమిళ భక్తిరస చిత్రం హరిదాసు. ఆ చిత్రం విజయం సాధించింది. కథాంశం, చిత్రం నచ్చిన ఎన్టీఆర్ -దానికి కొన్ని మార్పులుచేసి తమ బ్యానర్‌పై చిత్రంగా రూందించాలని భావించారు. దాంతో పాండురంగ మహాత్యం కథ సిద్ధమైంది. చిత్రానికి దర్శకునిగా -అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా నటించిన చంద్రహారం, పెంకిపెళ్ళాం (అవి పరాజయం చెందినా) చిత్రాల దర్శకులైన కమలాకర కామేశ్వరరావును ఎన్నుకున్నారు. కామేశ్వరరావు విశేష పరిజ్ఞానం పట్ల ఎన్టీఆర్‌కి ఉన్న నమ్మకంవల్ల, సన్నిహితుల సందేహాలను తోసిపుచ్చారు. వారి నమ్మకం, సత్ఫలితంగా కామేశ్వరరావు పౌరాణిక బ్రహ్మగా రాణించారు.
===========
మాటలు, పాటలు:
సముద్రాల జూనియర్
సంగీతం: టివి రాజు
ఎడిటింగ్: జిడి జోషి,
కళ: తోట
నృత్యం: వెంపటి పెద సత్యం
ఛాయాగ్రహణం: ఎంఎ రెహమాన్
నిర్వహణ: అట్లూరి పుండరీకాక్షయ్య
నిర్మాత:
నందమూరి త్రివిక్రమరావు.
------------------
ఈశ్వర కటాక్షం కోసం తపమాచరిస్తున్న యోగి (కెవియస్ శర్మ) శిరస్సును దేవేంద్రుడు (ఏవి సుబ్బారావు) ఖండించటంతో, అతడు జాహ్నవి దంపతుల కుమారుడు పుండరీకుడు (ఎన్టీఆర్)గా జన్మిస్తాడు. తండ్రి (నాగయ్య), తల్లి (ఋష్యేంద్రమణి) లక్ష్మి కృష్ణ భక్తులు. బాబాయి కుమారుడు శ్రీహరి (పద్మనాభం). పుండరీకునికి వివాహం జరిగినా, కళావతి (బి సరోజ) అనే వేశ్యకు దాసుడిగా, వ్యసనపరుడిగా, దైవద్వేషిగా సంచరిస్తుంటాడు. భార్య రమ (అంజలిదేవి) కాపురానికి వచ్చాక కొంతకాలం బుద్ధిగా ఉండి, తిరిగి కళావతి మోజులో భార్య నగలు తస్కరిస్తాడు. ఆ నేరం తల్లిమీద మోపబడటంతో, జాహ్నవి దంపతులు, శ్రీహరి ఇల్లు విడిచి వెళ్తారు. కళావతి పుండరీకుని ఆస్తి స్వాధీనం చేసుకుని అతన్ని వెళ్ళగొడుతుంది. దేశదిమ్మరియైన పుండరీకుడు, కుక్కుటముని ఆశ్రమంలో గంగా, యమునా, సరస్వతులను మోహించి, వారి జాడకోసం మునిపై ఆగ్రహించటంతో కాళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ ముని ఆదేశంతో అహంకారం విసర్జించి, మాతాపిత పాద సేవే మాధవసేవ అని గ్రహించి, తల్లితండ్రుల కోసం ఆక్రోసించి వారిని కలుసుకుని వారి సేవలో తరిస్తుంటాడు. తనను అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని, తన పేరిట ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందాలని కోరుకుని తనవారితో స్వామిలో ఐక్యమవుతాడు. పండరీపురంలో వెలసిన శ్రీపాండురంగని ఎందరో భక్తులు ఆరాధించి, తరించి, స్వామిలో లీనమవటం చూపటంతో చిత్రం ముగుస్తుంది.
అంజలిదేవి అక్కగా షావుకారు జానకి అతిథి పాత్ర పోషించగా, ఆమె తండ్రిగా గోవిందరాజుల సుబ్బారావు, షావుకారుగా బొడ్డపాటి, పూజారిగా వంగర, కళావతి నెచ్చెలి చంపగా అమ్మాజి, సరసుడుగా పేకేటి శివరాం కనిపిస్తారు. బాలకృష్ణ, కస్తూరి శివరాం, అంతకుముందు బాలనటిగా 2, 3 తమిళ చిత్రాల్లో నటించిన విజయనిర్మల తెలుగులో నటించిన తొలి చిత్రం ‘పాండురంగ మహాత్యం’.
ఈమెను శ్రీకృష్ణుని పాత్రకు ఎన్నుకొన్న ఎన్టీఆర్ స్వయంగా ఆమె మేకప్ మెరుగులు దిద్దటం విశేషం. అలాగే బి సరోజాదేవికి ఇదే తొలి చిత్రం. మొదట వేశ్య పాత్ర అని కొంత సంశయించినా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ధైర్యంగా నటించింది. ఈమె పాత్రకు వి కృష్ణకుమారి అనే గాయని డబ్బింగ్ చెప్పారు. ఛాయాదేవి పొరుగింటి సూరమ్మగా, యశోదగా రెండు పాత్రలు, కెవియస్ శర్మ రెండు పాత్రలు ధరించారు. పాత్రధారులందరూ పరిణితి చెందిన తమ నటనతో ఎంతో ప్రతిభావంతంగా మెప్పించారు.
మహానటుడు ఎన్టీ రామారావు తొలుత విలాస పురుషునిగా, వ్యవసనపరుడిగా, ఆపైన తల్లితండ్రుల కోసం ఆవేదనపడే కుమారునిగా, పరమభక్తునిగా తాదాత్మ్యతను ఎంతో అద్భుతంగా నటనలో ఆవిష్కరించటం ఆయనకే చెల్లింది. దర్శకులు కమలాకర కామేశ్వరరావు సన్నివేశాలను ఆహ్లాదకరంగా, ఆర్ధ్రత, సంయమనంతో అర్ధవంతంగా చిత్రీకరించటం విశేషం. చిత్ర ప్రారంభంలో ‘తరంతరం నిరంతరం ఈ అందం ఆనందం’ (ఘంటసాల). ఈ పాటలో గుర్రాన్ని, అమ్మాయిలను, పూలను చూపి, పూల పిల్ల విసిరిన చెండు అందుకుంటూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేయటం వెరైటీ.
భార్య రమ గదిలో అలంకరణ, మిఠాయిలు చూపటం, వాటిపై పిల్లి దూకటం, భర్త అంగీపై కుంకుమ మరకలు భార్య గమనించటం, భార్యకోసం పుండరీకుడు, తల్లిదండ్రుల పూజలపై ఆంక్షలు, భార్య నగలు తస్కరించి వెళ్తున్న పుండరీకుడు దీపం చూపుతున్న తండ్రిని కర్రతో కొట్టడం, నగలు తల్లికాళ్ళవద్ద పడగా అతని ఉంగరం ఆమె చేతిలోకి రావటం, తిరిగి ఇల్లువిడిచి వెళ్ళేముందు తల్లి ఆ ఉంగరం పుండరీకుని వేలికి తొడిగి ఆశీర్వదించటం, దానికి ఎన్టీఆర్ రియాక్షన్.. హృదయాలు కదిలించేలా చిత్రీకరించారు.
తల్లిదండ్రుల కోసం వెదుకుతూ పుండరీకుడు ఆలపించే ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ (ఘంటసాల) గీత చిత్రీకరణ, పాట చివర అమ్మా, అమ్మా అని పలుసార్లు అనిపించటంలో చిత్రీకరణ రసానుభూతిని చిరస్థాయిగా నిలిపింది. అలాగే జయకృష్ణా ముకుందామురారే (ఘంటసాల) ఈ గీతం 15 నిముషాలు సాగటం, అద్భుతమైన సెట్టింగ్స్, శ్రీకృష్ణుని లీలలు, నృత్యం, నృత్య దర్శకులు వెంపటి సత్యం కృషితోపాటు దర్శకుని ఆలోచనకు అద్దంపట్టటం విశేషం. ఇక రంగదాసు కస్తూరి శివరాం అంగడి పేరు ‘ఇహపరాలు’. ఒకవైపు పూలు కొబ్బరికాయలు దేవుని విగ్రహం, మరోవైపు నృత్యం చేసే బొమ్మ, శృంగార సామగ్రివున్న పెట్టెలో శిష్యుడు రామదాసు (బాలకృష్ణ). వారిరువురి పైనా గీతంలో వివరంగా చూపటం ‘చెబితే వింటివ గురూ గురూ వినకే చెడితిరా శిష్యా, శిష్యా’ (మాధవపెద్ది, పిఠాపురం) వివరంగా చిత్రీకరించారు.
మిగిలిన గీతాలు చిత్ర ప్రారంభంలో కెవియస్ శర్మపై చిత్రీకరించిన భక్తి గీతం -హరహర శంభో’ (ఘంటసాల). రంభ (రీటా) ముని తపోభంగం చేయాలని పాడే నృత్య గీతం -కనవేరా మునిరాజవౌళీ నిను తరియించు (పి.లీల). విటుల మధ్య తోటలో బి సరోజాదేవి, అమ్మాజి, పేకేటి, వంగరలపై చిత్రీకరించిన గీతం -పెదవుల రాగం మది అనురాగం, విరిసే చెలినోయి నా మురిపెము నీదోయి’. కంఠశోష, వేదాలఘోష కైవల్యమందే లేదోయి చిత్ర పద ప్రయోగం (జిక్కి). ఎన్టీ రామారావు, బి.సరోజాదేవిలపై చిత్రీకరించిన యుగళ గీతం -నీవని నేనని తలచితిరా (పి.సుశీల, ఘంటసాల). బి.సరోజాదేవి తోటలో కుచలకుమారి, తంగప్పలపై చిత్రీకరించిన నృత్య గీతం -ఎక్కడోయి ముద్దులబావా చందమామా (ఎ.పి.కోమల, పిఠాపురం). అంజలీదేవి, ఎన్టీఆర్‌లపై చిత్రీకరించిన యుగళ గీతం -వనె్నల చినె్నల నెరా కనె్నలవేటల (పి.లీల, ఘంటసాల). నాగయ్య, ఋష్యేంద్రమణి, పద్మనాభంలపై చిత్రీకరించిన భక్తిగీతం. ‘జయజయ గోకుల బాలా మురళీగాన విలోల’ (నాగయ్య). సాధువులపై చిత్రీకరించిన తత్వగీతం ‘ఓ దారిగానని సంసారి దరిచేరేటి దారి’ (ఎంఎస్ రామారావు బృందం). కస్తూరి శివరావు, బాలకృష్ణ బృందంపై చిత్రీకరించిన తత్వగీతం -తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం (పిఠాపురం, మాధవపెద్ది). నాగయ్య, ఎన్టీఆర్, ఋష్యేంద్రమణి, అంజలిలపై చిత్రీకరించిన గీతం -సన్నుతిసేయవే మనసా/ ఆపన్న శరణ్యుహరిని (నాగయ్య). బి.సరోజాదేవిపై పద్యం -ఎక్కడివాడో యక్షతనయ (ఏపి కోమల) ఎన్టీఆర్‌పై పద్యం ఒకచేతను మధు పాత్ర ఒక చేత చెలువ (ఘంటసాల). తల్లి పాదాలముందు ఎన్టీఆర్ పద్యం -ఏ పాద సీమ కాశీ ప్రయాగాది (ఘంటసాల). ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన దండకం శ్రీ కామిని కామితాకార (ఘంటసాల). పాండురంగని భక్తులపై చిత్రీకరించిన గీతాలు సక్కుబాయిపై -ఆటలాడరారా కన్నయ్యా (ఏపి కోమల). మీరాబాయిపై -తుమబిన్ మోరీకౌన్ గోవర్థన (ఏపి కోమల). -అదీబిజా ఏఖిలే బీజాంకురాలే (మరాఠీ- ఘంటసాల). అజ్‌కాసు స్వేరాదిన్ (ఘంటసాల- హిందీ). అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు (ఘంటసాల, ఏపి కోమల బృందం).
టివి రాజు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలు సంగీతపరంగా అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ చిత్రానికీ టివి రాజు సమకూర్చిన స్వరాలు నేటికీ అపూర్వంగా అలరారుతూ చిరస్మరణీయ గీతాలుగా నిలవటం ప్రత్యేక విశేషం. సందర్భానికి తగ్గ మాటలతోపాటు సన్నివేశానికి తగ్గ పాటలు సృష్టించిన సముద్రాలవారి పాళీ, బాణీ జోడు గుర్రాలవలె సాగటం వేదాంతపరంగా, లౌకికపరంగా హెచ్చరికలుగా సందేశాత్మకంగా ఆకట్టుకోవటం హర్షణయం. -జయకృష్ణా ముకుందా మురారే గీతాన్ని కేరళలోని గురువాయూర్ కృష్ణాలయంలో భక్తి పాటలతో విన్పింపచేయటం ఓ విశేషం.
అద్భుతమైన తన గాత్రంతో అలరించిన ఘంటసాల పేరు టైటిల్స్‌లో కనబడదు. ఈ విషయాన్ని ఈ చిత్రం ప్రీవ్యూనాడు ఘంటసాల సతీమణి సావిత్రమ్మ గమనించి ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దాన్ని సవరించటానికి వీలుపడక పోవటంతో ఎన్టీ ఆర్ ఘంటసాల వారిని క్షమించమని కోరగా, దానికి వారు ‘నా కంఠం శ్రోతలకు తెలుసు దాందేముంది బాబూ ఫరవాలేదు అని ఎంతో ఉన్నతంగా, నిగర్వంగా బదులిచ్చారుట. ఘంటసాల సంస్కారానికిది నిదర్శనం. ఈ చిత్రంలోని హిందీ, మరాఠి పాటలను జొప్పించటం, వాటిని ఘంటసాల ఆలపించటం ఈ చిత్రానికి మరింత వనె్నతెచ్చింది.
పాండురంగ మహాత్యం చిత్రం నవంబరు 28, 1957న విడుదలై విజయాన్ని సాధించింది. 9 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడలో శ్రీలక్ష్మీటాకీస్‌లో శత దినోత్సవ వేడుకలు జరిగాయి.
అద్భుతమైన సందేశంతో కూడిన భక్తి చిత్రంగా పాండురంగ మహాత్యం చరిత్ర సృష్టించింది. ఇదే కథతో బాలకృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పాండురంగడు’ రంగుల చిత్రం అంత సక్సెస్ కాకపోవటం ప్రేక్షకుల మనస్సుల్లో ‘పాండురంగ మహాత్యం’ నాటుకున్న బలమైన ముద్రలే కారణం.

- సివిఆర్ మాణిక్యేశ్వరి