కడప

జిల్లాకు చేరిన మంజునాథ్ కమిటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 25: కాపులు (బలిజలు)ను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిటీ ఆదివారం జిల్లాలోని స్టేట్‌గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంజునాథ్ కమిటీకి అధికారులు, బిసి సంఘం నేతలు స్వాగతం పలికారు. కాపు నేతలు కూడా లోలోపల కలిసినట్లు తెలిసింది. సోమవారం మంజునాథ్ కమిటీ ఎదుట బిసి సంఘాలు, కాపు సంఘం తమ తమ వాదనలు విన్పించాలని పల్స్‌సర్వేను చేస్తున్నామని కమిషన్ సర్వే అనంతరం రాజ్యాంగ పరంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కమిటీ అధికారులు పేర్కొన్నారు. పల్స్ సర్వే ఎప్పటికి పూర్తిచేస్తారో ఏమో కానీ బిసిల్లో వ్యతిరేకత రాకుండా ఆందోళన లు ఉత్పన్నం కాకుండా అందరి వాదన వినేందుకే వచ్చామని మంజునాథ్ కమిటీ సభ్యులు, అధికారులు అంటున్నారు. బిసి సంఘం నేతలు మాత్రం పల్స్‌సర్వే పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తూ, ఎటుతిరిగి కాపులను బిసిలో చేర్చడం తథ్యమని వారిని బిసిలోకి చేర్చకుండా అడ్డుకోవడమే తమ ధ్యేయమని పలువురు బిసి సంఘం నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున స్టేట్‌గెస్ట్ హౌస్ వద్ద మోహరించారు. కాపు సంఘం నేతలు, బిసి కులాలకు చెందిన సంఘాల నేతల కదలికలపై పోలీసులు నిఘా ఉంచి సోమవారం మంజునాథ్ కమిటీ కార్యక్రమం సాఫీగా జరిగేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఇంకుడుగుంతలో పడి
బాలుడి దుర్మరణం
ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 25: స్థానికి అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాల మైదానంలోని ఇంకుడుగుంతలో పడి మూడవ తరగతి చదువుతున్న పాపగాళ్ల మోహన్‌క్రిష్ణ (9) అనే బాలుడు మృతిచెందిన సంఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఇందిరానగర్‌కాలనీలో నివాసముంటున్న పాపగాళ్ల లక్ష్మీదేవి భర్త అనారోగ్యంపాలై చనిపోయాడు. లక్ష్మీదేవి మొదటి కుమారుడైన మోహన్‌క్రిష్ణ ఆదివారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో సమీపంలోని అనిబిసెంట్ మైదానానికి ఆడుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇటీవల వర్షాలు కురవడంతో ఇంకుడుగుంతలోకి నీరు పూర్తిగా చేరడంతో గుంత కనిపించకుండాపోయింది. మోహన్‌క్రిష్ణ ఆడుకుంటూ గుంత అని తెలియక కాలుపెట్టడంతో నీటిలో పూర్తిగా మునిగిపోయి కేకలు వేయడంతో పక్కనే ఉన్న మైదానం పక్కనున్న వేర్‌హౌస్‌లోని హమాలీలు వెంటనే అక్కడికి చేరుకొని బాలుడిని రక్షించారు. అప్పటికే బాలుడు కొన ఊపిరితో వుండగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సరైన సమయానికి బాలుడికి వైద్యం అందక బాలుడు మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలుడి తల్లి, బంధువులు, ఎమ్మార్పీ ఎస్ నాయకులు, ప్రజా సంఘాలు ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంకుడుగుంతను తవ్వి అలాగే వదిలేయడం వల్లే తమ కుమారుడు మరణించాడని తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్.జబీవుల్లా అక్కడికి వచ్చి మీకు తగిన విధంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సాకే లక్షుమయ్య, సుధాకర్, ఆల్ ఇండియా బంజరసంఘం జిల్లా అధ్యక్షుడు వేదానాయక్, జిల్లా యువసేన అధ్యక్షుడు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ భూములకే శఠగోపం!

కడప,సెప్టెంబర్ 25: జిల్లాలో దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవుని మాణ్యాలు వేలాది ఎకరాలు ఉన్నా కొంతమంది రాజకీయ నేతలు, సమాజంలో పరపతి కలిగిన నేతలు దేవుళ్లకే శఠగోపంపెట్టి దేవుని మాణ్యాలు సొంతమాణ్యాలుగా చేసుకుని సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో పలు దేవాలయాల్లో ధూప, దీప, నైవేధ్యాలకు చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టకుండా భూ అక్రమార్కులు దేవుడి సొమ్మునే స్వాహా చేస్తున్నారు. సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయిలో కొంతమంది అధికారులు, సిబ్బంది దేవుళ్లపేరుతో గుడిని, లింగాన్ని కూడా మింగేసినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో శతాబ్దాలకాలం నుంచి దాదాపు 1860 దేవాలయాలు ఉన్నాయి. ఏటా రూ.25లక్షలు పైబడి ఆదాయం కలిగిన దేవాలయాలు నాలుగు ఉన్నాయి. రూ.20 లక్షలు ఆదాయ ఉన్న దేవాలయాలు 23 ఉన్నాయి. రూ.2లక్షల్లో ఆదాయం ఉన్న దేవాలయాలు 110 ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆదాయం మించి ఉన్న దేవాలయాలు 130 ఉన్నాయి. ప్రస్తుతం 156 దేవాలయాలను పునరుద్దరిస్తూ నూతనంగా కట్టేందుకు కూడా ప్రభుత్వం రూ.33,27,35,000 నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వమేమో దేవాలయాల అభివృద్ధికి కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులు అధికంగా ఉన్నా , దాతలు అధికంగా ఉన్నా దేవాలయాల ఆలనాపాలనా పర్యవేక్షణలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంతో దేవాలయాల భూములు యధేచ్చగా స్వాహా అవుతున్నాయి. జిల్లాలో దేవాలయాలకు రికార్డుల పరంగా దాదాపు 11,600 ఎకరాలు భూములున్నాయి. వీటిలో సగంపైగా దురాక్రమణలో ఉండగా, మరో 3,200 ఎకరాలు పైబడి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కోట్లాదిరూపాయల దేవాలయాల భూములను బడా నేతలు ఆక్రమించుకుని కొంతమంది పంటలు సాగుచేయడం, మరికొంతమంది కౌలుకు ఇచ్చి దేవునికే శఠగోపం పెడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రికార్డుపరంగా దేవాలయాల కౌలు భూములకు రూ.కోటి 20లక్షలు కౌలు దారులు చెల్లిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయినా ఈ కౌలులో అధికారులు కూడా చేతివాటాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ, దేవాదాయశాఖ , పోలీసుశాఖ, రిజిస్టేషన్ శాఖ సమన్వయంతో వ్యవహరించి దేవాలయాల భూములను దేవస్థానానికి అప్పగించి దురాక్రమణదారులపై చర్యలు తీసుకుని దేవాలయాలకు ఆదాయం పెంచి, దేవుని మాణ్యాలు కాపాడి, శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు పునరుద్ధరించి, ప్రతి దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తుప్పుపట్టిన బిందు పరికరాలు!

కడప,సెప్టెంబర్ 25: తక్కువ నీటితో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అందించిన బిందు సేద్య పరికరాలు తుప్పుపడుతున్నాయి. వీటిపై సూక్ష్మనీటి పారుదల శాఖాధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. వర్షాధారంపై ఆధారపడి పండ్లతోటలు, కూరగాయలతోటలు సాగుచేసేందుకు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్రప్రభుత్వం సూక్ష్మనీటి పారుదల పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. అతి తక్కువ నీటితో బిందుసేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే పైపులు, స్పింక్లర్లు, విద్యుత్ మోటార్లు, పంపులను సబ్సిడీతో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇంతవరకు ప్రభుత్వలక్ష్యం అమలులో మాత్రం ఆమడదూరంలో ఉంది. కొంత మంది ప్రైవేటీ ఏజెన్సీలు బిందుసేద్యం పరికరాలను తమకు అనుకూలంగా మార్చుకుని తూ.తూ మంత్రంగా రైతులకు సరఫరా చేసి కోట్లాదిరూపాయలు కొంతమంది అధికారులు, సిబ్బంది బొక్కేసినట్లు తెలుస్తోంది. రెండు లక్షల ఎకరాలుపైబడి పండ్లతోటలు, పంటల సాగుకు సూక్ష్మనీటి పారుదల ప్రాజెక్టుకింద ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే సూక్ష్మసాగు పత్రికలకే పరిమితమైందనేది జగమెరిగిన సత్యం. రైతులకేమో బిందుసేద్యం నిమిత్తం 120 సంపుల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.40కోట్లు ఖర్చు చేశారు. కౌలు రైతులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భజలాలు పెరిగిన అక్కడక్కడ కుంటలు, చెరువులు, కాలువల్లో, వాగుల్లో నీరు చేరిన బిందు, తుంపర సేద్యం లక్ష్యం నెరవేరడం లేదు. పైపులు, మోటార్లు బిందు, తుంపర సేద్యానికి కావాల్సిన సామాగ్రి సరఫరా చేసినా అవి తుప్పుపడుతున్నాయి. 2009లో రైతుమిత్ర సంఘాల ద్వారా జిల్లాలో పంపిణీ చేశారు. అప్పటి నుంచి పైపులను రైతులు తమ పొలాలకు ఏర్పాటు చేసుకున్నా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో నీరు లభించకపోవడం, పంపుల్లో నీరు లేని కారణంగా వారి లక్ష్యం ముందుకు సాగడం లేదు. కొంతమంది రైతులు అరకొరనీటిని నమ్ముకుని ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసుకుని బిందు, తుంపర సేద్యంద్వారా పంటలు సాగులోకి తెస్తున్నారు. తరచు సాంకేతిక లోపాలతో అరకొర నీరు పంటలకు వదలాలన్నా పైపులు పగిలిపోవడం, లీకేజిలు జరుగుతున్నాయి. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేరుకేమో ఉద్యానవనశాఖ సూక్ష్మ, నీటి పారుదలపథకం శాఖ ఉన్నా రైతులకు సలహాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా సూక్ష్మ, బిందు సేద్యానికి పెద్దపీట వేసినా రైతన్నకు తగిన ఆదరణ,ప్రోత్సాహం లేని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వమేమో రైతులకు పండ్లమొక్కలు, సబ్సిడీ కింద ఎరువులు, వాటి పెంపకాలకు ఏటా వందలాది కోట్లరూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లాలో పండ్లతోటలు విస్తారంగా ఉన్నందున ముఖ్యమంత్రి జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటించారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడంతో హార్టికల్చరల్ పబ్‌గా మారింది. ఈపరిస్థితుల్లో ప్రభుత్వమే జోక్యం చేసుకుని హార్టికల్చర్ బిందు, తుంపర సేద్యం లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతులపై సీఎం కపట ప్రేమ..

సుండుపల్లె, సెప్టెంబర్ 25: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర రైతులపై కపట ప్రేమ చూపుతున్నదని ప్రత్యేక హోదాను వదలి చంద్రబాబునాయుడు రాష్ట్రంపై కపట ప్రేమను చూపుతున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు. సుండుపల్లె మండలంలోని రెడ్డివారిపల్లెలో మండల కన్వీనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర భవిష్యత్తు బంగారం అవుతుందని, ప్రత్యేక హోదాను తెస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పిన తెదేపా నేడు ప్రత్యేక హోదా వస్తే ఒరిగేదేమీ లేదని చెప్పడం హాస్యాస్పదమని తెలియజేశారు. నేడు ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలకు మోసం చేయడం తగదని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రతి పనికీ అడ్డుకట్ట వేస్తున్న టీడీపీకి ప్రజలు దగ్గర్లో బుద్ది చెప్పే రోజులు వస్తుందని తెలియజేశారు. నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, నేడు కష్టాలతో ప్రజలు సతమతమవుతున్నా పట్టించుకోని చంద్రబాబు పాలన అని తెలిపారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించినట్లు చరిత్ర లేదని నేడు తెదేపా కూడా ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు త్వరలో తెదేపాకు భూస్థాపితం చేస్తారని తెలియజేశారు. అనంతరం మండల కన్వీనర్‌ను పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోవు ఎన్నికలలోపు మండలంలో వైసీపీని పటిష్టంగా చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, జడ్పీటీసీ హకీంసాబ్, సర్పంచ్ బ్రహ్మానందం, కో ఆప్షన్ మెంబర్ ఇర్ఫాన్, క్రిష్ణమరాజు, చిన్నప్ప, చింటు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.