Others

జంధ్యాలవల్లే ఆ పాత్ర చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వంకాయల సత్యనారాయణ మూర్తి

నటుడిగా ప్రస్థానం..
నేనసలు నటుడినే కాదు. నటుడనేవాడు కారణజన్ముడని, జన్మతః నటుడిగా పుడతారని నా గురువు కుప్పిలి వెంకటేశ్వరరావు అంటూంటే.. అదొక ఛాలెంజ్‌గా తీసుకొని నటుణ్ణయ్యాను. చాలెంజ్‌లకు తగ్గట్టుగా నన్ను నేను వౌల్డ్ చేసుకోవడం నాకున్న ఓ బలహీనత. తొలిసారిగా ‘కొడుకు పుట్టాల’ నాటకంలో రెండున్నర నిమిషాల పాత్ర చేశా. తరువాత కూడా అవసరార్థమే నాటకాల్లో నటించాల్సి వచ్చింది. తొలి సినిమా ‘నీడలేని ఆడది’ ఆడిషన్స్‌కు వెళ్లినపుడు అనేకమంది తెలిసినవాళ్లే అక్కడ ఎంపికవ్వడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో అసిస్టెంట్ టు కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్న నేను అప్పుడప్పుడు ఎవరైనా అడిగితేనే ఆయా పాత్రల్లో నటించాను. రెండో చిత్రం అయినవాళ్ళు, మూడో చిత్రం అత్తవారిల్లు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన అత్తవారిల్లు చిత్రంలో జి.వరలక్ష్మితో పెయిర్‌గా నటించాల్సి వచ్చింది. ఆమె నాకన్నా సీనియర్ నటి. తొలి షాట్ ముగిశాక దర్శకుడితో ఆమె.. ఎవరో కొత్త కుర్రాణ్ణి తీసుకొచ్చావ్. నన్ను చూసి భయపడుతున్నాడు అన్నదామె. అప్పుడు ప్రత్యగాత్మ.. భయపడమని నేనే చెప్పా. అది సీన్లో ఒక భాగమే. అంతేగాని అతనికెలాంటి భయాల్లేవు. రెండు మూడు రోజుల్లో మీరే అతన్ని మెచ్చుకుంటారు అన్నారు. ఆ చిత్రంలో కళ్లజోడు తీసి కెమెరాను పిలిచి ఓ డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్‌ను సింగిల్ షాట్‌లోనే ఓకె చేయడంతో యూనిట్ అంతా మెచ్చుకున్నారు.
ప్రత్యగాత్మ టేకింగ్...
ఆయన కుర్చీ డైరెక్టర్. కుర్చీలో కూర్చునే అన్నీ చేసేవారు. ముందుగా ఆయన అనుకున్న షాట్‌ను నటీనటులకు వివరిస్తారు. వెళ్లి చేయండి అంటారు. చేశాక ఓకె కట్ అంటారు. తరువాత దగ్గరికి పిలిచి, గతంలో ఓ జ్ఞాపకాన్ని నటీనటులకి ఓ కథలా చెబుతారు. ఆ కథతోనే షాట్‌లోవున్న నటీనటులు ఆ పాత్ర మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఆర్టిస్టుకు తెలియకుండానే ఆ పాత్రను నటుడిలో నిక్షిప్తం చేయడంలో ప్రత్యగాత్మ శైలి. అలా తానేం కావాలనుకున్నాడో ఆర్టిస్టుల నుంచి అది తీసుకోగలడు. నేనెప్పుడూ సెకెండ్ టేక్ తీసుకోలేదు.
ఎన్టీఆర్‌తో అనుబంధం
టైగర్ చిత్రంలో ప్రధాన విలన్ నేను. మొదట మా ఇద్దరి కథ చిత్రంలో ఒకే ఒక్క షాట్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. షాట్‌పై క్లాప్ కొట్టడానికి ముందు సెట్‌లోకి ఎన్టీఆర్ వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. నేను నిలబడలేదు. ఎవరు మీరు అని అడిగారు ఎన్టీఆర్. నా పేరు వంకాయల సత్యనారాయణ. మాది వైజాగ్. ఇంతకన్నా మీకు అవసరం లేదు అన్నాను. ఆయన నవ్వి భలే చెప్పారే, ఐ లైక్ ఇట్ బ్రదర్ అని నవ్వేశారు. తరువాత మా ఇద్దరి అనుబంధం అనేక చిత్రాల్లో సాగింది.
స్టేషన్ మాస్టర్‌గానే గుర్తింపు...
కె.విశ్వనాధ్ ఓ నాటకంలో నన్ను చూసి మనమొకసారి కలుద్దామన్నారు. తరువాత కురబల కోటలో సీతామలక్ష్మి షూటింగ్ మొదలుపెడుతున్నాం, రమ్మన్నారు. వైజాగ్ నుంచి అక్కడికి రైల్లో వెళ్తుండగా నా పాత్ర ఏమిటని మాటల రచయిత జంధ్యాలను అడిగాను. ఐదు సీన్లతో వుండే స్టేషన్ మాస్టర్ పాత్ర అన్నారు. నాకు తెలిసిన వ్యక్తికి అదే చిత్రంలో 55 సీన్లు పాత్ర ఉందన్నారు. నేను వెంటనే పక్క స్టేషన్‌లో దిగి వెళ్లిపోతానన్నాను. అంత చిన్న పాత్ర చేయనన్నాను. తరువాత జంధ్యాల 55 సీన్ల పాత్ర ప్రాధాన్యతను, ఐదు సీన్ల పాత్ర ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో, ఐదు సీన్ల పాత్రనే ఎంచుకున్నాను. అదే సీతామాలక్ష్మి చిత్రంలో స్టేషన్‌మాస్టర్ పాత్ర. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా స్టేషన్ మాస్టర్‌గారూ రిటైరయ్యారా? అని అడిగే అభిమానులను చూస్తుంటే ఆనందం కలుగుతుంది. విశ్వనాథ్ దర్శకత్వంలో అలా శుభలేఖ, శృతిలయలు, సాగరసంగమం, సూత్రధారులులాంటి చిత్రాల్లో నటించాను.
నేటి సినిమా పరిస్థితి
నేటి సినిమాలను తలచుకుంటే బాధగా, కోపంగా ఉంది. ఆశ్రయించి, ఆధారపడి హీరోల చుట్టూ కథలు అల్లుకుంటూ, కాల్షీట్లు వచ్చాక కథేంటి అని చూసుకునే నిర్మాత, దర్శకులు ఉన్నంతకాలం పరిశ్రమ ఇలానే తగలబడిపోతుంది. ఇప్పుడు పరిశ్రమ అంటే ఒకప్పుడు వ్యాపారం అన్నమాట ఉండేది. ఇపుడది కూడా కాదు, విలాసాలమయం అయింది. తాము పెట్టిన డబ్బు తిరిగి రప్పించుకోవడం కోసం చిన్న సినిమాలను చంపేస్తున్నారు. పిచ్చి పిచ్చి కథలతో సినిమాలు తీయడంవల్ల అవన్నీ ఎక్కువ థియేటర్లలో వేయడంవల్ల, ప్రేక్షకుడు గతిలేక ఏదో సినిమా చూడటంవల్ల, రెండు మూడు వారాలకన్నా పెద్ద సినిమాలు కూడా ఆడడంలేదు. ఒక సినిమా హిట్ అయిందని దర్శకుడు, హీరో మీసాలు మెలేస్తే, అది తప్పు. ఆ దర్శకుడు ఒక్క హీరోతోనే ఒక సినిమా తీసి హిట్ చేయమనండి చూద్దాం. సినిమా అంటే అందరూ కలిసి చేస్తేనే గొప్పగా వస్తుంది. ప్రస్తుతం అలా లేదు. హీరోతోనే సినిమా పూర్తవుతుందని గుడ్డిగా నమ్ముతున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. తాలం, గొల్లెం, పెల్లంలాంటి మాటలు మాట్లాడే నటీనటులు వచ్చేశారు. తెలుగు భాషను వీరంతా ఖూనీ చేస్తున్నారు. భాష తన ఉనికిని తెలుగు సినిమాలవల్ల కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కండలు చూపిస్తున్నారు కానీ, గుండెల్లో వుండే దమ్ము చూపడం లేదు ప్రస్తుతం దర్శక నిర్మాతలు, హీరోలు. ఇప్పటివాళ్లంతా ఆర్ట్ఫిషియల్ రెస్పెక్ట్ చూపిస్తుండడం బాధగా వుంది.
రీ ఎంట్రీ...
గాజులపల్లి త్రివిక్రమ్ అనే ఓ కుర్రాడు ఓ మంచి కథ రాసుకుని వీణావేదిక అనే పతాకంపై ‘కారం దోశ’ అనే చిత్రాన్ని రూపొందించాడు. అమెరికాలో ఉద్యోగం చేసే అతను, కేవలం కథా స్క్రీన్‌ప్లే లాంటి విషయాలపై ముందుగా అన్నీ రాసుకుని 45 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాడు. ఈ చిత్రంలో నేనే ప్రధాన పాత్రలో నటించాను. దర్శకుడు మళ్లీ అమెరికానుంచి వచ్చి డబ్బింగ్ తదితర కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తాడు. గాజులపల్లి త్రివిక్రమ్ వెల్ డిసిప్లెయిన్డ్. తనకు ఏం కావాలో తెలుసు. తనకంటూ ఓ గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్న కుర్రాడు అతడు.
నా గురించి..
17 ఏళ్ల వయసులోనే 1960లో అప్పటి భారత ప్రెసిడెంట్‌కు, ప్రైమ్‌మిస్టర్‌కు, లేడీ వౌంట్‌బాటన్‌కు, డిఫెన్స్ మినిస్టర్ కృష్ణమీనన్‌కు, త్రీ చీఫ్స్‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా ఓ వారం రోజులు వ్యవహరించాను. అది ఇప్పటికీ నాకు తీపి గుర్తే! బాక్సింగ్, రెజ్లింగ్, బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లాంటి వాటిల్లో ప్రావీణ్యం వుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఆల్‌రౌండర్‌ని. మారథాన్ రన్నర్‌ను. క్వాలిఫైడ్ ఎకౌంటెంట్‌ను. చార్టెడ్ ఎకౌంటెంట్‌ను. క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీని. క్వాలిఫైడ్ అడ్వకేట్‌ని. క్వాలిఫైడ్ శానిటరీ సూపర్‌వైజర్‌ను. క్వాలిఫైడ్ కోఆపరేటివ్ డైరెక్టర్‌ను. హిందీ టీచర్‌ను. స్టెనోగ్రాఫర్‌ను. ఇన్ని చేయగలను కాబట్టే సినిమాలు లేకపోయినా సంతోషంగా ఉన్నాను.

- సరయు