ఫోకస్

మాతృభాషలో పట్టుంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరిక సమాజం మాతృభాషలో మాత్రమే మాట్లాడుతుంది - అనే ఇంగ్లీషు సామెత ఒకటుంది. మాతృభాషకు పాతరవేసే విధానాలవల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత లోపిస్తోంది. విషయాన్ని ఇతరులకు అర్థమయ్యే విధంగా మాట్లాడలేకపోతున్నారు. భావ వ్యక్తీకరణలో లోపం కొట్టుచ్చినట్లు కనపడుతోంది. అదే మాతృభాషలో పట్టుంటే, అన్ని భాషల్లో సులువుగా మాట్లాడవచ్చు. నేర్చుకుని రాయవచ్చు. బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి కారణమేంటి? బెంగాలీ భాషపై అప్పటి పాకిస్తాన్ పాలకులు నిషేధం విధించారు. మతం కంటే భాష గొప్పదని బంగ్లాదేశీయులు తిరుగుబాటుచేశారు. తమ సంస్కతిని, భాషను కాపాడుకున్నారు. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్‌గా అవతరించింది. తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాష మాట్లాడేవారిని చూస్తే వారి భాషపట్ల వారికి ఎనలేని మమకారం, అనుబంధం ఉంటుంది. అదేమి దురదృష్టమోకాని తెలుగుభాష మాట్లాడే వారిలో అది లోపించింది. మనం ఇంగ్లీషు మీడియం వ్యామోహంలో పడి మాతృభాషకు దూరమవుతున్నాం. ఈ రోజు ఇంగ్లీషు విద్యవల్ల అమ్మ, నాన్నను మమీ, డాడీ కల్చర్ పెరిగింది. అత్త, మామ, పిన్ని, బాబాయి, మేనమామ, మేనత్త అనే మాటలు పోయాయి. నాయనమ్మ, అమ్మమ్మకు మధ్య తేడాలేదు. అందరినీ అంకుల్, ఆంటీ అంటున్నారు. పిన్నికి, అత్తకు మధ్య తేడా లేదు. ఇవన్నీ చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. తెలుగు భాష వ్యాప్తికి పాటుపడిన మహనీయులు గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, గిడుగు శ్రీరామమూర్తి తెలుగు భాషను బతికించేందుకు జీవితాలను త్యాగం చేశారు. తెలుగు భాషను ఇంటర్ వరకు తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల విద్యార్థులు మాతృభాషకు దూరంకారు. కర్నాటక, తమిళనాడులో ఏ సిలబస్‌కు వెళ్లినా తప్పనిసరిగా వారి స్థానిక భాషను చదవాల్సి ఉంటుంది. మాతృభాషలో విద్యాబోధనకు ప్రభుత్వం సంకల్పించాలి. భాషా ప్రియులు, పెద్దల సలహాలను తీసుకోవాలి. ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధనవల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారు. లేని పక్షంలో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు మాదిరిగానే మాతృభాష తెలియని విద్యార్థులు వ్యవహరిస్తారు.

- షేక్ సలాం బాబు అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం