రాష్ట్రీయం

జ్యుడీషియల్ రిమాండ్‌కు అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 12: డిపాజిటర్లను భారీగా మోసం చేశారనే అభియోగంపై సిబిసిఐడి పోలీసులు అరెస్టుచేసిన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావుకు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. అగ్రిగోల్డ్ సంస్థలో పదివేలు డిపాజిట్ కాలపరిమితి ముగిసినా చెల్లించలేదని ఘంటశాల వెంకన్నబాబు అనే బాధితుడు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు 2015 జనవరి 2న తొలికేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను సిబిసిఐడి అధికార్లు శుక్రవారం ఏలూరు తీసుకువచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎ హరిహరనాథశర్మ ఎదుట వారిద్దరిని హాజరుపర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి సక్రమంగానే ఉందని నిర్ధారించుకుని ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా జైలు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పత్రికల ద్వారా వీరిద్దరి అరెస్టు తెలుసుకున్న అగ్రిగోల్డ్ సంస్థ స్థానిక ఏజెంట్లు, డిపాజిటర్లు పెద్దఎత్తున జిల్లా కోర్టుకు చేరుకున్నారు. పోలీసులు వ్యూహాత్మకంగా అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలను న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరుపర్చటంతో వారంతా కొంత అసంతృప్తికి గురయ్యారు. అనంతరం నిందితులను వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకువస్తారన్న సమాచారంతో వారంతా పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఇలాంటి పరిణామం చోటుచేసుకుంటుందన్న ఉద్దేశ్యంతో పోలీసులు కూడా పెద్దసంఖ్యలోనే మోహరించారు. వైద్యపరీక్షల అనంతరం వారిద్దరిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఏజెంట్లు, డిపాజిటర్లు పెద్దఎత్తున శాపనార్ధాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒకదశలో వారిద్దరి మీదకు దూసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, ఛైర్మన్, ఎండిలను సురక్షితంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి, అక్కడ నుంచి తరలించారు. అదేవిధంగా వారిని జిల్లా జైలుకు తీసుకువెళ్తారన్న ఉద్దేశ్యంతో అక్కడ కూడా బాధితులు చేరుకుని మరోసారి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా డిపాజిటర్లకు చెల్లించాల్సిన ప్రతి నయాపైసా చెల్లిస్తానని అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు పేర్కొన్నారు. సిబిసిఐడి డిఎస్పీ రాజ్‌గోపాల్ మాట్లాడుతూ త్వరలోనే న్యాయస్థానం అనుమతితో మళ్లీ వీరిని కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరం ఉందన్నారు.