రాష్ట్రీయం

తిరుమలలో వైభవంగా రథసప్తమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 24: సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం విశేషం. వాహన సేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ.1564 నుంచి జరపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధవాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
సూర్యప్రభ వాహనం
బుధవారం తెల్లవారు జామున 5.30 నుంచి 8గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్యభగవానుడు తన ఉషారేఖలను ఉదయం 7.04 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఉదయాత్పూర్యం నుంచి ఎంతో ఆసక్తితో నిరీక్ష్తిన్న వేలాదిమంది కన్నులు ఒక్కసారిగా భక్తిపారవశ్యంతో పులకించాయి. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది.
కాగా రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, శ్రీ వేంకటేశ సప్తవాహన స్తోత్రమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చి అనంతరం విద్యార్థులు లయబద్దంగా శ్లోకాలు ఆలపించారు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. ఉదయం 11గంటలకు స్వామివారికి ఎన్ని వాహన సేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరుదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తర్వాత ఉదయం 1గంటలకు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడా వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
చక్రస్నానం
తిరుమలలో రథసప్తమి ఉత్సవంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సుదర్శన చక్రత్తాళ్వారుల వారికి చక్రస్నానం వరాహ పుష్కరణిలో వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు ఆలయాన్ని ప్రవేశించిన తరువాత అర్చక స్వాములు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను మాడ వీధుల్లో ఊరేగిస్తూ వరాహ స్వామి ఆలయం వద్దకు చేర్చారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వార్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి, స్వామి పుష్కరణిలో తీర్థస్నానం చేయించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు,సకల కోర్కెలను తీర్చే దైవ వృక్షమైన కల్పవృక్ష వాహనంపై స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి తిరు వీధుల్లో ఊరేగుతూ అనుగ్రహించారు.
సర్వభూపాల వాహనం
సాయంత్రం 6గంటలకు తిరుమల మాడ వీధుల్లో సకల చరాచర జగత్పాలకుడైన స్వామివారు రాజసం ఉట్టి పడుతుండగా, ప్రౌఢ గాంభీర్యంతో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ హస్తాన్ని అనుగ్రహించారు.
చంద్రప్రభ వాహనం
రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ఉదయం భానుని లేలేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్తవాహనశోభ వెనె్నల రేడైన చంద్రుని చల్లనికాంతులు తాకేవేళ చంద్రప్రభ వాహన సేవతో ముగిసింది. ఆ తరువాత స్వామివారు దేవేరులతో కలసి బంగారు పీఠంపై ఆసీనుడై ఆలయ ప్రవేశం చేయడంతో రథసప్తమి వాహన వేడుకలు ముగిశాయి. ఈకార్యక్రమంలో టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, జే ఈ ఓ శ్రీనివాసరాజు, సీవీ ఎస్వో రవికృష్ణ, ఆలయ డిప్యూటి ఈ ఓ కోదండరామారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.