AADIVAVRAM - Others

కష్టాలే పూలబాటగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్, అత్యంత మేధావి, భారతీయులలో అగ్రగణ్యులు, ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను తన మేధస్సుతో ఆవిష్కరించిన మోక్షగుండం విశే్వశ్వరయ్యగారి జీవితాన్ని పరికిస్తే.. ఆయన జీవితం పూలబాట కాదని, ఎన్నో వొడిదుడుకులతో కూడుకున్నదని అర్థమవుతుంది. కష్టాలను గరళ కంఠుడిలా తన కంఠంలోనే మింగుకుని గుండె నిబ్బరంతో అనుకున్నది సాధించగలిగారీయన.
కర్నాటకలో ఒక పేద కుటుంబంలో జన్మించిన మోక్షగుండం విశే్వశ్వరయ్యకి చిన్నతనం నుంచే కష్టాలు కడలి తుఫానుల్లా ఎదురయ్యాయి. అసలే పేద కుటుంబం. ఆ తరువాత అది చాలదన్నట్లుగా గోరుచుట్టు రోకటి పోటులా తండ్రి మరణం. కుటుంబానికి పెద్దగా నిలిచి, కుటుంబ పోషణ బాధ్యతను మోసే వ్యక్తి మరణంతో ఆ కుటుంబం మరింత కష్టాలమయమయింది.
అయితే ఎలాగోలా తన మేనమామ అయిన రామయ్య గారింట్లో ఉంటూ బెంగుళూరులో చదువుకున్నారు విశే్వశ్వరయ్య. 1875లో బెంగుళూరులోని వెస్లియన్ మిషన్ హైస్కూల్‌లో చేరి అక్కడే చదువుకున్నారు. ఆ తరువాత కాలేజీ చదువు. ఆయన ప్రతిభకు సులువుగానే సెంట్రల్ కాలేజీలో సీటు దొరికింది. భోజనం మామగారింట్లో చేసే వీలుండటంతో భోజనానికి ఇబ్బంది ఉండేది కాదు. అయితే పుస్తకాలకు, పెన్నులకు కూడా మామగారిపై ఆధారపడటం ఇష్టంలేక మైసూరు మహారాజా వారి దగ్గర మంత్రిగా పని చేస్తున్న ‘ముద్దయ్య’ అనే ఆయన పిల్లలకు ట్యూషన్ చెపుతూ వచ్చిన డబ్బులతో తన చదువు కొనసాగించారు.
ఇదిలా ఉండగా ఇంతలో మెట్రిక్యులేషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది. విశే్వశ్వరయ్య చేతిలో ఏ మాత్రం డబ్బులు లేవు. తన తల్లిని అడుగుదామంటే ఆమె ఉండేది చిక్‌బళ్లాపురంలో. ఈయన ఉండేది బెంగుళూరులో. తల్లి దగ్గరకు వెళ్లడానికి కూడా ఆయన దగ్గర డబ్బుల్లేవు. చివరకు బెంగుళూరు నుంచి చిక్‌బళ్లాపురానికి నడుచుకుంటూనే వెళ్లారు. వీటి మధ్య దూరం 30 మైళ్ల పైనే.
అక్కడ ఇంటికి వెళితే కుటుంబ పరిస్థితి కూడా అంతే. తల్లి దగ్గర కూడా డబ్బుల్లేవు. చివరకు తల్లి ఇంట్లో ఉన్న రాగి అణాలను కుదువబెట్టి 12 రూపాయలు ఇచ్చింది. బస్సులో వెళితే డబ్బులు సరిపోవని తిరిగి బెంగుళూరుకు దాదాపు 30 మైళ్ల దూరం నడిచే వెళ్లారు.
తీరా ఫీజు కట్టేందుకు వెళ్లేసరికి గడువు అయిపోయిందని, ఫీజు కట్టించుకోలేదు. చివరకు ఎలాగో అక్కడ పనిచేసే ఒక అధికారి సిఫార్సుపై ఫీజు కట్టగలిగారు. అదే ఏడాది జరిగిన మెట్రిక్యులేషన్ పరీక్షల్లో మైసూరు సంస్థానానికే ప్రథముడిగా నిలిచారు.
చిన్ననాటి నుంచి ఇంజనీర్ కావాలనేది విశే్వశ్వరయ్య కోరిక. అయితే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు బెంగుళూరులో లేవు. ఇంజనీరింగ్ చదవాలంటే పూణె వెళ్లాల్సిందే. అక్కడకు వెళ్లి చదివేందుకు డబ్బులు లేవు. కానీ ఆయన తెలివితేటలు, ప్రతిభా పాటవాల గురించి అప్పటికే మైసూరు సంస్థానానికి తెలిసి ఉండటంతో మైసూర్ దివాన్ రంగాచార్యులు ఉపకార వేతనం అందించారు. ఆ ఉపకార వేతనంతోనే అష్టకష్టాలు పడి ఇంజనీరింగ్ చేయడమే కాకుండా ఆ కాలేజీ ప్రథముడిగా నిలిచారు.
ఇవి ఆయన ఇంజనీర్ కావడానికి ఎదుర్కొన్న కష్టాలు. కడు పేద కుటుంబంలో పుట్టినా, చిన్నతనంలోనే పెద్ద దిక్కైన తండ్రిని కోల్పోయినా, ట్యూషన్లు చెప్పుకుంటూ, ఉపకార వేతనాలతో ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ ఇంజనీర్లలో అగ్రగణ్యుడిగా, నీతి నిజాయితీలకు మారురూపంగా నిలిచి మహోన్నతుడయ్యారు.
విజేతల పయనమే ఇది. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎగుడు దిగుళ్లుగా జీవన పయనం కొనసాగినా లక్ష్యాన్ని సాధించేందుకు అవన్నీ సోపానాలుగా భావించే మనస్తత్వమే వారి ప్రయాణం!!
*

-శృంగవరపు రచన 99591 81330