కడప

ఎస్పీ దృష్టికి చీటీల మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 4: దాదాపు 15రోజుల క్రితం రైల్వేకోడూరు పట్టణంలో ఒక మహిళ రూ.2.5కోట్లమేర చీటీల పేరుతో కుచ్చుటోపీ పెట్టి మోసం చేయగా బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కోడూరుకు చెందిన బాధిత మహిళలంతా సోమవారం జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠిని కలిసి ఫిర్యాదు చేశారు. తాము నెలరోజులుగా రైల్వేకోడూరు పోలీసుస్టేషన్ చుట్టు తిరుగుతున్న ఇటు సిబ్బంది కానీ, అటు పోలీసు అధికారులు కానీ ఈవ్యవహారంపై పట్టించుకోలేదని ఎస్పీ ఎదుట ఏకరువు పెట్టారు. సంబంధిత మహిళ ఎక్కడికి వెళ్లింది స్థానిక పోలీసులకు తెలుసునని, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాయచోటిలో ఇటీవల ఒక మహిళ రూ.2.6 కోట్లమేర చీటీల పేరుతో రాయచోటి ప్రజలను మోసగించింది. ఆమెపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె పోలీసులు, అధికారులతో లాలూచీ పడి దర్జాగా తిరుగుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఖాతరుచేయకుండా మోసం చేసిన మహిళ పక్షమే పోలీసులు నిలచినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అధికారపార్టీ నేతలకు చేరగా, వారు బాధితులకు న్యాయం చేయాలని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్డునపడ్డ బంగారు కార్మికులు
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 4: బంగారంపై కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ బంగారు వ్యాపారులు తమ బంద్‌ను కొనసాగిస్తున్నారు. దీంతో నిత్యమూ బంగారు పనులు చేసుకుంటూ జీవనం సాగించే వేలాదిమంది స్వర్ణకారుల కార్మికులు రోడ్డున పడ్డట్లైంది. గత నెలరోజుల్లోనే మూడవసారి బంగారు వ్యాపారులు ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ బంద్ చేసిన విషయం పాఠకులకు విధితమే. గత మూడునాలుగురోజులుగా బంగారు వ్యాపారులు పూర్తిగా బంద్‌ను పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంగారు పనులు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులు పట్టణంలో సుమారు ఐదువేలమందికిపైగా జీవిస్తున్నారు. కార్మికులకు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ లబోదిబోమంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంగారంపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంలోగానీ, వారి బాధల గురించి పట్టించుకోవడం లేదని బంగారు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అదటుండగా వ్యాపారులు మాత్రం బంగారంపై విధించిన సుంకాన్ని తగ్గించేంతవరకు తమ వ్యాపారాలను కొనసాగించేంది లేదని ఖరాఖండిగా తేల్చి చెబుతూ బంద్‌ను పాటిస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారంపై నిత్యం కోట్లాదిరూపాయల వ్యాపార లావాదేవీలు ఆగిపోయినట్లయింది. ప్రొద్దుటూరు అంటే స్వచ్ఛమైన బంగారుకు పెట్టింది పేరని, ప్రొద్దుటూరులో బంగారం కొంటే 24క్యారెట్లతో కలిగిన మేలిమి బంగారం లభిస్తుందని, ఎటువంటి మోసాలుండవని, అందు కోసమే ఎక్కడ సుభకార్యాలు జరిగినా, ఎటువంటి కార్యక్రమాలకు బంగారం కొనాలనుకున్నా జిల్లా నలుమూలలతోపాటు పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలుకు చెందిన అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పట్టణానికి వచ్చి బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. దీంతో నిత్యమూ రూ.8 నుంచి రూ.10 కోట్ల మేరకు చిన్నా, చితకా పెద్ద షాపుల ద్వారా లావాదేవీలు జరుగుతూ వుండేవి. ప్రస్తుతం బంగారు అంగళ్ల వ్యాపారులు ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే తగ్గించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ బంద్ పాటిస్తున్నందున కోట్లలో జరుగుతున్న లావాదేవీలు ఆగిపోయినట్లయింది. అంతే కాకుండా బంగారు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బంగారమే కాకుండా వస్త్రాలకు కూడా నిలయంగా మారిన ప్రొద్దుటూరులో వస్త్రాల కొనుగోలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండేవని పలువురు వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం వ్యాపారుల బంద్‌తో బంగారమే కాకుండా వస్త్రాలతోపాటు మిగిలిన వ్యాపారాలు కూడా మందకొడిగా సాగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగారు పనులు చేసుకుంటూ నిత్యం జీవనం సాగించే స్వర్ణకారులు బంద్‌తో కాస్త వీధిన పడ్డట్టు అయింది. కార్మికులు కార్పోరేషన్లు, ఫైనాన్స్ రూపంలో అప్పులు తెచ్చుకుంటూ వారికి నిత్యమూ సంపాదించిన మొత్తంలో చెల్లిస్తూ తాము తీసుకున్న అప్పులను తీర్చుకుంటూ వుండేవారమని, బంగారు వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేయడంతో అప్పులు ఇచ్చినవారు కూడా వ్యాపారులపై వత్తిడి తెస్తున్నారని, ఏమీ చేయలేక, వారికి సమాధానం చెప్పుకోలేక, కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితులు తమకు దాపురించాయని స్వర్ణకారుల కార్మికులు తమ ఆగ్రహాన్ని ఇటు పాలకులు, అటు వ్యాపారులపై వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలపై జగన్ ఆరా
పులివెందుల, ఏప్రిల్ 4: శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కడపజిల్లాలోని సమస్యలపై ఆరాతీశారు. సోమవారం బెంగుళూరు నుంచి పులివెందులకు చేరుకున్న జగన్ తన క్యాంప్ కార్యాలయంలో కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని తాగునీటి సమస్య, పెండింగ్‌లో వున్న ప్రాజెక్టుల నిర్మాణం, కరువు పరిస్థితి గురించి నాయకులు జగన్‌కు వివరించారు. కాగా జగన్ లింగాల, వేముల మండలాలలో పర్యటించి రైతుల పరిస్థితిని తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ముఖ్య అనుచరుల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా సొంత జిల్లాలోని నాయకులు టిడిపిలోకి వలసలు పోకుండా ఆపేందుకు పలువురు ముఖ్య నేతలతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంతోపాటు జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులు భారీగా జరుగుతాయన్న ఊహాగానాలు వస్తున్న తరుణంలో వాటికి అడ్డుకట్ట వేయడానికి స్వయంగా జగనే రంగంలోకి దిగుతున్నట్లు కూడా చర్చించుకుంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో వలసలు ఆగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం అందరినీ కలుపుకొనిపోతే తప్ప వలసలు ఆగే పరిస్థితులు కనిపించడం లేదని తమ పార్టీ నాయకులే అంటున్నారు. జగన్ వెంట వై ఎస్.మదన్‌మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపాకలో మొదలైన అన్నమయ్య 5513వ వర్థంతి వేడుకలు
రాజంపేట, ఏప్రిల్ 4:శ్రీ వేంకేటేశ్వరునిపై 32వేల సంకీర్తనార్చన చేసిన అన్నమాచార్యుల 513వ వర్ధంతి వేడుకలు ఆయన జన్మస్థలం తాళ్లపాకలోని అన్నమయ్య ధ్యాన మందిరం, రాజంపేట-రేణిగుంట హైవేలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అన్నమయ్య 513 వర్ధంతి వేడుకలు తాళ్లపాకలో నాలుగు రోజుల పాటు టిటిడి నిర్వహించనుంది. ఇందుకోసం టిటిడికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన సంగీత కళాకారులు, తిరుమల నుండి ప్రత్యేకంగా వేద పండితులు తాళ్లపాకకు చేరుకున్నారు. అన్నమయ్య వర్ధంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ధ్యాన మందిరంలోని అన్నమయ్య విగ్రహానికి తిరుమల నుండి వచ్చిన ప్రత్యేక వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరంలోను, బయట ఉన్న అన్నమయ్య విగ్రహాలకు ప్రత్యేక పూలాలంకరణ చేశారు. తిరుమల నుండి తీసుకొచ్చిన అన్నమయ్య పంచలోహ విగ్రహానికి గ్రామంలో ప్రత్యేకంగా ఉదయం పూజలు నిర్వహించి ఊరేగించారు. ఈ సందర్భంగా బహుళ ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలు, గోష్టిగానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే జరిగింది. అలాగే అన్నమయ్య ధ్యాన మందిరంతో పాటు ఇక్కడి శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ సుదర్శనచక్రం ఆలయాల్లో కూడా తిరుమల నుండి వచ్చిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వినియోగం జరిపారు. అన్నమయ్య వర్ధంతి వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాలకు ప్రత్యేక అలంకరణలు జరిపారు. కాగా తాళ్లపాకలోని అన్నమయ్య ధ్యాన మందిరం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైనుండి సాయంత్రం తిరుపతికి చెందిన కుమారి ఎస్.అనూష బృందం సంగీత సభ, తిరుపతికి చెందిన జి.మునిలక్ష్మి బృందంచే హరికథా కాలక్షేపం జరిగింది. అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన రుక్మిణీ నాగేశ్వరరావు బృందంచే సంగీత సభ, తిరుపతికి చెందిన ఎం.లక్ష్మీకుమారి బృందంచే హరికథా కాలక్షేపం నిర్వహించారు. కాగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం హైవేలో వెళ్ళే ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశారు.
శతాబ్ధాల చరిత్రకు సజీవ సాక్ష్యం... ఒంటిమిట్ట రామాలయం
ఒంటిమిట్ట, ఏప్రిల్ 4:మరో అయోధ్యగా పేరొంది, ఆంధ్ర భద్రాదిగా విరాజిల్లుతున్న ఏకశిలనగరం ఒంటిమిట్ట మహానీయుల ఆనవాళ్లకు, శిల్పసంపదకు మకుటంలోని మణిహరంలా చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ నెల 12వ తేది నుండి 24వ తేది వరకు కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక్కసారి మహానీయుల చరిత్రను, అద్భుతమైన శిల్పసంపద విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట దేవస్థానాన్ని ప్రభుత్వం, టిటిడి సంయుక్తంగా ఆకాశాన్ని అంటేలా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పురాతన చరిత్ర ఉన్న ఈ రామాలయానికి ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఈ ఆలయంలో ఒకే శిలపై త్రేతాయుగంలో జాంబవంతునిచే హనుమంతుడు లేని ఈ సీతారామలక్ష్ముణులను ప్రతిష్టించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఆంజనేయస్వామి సీతారామలక్ష్ముణులకు పరిచయం కాక మునుపే ఈ ఏకశిల గడ్డపై రామాలయం వెలసింది. అదే విధంగా కంపరాయలు అనే రాజు ఒంటిమిట్ట మార్గంలో వెళుతూ తీవ్రమైన దాహర్తికి గురైనపుడు ఒంటడు, మిట్టడు అనే వారు రామతీర్థాన్ని చూపి దప్పిక తీర్చినట్లు చరిత్ర చెబుతుంది. అందుచే ఈ ఇద్దరి పేర్లతో ఒంటిమిట్ట పిలువబడుతుంది. ఈ ఆలయం దట్టమైన మిట్టపై ఉండడం వలన ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు మరో చరిత్ర చెబుతుంది. సీతారామలక్ష్ముణులు వనవాస కాలంలో నడయాడుతుండగా పక్షుల దాహర్తిని తీర్చేందుకు సీతమ్మ తల్లి కోరికపై రామయ్య పాతాళగంగను బాణంతో పైకి తెచ్చాడని ఆ ప్రాంతం రామతీర్థంగా మారిందని మరో కథనం. సీతాదేవి దప్పిక తీర్చేందుకు లక్ష్ముణస్వామి బాణం సంధించిన చోటు లక్ష్ముణ తీర్థంగా పిలువబడుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ రామాలయం ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతుంది. స్వామివారి అభిషేకానికి ఇమాం అనే నవాబు బావిని త్రవ్వించినట్లు ఆలయ ఇతిహసం చెబుతుంది. గతంలో స్వామివారి అభిషేకానికి ఆ బావి నీరే వినియోగించే వారు. నేడు ఆ బావి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా ఆలయంలోని శిల్పసంపద, కళ వాటి అందాలు వర్ణించ శక్యం కాదు. భారతదేశంలోని ఏ ఆలయాలలో లేని శిల్ప సంపద ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఉందనేది నగ్నసత్యం. ఈ గోపురాల నిర్మాణం చోళ కళతో అత్య అద్భుతంగా నిర్మించారు. ఆలయంలోని ఎతె్తైన గోపురాలలో రామాలయ గోపురం ఒకటిగా పేరుగాంచింది. కీస్తుశకం 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణాలు. ఆలయంలోని మూడు గోపురాల నిర్మాణాన్ని బట్టి చూస్తే శిల్పసంపద అత్యద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని చోళులు, మట్టిరాజులు, విజయనగర రాజులు వారి వారి పాలనలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇదీలా ఉండగా ఈ ఆలయాభివృద్ధికి కృషి చేసిన మహానీయులలో మొట్టమొదటి వారు వావిలికొలను సుబ్బారావు. ఈయన రామకుటీరంలో ఉంటూ స్వామివారిని సేవించడం జరిగింది. భద్రాది రామయ్య ప్రియ భక్తుడు రామదాసు వలే ఒంటిమిట్ట రామయ్యకు వావిలికొలను సుబ్బారావు ప్రియ భక్తుడుగా చరిత్రలో నిలిచారు. ఈయన స్వామివారి కోసం కోట్లాది రూపాయలు, బంగారు అభరణాలు, అప్పట్లో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించి చరిత్ర పుటల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన ఆశ్రమం స్థానిక శృంగిశైలంపై ఉంది. అదే విధంగా మహా భాగవత అనువాద కవి బమ్మెర పోతనామాత్యులు ఒంటిమిట్ట వాసి కావడం, తాను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామునికి అంకితం చేయడం విశేషం. ఒంటిమిట్టకు క్రోసుడు దూరంలో ఉన్న పెన్నానదిలో నిత్యం స్నానమాచరించి స్వామివారిని సేవిస్తూ పోతనామాత్యులు భాగవత రచన చేసినట్లు చరిత్ర చెబుతుంది. అంతే కాకుండా శ్రీరామనవమి వేడుకలలో పోతన జయంతిని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. రామ, రావణ యుద్ధంలో లక్ష్ముణస్వామి మూర్ఛకు గురైనపుడు ఆంజనేయస్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్లే సమయంలో అందు నుండి ఒక మూలిక ఒంటిమిట్ట చెరువుకట్టపై పడగా అక్కడ స్వయంభువుగా వీరాంజనేయ స్వామి వెలసినట్లు చరిత్ర చెబుతుంది. నేడు ఈ ఆలయం కూడా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఆంజనేయ స్వామి చరిత్రలో నిలిచారు. అలాగే కోదండ రామస్వామికి కూడా ఆ రోజుల్లో వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు దర్శించి తనవి తీరినట్లు చరిత్ర చెబుతుంది. అంతే కాకుండా ఆ రోజుల్లో సీతారామలక్ష్ముణులు సంచరించిన మృకుండాశ్రమం కూడా రామాలయానికి సమీపంలోనే ఉంది. ఆలయ చరిత్ర యొక్క విశేషాలు త్రవ్వేకొద్దీ వెలుగు చూస్తాయనేందులో సందేహం లేదు. ఈ ఆలయంలో పూర్వం అనేక మంది మహా యాగాలు చేసే వారని, అందుకు మృకుండ మహార్షే ఉదాహరణగా చెబుతారు. వనవాసంలో రాక్షసులను హత మార్చేందుకు పిడిబాకు, కోదండంతో ఇక్కడకు రామయ్య విచ్చేశాడని అందుకు ఇక్కడి రాముడికి కోదండ రాముడనే పేరు సార్ధకమైంది. ఈ ఆలయంలో ఆంజనేయస్వామి లేని సీతారామలక్ష్ముణులుగా చరిత్రలో నిలిచింది. మహా గోపుర ఉత్తర ద్వారం వద్ద రెండు శిలా శాసనాలు ఉన్నాయి. ఇందులో మొదటి శాసనం కీస్తుశకం 1555లో కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి వేయించారు. ఇందులో విజయనగర పాలకులైన వీర సదాశివదేవరాయల సామంతులు, మండలాక్షులైన తిరుమలయ్య, దేవ మహారాజులు పులపుత్తూరు గ్రామాన్ని కంచెరాజు, బోగేపల్లె గ్రామాలను, వరి మళ్లను ఆ రోజుల్లో దానమిచ్చారు. గోపుర ప్రాకారాల నిర్మాణాలకు రథం, బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమయ్య రాజయ్య కుమారుడైన నాగరాజయ్య, దేవ మహరాజులు పొలాలను దానమిచ్చారు. మహకవి పోతన రామాలయంలో భాగవత రచన చేస్తూ గజేంద్ర మోక్షంలోని అల వైకుంఠపురం పద్యంలో కొన్ని చరణాలు నిలిపి వేయగా రామయ్య వచ్చి ఆ పద్యాలను పూరించినట్లు చరిత్ర స్పష్టంగా తెలుపుతుంది.
ఈ విధంగా భారతదేశంలోనే మకుటంలో మణిహరంలా ఒంటిమిట్ట శిల్పసంపదలకు పుట్టినిల్లుగా దిన దిన ప్రవర్ధమానంగా భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం, టిటిడి సంయుక్తంగా రూ. 20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ బ్రహ్మోత్సవాల కళను ఇప్పటి నుండే కనువిందు చేస్తున్నారు.

విద్యాప్రమాణాల పెంపుకోసమే కేంద్రీయ విద్యాలయాలు
రాజంపేట, ఏప్రిల్ 4:బడుగు, బలహీన వర్గాలలో విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు ఎంతోగానో దోహద పడుతాయని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ వసతి గృహం-2లో కేంద్రీయ విద్యాలయంలో చేరే విద్యార్థులకు మేడా అడ్మిషన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాయన్నారు. రాజంపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయమన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం నుంచి విద్యాభివృద్ధి కోసం మరిన్ని నిధులు తెప్పించి రాజంపేట ప్రాంతాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం నూతనంగా కేంద్రీయ విద్యాలయాలు, రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రస్తుతం ప్రభుత్వ బాలుర వసతిగృహం - 2లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విద్యాలయానికి శాశ్వత భవనాల నిర్మాణాలను మండలంలోని మిట్టమీదపల్లె ప్రాంతంలో నిర్మించడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యార్థులను అక్కడకు పంపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత ఒక్కొక్క తరగతి పెంచుకొంటూ పోవడం జరుగుతుందన్నారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలను ఈ నెల 20వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశం కొరకు స్థానికంగా ఉన్న పిల్లలకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గతంలో మాజీ ఎంపి ఎ.సాయిప్రతాప్ కృషి వల్ల రాజంపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. ఆర్‌యుబి కూడా సాయిప్రతాప్ కృషి ఫలితమేనన్నారు. ప్రతి ఒక్కరి సహయ, సహకారాలతో రాజంపేట నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు పి.కుసుమకుమారి, ఏజిపి టి.లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు గుల్జార్‌బాషా, టి.సంజీవ్‌రావు, ఎస్.బాపనయ్యనాయుడు, షేక్ అబ్దుల్లా, కొండా శ్రీనివాసులు, వడ్డెర రమణ, వడ్డెర శ్రీనివాసులు పాల్గొన్నారు.