కడప

రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 15:రోజురోజుకు పట్టణం విస్తరిస్తూ జనాభా పెరుగుతూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నా పట్టణ ప్రధాన రహదారితో పాటు ఆర్ యస్ రోడ్డును విస్తరించే విషయం ప్రకటనలకే పరిమితమవుతూ వస్తుంది. కారణాలు ఏమైనా దశాబ్దాల నుండి ఈ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. రాజంపేట పట్టణ ప్రధాన రహదారిలో ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు. మన్నూరు నుండి ప్రధాన పోస్టాపీసు వరకు రోడ్డు విస్తరణ జరిగిందని, అలాగే పాత బస్టాండు నుండి సబ్‌స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ జరిగిందని, మిగిలి ఉన్న ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు రోడ్డు విస్తరణ చేపడితే చాలావరకు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కారణాలు ఏమైనా రోడ్డు విస్తరణ పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల నిత్యం ట్రాఫిక్ అంతరాయాలు ఎదుర్కొనక తప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరగని మార్గంలోనే ప్రధాన వ్యాపార సంస్థలున్నాయని, దీంతో రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ప్రధాన మార్కెట్ కూడా ప్రధాన పోస్ట్ఫాసు ప్రక్కనే ఉందని దీంతో నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య వేలల్లో ఉంటుందంటున్నారు. ఇక ఆర్‌యస్ రోడ్డు ఇటీవల కాలంలో జనరద్దీతో నిండిపోతున్నది. సాయంత్రం సమయాల్లో అయితే ద్విచక్ర వాహనాల రాకపోకలకే ఇబ్బందికరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్డును కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన రహదారులు ప్రక్కనుంచితే ప్రధాన రహదారికి, ఆర్‌యస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రధాన బజార్లు, వీధుల్లో కూడా జనరద్దీ అధికంగా ఉంటున్నది. ముఖ్యంగా పాత పోలీసులైన్ వీధి, ఈడిగపాలెం, నాగులమాను వీధి, పొట్టిశ్రీరాములు వీధి, గాంధీబొమ్మ సర్కిల్, గడ్డివీధి తదితర చోట్ల నిత్యం ట్రాఫిక్ అంతరాయాలున్నాయి. ఇక్కడ సరైన నియంత్రణ అటు మున్సిపల్ అధికారులు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ట్రాఫిక్ అంతారాయాల కారణంగా ద్విచక్ర వాహనదార్లు పడుతున్న అగచాట్లు చెప్పనలవి కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా పట్టణంలో పూర్తిస్థాయిలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసే విషయంలో సంబంధిత అధికారులు చొరవ చూపాల్సిన అవసరముంది.

వైఎస్ జగన్
ఓదార్పుయాత్రలకే పరిమితం..

వేంపల్లె, ఏప్రిల్ 15: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమాత్రం ప్రజలు, రైతుల కష్టాలపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని కేవలం ఓదార్పుయాత్రలకే పరిమితమవుతున్నాడని శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. తాను 2011 నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆరు సంవత్సరాల పాటు కొనసాగానని, అప్పటి నుండి పులివెందుల ప్రాంత ప్రజల కోసం సాగునీరు, తాగునీరు కోసం ఎనలేని కృషి చేశానన్నారు. ఇందులో భాగంగానే కృష్ణా జలాలు పులివెందులకు రావడం జరిగిందన్నారు. 2009-14 సంవత్సరం వరకు ఒక్కసారైనా ప్రజలు, రైతుల కష్టాల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. కేవలం జిల్లాకు, పులివెందుల తాలూకాకు ఒక విజిటింగ్ ప్రొఫెసర్‌గా రావడం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిపై నిందలు మోపడం ఆయనకు ఆనవాయితీగా మారిందన్నారు. పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి ఉంటే చీనీ చెట్లు ఎందుకు ఎండుతాయని వైఎస్ జగన్ నిందలు మోపడం సరికాదన్నారు. ఎక్కడో ఓ చోట ఒకట్రెండు చీనీచెట్లు ఎండిపోయి ఉండవచ్చు దానిని తన పేపర్లో పెద్ద అక్షరాలతో రాసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలోనే గండికోట ప్రాజెక్టుకు నీళ్లు తీసుకువచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా పైడిపాలెం రిజర్వాయర్ పూర్తి చేయడం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసి నీళ్లు తీసుకొనివస్తే నీళ్లు ఇస్తే చీనీచెట్లు ఎందుకు ఎండుతాయని వైఎస్ జగన్ ప్రశ్నించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి, పెద్ద కరువు మన ముందు ఉంది అయినప్పటికీ సింహాద్రిపురం, లింగాల మండలాలలో ఉన్న చీనీచెట్లు సుమారు 90 శాతం మేర బాగున్నాయని తెలిపారు. తొండూరు మండలంలో వీలైనన్ని గ్రామాలకు నీరందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో నీళ్లు లేకపోవడంతో నీళ్లు తాగడం లేదన్నారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసునన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డిని పులివెందుల ప్రాంతానికి పిలుచుకువచ్చి సాగునీరు, తాగునీటిపై సర్వే జరపనున్నామన్నారు. అలాగే సాగునీరు అందని ప్రాంతాల్లో ట్రాక్టర్లతో సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. తాను సాగు, తాగునీటి కోసం పడుతున్న అష్టకష్టాలు పులివెందుల ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలలో పులివెందుల శాసనసభ నుండి పోటీ చేస్తానని గెలుపొందుతానని, ఒకవేళ ఓడిపోతే తాను రాజకీయాల నుండి పూర్తి స్థాయిలో వైదొలుగుతానని ఆయన సవాల్ విసిరారు. పులివెందుల ప్రాంత ప్రజలు తనను తప్పక ఆశీర్వదించి అత్యధిక ఘనమెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాలలో ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి కష్టసుఖాలలో పాలు పంచుకున్నానని తెలిపారు. మరో రెండేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు షబ్బీర్, మునిరెడ్డి, తిప్పారెడ్డి, మోహన్‌రెడ్డి, కొండయ్య, రామచంద్రారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.