ఫోకస్

అవినీతిని పారద్రోలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టాల్సిందే. ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. నీటి పారుదల ప్రాజెక్టు అంటే.. అవినీతికి చిరునామాగా మారింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారింది. అక్రమాలకు నీటి పారుదల ప్రాజెక్టులు చిరునామాగా మారాయి. అదే విధానం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోందనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ, ప్రాజెక్టుల వ్యయం ఏయేటికాయేడు పెరుగుతుంది. అందులో సందేహం లేదు. అయితే ఈ పెరుగుదల శాస్ర్తియంగా ఉండాలి. గత ప్రభుత్వాలు రూపొందించిన సాగునీటి పారుదల డిజైన్లను టిఆర్‌ఎస్ పూర్తిగా మార్చివేస్తోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో శాస్ర్తియత లేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 35వేల కోట్ల రూపాయలతో చేపట్టగా దీని డిజైన్ మార్చి 80వేల కోట్ల రూపాయలకు పెంచారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రాజెక్టుల డిజైన్‌ను మార్చివేస్తూ, వ్యయం పెంచుతుండటంతో ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులను ఒక పర్యాయం డిజైన్ చేసిన తర్వాత మళ్లీ దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మారిస్తే ఎందుకు మార్చాల్సి వస్తుందో ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయం అధికారంలో ఉన్నవారికి అర్థం కావలసి ఉంది. వైఎస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో వెలుగుచూసిన అవినీతి తరహాలోనే ఇప్పుడు కూడా అవినీతి పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో పారదర్శకత, శాస్ర్తియత ఉండాలి. పేర్లు, డిజైన్‌లు మార్చడంవల్ల కీర్తి తమకే రావాలన్న ఆశయం, ఆశ టిఆర్‌ఎస్ నేతలకు ఉన్నట్టు అనిపిస్తోంది. ఇతర పార్టీలకు, ఇతర నేతలకు పేరు రావడం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ఇష్టం లేదనిపిస్తోంది. అందుకే ఆయన చేపట్టే ప్రతి పని వెనుక టిఆర్‌ఎస్ ముద్ర ఉండేలా చూస్తున్నారు. విపక్షాలకు విలువ ఇస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల రూపకల్పనలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది.

- కె. నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి