బాల భూమి
అణకువ (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకజిత్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. బాగా ధనం సంపాదించాడు. మేడలు, మిద్దెలు ఒకటేమిటి సమస్త భోగభాగ్యాలు ఆయన ముంగిట ఉన్నాయి. అతనికి ఒక్కగానొక్క కుమారుడు విలాస్. కళాశాల చదువు పూర్తి చేసిన విలాస్ నిజంగానే విలాస పురుషుడిగా జీవితాన్ని గడపసాగాడు. పెద్దల యెడల అణకువ, గౌరవం చూపేవాడు కాదు. వాళ్ల నాన్న వద్ద ఫ్యాక్టరీలో పనిచేసే పెద్దల్ని సైతం లెక్క చేసేవాడు కాదు.
‘నేను కోటీశ్వరుడి కుమారుణ్ని. వీళ్లంతా మా వద్ద పనిచేసే పనివాళ్లు. వీళ్లను నేను గౌరవించడం ఏమిటి? వీళ్లకు నేను అణకువగా ఉండటం ఏమిటి?’ అని విలాస్ తన మనసులో అనుకునేవాడు.
విలాస్ ప్రవర్తన తండ్రి లోకజిత్‌కు నచ్చేది కాదు. అతనిలో మార్పు తేవడానికై సమయం కోసం వేచి చూస్తున్నాడు లోకజిత్. ఒకరోజు విపరీతమైన తుపానుతో కూడిన వర్షం పడుతోంది. ఆ సమయంలో తండ్రీ కొడుకులిద్దరూ తోటలో ఉన్న బంగళాలో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
‘నాయనా విలాస్! జీవితంలో ఎదగాలంటే అణకువ చాలా ముఖ్యం. పెద్దలను గౌరవించాలి’ అన్నాడు తండ్రి.
‘మన వద్ద పనిచేసే వాళ్లకు మనం అణకువగా ఎందుకు ఉండాలి నాన్నా. అది మనకు అవమానం. మనదే పైచేయిగా ఉండాలి’ అన్నాడు విలాస్.
‘తప్పు బాబూ. అలా చులకనగా మాట్లాడకూడదు. వాళ్లు మన కోసం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నారు. అటువంటి వారిని కించపరుస్తూ మాట్లాడకూడదు’ వారించాడు లోకజిత్.
‘వీళ్లంతా తేరగా పని చేయడం లేదుగా నాన్నా. నెలనెలా జీతాలు పారేస్తున్నాం కదా!’ చులకన చేస్తూ అన్నాడు విలాస్.
‘వాళ్లు కేవలం నెలనెలా జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు. వారి రెక్కల కష్టంపై మనం కోట్లు గడిస్తున్నాము. మనం మర్యాద పూర్వకంగా వారిని పలకరించి, అణకువగా ఉండి, వారికి ఆపదలు కలిగినప్పుడు ఆదుకున్నట్లైతే పనివాళ్లలా కాక మనవాళ్లలా మనస్సు పూర్తిగా శ్రమ చేస్తారు. దానివల్ల మన సంస్థకు ఇంకా మేలు జరిగి ఇంకా మరో పది మందికి మనం ఆశ్రయం కల్పించగలము. మనం బ్రతకడం గొప్ప విషయం కాదు. మనతోపాటు పదిమందిని బ్రతికించటం గొప్ప విషయం’ అని హితవు పలికాడు తండ్రి లోకజిత్.
ఇంతలో తుపాను పెద్దదై గాలి బీభత్సం సృష్టించింది. తోటలోని కొన్ని చెట్లు గాలి ఎటు వీస్తే అటు వంగి గాలి తగ్గగానే యథాస్థానంలో నిలబడుతున్నాయి. గాలికి వంగకుండా నిటారుగా నిలబడిన చెట్లు కూకటి వేళ్లతో పడిపోయాయి. కొన్ని చెట్లు రంపంతో కోసేసినట్లు సగానికి తెగి పడిపోయాయి.
ఆ చెట్లను కుమారుడికి చూపిస్తూ ‘నాయనా విలాస్! చూశావా? తుపాను గాలి విపరీతంగా వీస్తోంది. ఆ గాలివాటం ఎటు ఉందో అటు అణకువగా వంగి, గాలి తగ్గగానే తన యథాస్థానంలో నిలబడిన చెట్లన్నీ ఎటువంటి ప్రమాదానికి గురి కాలేదు. గాలి వాటానికి నిటారుగా నిలబడిన చెట్ల పరిస్థితి ఒకసారి గమనించు. తుపాను గాలి వేగానికి కొన్ని చెట్లు సగానికి తెగి పడిపోయాయి. మరి కొన్నైతే కూకటి వేళ్లతో కూలిపోయాయి. మనమైనా అంతే నాయనా. అణకువగా ఉంటే పది కాలాలపాటు బాగుంటాము. నన్ను మించిన వారు లేరని గర్వంతో చెలరేగిపోతే కూలిన చెట్లకు పట్టిన గతే మనకూ పడుతుంది. డబ్బు అశాశ్వతమైనది. ఈ రోజు మన దగ్గర ఉంది. కొన్ని రోజుల తరువాత ఈ డబ్బు మనల్ని వదలి వెళ్లిపోవచ్చు. అణకువ, సంస్కారం, మంచితనం శాశ్వతంగా ఉంటాయి. అది నేర్చుకున్న వాడి జీవితం చరితార్థవౌతుంది’ అని హితవు పలికాడు తండ్రి లోకజిత్.
తండ్రి మాటలు విన్న విలాస్‌లో పెనుమార్పు వచ్చింది. ఆ రోజు నుండి పెద్దల యెడల అణకువ, మర్యాదపూర్వకంగా మాట్లాడటం అలవాటు చేసుకుని తండ్రిలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అందరి ప్రశంసలందుకున్నాడు.