కడప

కాదేదీ ‘బెట్’కనర్హం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 21: పందేలకు కాదేదీ అనర్హం అన్నట్లు జిల్లాలో జూదగాళ్లకు ఇప్పుడు ‘బెట్’లు కాచేందుకు కొత్త అంశం దొరికింది. ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి ఏ పార్టీ టిక్కెట్ వస్తుందనే అంశంపై ఊహాగానాలు, పందేలు ప్రారంభమయ్యాయి. మొన్న జమ్మలమడుగు నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి ప్రకటన, మైదుకూరు నియోజకవర్గంలో డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశంలోకి పోవడం దాదాపు ఖాయమైందనే వార్తలు, రాజంపేట నియోజకవర్గంలో మేడా సోదరులు వైసీపీ గూటికి చేరడం దాదాపు ఖరారేనన్న తతంగం జరగడంతో జిల్లాలో రాజకీయ వేడి రగిలింది. ఇంతవరకూ పేకాట, క్రికెట్, సంక్రాంతి సీజన్‌లో కోడిపందేలపై బెట్‌లు కట్టిన జూదగాళ్లకు ఇప్పుడు కొత్త అంశం దొరికింది. జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో ఇరుపార్టీల్లోనూ కొంత అయోమయం, అస్పష్టత ఉంది. ఈ అస్పష్టత కారణంగానే పందేలకు ఊపొచ్చింది. స్వయంగా టిక్కెట్ బరిలో ఉన్న ఆయా నేతలే తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. తనకే టిక్కెట్ ఖాయమని, పందేలు పెట్టుకోమని చెబుతుండటం గమనార్హం. రెండు ప్రధాన రాజకీయపార్టీలతోపాటు జనసేన పార్టీలో కూడా టిక్కెట్‌కై పలువురు నేతలు పోటీలు పడుతున్నారు. జనసేన పార్టీ తరపున స్వయంగా గెలుస్తామనే నమ్మకం లేనప్పటికీ, జనసేన పార్టీ ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తుపెట్టుకుంటే, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే నియోజకవర్గంలో పొత్తు కలిసిన ప్రధాన పార్టీ అండతో గెలవవచ్చుననే ఆశలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే జనసేనలో పనిచేస్తూ, పవన్ కల్యాణ్‌తో పరిచయం ఉన్న నేతలు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాజంపేట నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం నుండి వెళ్లిపోవడం దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఆ నియోజకవర్గానికి కొత్త మొహాలు రంగంలోకి వచ్చాయి. పాత కాపులు, మాజీలకన్నా కొత్తమొహాల వల్లే రాజకీయ ప్రయోజనం అధికంగా ఉంటుందని తెలుగుదేశం అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ‘రెడ్‌బస్’ కంపెనీ యాజమాన్య సభ్యుల్లో ఒకరైన పి.చరణ్‌కుమార్ రాజు సుండుపల్లె మండలానికి చెందినవాడే. యువకుడైన చరణ్, తాను ఎన్ని కోట్లరూపాయలైనా ఖర్చు చేయగలననే భరోసాను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. రాయచోటిలో ప్రసిద్ధి చెందిన రాజు విద్యాసంస్థల యజమాని జగన్మోహన్‌రాజు కూడా రాజంపేట బరిలో తెలుగుదేశం తరపున టిక్కెట్ సంపాదించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అలాగే జిల్లాలో కమలాపురం , జమ్మలమడుగు , రైల్వేకోడూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు,కడప నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎవరిని బరిలో దించుతారన్నది ఆపార్టీ నేతలకే అంతుపట్టని విషయం. ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన బలమున్న ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. వీరిలో ప్రతి నాయకుడు తమకే టిక్కెట్ ఖాయమని అనుచరులతో చెబుతుండటంతో పందేలజోరు ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలోనూ కడప పార్లమెంట్‌కు, రాజంపేట, రాయచోటి, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరన్నది డోలాయమానంలో ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో సుధీర్‌రెడ్డిని గెలిపించుకురావాలని జగన్ పిలుపునిచ్చినప్పటికీ, అక్కడ తెలుగుదేశంలో నాయకుల మద్య ఉన్న ఆధిపత్యపోరులో వైసీపీ వైపు వస్తే వారివైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ఇరుపార్టీల్లో ఉన్న ఈ పరిణామాలన్నీ జూదగాళ్లకు ఒక కొత్త బెట్టింగ్ అంశంగా మారాయి. ఇప్పటికే ఒక నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నాయకుడొకరు తనకే టిక్కెట్ ఖాయమైందని చెబుతూ, తన అనుచరులతో కోట్లరూపాయలు బెట్టింగ్‌లకు ప్రోత్సహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.