కడప

నాసిరకంగా వరిపైరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 1:జిల్లాలో ఖరీఫ్‌లో అరకొర నీటిని నమ్ముకుని సాగుచేసిన వరి దిగుబడికి సకాలంలో వర్షాలు లేక వడ్లు నాసిరకంగా పండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వరిపైర్లను గత వారం రోజులుగా రైతులు వరికోతలకు దిగారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 15వేలు ఎకరాలు పైబడి వరి విస్తీర్ణం ఉండగా అన్నమయ్య ప్రాజెక్టు, బుగ్గవంక, లోయర్ సగిలేరు, పింఛా, కెసి కెనాల్, తెలుగుగంగ, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, 1842 పైబడిన చిన్న, పెద్ద చెరువులలో అక్కడక్కడ గత ఖరీఫ్ వర్షాలకు నీరు చేరికతో 50వేల ఎకరాలు పైబడే వరి పంట జిల్లా వ్యాప్తంగా సాగుకునోచుకుంది. సాగుచేసుకున్న సమయంలో రైతులు ఆనందోత్సాహాల మద్య వరి విత్తనాలు నర్సరీల నుంచి కొనుగోలు చేసి, అప్పులుచేసి పైర్లు పెట్టారు. పైరు అనంతరం భారీగా ఖర్చులుపెట్టిన రైతులు పంట దిగుబడి చేతికొచ్చే సమయానికి రోగాల బారినపడి నాసిరకం దిగుబడితో పెట్టిన పెట్టుబడులు రాక రైతులు లబోదిబోమని గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వమేమో జిల్లాలోని 32 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. సాగునీటి కష్టాలు నకిలీ ఎరువులను అధికమించి అతి కష్టంమీద ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేలు ఖర్చుచేసి వరి పంటలు సాగుచేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుతం వరి కోతకు చెల్లించాల్సిన కూలీలకు చిల్లర అందకపోవడం, రూ.2వేలు నోట్లు మారకపోవడంతో రూ.100లు లేకపోవడంతో నానాయాతలు పడుతున్నారు. కూలీలకు కూలీలు చెల్లించేందుకు జిల్లా వ్యాప్తంగా రూ.25 కోట్లు అవసరం ఉంటుంది. గతంలో రైతులు కూలీలకు కోత కోసి వడ్లను తీసుకున్న తర్వాత వారికి కూలీ రూపంలో వడ్లనే తూకాలు వేసి కొంతమంది, కొలతలతో కొలచి ఇచ్చేవారు కొంతమంది రైతులు డబ్బులు చెల్లించేవారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుపుణ్యమా అని కూలీలు కూలి పనులు పూర్తిచేసిన తర్వాత కూడా ఒకటిరెండు రోజులుగా సంబంధిత రైతుల ఇళ్ల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. ఖరీఫ్‌లో వరిసాగును సంబంధిత రైతాంగం అతికష్టంమీద చేశారు. తీరా పంటదిగుబడి సమయంలో నాసిరకం వడ్లు దిగుమతి కావడంతో వారు పెట్టిన పెట్టుబడులు కూడా లభించవని ప్రస్తుతం కూలీలకు కూలీ ఇచ్చే పరిస్థితులు లేవు. ఈపరిస్థితుల్లో ప్రభుత్వం వరి పంటసాగుచేసిన రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి
సిద్దవటం,డిసెంబర్ 1:రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, రాజంపేట నియోజకవర్గంలో జరిగిన జన చైతన్యయాత్రలు సక్సెస్ అయినట్లు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మండలంలోని మాచుపల్లె గ్రామంలో మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గజ్జల సు బ్బారెడ్డిని గురువారం మేడా పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టిడిపిని ఆదరిస్తున్నారన్నారు. రాజంపేట నియోజకవర్గంలో నిర్వహించిన జన చైతన్యయాత్రలో లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదుచేశామన్నారు. గ్రామీణ ప్రాం తాల్లో నెలకొన్న ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. రాను న్న రెండున్నర సంవత్సరాల్లో అన్ని పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు యా త్రలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యాత్రలో భాగంగా రాజంపేటకు విచ్చేసిన ముఖ్యమంత్రికి ప్రజలతోపాటు జిల్లాలోని నాయకులు ఘనస్వాగతంతోపాటు ఓ పండుగ వాతావరణం నెలకొనడం హర్షణీయమన్నారు. జనచైతన్యయాత్రలు దిగ్విజయం చేసిన అన్ని మండలాల అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. టిడిపి హయాంలోనే అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఏపిటిపి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నర్సయ్య, నాయకులు మేడా మధుసూధన్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఎంపిపి నరసింహారెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ రేసులో
పెరుగుతున్న ఆశావహులు!
రాజంపేట, డిసెంబర్ 1: రాజంపేట మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరిగే పరిస్థితుల నేపధ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఛైర్మన్ పదవికోసం ఆశావహుల సంఖ్య పెరుగు తూ పోతుంది. ఇప్పటికే అరడజనుకు పైగా ఈ పదవిపై కనే్నసి ఉండ గా, తాజాగా ఈ సంఖ్య పెరుగుతున్నది. దీంతో రాజంపేట మున్సిపల్ రాజకీ యం రంజుగా మారుతున్నది. రాజంపేట మున్సిపల్ బరిలోకి అధికార తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మల్లెల శ్రీవాణి దిగనుంది. అలాగే పట్టణంలో సుపరిచితుడైన కావుటూరు వెల్ఫేర్ పౌండేషన్ ఛైర్మన్ కావుటూరు సుబ్రమణ్యంనాయుడు కూడా మున్సిపల్ ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చారు. ఈయన తన పౌండేషన్ ద్వారా విద్య, ఆధ్యాత్మికంగానే కాకుండా ఇతరత్రా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడమే కాకుండా, ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్‌టి రామారావు చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించి నియోజకవర్గ వ్యాపితంగా ఉచితంగా పంచిపెడుతూ తె లుగుదేశం పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ప్ర మాదాలు ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తన సొంత నిధులతో ఆదుకుం టూ వస్తున్నారు. పార్టీ అధిష్టానంలో అత్యంత ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన సుబ్రమణ్యంనాయుడు ఆర్థికంగా కూడా బలవంతుడని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటివరకు పార్టీకి తాను ఉపయోగపడుతున్నారు తప్పి తే పార్టీ ద్వారా ఎలాంటి పదవులు కాని, ఇతరత్రా లాభకరమైన పనులకు ఎగబడింది లేదు. పార్టీకి అవసరమైనప్పుడు తన వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు. పార్టీకి అవసరమైనప్పు డు సహకరించడం, మిగిలిన సమయాల్లో రియల్డర్‌గా, రైతుగా తన పనులు తాను చేసుకుంటూ ముందుకెళుతున్న సుబ్రమణ్యంనాయుడు రాకతో మున్సిపల్ రాజకీయ రంగం పూర్తిగా వేడెక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మల్లెల శ్రీవాణి విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన శ్రీవాణి రాజంపేట పంచాయతీ స్థాయి నుండి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యి జరిగిన మొదటి ఎన్నికల్లో ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై 5 ఏళ్ల పాటు పదవిలో ఉండింది. ఆ తరువాత కారణాలు ఏమైనా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. తాజాగా రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే రిజర్వేషన్లతో పనిలేకుండా ఓసి వర్గాలకు కేటాయించినా అధికార పార్టీలో బీసీ వర్గాలు పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఓసి వర్గాలకు చెందిన వారు కూడా అనేకం ఈ మున్సిపాలిటీ నుండి పోటీ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.మల్లెల శ్రీవాణి కూడా ఓసిలకు కేటాయించినా ఈ మున్సిపాలిటీలో పోటీకి సిద్ధంగా ఉంది. కాగా మల్లెల శ్రీవాణి ఛైర్‌పర్సన్‌గా మున్సిపాలిటీ అభివృద్ధికార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించిన చరిత్ర ఉంది. శ్రీవాణి మామగారు మల్లెల సుబ్బరాయుడు కౌన్సిలర్‌గా గతంలో బాధ్యతలు ఈ మున్సిపాలిటీ నుండి నిర్వహించి ఉన్నారు. మున్సిపాలిటీలో సుపరిచితురాలైన మల్లెల శ్రీవాణి తిరిగి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతుంది. తాజాగా రాజంపేటలో సీఎం చంద్రబాబు పాల్గొన్న జనచైతన్యయాత్ర బహిరంగసభలో కూడా శ్రీ వాణి పాల్గొనడం జరిగింది. విద్యాధికురాలు, వాక్‌చాతుర్యం కలిగిన శ్రీవాణికి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంది. గతంలో అనేక పర్యాయాలు మున్సిపాలిటీలో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకొన్న అనుభవం కలిగిన శ్రీవాణి మున్సిపల్ బరిలోకి రావడంతో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కనున్నాయనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు సముచిత స్థానం ఇస్తుండడంతో మల్లెల శ్రీవాణి అభ్యర్థిత్వాన్ని, గతంలో ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. మల్లెల శ్రీవాణి మామగారు మల్లెల సుబ్బరాయుడు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి సన్నిహితుడు కూడా కావడం విశేషం. 2014 ఎన్నికల్లో మేడా విజయం కోసం పనిచేసేందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పార్టీలోకి రావడం జరిగింది. కాగా రాజంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపధ్యంలో రాజంపేట జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినప్పుడు ఎవరైనా పార్టీలో ఛైర్‌పర్సన్‌గా గాని, కౌన్సిలర్స్‌గా గాని పోటీ చేసేందుకు సుముఖంగా ఉండే పక్షంలో వారి పేర్లు ఇవ్వాలని, పార్టీ అధిష్టానం సర్వే నిర్వహించి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేస్తుందని గతంలో ప్రకటించి ఉన్నారు. దీంతో అధికార పార్టీ నుండి ఛైర్‌పర్సన్‌గా పోటీ చేయాలనుకుంటున్న అనేకమంది నేతలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
అధిష్టానం నిర్ణయిస్తే పోటీకి సిద్ధమంటున్న ఆశావహులు
రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు మల్లెల శ్రీవాణితో పాటు కావుటూరు సుబ్రమణ్యంనాయుడులు తెలిపారు. మున్సిపాలిటీని అన్నివిధాలుగా అభివృద్ధి పరచాల్సి ఉందంటున్న సుబ్రమణ్యంనాయుడు ఇటీవల మున్సిపాలిటీ విస్తీర్ణం కూడా బాగా పెరిగిందని, అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. దీర్ఘకాలికంగా తిష్టవేసుకొని కూర్చొన్న సమస్యలపై సత్వరం స్పందించాల్సిన అవసరముందని పేర్కొంటున్నారు. మల్లెల శ్రీవాణి కూడా వెనుకబడిన ఈ మున్సిపాలిటీలో పేద, బడుగు వర్గాలు అధికంగా ఉన్నారని, కనుక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరముందంటున్నారు. పదవులతో పనిలేకుండా తన పరిధిలో మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కూడా ఆమె పేర్కొంటుంది. ఛైర్‌పర్సన్‌గా తాను మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడం జరిగిందని కూడా మల్లెల శ్రీవాణి పేర్కొంది.
ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన

కడప,డిసెంబర్ 1:విస్తృత ప్రచారం అవగాహన కార్యక్రమాల ద్వారానే హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధుల నియంత్రణ చేయవచ్చని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను గౌరవించి, ఆదరించి వారిలో మనోధైర్యం ఆత్మస్థైర్యం నిలపాలని కోరారు. హెచ్‌ఐవి ఎయిడ్స్ నియంత్రించాలంటే ముఖ్యంగా వ్యా ధులపై విస్తృత ప్రచారం అవగాహన కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలన్నారు. గత 25 సంవత్సరాల క్రితం హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధి దేశంలో లేదని ప్రపంచ దేశాల్లో ఉండేదని, మనదేశంలో ఈవ్యాధి త్వరగా ప్రబలిందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్దవహించి నియంత్రణ చర్యలు, చికిత్సలు చే యడం ద్వారా అంచలంచెలుగా ఎ యిడ్స్ వ్యాధిగ్రస్తులను తగ్గించడం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో పాయింట్ -3కి పడిపోయిందని , రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో 1.7శాతం వ్యాధిగ్రస్తులుండగా, 0.74శాతం కడప జిల్లా రెండవస్థానంలో ఉందన్నారు. వ్యాధి వున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఐసిటిసి సెంటర్‌లో హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెచ్‌ఐవి వ్యాప్తిలేని , హెచ్‌ఐవి వివక్ష రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు ముం దుకు రావాలన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు వ్యాక్సిన్ కనుకొన్నారన్నాని త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే హెచ్‌ఐవి నియంత్రణపై నాలుగు లేక ఐదు రకాల షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయని వాటిని జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పంపి ప్రదర్శించేలా చూడాలని డిఎంహెచ్‌ను కలెక్టర్ ఆదేశించారు. నియంత్రణ కార్యక్రమాన్ని పాఠశాల, కాలేజి, నర్సింగ్ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులను , ఎన్‌జిఓలను భాగస్వామ్యులు చేసినప్పుడే ప్రచారం ప్రజల్లోకి వెళుతుందన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెసి -2 నాగేశ్వరరావు, రిమ్స్ డైరెక్టర్ శశిధర్, డిఎంహెచ్‌ఓ సుధాకర్‌బాబు, స్టెప్ సిఇఓ మమత, డాక్టర్ రామిరెడ్డి, డిసిహెచ్ ఎస్ రామారాజన్, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాత కలెక్టరేట్ కార్యాలయం నుంచి జెడ్పి కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన ర్యాలీని జెసి నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ ఈశ్వరయ్య, ఎన్‌హెచ్‌ఎం డిపిఎంఓ ఉమామహేశ్వరరావు, డిఐఓ నాగరాజు, డిటిసి కో-ఆర్డినేటర్ డా.జమాల్‌బాషాతోపాటు వివిధ కళాశాలల, పాఠశాలల నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
రాజంపేటలో జోరువాన
రాజంపేట, డిసెంబర్ 1: రాజంపేటలో గురువారం ఉదయం నుండి ఆకాశం మేఘావృత్తంగా మారి సాయంత్రం ఒక మోస్తరు భారీవర్షం పడింది. దీంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది భారీ వర్షాలు డిసెంబర్ మాసంలో పునరావృత్తమవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. మొత్తానికి డిసెంబర్ మాసంపై ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్నారు. గత ఏడాది కూడా ఖరీఫ్‌లో కరవుఏర్పడి, రబీలోకూడా వర్షాలు పడకపోయినా డిసెంబర్ మాసం రెండవ వారం నుండి జనవరి మాసం మొదటివారం వరకు భారీ వర్షాలు కురిసి రాజంపేట డివిజన్ వ్యాపితంగా నదులు పొంగి పొర్లి, చెరువులు, వంకలకు పూర్తిస్థాయి సాగునీటి మట్టం చేరుకున్న విషయం తెలిసిందే. గత పదేళ్లుగా తీసుకుంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం షరామామూలు తంతుగా ఉంది. ఈ ఏడాది కూడా గత చరిత్రే పునరావృత్తమై భారీ వర్షాలు డిసెంబర్ మాసంలో కురుస్తాయన్న ఆశాభావంతో రైతులున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు పడితే ఇక్కడ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏ చెరువు, వంక చూసినా చుక్కనీరు లేని పరిస్థితి ఉంది. దీంతో ఆయకట్టు భూములన్నీ బీడుగా మారి ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో పడ్డ భారీ వర్షాల వల్ల బావులు, బోర్లలో భూగర్భజలాలు కొరత లేదు. దీంతో ప్రస్తుతం బావులు, బోర్ల క్రింద మాత్రమే భూములు సాగు చేస్తున్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో బావులు, బోర్ల క్రింద పండించే రైతుల్లో కూడా ఆందోళన ఉంది. రోజురోజుకు భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఓ మోస్తరుగా భారీ వర్షాలు పడితే ఆయకట్టు రైతుల పరిస్థితిని ప్రక్కన పెడితే బావులు, బోర్ల క్రింద రైతుల కష్టాలకు ఓ ముగింపు లభిస్తుందనడంలో సందేహం లేదు. ఖరీఫ్‌లో భారీ వర్షాలు పడకపోయినా అడపా తడపా ఓ మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కురుస్తూ వచ్చాయి. దీంతో పశువుల మేతకు ఇబ్బందులు లేని పరిస్థితులైనా ఏర్పడ్డాయి. నవంబర్ మాసంలో చిరుజల్లులు కూడా కురవకపోవడం రబీపై ఆశలు పెట్టుకున్న ఆయకట్టు రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపధ్యంలో డిసెంబర్ మాసం ప్రారంభమైన మొదటిరోజే ఓ మోస్తరు వర్షం పడడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ మాసంలో భారీ వర్షాలు పడతాయన్న ఆశలు పెట్టుకున్న ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరాలని ఆశిద్దాం. కాగా ఈ మాసంలో పడే వర్షాలను బట్టి అట్టు బావులు, బోర్ల క్రింద రైతుల ప్రయోజనాలు కాపాడేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంది. కాగా గురువారం పడ్డ భారీ వర్షంతో పట్టణంలో రోడ్లు అన్నీ చిత్తడిగా మారగా, గ్రామాల్లో మట్టిరోడ్లు బురదమయంగా మారాయి. కాగా రైల్వేకోడూరు, :మండలంలోని పలు గ్రామాలలో గురువారం వర్షం కురిసింది. మండలంలోని రెడ్డివారిపల్లె, మైసూరువారిపల్లె, బుడుగుంటపల్లె, కోడూరు, రాఘవరాజపురం తదితర గ్రామాలలో ఒక మోస్తారు వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో వర్షం కురవడంతో మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ్భారత్‌లో ప్రభుత్వం విఫలం
* ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు టౌన్, డిసెంబర్ 1: మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విషయంలో కలెక్టర్ సత్యనారాయణ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల ఎంపిడిఓలు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా బహిరంగ మలవిసర్జన చేయరాదని మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.8 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేలను లబ్దిదారులకు అందించి మరుగుదొడ్లను నిర్మించుకోనేలా చూడాల్సి వుండగా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఫలితం సాధించలేకపోతోందని విమర్శించారు. నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణాలు 80శాతం పూర్తయ్యాయని కలెక్టర్ సత్యనారాయణ, అధికారులు చెబుతున్నారని, అధికారుల గణాంకాలనుబట్టి పరిశీలిస్తే కనీసం 25శాతం మేర కూడా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం శోచనీయమన్నారు. జిల్లాలో 90శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పిన కలెక్టర్ జిల్లాలో నూరు గ్రామాలను దత్తత తీసుకొని ఈనెలాఖరుకల్లా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గ పరిధిలో రెండు మండలాలుండగా ప్రొద్దుటూరు మండలంలో 2577 మరుగుదొడ్లు మంజూరుకాగా 454 పూర్తయ్యాయని, 342 వాటికి బిల్లులు మంజూరయ్యాయన్నారు. రాజుపాళెం మండలంలో 991 మరుగుదొడ్లు మంజూరుకాగా 179 పూర్తయ్యాయని, 120 వాటికి బిల్లులు మంజూరయ్యాయన్నారు. ప్రొద్దుటూరు మండలంలోని నాగాయపల్లె గ్రామానికి దళితులకు 58, 12 బిసిలకు మంజూరయ్యాయని, వీటిల్లో దళితులు నానా కష్టాలు పడి 30 వాటికి బేస్‌మట్టాలు వేసుకుంటే ఇంతవరకు వారికి ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. నాగాయపల్లెలోని 70 మరుగుదొడ్లను దాతల సహాయం, తన సొంత నిధులతో నిర్మాణాలను పూర్తి చేయించేలా కృషి చేస్తానన్నారు. ఈనెల 21న జరగబోవు జడ్పి సమావేశాల్లో ఇదే అంశంపై కలెక్టర్ కార్యాలయం ఎదుట తాను ధర్నా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
చట్టాలపై అవగాహన అవసరం
* జడ్జి అతిఖ్ అహ్మద్
సిద్దవటం,డిసెంబర్ 1:విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఎంతైనా అవసరమని జూనియర్ సివిల్ జడ్జి అతిఖ్ అహ్మద్ అన్నారు. స్థానిక గురుకులం పాఠశాలలో గురువారం మండల లీగల్‌సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ర్యాగింగ్ ఓ రాక్షస క్రీడలా తయారైందని ర్యాగింగ్‌ను ప్రారద్రోలేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. అలాగే విద్యార్థి తనజీవితాన్ని కోల్పోవడంతోపాటు కోర్టుల చుట్టు తిరిగి సమయాన్ని వృధా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు ఎన్నోవ్యయ ప్రయాసాలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కృషిచేస్తుంటారని వారి ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. న్యాయవాదులు లక్ష్మిరెడ్డి, గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్, మండల లీగల్‌సర్వీసెస్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఖాతాదారులకు
ఆన్‌లైన్ సేవలు అందించాలి
* కలెక్టర్ కెవి సత్యనారాయణ

కడప,డిసెంబర్ 1:బ్యాంకు ఖాతాదారులకు ఏటిఎం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక నూతన కలెక్టరేట్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరీ బ్యాంక్ శాఖను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖాతాదారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం ప్రస్తుత తక్షణ ఆవశ్యకత అన్నారు. బ్రాంచి మేనేజర్ బివి రాజేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఈ బ్రాంచ్ ద్వారా ఖాతాదారులకు అవసరమైన అన్ని సేవలు సంతృప్తికరంగా అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ డిజిఎం ఎన్.కులకర్ణి, ఏజిఎం కె.గోపాల్‌రావు, ఏపిజిబి రీజనల్ మేనేజర్ రాజశేఖరరెడ్డి, ఇన్‌చార్జ్ డిటిఓ సత్యవతి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి ఉత్సవంలో పాల్గొన్న
డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా
కడప,(కల్చరల్)డిసెంబర్ 1:స్థానిక హబీబుల్లా వీధిలో గురుస్వామి దశరథ ఆధ్వర్యంలో 20వ సంవత్సర వార్షికోత్సవ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా పాల్గొని టెంకాయకొట్టి పూజాకార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంలో జరగడం విశేషమన్నారు. ఉత్సవ నిర్వాహకులై గురుస్వామి దశరథ, సుబ్బయ్యస్వామి, దాసరి శివప్రసాద్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అల్లాబకష్ ఎంతో అభినందనీయులని, వారిని ఆదైవం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా శుక్రవారం దాదాపు వెయ్యిమంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక భక్తులు తాతా నరసింహులు, ఈశ్వరరెడ్డి, గోపాల్, సునీల్, చిన్న, బాలుడుతదితరులతోపాటు జిల్లా టిడిపి కార్యదర్శి ముక్తియార్, అమీర్‌బాషా, బిసి నాయకులు రాజగోపాల్, తేజ పాల్గొన్నారు.
పోలీసు దేహదారుఢ్యపరీక్షలో
485 మంది ఉత్తీర్ణత
* ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ
కడప(క్రైమ్), డిసెంబర్ 1:పోలీసు దేహదారుఢ్య పరీక్షలకు 800 మంది అభ్యర్థులను పిలువగా 660మంది హాజరుకాగా 485 మంది ఉత్తీర్ణులైనట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కడప మున్సిపల్ స్టేడియంలో పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల కార్యక్రమం ఏర్పాటుచేశామని, ముందుగా సర్ట్ఫికెట్ల పరీశీలన అనంతరం దేహదారుఢ్య పరీక్షలైన పరుగుపందెం, లాంగ్ జంప్ తదితర పరీక్షలు నిర్వహించారు. గతంలో మాదిరిగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కంప్యూటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించామన్నారు. ఆటోమెటిక్ సెన్సలర్ల ద్వారా ఎత్తు, బరువు, కొలతలు తీసుకున్నామన్నారు. 1600మీటర్ల పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి 100మీటర్లు, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహించామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎంపికలుచేశామన్నారు. అడిషనల్ ఎస్పీ విజయకుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.