గుంటూరు

హస్తినకు కోడెల.. తనయుడు అమరావతికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 1: రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓపేజీని సృష్టించుకుని తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి తిరుగులేని నేతగా నిలుస్తూ వస్తున్న ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు హస్తినకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశే్లషకులు. అరుసార్లు శాసనసభకు ఎన్నికైన డాక్టర్ కోడెల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పార్లమెంటులో అడుగిడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తనయుడు డాక్టర్ శివరామ్‌ను నర్సరావుపేట లేక సత్తెనపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు పంపించాలని నిర్ణయించినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనికి అటు అధిష్టానం, ఇటు కేడర్ నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాగానే తండ్రి, తనయుల అభ్యర్థిత్వాలను ప్రకటించనున్నారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి గెలుపొందిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు అటు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల సమాన అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ జంట నియోజకవర్గాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకునేలా కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు శివరామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి నిజమైన లబ్ధిదారులకు అందేలా చూస్తూ వచ్చారు. రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేడర్, నాయకులు బలంగా ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలను పేద, బడుగు, బలహీనవర్గాల వారి దరికి చేర్చి పార్టీకి వారి ఆదరణ, అభిమానాలను దూరం కాకుండా చేయడంలో సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు. రెండు నెలల్లో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అటు కోడెలకు పార్లమెంటు, తనయుడికి శాసనసభ టిక్కెట్లు ఇచ్చినట్లయితే పార్టీని తిరిగి విజయపథంలో నడిపించేందుకు నేతలతో పాటు కార్యకర్తలు, యువత సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండవతరం నాయకులు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో శివరామ్‌ను పోటీకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ కరణం బలరామ్, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్‌లు తమ తనయులు, కుటుంబ సభ్యులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో శివరామ్ పోటీకి మార్గం సుగమం కానుంది.

దివ్యాంగుల భారీ ర్యాలీ
గుంటూరు (కొత్తపేట), మార్చి 1: ఆంధ్రులను అన్ని విధాలా మోసం చేసిన ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం రావడాన్ని నిరసిస్తూ రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బృందావన గార్డెన్స్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అధికసంఖ్యలో దివ్యాంగులు మోటారు వాహనాలపై బస్టాండ్ వద్ద గల ఎన్‌టిఆర్ విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన మోదీ, రాష్ట్రంపై కక్షసాధింపు కొనసాగిస్తున్నారని గోనుగుంట్ల మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి, ఇంత జరుగుతున్నా నోరుతెరిచి మాట్లాడని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌టియుసి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, కృష్ణ, శివప్రసాద్, బ్రహ్మయ్య, లక్ష్మణ్, దుర్గారావు, నరసింహారావు, జాకోబ్, చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.

విభజన హామీలు నెరవేర్చేవరకు తెలుగుజాతి విశ్వసించదు
* ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్
* మోదీ విశాఖ పర్యటనపై ‘దేశం’ శ్రేణుల నిరసన
గుంటూరు (కొత్తపేట), మార్చి 1: భారత పార్లమెంటు సాక్షిగా ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చేవరకు మోదీ, ఆ పార్టీ నేతలను తెలుగుజాతి విశ్వసించబోదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టంచేశారు. శుక్రవారం మోదీ విశాఖ పర్యటనను గర్హిస్తూ స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి, మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా 29 సార్లు ఢిల్లీకి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా మోదీ స్పందించలేదన్నారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి అమరావతి వచ్చి రాజధాని నిర్మాణాన్ని చేపడితే 29 గ్రామాల ప్రజలు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే కన్నుకుట్టిన మోదీ రాష్ట్ర ప్రజలను అవమానపరిచేలా కుండ మట్టి, నీరు ఇచ్చి వెళ్లారని మండిపడ్డారు. హుదుద్, తిత్లీ తుఫాన్‌లను పట్టించుకోక పోవడం, ఉక్కు కర్మాగారం, రైల్వే డివిజన్, చెన్నై కారిడార్, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీలను పట్టించుకోకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రులను మోసం చేసిన బీజేపికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సుబ్బారావు, షేక్ లాల్‌వజీర్, షేక్ మస్తాన్‌వలి, ఆవుల వీరశేఖర యాదవ్, మానుకొండ శివప్రసాద్, సముద్రా కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి రెట్టింపుతో లబ్ధిదారుల్లో హర్షం
* జిల్లాలో 40,480 మందికి ప్రయోజనం
* నేటి నుంచి ఖాతాల్లో జమకానున్న రూ.8.09 కోట్లు
గుంటూరు, మార్చి 1: నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. రాష్ట్రప్రభుత్వం అందించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగ భృతిని రెట్టింపు చేయడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. పథకం ప్రకటించినప్పుడు వెయ్యి రూపాయలు అందించిన ప్రభుత్వం మార్చి నెల నుండి రెట్టింపు చేస్తూ 2 వేల రూపాయలకు పెంచింది. జిల్లా వ్యాప్తంగా 40,480 మంది లబ్ధిదారులకు 8,09,60,000 రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. మార్చి నెల నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ వారి వారి ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రెట్టింపు భరోసా అందనుండటంతో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కోచింగ్, ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నగదును ఉపయోగించుకునేలా నిరుద్యోగ యువత ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు ఆయా సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా అర్హులైన వారు నిరుద్యోగ భృతి కోసం నేరుగా ఆన్‌లైన్‌లో కేటాయించిన వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అర్హులైనప్పటికీ అనర్హులుగా వచ్చినట్లయితే 1100కు కాల్‌చేసి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు వివిధ సామాజిక పింఛన్లు తీసుకుంటున్నప్పటికీ సంబంధిత కుటుంబంలోని నిరుద్యోగి పథకానికి అర్హులే అవుతారని అధికారులు స్పష్టంచేశారు. ప్రాథమికంగా 22 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలని, డిగ్రీ, పిజి, డిప్లమో పూర్తిచేసి కనీసం ఏడాది గడవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం అయి ఉండాలని, తెల్లరేషన్‌కార్డు తప్పనిసరిగా కలిగి ఉండటంతో పాటు ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు.

సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళన
సత్తెనపల్లి, మార్చి 1: సమస్యల పరిష్కరించాలనే డిమాండ్‌తో మున్సిపల్ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు దిగి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కార్మిక సంఘాలు పిఎఫ్ తదితర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించబోమని మున్సిపల్ కమిషనర్‌కు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, ఎఐటియుసి నేత నరిశేటి వేణుగోపాల్ కార్మికులనుద్దేశించి ప్రసంగించారు.

జిల్లాలో నూరుశాతం అక్షరాస్యత సాధించాలి
గుంటూరు (పట్నంబజారు), మార్చి 1: జిల్లాలో సీజనల్ హాస్టళ్లు, రెసిడెన్సియల్ స్పెషల్‌ట్రైనింగ్ సెంటర్‌లు, అర్బన్ రెసిడెన్షియల్ హాస్టళ్లలో నూరుశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేయాలని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ పిల్లి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరంపాలెంలోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఎన్జీవోలతో జరిగిన సమీక్షా సమావేశంలో రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు సమష్టిగా కృషిచేయాలన్నారు. వలసలను నివారించేందుకు సీజనల్ హాస్టళ్లను, డ్రాపౌట్స్‌ను, వీధిబాలురను రెసిడెన్షియల్ స్పెషల్ సెంటర్లలోనూ, భిక్షాటన చేసే వారిని, కాగితాలు ఏరుకునే వారి కోసం అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్‌లను సమగ్ర శిక్షా అభియాన్ నిర్వహిస్తుందన్నారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం, భోజనం అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రత్యామ్నాక పాఠశాల కో-ఆర్డినేటర్ టియు మనోరంజని, పాఠశాల కో-ఆర్డినేటర్ ఎ నాగేశ్వరరావు, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలి
తాడేపల్లి, మార్చి 1: సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని కెఎల్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగయ్య అన్నారు. మండల పరిధిలోని వడ్డేశ్వరం కెఎల్‌యులో శుక్రవారం సెంటర్ ఫర్ యాక్టివిటీస్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా రంగయ్య హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సమాచార హక్కుచట్టం భారతదేశంలో అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ఎంతో గొప్పదని, ఏ ప్రభుత్వ కార్యాలయం, ప్రైవేటు సంస్థలలోనైనా సమాచారం పొందే హక్కు ప్రజలకు కల్పించబడిందన్నారు. ఈ చట్టం ద్వారా సమాజాన్ని బాగుపర్చవచ్చన్నారు. వాస్తవాలు నిజాయితీ కోసం న్యాయపరమైన హక్కుల కోసం ప్రశ్నించే తత్వం ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, యువత కృషిచేయాలన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం అక్టోబర్ 12, 2005 సంవత్సరంలో భారతదేశమంతటా అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, వారి నెంబర్లు ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి, ప్రొ వైస్ ఛాన్సలర్ ఎ రామకుమార్, విద్యార్థి విభాగపు అధిపతి హబీబుల్లా ఖాన్, అసిసోసియేట్ డీన్ కె రవీంద్రనాధ్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సూపర్ హీరో అభినంద్‌కు బీజెపీ, టీడీపీ నేతల అభినందనలు
తెనాలి, మార్చి 1: యుద్ధ కైదీగా పట్టుబడ్డ భారత ఎయిర్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం బేషరతుగా విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకసని తెనాలి గాంధీచౌక్‌లో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తూ స్వీట్లు పంపిణీచేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అభినందన్ విడుదల భారతదేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దౌత్యవిజయానికి నాంధీగా పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ కార్యదర్శి వీరవల్లి మురళీ, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సౌపాటి కిరణ్‌ల ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గాంధీచౌక్‌లో అభినంద్ విడుదలకు హర్షం వ్యక్తంచేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. భారతీయుల ఐకమత్యం, ధీరత్వానికి అభినంద్ విడుదల తార్కాణంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీతులసీ, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, అశోక్‌వర్ధన్, పూర్ణచందరావు తదితరులు పాల్గొన్నారు.

మోదీకి అంగన్‌వాడీల నిరసన
సత్తెనపల్లి, మార్చి 1: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర అంగన్‌వాడీ అధ్యక్షురాలు భీమనేని వందనాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్తెనపల్లి పట్టణంలోని వెలుగు కా ర్యాలయం వద్దనుండి తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తోట అంబిక, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కోలాహలంగా కిట్స్ యువ-2019 వేడుకలు
వట్టిచెరుకూరు, మార్చి 1: మండలంలోని వింజనంపాడు పరిధిలో ఉన్న కెకెఆర్ అండ్ కెఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యువ-2019 వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ చైర్మన్ కె లక్ష్మీనారాయణ హాజరయ్యారు. తొలుత జాతీయ స్పోర్ట్స్ సందర్భంగా మార్చ్‌పాస్ట్ నిర్వహించి, జాతీయపతాకాన్ని ఎగురవేసి, క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ నేడు మన రాష్ట్రం సాంకేతికాభివృద్ధిలో దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థులందరికీ ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషిచేస్తుందన్నారు. అత్యంత వ్యయ ప్రయాసలతో కిట్స్ కళాశాల యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ పోటీప్రపంచంలో విద్యార్థులకు భాష, సాంస్కృతిక నైపుణ్యాలు అత్యంత అవసరమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచేలా ఉన్నాయన్నారు. కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ కిట్స్ యువ వేడుకల నిర్వహణ ఒక లక్ష్యంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎం బసవేశ్వరరావు, కార్యదర్శి కోయి శేఖర్, ప్రిన్సిపాల్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, సీపీఎం నేతలు- వైసీపీకి రాజీనామాలు
మంగళగిరి, మార్చి 1: మంగళగిరి మున్సిపల్ కౌన్సిల్‌లో టీడీపీ సీనియర్ కౌన్సిలర్ ఉడతా శ్రీను, బీజేపీ ఫ్లోర్ లీడర్ మునగపాటి వెంకటేశ్వరరావు, సీపీఎం కౌన్సిలర్ వంగర శకుంతల, మంగళగిరి మండల పరిషత్‌లో టీడీపీ ఫ్లోర్ లీడర్ బొక్కా నరసింహారావు తదితరులు శుక్రవారం ఆయా పార్టీలకు రాజీనామా చేసి వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు వేసి జగన్ సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు దొంతిరెడ్డి శంకరరెడ్డి, మున్నంగి గోపిరెడ్డి ఆయా పార్టీల నేతలను వైసీపీలో చేర్పించారు. ఉడతా శ్రీనుకు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు శంకరరెడ్డి, గోపిరెడ్డి జగన్‌కు సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఉడతా శ్రీను, బొక్కా నరసింహారావులను టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీకి తానే రాజీనామా చేశానని, బహిష్కరించినట్లు చిరంజీవి ప్రకటన విడుదల చేయటం హాస్యాస్పదంగా ఉందని ఉడతా శ్రీను పేర్కొన్నారు. ఇలావుండగా స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కు సమాచారం లేకుండా వైసీపీ నేతలు దొంతిరెడ్డి శంకరరెడ్డి, గోపిరెడ్డి శుక్రవారం మంగళగిరికి చెందిన టీడీపీ, బీజేపీ, సీపీఎం నేతలను జగన్ వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్పించి ఉడతా శ్రీనుకు అసెంబ్లీ టిక్కెట్‌కు సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పట్టణ, మండల కన్వీనర్లు మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి మండల, పట్టణ కన్వీనర్లు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, దుగ్గిరాల మండల వైసీపీ అధ్యక్షుడు వై సాయికృష్ణ, బూత్ కమిటీల కన్వీనర్ పచ్చల శ్యాంబాబు, యూత్ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ తదితరులు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది. ఒక వర్గం ఎమ్మెల్యే ఆర్కేకు అండగా ఆయనకే సీటివ్వాలని, మరోవర్గం ఉడతా శ్రీనుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని అధినేత ముందు తమ వాదన వినిపిస్తున్నాయి.