ఫోకస్

రిజర్వేషన్లు రాత మార్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజికంగా బలహీనపడిన వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలను మిగిలిన వారితో సమానంగా కల్పించేందుకు, వారి అభివృద్ధికి దోహదపడేందుకు ఉద్దేశించినవే రిజర్వేషన్లు. వీటివల్ల సమాజంలో అసమానతలు తగ్గుతాయని కొన్ని వర్గాలకు, మతాల వారికి, కొన్ని ప్రాంతాల వారికి, వికలాంగులకు, క్రీడాకారులకు, ఎన్‌సిసి వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాయి. ఒక విధంగా చెప్పాలంటే నిమ్నవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుగా వీటిని పేర్కొనవచ్చు. దేశంలో 50 శాతం కోటా పరిమితికి మించి రిజర్వేషన్లు అమలుచేయాలంటే మండల్ కమిషన్ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపరిచిన నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉండాలి. అయితే తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.
రిజర్వేషన్ల ఉద్దేశ్యం, లక్ష్యం గాడితప్పి రాజకీయాల్లో ఇది ఒక అస్త్రంగా మారిపోయిందని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల సమీక్షకు సామాజిక సమన్యాయంకోసం కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తులు, రాజకీయాలతో సంబంధం లేని వారితో ఓ కమిటీ వేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. అధ్యయనం తర్వాతనే ఎంతకాలంపాటు ఎవరికి రిజర్వేషన్లు ఉండాలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కేంద్రానికి సూచించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ దమ్ముంటే రిజర్వేషన్లను తొలగించాలని సవాలు విసిరారు. ఒకపక్క గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం, మరోపక్క ఆంధ్రాలో కాపు ఉద్యమం, మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులాల కుంపట్లు మండుతున్నాయి, దాంతో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, విద్యాసంస్థల్లో సరైన ప్రాతినిధ్యం లేని సామాజిక వెనుకబడిన తరగతులకు,షెడ్యూల్డు కులాలు, తరగతుల వారికి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక కోటాను అమలుచేస్తున్నారు. మత / భాషాపరమైన మైనార్టీ విద్యాసంస్థలు మాత్రం ఈ రిజర్వేషన్ల నుండి మినహాయింపు పొందాయి. పార్లమెంటులో ప్రాతినిధ్యానికి కూడా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ విధానం విస్తరించారు. ప్రెసిడెన్సీ ప్రాంతాలలోని సంస్థానాల్లో స్వాతంత్య్రం రావడానికి చాలాకాలం క్రితమే వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో 1806 తర్వాత విస్తృతస్థాయిలో కులాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 1881, 1931 మధ్య జనాభా లెక్కల సేకరణ సమయంలో ఈ ప్రక్రియ ఊపందుకుంది. మనుస్మృతి వంటి పురాతన గ్రంథాల ప్రకారం కులం అనేది ఒక వర్ణాశ్రమ ధర్మంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన రిజర్వేషన్ /ప్రాతినిధ్యం కల్పించేందుకు నిర్బంధ విద్యకు జ్యోతిరావు ఫూలే డిమాండ్ చేయడంతో 1882లో హంటర్ కమిషన్‌ను నియమించారు. ప్రభుత్వ సేవల్లో అర్హత ఉన్న స్థానిక పౌరులకే కాకుండా స్థానికేతరుల నియామకానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ట్రావెన్‌కోర్ సంస్థానంలో ఉద్యమం జరిగింది. దాంతో 1901లో మహారాష్టల్రోని కొల్హాపూర్ సంస్థానంలో సాహూ మహరాజ్ రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారు. బరోడా, మైసూర్ సంస్థానాల్లో రిజర్వేషన్లు అప్పటికే అమలులో ఉన్నాయి. 1921లో బ్రాహ్మణేతరులకు 44 శాతం, బ్రాహ్మణులకు 16 శాతం, ముస్లింలకు 16 శాతం, క్రైస్తవులకు 16 శాతం, ఎస్సీలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మద్రాస్ ప్రెసిడెన్సీ ఆదేశాలను జారీ చేసింది. 1935లో పుణే ఒప్పందం పేరుతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన తీర్మానం ప్రకారం అణగారిన వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని నిర్ణయించింది. 1942లో అంబేద్కర్ షెడ్యూల్డు కులాల పురోగతికి మద్దతుగా అఖిల భారత అణగారిన తరగతుల సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాల తీర్మానం స్వాతంత్య్రం రాగానే చేశారు. తర్వాత కాలేల్కర్ నివేదిక, మండల్ కమిషన్ తదితర కమిషన్లు ఇచ్చిన సూచన మేరకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కాపులు తమను బిసి జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల జాబితాలో చేర్చే అంశం అధ్యయనానికి జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. మరోపక్క కాపుల అభివృద్ధికి కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. బడ్జెట్‌లో కాపుల కార్పొరేషన్‌కు వంద కోట్ల రూపాయిల నిధులను కూడా కేటాయించింది. అయితే ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ‘కాపు గర్జన’కు పిలుపునిచ్చారు. అది కాస్తా హింసకు దారితీయడం, కొంతమంది కార్యకర్తలు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టడంతో వ్యవహారం గాడి తప్పింది. కాపులను తక్షణం బిసిలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఆమరణ దీక్షకు దిగారు. రాష్ట్ర మంత్రులు, కొంత మంది నాయకులు ముద్రగడకు నచ్చచెప్పి దీక్షను విరమింపచేయడంతో ప్రస్తుతానికి ఉద్రిక్త వాతావరణం సడలింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.