మెయన్ ఫీచర్

కేంద్రంతో ఘర్షణ వైఖరి ‘ఆప్’కే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిపై సమరభేరి మోగించిన అన్నాహజారే వొకప్పటి అనుచరుడు, ఆమ్‌ఆద్మీ పార్టీ పేరున గత ఫిబ్రవరి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తమ సహజలక్షణమైన ‘అరాచకవాదం’ బయటపెట్టుకున్నారు. ప్రధాని మోదీని సైతం పిరికిపంద అని మానసిక రోగి అని తులనాడారు. ముఖ్యమంత్రి అయినా ఆయన నోటిదురుసుతగ్గలేదు. ముఖ్యమంత్రిగా 49 రోజులపాటున్న సమయంలో ఆయన ఢిల్లీ వీధులకెక్కి ధర్నాచేసిన విషయం, తన్నుతాను ‘అరాచకవాది’నని ప్రకటించుకున్న విష యం తెలిసిందే. తాజాగా సిబిఐ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుపై దాడి చేసినందుకు అది తనపైననే జరిగిన దాడిగా కేజ్రీవాల్ నొచ్చుకున్నారు. నిజానికి రాజేంద్రకుమార్‌పై అవినీతి ఆరోపణలు ఎప్పుడో వున్నాయి. ఆదాయానికి మించి ఆయనకు ఆస్తులున్నాయని, 2007-2014 మధ్య కాలంలో కాంట్రాక్టులను కొన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు ఆయనపై సిబిఐ ఆరోపణలు నమోదుచేసింది. ఆయనతోపాటు మరో ఆరుగురు ఆఫీసర్ల మీద కూడా అభియోగాలున్నాయి.
ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చినది మొదలు కేంద్రం తో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘర్షణ వైఖరినవలంభిస్తోంది. ముఖ్యంగా పాలనా పరంగా అధికారుల నియామకంలో కేంద్రం మాట పెడచెవిన పెడుతోంది. శ్రీ రాజేంద్రకుమార్ నియామకం అలా జరిగిందే. ఈ విషయమై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కూడా కేజ్రీవాల్‌ను హెచ్చరించింది. ‘‘రాజేంద్రకుమార్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని మరోసారి పరిశీలించమని కేజ్రీవాల్‌కు ఉత్తరం వ్రాశాం, రాష్టప్రతికి, ప్రధానమంత్రికి, ఢిల్లీ గవర్నరుకు చీఫ్ విజిలెన్స్ కమీషనర్‌కు కూడా ఉత్తరం నకలు పంపాం’’ అన్నారు. ట్రాన్స్‌పరెన్సీ యింటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్రీ అశుతోష్ మిశ్రా. దీనితో ఆప్ నుంచి విడిపోయిన ప్రశాంతభూషణ్, యోగేంద్ర యాదవ్‌లు కూడా ఏకీభవించారు. నిజానికి సిబిఐ ఢిల్లీ సెక్రటేరియట్‌లోని 3వ అంతస్తులోగల కుమార్ ఆఫీసు మీద దాడి చేసింది. కాని కేజ్రీవాల్ తమ ఆఫీసుమీద దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. దీన్ని సిబిఐ ప్రవక్త దేవ్‌ప్రీత్‌సింగ్ ఖండించారు. సిబిఐ చర్యను జైట్లీ మీదకు మళ్ళిస్తూ ఢిల్లీ క్రికెట్ బోర్డులో అవకతవకల ఫైలును వెదికేందుకే, సిబిఐ దాడి చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆరోపణల్ని జైట్లీ కొట్టిపారేశారు.
అబద్ధమాడినా అతికినట్లుండాలి అం టారు. ‘అవినీతి’పై వార్ ఛాంపియన్‌గా తన్నుతాను ప్రకటించుకునే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానమంతా తప్పుడు మాటలే, తప్పటడుగులే. మొన్నటికి మొన్న బిహారు ఎన్నికల్లో నిస్సిగ్గుగా లాలూ, రాహుల్‌లతో విజయోత్సవంలో పాలుపంచుకున్న కేజ్రీవాల్‌కు నిందించడం వెన్నతో పెట్టిన విద్య. అవినీతి లాలూతో కలవద్దని, అవినీతి కాంగ్రెస్‌తో జతకట్టవద్దని నితీష్‌కుమార్‌కు ఆయన నీతులు చెప్పలేకపోయారు. కారణం పచ్చి అవకాశవాద రాజకీయం. పదవీ రాజకీయాల పటాటోపం తప్ప మరోటి కాదు. వారణాసిలో చావుదెబ్బతిన్న తరువాత, అంతకుముందు నుంచి కూడా ఆయన మోదీ నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
2014 ఫిబ్రవరిలో తన సహచర మంత్రి సోమనాధ్ భారతి కొందు ఉగాండా మహిళలపై చేసిన జాతి వివక్ష తాలూకు వ్యాఖ్యలను, మందీ మార్బలంతో మహిళలను వేధించడం, బెదిరించడం వంటి చర్యలను ఆయన సమర్ధిస్తూ వీధులకెక్కారు. చివరకు సోమనాధభారతి స్వంత భార్యయే ఆయనపై గృహహింస తాలూకు ఆరోపణలు చేయడంతో ఆయన పదవీచ్యుతుడయ్యాడు. పాలించాలా? ప్రతిఘటించాలా? అన్న విషయంలో ఏదీ తేల్చుకోలేక పూటకోమాట మాట్లాడారు. ముందు మంత్రులకు కార్లు వద్దన్నారు. తరువాత ‘ఎర్రబుగ్గ’ మాత్రమే వద్దని చెప్పామన్నారు. నిర్భయ ఘటన సమయంలో వచ్చిన మహిళా సంఘటనోద్యమ బలాన్ని, అంతకుముందు అన్నాతో కలిసి చేసిన అవినీతి వ్యతిరేకోద్యమాన్ని తన రాజకీయ ప్రణాళికకు అనువుగా మల్చుకున్న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన రెండు వారాల్లోనే డెన్మార్క్ మహిళపై జరిగిన అత్యాచారాన్ని నివారించలేకపోయారు. చివరకు 33 గంటల ధర్నా తరువాత కూడా ఆయన ఢిల్లీ పోలీసులను తమ క్రింద పనిచేసేలా చేసుకోలేకపోయారు. మహిళల్ని రక్షించలేకపోయారు. మంత్రినీ రక్షించుకోలేకపోయారు.
రెండవసారి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ప్రధానమంత్రిని, ఢిల్లీ గవర్నరును స్పీడ్‌బ్రేకర్లు అన్నరు. ఢిల్లీ పోలీసులు తనకు కాకుండా గవర్నరుకు జవాబుదారీకావడం ఆయన భరించలేకపోతున్నారు. జూన్ 2015లో ఆయన ప్రభుత్వం ఒక టి.వి. ప్రకటనలో కేంద్రం ఇబ్బందిపెడ్తున్నదని, తాము పనిచేస్తూపోతున్నామని, విద్యుత్ ఛార్జీలను తగ్గించినందుకు ఓ గృహిణి కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా చూపారు. నిజానికి విద్యుత్‌ఛార్జీలు తగ్గించామన్న కేజ్రీవాల్ తమ గృహ అవసరాలకు ఏప్రిల్, మే 2015 నెలలకు రూ.91,000 బిల్లు చేశారు. ఆయన యింట్లో 30 ఎయిర్ కండిషనర్లు, మరెన్నో ఎయిర్ కూలర్‌లున్నాయి, ఆయన అధికార నివాసానికి రూ.1,35,000ల కరెంటు బిల్లు వస్తుందని తెలిసింది. పార్టీ వారిని పాలనా యంత్రాంగంలో నియమించడం మరో వివాదానికి హేతువయింది. పార్టీ నాయకుడు నవీన్ జైహింద్ భార్య స్వాతి మలివాల్‌ను ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ వ్యవస్థాపక నేతలైన యోగేంద్రయాదవ్, ప్రశాంతభూషణ్‌లను అత్యంత అభ్యంతకరమైన పదజాలంతో దూషించి, అవమానకరమైన రీతిలో పార్టీనుంచి బహిష్కరించారు. ఆప్ ప్రభుత్వంలో మంత్రులైన వారిలో భావనాగౌర్, జితేందర్‌సింగ్‌తోమర్ సురేందర్‌సింగ్‌లు తప్పుడు డిగ్రీ సర్ట్ఫికెట్‌లు కలిగి వున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేజ్రీవాల్ అన్నీ తానై నిర్ణయాలు చేయడం పలువురు సీనియర్లకు కోపం తెప్పించింది. చేతన్‌భగత్ లాంటి వాళ్ళు ఐటెమ్‌గర్ల్ ఆఫ్ పోలిటిక్స్‌గా ఆప్‌ను అభివర్ణించారు. కర్ణాటక పూర్వ లోకాయుక్త సంతోష్‌హెగ్డే, కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్, మల్లికాసారాభాయ్ వంటివారు ఎపుడో పార్టీని వదిలేశారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో చేసిన స్కూళ్ళు, కళాశాలలు, ఆస్పత్రుల్లో టాయిలెట్ల నిర్మాణం వంటివి మూలబడ్డాయి. జన లోక్‌పాల్, స్వరాజ్, ఢిల్లీకి పూర్తి రాష్టహ్రోదా, యమున శుద్ధి వంటి సమస్యల విషయమై ఢిల్లీ ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్నది.. జంతర్‌మంతర్ ర్యాలీలో పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటున్న శ్రీ గజేంద్రసింగ్‌ను ఆపలేక, పరిష్కారం చూపించలేక పోయిన ఘనత కేజ్రీవాల్‌ది. సంచలన వార్తలకోసం ఆప్ తలమునకలవుతుంది. నీటిఛార్జీలను తగ్గించడం, 2000 లీటర్లపై సబ్సిడీని అందించడం వంటి పనులు మాత్రం ఢిల్లీ జల బోర్డు విజయవంతంగా అమలుచేస్తోంది.
ఢిల్లీలో తమ ఆఫీసుపై సిబిఐ దాడి చేసిందని ఆరోపించిన కేజ్రీవాల్ మరింత ముందుకుపోయి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలకు జైట్లీని బాధ్యుణ్ణి చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఢిల్లీ క్రికెట్ సంఘంలో జైట్లీ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని సీరియస్ ఫ్రాడ్ ఇన్‌వెస్టిగేషన్ ఆఫీస్ 2013 మార్చిలో నివేదిక యిచ్చింది. అయినా యిప్పుడు కేజ్రీవాల్ మళ్ళీ విచారణ కమిషన్ వేశారు. కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేశారు. జైట్లీకి క్రికెటర్లు మద్దతు పలికారు. కేజ్రీవాల్ ఒక క్రేజీ బాయ్. ఆయన కోర్టులకు బయట సాక్ష్యాలు లేకుండా విచారణ చేస్తారు. పోలీసులు చేయాల్సిన పని ఆయన కార్యకర్తలు చేస్తారు. ఆయనొక సమాంతర మీడియా నడుపుతారు. ఆయన దృష్టిలో ఆయన తప్ప అందరూ నేరస్థులే. అంతా అవినీతి పరులే. ప్రజల పేరుతో భయం సృష్టించడమే ఆయన రాజకీయం. వివేకంతో, వివేచనతో భారత్‌ను యిక్కడి సమస్యలను ‘ఆప్’ అధ్యయనం చేయాలి. ఇక్కడి వ్యవస్థలను, వ్యక్తులను సంస్థలను గౌరవించడం నేర్చుకోవాలి. వినడం నేర్చుకోవాలి. వ్యతిరేకాత్మక ధోరణి విడనాడాలి. తాము మాత్రమే అవతారపురుషులమని ఇతరులంతా రాక్షసులని భావించడం మానాలి. నిందించడం మాని స్పందించడం నేర్చుకోవాలి.
అధికార కాంగ్రెస్ తమ ఉద్యమాన్ని అద్దెకిచ్చి తమాషా చూస్తోంది. ఆప్‌కు అఖండ మెజారిటీ యిచ్చిన ఢిల్లీ ప్రజలు ఆప్ పోకడలు చూసి నాలుక్కరుచుకుంటున్నారు. ఆప్ ప్రజాస్వామ్యాన్ని జన స్వామ్యం, జబర్దస్తీ స్వామ్యంగా మార్చాలని తమ మాట వినని వారిని వ్యతిరేకించాలని కంకణం కట్టుకుంది. గతం నాస్తి కాదు. అది అనుభవాల ఆస్తి. గతం అవగతం చేసుకుని ఆప్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యతిరేక రాజకీయాలు చేయడం ఓ రాజకీయ పార్టీగా ‘ఆప్’ను పాపులర్ చేస్తుందేమో కాని ఉజ్వల భవిష్యత్తునివ్వదు.
నిజానికి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషర్‌కున్న అధికారాలకు మించి ఉండవు. తాను ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో చాలావాటిని ఇంతవరకు కేజ్రీవాల్ అమలు చేయలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన భాజపా అగ్ర నేతలపై విమర్శల దాడులకు దిగుతుంటాడు. ఈ విమర్శల హోరులో తన అసమర్ధతను కప్పిపుచ్చు కోవడానికి కేజ్రీవాల్ అనుక్షణం ప్రయత్నిస్తు న్నారు. ప్రజల దృష్టి తన పాలనపై పడితే అసమర్ధత, అవినీతి, వైఫల్యాలు బయ టపడతాయని కేజ్రీవాల్ భయం. అందు వల్ల మోదీ, అరుణ్ జైట్లీ వంటి వారిపై అనవర ఆరోపణలు చేయడం, అవి తప్పని తేలాక వెనక్కి తగ్గడం కేజ్రీవాల్ వ్యూహం. కానీ ఇది ఎంతోకాలం చెల్లుబాటు కాదు. పని చేసిన సామర్ధ్యమే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయడానికి గీటురాయ. ఎంతకాలం ప్రజలను ఇలా మభ్యపెట్టగలుగుతారు? అనవసర వివాదాలతో కాలం వృధా చేయ క, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై కేజ్రీవాల్ దృష్టి కేంద్రీకరిం చాలి. మాటలు కాదు, చేతలు ముఖ్యం.

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ సెల్: 9676190888