Others

పిచ్చి పుల్లయ్య (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: అనిశెట్టి సుబ్బారావు
సంగీతం: టివి రాజు
నృత్యం: వేణుగోపాలస్వామి,
నర్తకి- కమల (కేరళ సిస్టర్స్)
ఎడిటింగ్: జిడి జోషి
ఫొటోగ్రఫీ: ఎంఎ రెహమాన్
కళ: ఎస్ కృష్ణారావు
సహాయ దర్శకులు:
కె హేమాంబరధరరావు
అసోసియేట్ దర్శకులు: రజనికాంత్
కథ, సినేరియా, దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
నిర్మాత: ఎన్ త్రివిక్రమరావు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్:
అట్లూరి పుండరీకాక్షయ్య
**

మన దేశంలో తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూసిన కొన్ని చిత్రాల ప్రభావంతో.. రాయలసీమ పేదల స్థితిగతులను వీక్షించి తోటి సినీ కళాకారులతో కలిసి కరవు నిధి సేకరణకు నడుంగట్టాడు నటులు ఎన్‌టి రామారావు.
తన సోదరుడు నందమూరి త్రివిక్రమ రామారావుతో కలిసి స్థాపించిన ‘నేషనల్ ఆర్ట్స్’ సంస్థ ద్వారా నిర్మించే తొలి చిత్రానికి, తన భావాలకు తగిన కథను దర్శకులు తాతినేని ప్రకాశరావుచే సిద్ధం చేయించి ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’ 1953లో సినిమా విడుదలైంది. అప్పటికే అందమైన కథానాయకునిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు ఎన్టీఆర్. తొలిసారిగా ఈ చిత్రంలో డీగ్లామరస్ రోల్ పోషించి, అమాయకమైన పల్లె యువకునిగా నటించి చూపించారు.
***
వెలుగుతున్న మూడు దీపాలు కలిగిన ప్రమిద చూపుతూ.. శాంతి మంత్రం ‘సహనాభవతు’ నేపథ్యంలో వినిపించిన తరువాత టైటిల్స్ ప్రారంభమవుతాయి.
పట్నంలో జమీందారిణి (మనోరమాదేవి -్ఛయాదేవి) ఇంట్లో పనికి పల్లెటూరి నుంచి పుల్లయ్య (ఎన్‌టి రామారావు)ను తండ్రి శేషయ్య (కోడూరి అచ్చయ్య) పంపుతాడు. ఆ ఇంట మరో పనిమనిషి కాంతం (కృష్ణకుమారి), చినబాబు (అమర్‌నాథ్), అతని భార్య వసంత (జానకి) పుల్లయ్య పట్ల అభిమానం చూపిస్తారు. జమీందారుకు దూరపు బంధువు భూపాలరావు (గుమ్మడి), జమీందారీని, ఇంటిని అజమాయిషీ చేస్తూంటాడు. అతనికితోడు గుమాస్తా నీలకంఠం (రమణారెడ్డి). వారి అకృత్యాలకు అడ్డుగా ఉన్నదని వసంతకు, పుల్లయ్యకు అక్రమ సంబంధం అంటగడతారు. భూపాలరావు చెప్పిన నిందలు నమ్మి గర్భవతియైన వసంతను భర్త చినబాబు, జమీందారిణి ఇంటినుంచి వెళ్లగొడతారు. పుల్లయ్య వసంతతో తన పల్లెటూరి చేరి, స్నేహితుడు చంద్రం (పుండరీకాక్షయ్య) సాయంతో ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు. వసంతకు ఒక బాబు జన్మిస్తాడు. ఈలోపు భూపాలరావు కుట్ర తెలిసికొన్న చినబాబు, భార్య కొరకు వెదుకులాడి ఆమెను కలుస్తాడు. జమీందారు సమాధిని తవ్వి అందులో నగలు తస్కరించబోయిన భూపాలరావు యుతాన్ని తెలుసుకుని పుల్లయ్య అడ్డుకుంటాడు. ఆ క్రమంలో మనోరమాదేవిని గాయపర్చిన భూపాలరావు, ఆ నేరం పుల్లయ్యపై మోపటంతో పోలీసులు పుల్లయ్యను అరెస్టు చేస్తారు. మనోరమాదేవి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటంతో పుల్లయ్య నిర్దోషిగా రుజువు అవుతుంది. భూపాలరావు, నీలకంఠం జైలుకు వెళ్తారు. పుల్లయ్యకు, కాంతానికి జమీందారిణి పెళ్లి చేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పుల్లయ్యగా ఎన్‌టి రామారావు అమాయకత్వంతో కూడిన తెలివి, వివేచన, ప్రత్యేకించి అమాయకపు నవ్వునూ ప్రదర్శించి మెప్పించారు. ముఖ్యంగా తాను పెంచుకున్న గొర్రెపోతును పోగొట్టుకున్న సన్నివేశంలో క్రోధం, బాధ, దుఃఖం అద్భుతంగా చూపించారు. చిన్నమ్మపై నిందలు మోపినపుడు పల్లెటూరిలో తన ఇంటికి తీసుకెళ్లి ఆమె కోసం తండ్రికి ఎదురుగా మాట్లాడటం -లాంటి అనేక సన్నివేశాల్లో ప్రతిభావంతంగా, ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. భూపాలరావుగా గుమ్మడి సుతిమెత్తని విలనీని చూపులతో, నర్మగర్భమైన మాటలతో ఒప్పించగా, జమీందారిణిగా ఛాయాదేవి విలక్షణమైన నటన చూపటం విశేషం. ధైర్యం, వివేకంగల యువతిగా, భర్తకు దూరమై నిందలతో బేలగా, కొంత పిరికితనం వంటి లక్షణాలను జానకి సన్నివేశానుగుణంగా మెప్పించారు. కాంతంగా కృష్ణకుమారి సన్నివేశానుగుణమైన పలు వైవిధ్యాలను ఎంతో నేర్పుతో ప్రకటించి అలరించారు. పుల్లయ్య తల్లిగా హేమలత, నర్సుగా మోహన, ఇంకా మహంకాళి వెంకయ్య ఈ చిత్రంలో నటించారు.
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించి కమ్యూనిస్టు ఉద్యమాల్లో గడిపి, చిత్రరంగ ప్రవేశం చేసిన తాతినేని ప్రకాశరావు తొలుత 1947 నుంచి 1951 వరకూ ఎల్‌వి ప్రసాద్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. 1948లోని ‘ద్రోహి’ చిత్రంలో ఎల్‌వి ప్రసాద్‌పై సన్నివేశాలను వీరే చిత్రీకరించారు. తొలిసారిగా 1952లో పీపుల్స్ ఆర్ట్స్ నిర్మించిన ‘పల్లెటూరు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరి ద్వితీయ చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’. ఈ చిత్రంలో సన్నివేశాలను ఎంతో బిగువుతో, పట్టుతో, ఆర్ద్రతతో మేళవించి రూపొందించారు.
తొలుత పుల్లయ్య అమాయకుడు అనే అంశాన్ని చిత్ర ప్రారంభంనుంచి మొదలుపెట్టి, తరువాత పట్నంలో జమీందారు భవనంలో బొమ్మను చూసి మనిషి అనుకోవడం, కాగితం పూలకు నీళ్లు పోస్తూ -బస్తీలో అసలు పూలకంటే కాగితం పూలకే విలువెక్కువ అనడం లాంటి సన్నివేశాలను ఆసక్తిగా తెరకెక్కించారు.
‘ఆలపించనా అనురాగములో’ అనే రేడియో గీతంపై ప్రధాన పాత్రల రియాక్షన్ (జానకి, అమర్‌నాధ్, రామారావు, కృష్ణకుమారి), మరో గీతం ‘ఎల్లవేళలందు నీ చల్లని చిరునవ్వులకై’ రేడియో గీతానికి పుల్లయ్య, కాంతంల ప్రేమచూపుల రియాక్షన్స్, పుల్లయ్య పట్నం వెళ్లేటప్పుడు అతనిపై చిత్రీకరించిన నేపథ్యగీతం ‘బస్తీకి పోయే ఓ పల్లెటూరివాడా’ (గానం- పుండరీకాక్షయ్య) ఔట్‌డోర్‌లో కనువిందుగా చిత్రీకరించటం, వసంతపై నిందవేసిన సన్నివేశంలో నలుపు తెలుపుల్లో అమరనాథ ముఖ వైఖరిలో మార్పులు చూపటం, వసంత ధైర్యంగా మాట్లాడటం, చివర వసంత ‘సీత అగ్నిప్రవేశం’ చిత్రం గుర్తుకు తెచ్చుకుంటూ చనిపోవ ప్రయత్నించటం, చిత్రం ప్రారంభంలో ఈ అపవాదు గూర్చి ఆమె చెప్పిన మాటలు, పుల్లయ్య గుర్తుచేయటం ఎంతో అర్థవంతంగా, సన్నివేశాలను రక్తికట్టేలా తీర్చిదిద్దారు. అర్థవంతమైన మాటలు, పాటలతో అనిశెట్టి సుబ్బారావు అలరించగా, ఈ చిత్రానికి టివి రాజు చక్కని స్వరాలు కూర్చారు (అంతకుముందు టింగురంగా చిత్రానికి ఎస్‌బి దినకర్‌తో కలిసి సంగీతం సమకూర్చిన టివి రాజు సొంతంగా బాణీలు కూర్చిన తొలి చిత్రం పిచ్చిపుల్లయ్య). కృష్ణకుమారి, ఎన్‌టి రామారావులపై గీతం -ఈ వౌనమేలనోరుూ గతం చెమరచుట మేలోయి (ఏపి కోమల), రమణారెడ్డి -కృష్ణకుమారిలపై -ఓ పంతులుగారు వినమేమయ్యా’ (ఏపి కోమల, పిఠాపురం) జానకి, ఎన్టీఆర్‌లపై వచ్చే నేపథ్య సంగీతం -మాననీయుడవు నీవయ్యా (ఎంఎస్ రామారావు), అమర్‌నాథ్‌పై నేపథ్యగానం -శోకపు తుఫాను రేగిందా (ఎంఎస్ రామారావు), కేరళ సిస్టర్స్‌పై నృత్యగీతం -ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ (పి సుశీల) అలరిస్తాయి. రేడియో గీతం -ఆలపించనా అనురాగముతో (ఘంటసాల) పాటలో ‘అరమరలెరుగని అమాయకునిలో ఆశయాలేవో అవతరించగా’ అన్నపుడు, కధానాయకుని పరంగానూ, ప్రేమ విలువను తెలియచేస్తూ ‘కరుణ హృదయమే తాజ్‌మహల్‌గా/ అనంత ప్రేమకు ఆశ చెందగా/ నిర్మల ప్రేమకు నివాళులిడుచు/ కాంతిరేఖలే కౌగిలించగా’ అన్న సన్నివేశాలు అద్భుతంగా సాగుతాయి. మరో రేడియో గీతం ‘ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై’ (ఘంటసాల -ఆర్ బాలసరస్వతీదేవి) చక్కని అనురాగానికి ప్రతీకగా సాగటం అలరిస్తుంది. చక్కని కెమెరా ప్రతిభ రాత్రిపూట సన్నివేశాల్లో ప్రత్యేకించి చూపటం విశేషం.
‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా, మానవ నైజాలు, కుయుక్తులు, మంచితనం, నిర్మలత్వం, నిజాయితీ వంటి లక్షణాలు కలవారికి అంతిమ విజయం కలుగుతుందనే సందేశాన్ని ప్రకటించే చిత్రంగా నిలవటం చెప్పుకోదగ్గ అంశం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి