AADIVAVRAM - Others

మహా మానవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగానే సైన్స్ అంటే అందరూ దూరంగా ఉంటారు. అది పిల్లలకు సంబంధించిన విషయం అనుకుంటారు. సైన్స్ అంటే మన గురించిన సంగతులే. వాటిని మనసు పెట్టి చదివితే తప్పకుండా అర్థం అవుతాయి. కానీ ఫిజిక్స్‌లోని కొన్ని అంశాలు నాకు కూడా అర్థంకావు. ఫిజిక్స్ చాలా మటుకు కంటికి కనిపించదు. ఆ సిద్ధాంతాల ఆధారంగా జరుగుతున్న అంశాలను బట్టి భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. అందులోనూ థియరిటికల్ ఫిజిక్స్ అని మళ్లీ ఒక విభాగం ఉంది. అది మరీమరీ అర్థంకాదు. నేను అందుకే అర్థమయిన చోటుకి ఫిజిక్స్ గురించి చెప్పడం అలవాటు చేసుకున్నాను. అర్థంకాకున్నా చదవడం అలవాటు చేసుకున్నాను అని కూడా చెప్పాలి.
ఒక ప్రచురణ సంస్థ కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు అనువాదం చేయడానికి హక్కులు తెచ్చుకున్నారు. ఆ మూడు, నాలుగు పుస్తకాలు అంతరిక్షం గురించి, విశ్వం గురించి వివరిస్తాయి. అయితే అందులో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ల ద్వారా రచయిత ప్రపంచానికి తన రంగం గురించి చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ మాట చెప్పగానే అందరూ ఆ పుస్తకాలను బాల సాహిత్యం అని వర్గీకరిస్తారు. ఇక వాటిని ముట్టుకోను కూడా ఆలోచించరు. ఆ వరుసలోని మొదటి పుస్తకాన్ని అనువదించే అవకాశం నాకు వచ్చింది. ఆనందంగా మూడు వందల పేజీల పుస్తకాన్ని నెల రోజుల్లో తెలుగులోకి రాసేశాను. రాస్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. సైంటిస్టులకు తమ రంగం గురించి తమ పద్ధతిలో రాయడం తెలుసేమోగానీ, మామూలు వారికి అర్థం చేయించే పద్ధతిలో రాయడం చేతకాదు. నేను ఈ మాటలు అంటున్నందుకు ఎవరూ బాధపడనవసరం లేదు. కార్ల్ సేగన్ అని ఒక పరిశోధకుడు ఉండేవాడు. అతను పుస్తకాలు రాశాడు. ఒక టీవీ సీరియల్ తీశాడు. అవి ప్రపంచానికి అందించిన సమాచారం ఎంత బాగుందో, అదే పద్ధతిలో స్టీఫెన్ హాకింగ్ ఈ బాల నవలలను రాశాడు. ఆయన చెప్పే అంశాలు ఐన్‌స్టైన్ సిద్ధాంతాలలాగే పరిశోధకుల బుర్రలకు పనిపెట్టాయి. నిజానికి ఐన్‌స్టైన్ తర్వాత అంతటి మేధావి హాకింగ్ అన్నారు. విశ్వానికి రహస్య తాళంచెవి అని నేను అనువదించిన నవలకు ప్రచురణకర్తలు పేరు పెట్టారు. అయితే నేను ఎగిరి గంతేసి నెలరోజుల్లో రాసిన పుస్తకాన్ని వాళ్లు ఎన్నాళ్లయినా అచ్చువేయలేదు.
2018 జనవరిలో హైదరాబాద్ పుస్తక మేళా జరిగింది. అందులో మాది అని నేను గర్వంగా చెప్పగల క్రియేటివ్ లింక్స్ స్టాల్‌లో వెళ్లి కూచున్నాను. నా పుస్తకాలు పక్కనే పేర్చి ఉన్నాయి. వాటి పక్కన అందంగా అచ్చేసి కాస్త వేరుగా కనిపించే పద్ధతిగా కవర్ పేజీ వేసిన పుస్తకం ఒకటి కనిపించింది. చేతిలోకి తీసుకుంటే దాని మీద ‘విశ్వానికి రహస్య తాళం చెవి’ అని పేరుంది. అది నాకు పెద్ద సర్‌ప్రైజ్. విప్పిచూస్తే అది అచ్చంగా నా పుస్తకమే. పాపం ప్రచురణకర్తలు హైదరాబాద్‌వారు కాదు. పుస్తకం ఎప్పుడు అచ్చువేశారో తెలియదు. అనువాదకుడికి నాలుగు కాపీలు పంపించాలని వాళ్లకు తోచినట్టు లేదు. నాకు కొంచెం బాధ తోచింది. ఫోన్‌లో మాట్లాడాలి అనిపించలేదు. సంస్థ ప్రతినిధికి మెయిల్ చేశాను. వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను. చాలారోజులపాటు జవాబు రాలేదు. మళ్లీ సందేశాలు పంపించాను. తరువాత సంగతి మర్చిపోయాను. నా మానాన నేను పనిచేసుకుంటూ ఉంటే, ఒకరోజున పోస్ట్‌మాన్ వచ్చాడు. ఒక పార్సిల్ ఇచ్చాడు. విప్పి చూస్తే అందులో హాకింగ్ పుస్తకాల అనువాదం ఐదు కాపీలు ఉన్నాయి. ఎగిరి గంతేశాను. ఆ సంగతి ఎవరూ చూడలేదు.
పుస్తకాలను టి.వి. పక్కన షోకేస్‌లో గర్వంగా ప్రదర్శనకు పెట్టాను. మరునాడు ఉదయం కంప్యూటర్‌ను మామూలుగా స్నానం తరువాత స్టార్ట్ చేసి ముందు కూచుంటే, హిందూవారి తాజా వార్తల పద్ధతిలో మూలన ఒక బాక్స్ వచ్చింది. క్లిక్ చేస్తే అది పెద్ద స్క్రీన్ నిండా పరుచుకుంది. స్టీఫెన్ హాకింగ్ అనే మహామానవుడు 76 సంవత్సరాల వయసులో ఇక చాలు అనుకుని మరో ప్రపంచానికి వెళ్లిపోయాడు. నిన్న కలిగిన సంతోషానికి పూర్తిగా వ్యతిరేకంగా ఒక్కసారిగా మనసు కృంగిపోయింది. అతని పుస్తకం అనువదించానని కాదు కానీ, నాకు చాలా రకాలుగా హాకింగ్ ఆదర్శప్రాయుడు. అతను మృత్యుంజయుడు నాలాగే. అతను కేవలం ఆత్మశక్తితో బతికాడు. ప్రస్తుతం నాలాగే. చాలా గొప్ప పనులు చేశాడు. నేను అంత గొప్ప పనులు చేయలేదు గానీ, నాకు చేతనయిన చిన్నచిన్న పనులు చేస్తూనే ఉన్నాను.
హాకింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఫ్రెడ్ హాయిల్ దగ్గర పరిశోధన చేయాలి అనుకున్నాను. అది కుదరలేదు. మరొక గురువు వద్ద చేరవలసి వచ్చింది. ఇరవయ్యేళ్ల వయసులోనే కాలేజికి వెళ్లాలని ఒకనాటి ఉదయం షూస్ వేసుకుంటూ ఉంటే అతని చేతులు తడబడ్డాయి. ఆ తరువాత మరేవో కొన్ని సమస్యలు వచ్చాయి. పరీక్షలు చేయిస్తే భయంకరమయిన నాడీమండల వ్యాధి వచ్చిందని తేల్చేశారు. ఒకటి, రెండు ఏళ్లకన్నా బ్రతకడు అని మొగమాటం లేకుండా చెప్పారు. కానీ ఆ మానవుడు ఆ తరువాత యాభయ్యారు సంవత్సరాలు బతికాడు. నాకూ ఒకప్పుడు పెద్ద జబ్బు చేసింది. ఒకటి కాదు, రకరకాల సమస్యలు ఒకేసారి వచ్చాయి. నలుగురు డాక్టర్‌లు నన్ను మధ్యలో పెట్టుకుని ముఖాలు వేలవేసుకుని నా గురించి చర్చించడం గుర్తుంది. వారిలో ఒక కాన్సర్ నిపుణుడు నా మీద జాలిగొని నన్ను బాబూ అని సంబోధించాడు. అతను ఎలాగున్నాడో కానీ, నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు చెముడు వచ్చింది. ఆ సంగతి చెప్పిన అమ్మాయిగారు మరికొన్ని రోజులలో నీకు రెండు చెవులు అసలు వినిపించవు అన్నది. చిత్రం ఏమిటోగానీ, నా చెవులు అంతో ఇంతో పని చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ నా డాక్టర్ మిత్రులు నా మానసిక శక్తి గురించి చెపుతూ ఉంటారు. పిల్లల కోసం తయారుచేసిన వైట్‌బోర్డ్ మీద ఒక మాట రాసి ఉంది. ఐ యామ్ బార్న్ ఫర్ బెటర్ థింగ్స్ అంటుంది ఆ మాట. అంటే నేను ఇంకా ఏదో గొప్ప పనులు చేయవలసి ఉంది అని భావం. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లకూ బహుశా నా ఫిలాసఫీ పట్టి ఉంటుంది. నేను మాత్రం ఆ బలంతోనే ముందుకు సాగుతున్నాను.
గొప్పవాణ్ణి కావాలని నా కోరిక. స్టీఫెన్ హాకింగ్ అంత గొప్పవాణ్ని కావాలని నా కోరిక. ప్రపంచంలో గొప్ప శాస్తవ్రేత్తలు ఎవరు అన్న ప్రశ్నకు సగటున జవాబును లెక్కవేస్తే వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో సైంటిస్టులు తేలతారు. కనీసం నన్ను అడిగితే ముందుగా న్యూటన్ పేరు చెపుతాను. తరువాత ఐన్‌స్టైన్ వస్తాడు. ఆ తరువాత హాకింగ్ వస్తాడు. మిగతా రెండు వేళ్ల గురించి ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేద్దాం.
నేను చెప్పిన ముగ్గురిలో మొదటి ఇద్దరు రకరకాల రంగాలను గురించి పరిశోధించాను. ఇక్కడ నాకు హాకింగ్ ఆదర్శం కుదరలేదు. నేను కూడా రకరకాల పనులు కేవలం చెయ్యగలిగినందుకు చేశాను. హాకింగ్ అంతరిక్షం, విశ్వం చరిత్ర అన్న అంశాలను మాత్రమే చివరి దాకా పట్టుకుని పరిశోధించాడు. పరిశ్రమించాడు. నేను కూడా చేతనయిన ఏదో ఒక పనిని మాత్రమే ఎంచుకుని ఉంటే, కొంతయినా పేరు సంపాదించుకుని ఉండేవాడిని.
విశ్వానికి రహస్య తాళంచెవి పుస్తకంలో హాకింగ్ తాను గట్టిగా నమ్మిన సిద్ధాంతాలను కూడా చెప్పడానికి ప్రయత్నించాడు అంటే ఆశ్చర్యం. ఆ నవలలను ఆయన లూసీ అనే మరొక వ్యక్తితో కలిసి రాశాడు. ఆయన జీవితంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుసు. పరిశోధించి చూస్తే వాళ్లిద్దరిలో లూసీ లేదు. మరింత పరిశోధిస్తే లేవడానికి చేతకాని ఈ మహామానవుడు ముగ్గురు బిడ్డలను కన్నాడని తెలిసింది. వారిలో ఒక అమ్మాయి పేరు లూసీ. అంటే ఆ మహామానవుడు కూతురితో కలిసి ఈ నవలలను రాశాడని నాకు అర్థం అయింది.
బ్లాక్‌హోల్స్ గురించి విన్నవాళ్లకు వాటి సంగతి తెలుస్తుంది. వినని వాళ్లకు కూడా తెలుస్తుంది. ఈ విశ్వంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చేరిన వెలుగు కూడా అందులో కలిసిపోతుంది. కనుక ఆ ప్రాంతం చీకటిగా ఉంటుంది. దగ్గరగా వచ్చిన అన్ని అంశాలను అది మింగేస్తుంది. వీటిని తెలుగులో కాలబిలాలు లేదా కృష్ణబిలాలు అన్నారు. అవి అన్నింటినీ మింగుతాయి అనుకున్నారు. కానీ హాకింగ్ మాత్రం మహామహా సిద్ధాంతాలను కాదు అంటూ బ్లాక్‌హోల్స్ నుంచి తప్పించుకు రావచ్చు అని ప్రతిపాదించాడు. నవలలో ఒక మనిషి కూడా అందులోకి వెళ్లి తప్పించుకుని తిరిగి వచ్చినట్టు రాశాడు. పిల్లలకు కూడా అధునాతన సైన్స్ గురించి అవగాహన కలిగించాలని ఆయన బహుశా అనుకున్నాడు. నవల రాసిన తీరు చాలా బాగుంటుంది.
నాకు అనువాదం ఇచ్చిన ప్రచురణకర్తలు మిగతా పుస్తకాలు నాకు ఇవ్వలేదు. మరెవరికో ఇచ్చారు. తెలుగులో ఒక్కొక్క నవల ఒక రకంగా ఉంటుంది కదా అన్నాను. అయినా వాళ్లు పట్టించుకోలేదు. తరువాతి పుస్తకాలు రాలేదు అని నాకు గట్టిగా తెలుసు. అవి అచ్చుకాకపోవడానికి కారణం మాత్రం తెలియదు. నేను వాటికోసం ఎదురు చూడక తప్పదు.

-కె.బి.గోపాలం