ఫోకస్

బాబు-కెసిఆర్‌ది రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాల వినియోగం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు చేయడంలో ఇరువురు కూడా పరస్పరం ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ, గౌరవించుకుంటున్నారు కదా! అదే విధానాన్ని ప్రజల సమస్యల సందర్భంగా కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప మరింత జటిలం చేయకూడదు. కృష్ణా జలాల వినియోగానికి చట్టపరమైన, స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పరిశీలించకుండా, అమలు చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు కెసిఆర్-చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బచావత్ కమిషన్ అవార్డు ప్రకారం సమైక్య ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్ర మధ్య కృష్ణా జలాల పంపిణీ జరిగింది. 811 టిఎంసిల నీటిని సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఇటీవల ఏర్పాటైన జస్టిస్ బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణాజలాల్లో తెలంగాణ 299 టిఎంసిలు, ఎపి 512 టిఎంసిల నీటిని వినియోగించుకోవాలని స్పష్టంగా కేటాయింపులు చేశారు. బ్రజేష్ కమిటీ తీర్పు అటు తెలంగాణ, ఇటు ఎపికి కూడా శిరోధార్యమే. రెండు రాష్ట్రాలు కూడా ఈ తీర్పును గౌరవించాలి, అమలు చేయాలి. కృష్ణా జలాల విధివిధానాల గురించి రాష్ట్ర విభజన చట్టం 84, 85, 86, 87 సెక్షన్లలో స్పష్టం చేశారు. జలాల వినియోగంకోసం కృష్ణా రివర్ బోర్డ్ అథారిటీని ఏర్పాటు చేశారు. కర్నాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తుంగభద్ర జలాల వినియోగం కోసం తుంగభద్ర రివర్ బోర్డు అథారిటీ పనిచేస్తోంది. ఏ పేచీ లేకుండా తుంగభద్ర జలాలను వినియోగించుకున్నారు. ఈ పరిస్థితిలో కృష్ణా జలాల వినియోగానికి కూడా ఎలాంటి పేచీ లేకుండా నియమ, నిబంధనలు, విధివిధానాలను రూపొందించుకోవచ్చు. ఇందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖల మంత్రుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి. రెండు ప్రభుత్వాల్లో చిత్తశుద్ది కూడా ఉండాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాల పాలకులకు లోపించింది చిత్తశుద్ధి మాత్రమే. కృష్ణాజలాల వినియోగానికి కొత్తగా ఏవైనా ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే, నిర్మించాలని నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అనుమతి తీసుకోవాల్సి ఉంది. రెండు ప్రభుత్వాలు కావాలనే, ఉద్దేశపూర్వకంగా తప్పుడు విధానాలను అవలంభిస్తున్నాయి. రెండు రాష్ట్రాల పాలకులు ఘర్షణ వైఖరి మానుకుని, సఖ్యతతో, సోదరభావంతో మెలగాలి. ప్రజల అవసరాలను తీర్చడంలో డ్రామాలు ఆడటం మానివేసి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి.

- కె. రామకృష్ణ కార్యదర్శి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్