Others

మేలైన ఆలోచన ... మెరుగైన జీవితానికి భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతి బోండియా... ఆడుతూ పాడుతూ కాలం గడిపే ప్రాయంలో ఉన్న ఓ కాలేజీ విద్యార్థిని. ఆపదలో వున్న వారిని ఆదుకోవడమంటే వారికొక పూట భోజనం పెట్టడమో లేదా ఓ పది రూపాయలు ఇవ్వడమో కాదు.. అలా చేస్తే వారిని భిక్షాటనకు మరింతగా ప్రోత్సహించడమే అవుతుంది. అదే వారికి ఒక స్థిరమైన పనిని కల్పించినట్టయితే వారికి జీవితాన్నిచ్చినట్టవుతుంది. ఇదే స్వాతి బోండియా ఆలోచన. ఆ ఆలోచనే దాదాపు 36 కుటుంబాలకు జీవనోపాధిని కల్పించింది. వారు గౌరవగా బ్రతకడానికి అవకాశాన్నిచ్చింది. పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, నాలుగు రోడ్ల కూడళ్లలోను చిన్నపిల్లలు, ముసలివాళ్లు, స్ర్తిలు భిక్షాటన చేయడం మనం తరచూ చూస్తుంటాం. అలాంటి ఒక పసిపిల్ల బెంగుళూరులోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తారసపడింది స్వాతి బోండియాకు. ఆకలితో ఉన్నానని డబ్బులివ్వమని ప్రాధేయపడింది. పసిప్రాయంలో అలా భిక్షాటన చేస్తున్న ఆ పిల్లను చూసి జాలిపడింది స్వాతి. అయినా డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఆ పిల్లకు భోజనం పెట్టించి, బట్టలు కొనిచ్చింది. అయినా ఆ పిల్ల మాత్రం తనకివేవీ వద్దని, కేవలం డబ్బులు మాత్రమే కావాలని, డబ్బులు పట్టుకెళ్లకుండా ఇంటికి వెళితే తన తల్లి తనను కొడుతుందని ఏడ్చింది. అప్పుడర్థమయింది స్వాతికి ఆ పిల్ల పరిస్థితి. ఆ పిల్లదే కాదు చాలామంది భిక్షగాళ్ళ పరిస్థితి అదేనని కూడా అర్థమయింది.
ఆ క్షణంలోనే స్వాతి మనసులో వారినెలాగైనా ఆ పరిస్థితి నుంచి బయటపడేయాలని, దానికి తగిన సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ పిల్ల వెంటే వాళ్ల నివాసం దగ్గరకు వెళ్లింది. భిక్షాటన మాని, పనిచేసుకుంటూ జీవించమని, వారికి తాను పని కల్పిస్తానని భరోసా ఇచ్చింది. అయితే ఆ ప్రయత్నంలో వారికి పని కల్పించడం అంత సులభమైన విషయం కాదని అర్థమయింది స్వాతికి. ఆ ప్రయత్నాలలోనే ఒకసారి వారిని కలిసిన స్వాతికి రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ కుటుంబానికి అందమైన బొమ్మలు చేయడం చక్కగా చేతనవుతుందనే విషయం తెలుసుకుంది. ఇంకేం వారికి చేతనైన ఆ పనినే వారికి ఉపాధిగా మలచాలనుకుని తన దగ్గరున్న 250 రూపాయలతో బొమ్మలు చేయడానికి కావలసిన పరికరాలను తీసుకొచ్చి వారిని పనిచేయమని ప్రోత్సహించింది. అలా తయారైన బొమ్మలను రోడ్ల కూడళ్లలో అమ్మించింది. అలా అమ్మగా వచ్చిన ఆదాయం 750 రూపాయలు. దాంతో స్వాతికి నమ్మకం కలిగింది. వారిలాంటి వారికి సహాయం చేయడానికి ఇదే మంచిదారి అని. ఈ కుటుంబమే కాదు, ఇతర రాష్ట్రాలనుంచి నిస్సహాయంగా బతుకుతున్న ఎన్నో కుటుంబాలు ఇలాగే ఉన్నాయని తెలుసుకొని, వారందరికీ కూడా ఒక ఉపాధి కల్పించాలన్న ఆశయంతో 2011లో శాంతి ట్రేడర్స్ అన్న పేరుతో ఒక పరిశ్రమను ప్రారంభించింది. ఇదంతా ఐదేళ్ల క్రితం స్వాతి బోండియాకు 18 ఏళ్ల వయసులో జరిగింది. ఇప్పుడా పరిశ్రమలో దాదాపు 39 కుటుంబాలవారు ఉపాధిని పొందుతున్నారు. ఎవరికి చేతనైన వృత్తిని వారు చేస్తూ ఒక స్థిరమైన జీవితాల్ని జీవిస్తున్నారు. ఇక్కడ తయారైన వస్తువులను కార్పొరేట్ సంస్థలకు, ఇతర గుర్తింపు పొందిన పెద్ద పెద్ద సంస్థలకు కూడా విక్రయిస్తూ వచ్చిన లాభాలతో వారి కుటుంబాలకు, వారి పిల్లలకు కావలసిన విద్య, వైద్యం లాంటి అన్ని అవసరాలను తీరుస్తోంది. ఈ సంఖ్యను ఇంకా పెంచి 2018 నాటికి తన స్వంత రాష్టమ్రైన ఒడిసా, తను చదువుకున్న కర్నాటక రాష్ట్రాలలో రెండు వేల కుటుంబాలకు ఉపాధిని కల్పించాలన్నదే తన లక్ష్యంగా చెప్తుంది . ఎన్‌రిచ్ అన్న సొంత కంపెనీని ఏర్పాటుచేసి 12 గ్రామాలలోని విద్యార్థులకు లక్షలాది రూపాయలను స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. స్వాతి బోండియా సేవను గుర్తించిన ఐక్యరాజ్య సమితి కొలంబియాలో జరిగే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఛాలెంజ్ 2014కి స్వాతిని భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఆహ్వానించింది. గత సంవత్సరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్‌కు నామినేట్ అయిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం మన దేశంలోని పలు యూనివర్సిటీలతోపాటు మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఇతర దేశాలలో కూడా శిక్షణా కార్యక్రమాలకు హాజరై వేలాదిమందికి తన సూచనలు, సలహాలు అందిస్తోందీ 23 ఏళ్ల యువతి.

-మావూరు విజయలక్ష్మి